పంచాంగం. ఈ పదం తెలియని తెలుగువారుండరు. మన జీవితంలో మంచి చెడులకు , తిధులకు , ముహూర్తాలకు ప్రతీదానికి పంచాంగం పై ఆధారపడతాము. అసలు పంచాంగం అంటే ఏమిటి ? ఎందుకు అనేది ప్రశ్నిచకుండా ప్రజలు నమ్ముతారు కాబట్టి అది డబ్బు సంపాదనకు సరుకుగా, వికృత వాదనలకు వేదికగా చాలా సందర్భాలలో వాడబడుతుందనేది కాదనలేని సత్యం. వీటి ద్వారా చెప్పే జోస్యాలు అపహాస్యాలవుతున్నా ప్రజలలో అశాస్త్రీయ భావాలున్నంతవరకూ ఇవి వర్ధిల్లుతునే ఉంటాయి. అయితే పంచాంగం పై నమ్మకం ఉంచుకున్న వారి విశ్వాసాలను గౌరవించడం లో తప్పులేదు. ఇప్పటి పరిస్తితులలో చాలా వరకు తప్పదు కూడా . అయితే పంచాంగం పేరుతో ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు వాడుకుంటూ తాము చెప్పేది శాస్త్రం అంటుంటే మాత్రం చూస్తూ మిన్నకుండడం సమాజానికి మంచిది కాదనేది నా అభిప్రాయం . పంచాంగం - ప్రస్తుతం పరిస్తితుల పై ప్రజాశక్తి లో వచ్చిన వ్యాసం మీకోసం ఇక్కడ ఉంచుతున్నాను. ప్రజలలో అశాస్త్రీయ భావజాలం పోగెట్టేందుకు ఇలాంటి వ్యాసాలు అవసరం ఎంతైనా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను.

కాలం చెల్లిన తతంగం...'పంచాంగం'

 మీరెప్పుడైనా ఏదైనా పంచాంగాన్ని తిరగేశారా? దానిలో తిథులు, మాసాలు, గ్రహణాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సమయాలతో పాటు ఇంకా మన జీవితాల్ని శాసిస్తాయని చెప్పబడే అనేక విషయాలు ఉంటాయి. ఆ సంవత్సరానికి నాయకులైన గ్రహాలు, దానివల్ల ఫలితాలు, సరుకుల ధరలు, వాతావరణం, శిశుజననానికి మంచి సమయం, గృహ సంబంధమైన వస్తువులు ఉపయోగించటానికి శుభ ముహూర్తాలూ, బాలికల రజస్వల ఫలితాలు, బల్లిపాటు ఫలితాలు .... ఒకటేమిటి- అన్నీ పంచాంగంలో ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ సామాన్యుల జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే కొందరు స్వార్థపరుల కల్పనలు. ఖగోళ శాస్త్ర ప్రగతి గురించి, దానిలోకి స్వార్థపరుల కల్పనలు ఎప్పుడు ప్రవేశించాయి, వాటి విష ఫలితాలేమిటి? వంటి సంగతులు తెలుసుకుందాం.

వేదాల్లో బలుల ప్రస్తావన
భారతీయుల ఆది గ్రంథమైన రుగ్వేదంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, వాటి గమనాల గురించి పేర్కొన్నారు. యజుర్వేద కాలం నాటికి నెలలు, నెలల పేర్లు చెప్పబడ్డాయి. దేవతలకు జంతు బలులంటే ఇష్టమనీ, ఆ బలులు ఫలానా కాలాల్లో చేస్తే మంచిదనీ ఊహించుకుని ఆయా కాలాల్లో ఆ పనులు చేసేవారు. దశ పూర్ణ మాసం అంటే అమావాస్య, పౌర్ణమిలలో ఏయే బలులు చేయాలి? చాతుర్మాసంలో (ప్రత్యేకంగా పేర్కొనబడిన నాలుగు మాసాల కాలంలో) ఏయే బలులు చేయాలి? ఇవన్నీ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. రుతువుల వివరణ కూడా అందులో ఉంది. సామవేదంలో ఉత్తరాయణం, దక్షిణాయణం, వాటి ప్రాధాన్యం, మహావ్రత కర్మల ఆచరణ వివరించబడ్డాయి. అధర్వణ వేదంలో రాహువు ద్వారా సూర్య గ్రహణం వస్తుందని ఉంది. యజుర్వేదంలో సంవత్సరానికి 12 నెలలని చెప్పారు. అప్పుడప్పుడూ 13వ నెలను అధికమాసంగా చేర్చాలని అధర్వణ వేదంలో పేర్కొన్నారు. అభిజిత్‌ మొదలైన నక్షత్రాల పట్టిక దానిలో ఉంది.
తర్వాత కాలంలో లగధుడు అనే ఖగోళ శాస్త్ర పండితుడు ప్రాచీన గ్రంథాల్లోని విషయాలను పరిష్కరించి, క్రోడీకరించి వేదాంగ జ్యోతిషం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది క్రీపూ రెండు లేదా ఒకటో శతాబ్దంలో జరిగింది. ఈ గ్రంథంలో సూర్యచంద్రుల గమనాలకు సంబంధించిన సూత్రాలు వివరించారు. 'ఖగోళ శాస్త్రం వైదిక అనుబంధ పాఠాల్లో కిరీటం వంటిది' అని లగధుడు పేర్కొన్నాడు. ఖగోళ శాస్త్రం కాలం గురించి తెలుసుకునేదని వేదాంగ జ్యోతిషంలో పేర్కొన్నారు. వేదాలు బలుల గురించిన విషయాలను వివరిస్తాయని కాబట్టి, కాలక్రమేణా నిర్దేశించబడిన ఈ బలుల గురించి తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్రంలో నిష్ణాతుడు కావాలనీ పేర్కొనబడింది.
నెలలూ రుతువులూ ...
వైదిక రుషులు పూర్ణ చంద్రబింబం ఏ నక్షత్రంలో ఉండగా వస్తుందో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉంటే- ఆ మాసాన్ని చైత్రమనీ, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమనీ, జ్యేష్ట నక్షత్రంలో ఉంటే జ్యేష్ట మాసమని, ఫల్గుణీ నక్షత్రంలో ఉంటే ఫాల్గుణ మాసమనీ పేర్లు పెట్టారు. పన్నెండు చంద్ర మాసాలను రెండు నెలలకొకటి చొప్పున విభజించి, వాటిని ఆరు రుతువులుగా నిర్ణయించారు. వైదిక సాహిత్యంలో చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని సూర్యకాంతిని గ్రహిస్తుందని పేర్కొనబడింది. బృహస్పతి వంటి గ్రహాల ప్రస్తావన కూడా ఉంది.
తిథులూ పక్షాలూ ...
తరువాత కాలాన్ని మరింత కచ్చితమైన చిన్న చిన్న భాగాలుగా విభజించారు. శతపథ బ్రాహ్మణంలో ఒక రోజును 30 ముహూర్తాలుగా విభజించారు. ఒక ముహూర్తాన్ని 15 కిస్ప్రూలు గానూ, ఒక కిస్ప్రూను 15 ఇడానీలు గానూ, ఒక ఇడానీ అంటే 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగానూ విభజించారు. అంటే సంవత్సరాన్ని 10,800 ముహూర్తాలు లేక 3 కోట్ల 64 లక్షల 50 వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా విభజించారు.
వైదిక రుషులు ఒక మాసాన్ని రెండు స్వాభావికమైన భాగాలు లేక పక్షాలుగా విభజించారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ ఉండే వెలుతురు భాగం శుక్ల పక్షంగానూ, పౌర్ణమి నుంచి అమావాస్య వరకూ ఉండే చీకటిభాగం కృష్ణ పక్షంగానూ విభజించారు. ఈ రెండు పక్షాలూ కలిపితే ఒక చంద్రమాసం అయింది. ఒక పక్షాన్ని 15 తిథులుగా విభజించారు. ఈ తిథుల విభజన తొలిసారిగా ప్రపంచంలో భారతీయులే చేశారు. అవి పాఢ్యమి, విదియ, తదియ మొదలైనవి. తిథుల పేర్లకూ, సంస్క ృత సంఖ్యలకూ సంబంధం ఉంది. సంస్క ృత సంఖ్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ- ఇలా ఉంటాయి. తిథులు కూడా వాటి లాగానే పాఢ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి - అని పిలవబడ్డాయి. తిథుల విభజన తర్వాత 12 చంద్ర మాసాలకు సంవత్సరానికి 12 రోజులు కలిపి- అంటే రెండున్నరేళ్లకోసారి 30 రోజులు అధికమాసాన్ని కలిపి 366 రోజులతో కూడిన చంద్ర మాసాన్ని తయారు చేశారు.
కాలగణనకే పంచాంగాలు
మొట్టమొదటి పంచాంగంలో అంటే- కొన్ని వందల సంవత్సరాల వరకూ కాల గణన, గ్రహణాల వివరాలు మాత్రమే ఉండేవి. క్రీ.పూ. 230 తరువాత, భారతదేశంపై అలెగ్జాండర్‌ దండయాత్ర తరువాత భారత, గ్రీకు సంస్క ృతుల సమ్మేళనం ప్రారంభమైంది. దాని ప్రభావం ఖగోళ శాస్త్రంపై కూడా పడింది. అప్పటివరకూ ఉన్న నక్షత్ర పద్ధతి, బాబిలోనియన్ల గ్రీకుల 12 రాశుల రాశి చక్రంగా మార్పు చేయబడింది. అవి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మొదలైనవి. ఈ కాలంలో కూడా పంచాంగాలు కాలగణనకే ఉపయోగపడ్డాయి.
పక్కదోవ పట్టిన పంచాంగం!
క్రీ.పూ.4వ శతాబ్ది నుంచి మనుస్మ ృతికి భారతదేశంలోని ఎక్కువ రాజ్యాల్లో గౌరవం లభించింది. స్పష్టంగా చెప్పాలంటే బ్రాహ్మణులకు మాత్రమే విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం, బోధన పరిమితమైన తరువాత పంచాంగాల్లో వికృత ధోరణులు పొడసూపాయి. ఖగోళశాస్త్రంలో పండితులైన వారు తిథుల్లో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అన్నారు. భూమి లాగానే రాళ్లూ, రప్పలూ వంటి పదార్థాలతో నిండిన గ్రహాలనూ, సూర్య నక్షత్రాన్నీ, 27 నక్షత్రాలనూ, చంద్రుడనే ఉప గ్రహాన్నీ దేవతలుగా మార్చారు. వాటి ప్రభావం మానవుల మీద అపారంగా ఉంటుందని అన్నారు. ఖగోళశాస్త్ర విజ్ఞానంతో మానవుల జీవితాలకు సంబంధించిన ఫలితాలంటూ ఏవేవో చెప్పసాగారు. మానవుల జీవితాల్లో జయాపజయాలకు, కష్ట సుఖాలకూ, వారి మనస్తత్వాలకూ - వారు జన్మించిన తేదీని బట్టిగానీ, చంద్ర సంవత్సర వివరాలను బట్టి గానీ, స్త్రీలకు రజస్వల కాలాన్ని బట్టి గానీ సంబంధం ఉంటుందని అన్నారు. బల్లి పాటుకూ, పిల్లి ఎదురు కావడానికీ, తుమ్ముకూ భవిష్యత్తుతో సంబంధం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి కీడుకూ శాంతి అవసరమన్నారు. అవన్నీ తమకు తెలుసునన్నారు. శాంతి చేయించినందుకు దక్షిణగా కొంత తమకు ముట్టజెప్పాలన్నారు. ప్రచార యంత్రాంగాన్ని తమ చేతుల్లో ఉంచుకుని ఇటువంటి అశాస్త్రీయ భావజాలానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ అంశాలపై శాస్త్రీయ పరిశోధన చేస్తే వారి జోస్యాలు అబద్దాలని తేలాయి. తేలుతున్నాయి. 400 ఏళ్లనాడే వేమన పెళ్లి ముహూర్తాలను గురించి తన పరిశోధనా సారాంశాన్ని అత్యంత శక్తివంతంగా ఇలా తెలిపాడు :
'విప్రులెల్లజేరి వెర్రి కూతలు కూసి
సతిపతులను గూర్చి సంబరమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా
విశ్వదాభిరామ వినుర వేమ'
ఏ పార్టీకి ఆ పంచాంగం!
ఇటీవలి సంవత్సరాల్లో ప్రతి ఉగాది పండుగ నాడూ కాంగ్రెస్‌, టిడిపి, టీఆరెస్‌, బిజెపిల ఆధ్వర్యంలో తమ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీ ఆస్థాన జ్యోతిష్యుడు ఆ పార్టీ నాయకుడు అధికారంలోకి వస్తాడని జోస్యం చెప్పడం రివాజుగా మారిపోయింది. 2009 ఉగాది పంచాంగంలో వారు తమ జోస్యాలకాధారంగా ఏవో గ్రహాల చలనాన్ని వివరించారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క రకంగా గ్రహాలు ఎలా భ్రమణం చెందుతాయో వారికే తెలియాలి. అయినా ఆ సంవత్సరం జ్యోతిష్యులు చెప్పినట్టుగా చంద్రబాబు, అద్వానీ, కెసిఆర్‌, చిరంజీవి అధికారంలోకి రాలేదు.
2010-11 వికృతి నామ సంవత్సరంలో పంచాంగ ఫలితాలు ఇలా ఉన్నాయి : నేమాని వారు దుర్భిక్షం వస్తుందని చెబితే, తంగిరాల వారు మంచి వర్షాలు, పంటలూ పండుతాయని సెలవిచ్చారు. ములుగు వారు రాహుల్‌ ద్రావిడ్‌ ఆడడు, సహచరులను ఆడనివ్వడని, టీముకు బరువని చెప్పారు. కానీ ద్రావిడ్‌ 2010 డిసెంబరు నాటికి 200 క్యాచ్‌లు పట్టి, ప్రపంచ రికార్డు స్థాపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 191 పరుగులు చేసి మాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇవేనా జోస్యాలంటే ...? రాళ్లూ రప్పలకూ దైవత్వాన్ని ఆపాదించి వాటికి మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయంటే నమ్మేయడమేనా? పంచాంగకర్తలు ప్రజలను భయపెట్టి, శాంతుల పేరు మీద తరతరాలుగా దోచుకుంటున్నారు.
మహిళల పట్ల అణచివేత వైఖరి
స్త్రీల విషయంలో వీరి జోస్యాలు మరింత దుర్మార్గంగా ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి పంచాంగాల్లో బాలికలు రజస్వల కావడం వంటి విషయాల్లో ఫలితాలు ప్రకటిస్తున్నారు. సాయంత్రం పూట రజస్వల ఐతే జారగుణం కల స్త్రీ అవుతుందని ప్రకటించారు. సంధ్యలలో అయితే- చెడు ప్రవర్తన కలది ఔతుందని సూత్రీకరించారు. ఈ విషయాలనే పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అచ్చ తెలుగులో రాసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. లేచిపోతుందని, వ్యభిచారిణి, దొంగ అవుతుందని తన పంచాంగంలో పేర్కొన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది స్త్రీ మనోభావాలను గాయపరచడమే కాక మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అసలు వీరిలా చెప్పడానికి ఆధారం ఏమిటి? బల్లి తొడపై పడితే ఆ స్త్రీ వ్యభిచారిణి అవుతుందట. పురుషులకు అలాంటి ఫలితమేదీ చెప్పలేదు. ఈ ప్రకటనలన్నీ స్త్రీలను మానసికంగా వేధించి మరింతగా తమ  అధీనంలో ఉంచుకోవడానికేనని అర్థం కావడం లేదా?
నాటి నుంచి నేటివరకూ ఈ పంచాంగ కర్తలు, జ్యోతిష్కులు- అంతా తమకే తెలుసని, ప్రజల జీవితాలపై తామే అధినాథులమని విర్ర వీగుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి, కాలగణనకు ఉపయోగపడిన పంచాంగం సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో- కాలం చెల్లిన తతంగమే అవుతుంది. ఖగోళ విజ్ఞానం దాన్లో లేదని కాదు. అయితే, చాలా పరిమితమైనది. కొంతమంది స్వార్థపరుల, మూఢమతుల ప్రమేయంతో అదిప్పుడు ప్రగతికి ఆంటకంగా తయారైంది. కాబట్టి- ఈ అశాస్త్రీయ భావజాలంపై విద్యావంతులు, మహిళలు ఉవ్వెత్తున ఉద్యమం తేవాలి. శాస్త్రీయ భావజాల పూరితమైన నవ సమాజం కోసం నడుం బిగించాలి.
వ్యాస రచయిత : కెఎల్‌ కాంతారావభ్ , (వ్యాసకర్త ఫోను : 9490300449)
సేకరణ : ప్రజాశక్తి దినపత్రిక నుండి.
Reactions:

Post a Comment

 1. " వైదిక సాహిత్యంలో చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని సూర్యకాంతిని గ్రహిస్తుందని పేర్కొనబడింది... " ..ఈ విషయం పూర్వీకులకు కూడా తెలుసని తెలుస్తోందండి.

  ReplyDelete
  Replies
  1. @ anrd గారికి ,
   నేను వ్యాసకర్త వ్రాసిన దానిని నమ్మే ఈ విషయం అందరితో పంచుకోవాలనే ఈ పోస్టు ఉంచాను. ఎవరి విశ్వాసాలను కించపరచాలని కాదు. విశ్వాసాలు వేరు , విశ్వాసాలను ఆధారం చేసుకుని దోపిడీ చేయడం - మోసాలకు పాల్పడడం వేరు. విశ్వాసం వేరు - శాస్త్రీయ ఆధారాలు వేరు.

   Delete
  2. విశ్వాసాలను ఆధారం చేసుకుని దోపిడీ చేయడం - మోసాలకు పాల్పడడం వీటికి నేనూ వ్యతిరేకమేనండి.

   అయితే , ఎలా కనుగొన్నారో మనకు తెలియదు కానీ, ప్రాచీనులు చంద్రుని విషయంలో సరిగ్గానే చెప్పారు కదా ! అనిపించి వ్యాఖ్యను రాసాను . అంతేనండి.

   Delete
  3. @ anrd గారు ,

   మీ అభిప్రాయం ను నేను సమర్ధిస్తున్నాను.

   నేను ఈ పోస్టును నా బ్లాగు లో ఉంచిన ఉద్దేశ్యం కూడా అందుకేనండీ. పోస్టులో చెప్పిన విషయ సారాంశం కూడా అదే కదా.

   మన ప్రాచీనులు చాలా చాలా అద్భుత విషయాలు ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే చెప్పినవి చాలా చాలా ఉన్నాయి.

   అయితే మధ్యలో మాయగాళ్లు చేరి వాటిని కలగాపులగం చేసి ఏది మంచో, ఏది అశాస్త్రీయమో, కలగా పులగం చేయడం తో ఇబ్బంది ఎదురవుతున్నది.

   ఉదాహరణకు ఆయుర్వేదం , యోగా అనేవి అద్భుతమైన శాస్త్రాలు. వాటిని నేడు సరుకుగా మార్చి , ఎవడికి వాడు ప్రతీది హెర్బల్ , యోగిక్ అంటూ సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు.

   మన ప్రాచీనులే కాదు , ప్రపంచ వ్యాపితం గా ప్రాచీనులు కనిపెట్టిన అద్భుత విషయాలు లోకకళ్యానికి ఉపయోగపడే విషయాలలో అసలైనవాటిని గుర్తించి , ప్రోది చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

   Delete
 2. ఎవరైనా నష్టపోయివుంటే మరోసారి నమ్మరు. ఇపుడు తమరు నష్టపోయిందేమన్నా వుంటే తెలియచేయండి. ప్రపంచంలో సమస్యలే లేనట్టు మీకు ఇదే దొరికిందా! మీ కమ్మూనిస్టులంత వేస్ట్‌గాళ్ళవాల ప్రపంచంలో ఎంత జన నష్టం జరిగిందో లెక్కలు కట్టారా?

  ReplyDelete
  Replies
  1. @ Anonymous గారికి,
   పోస్టులో ఉన్న అంశాలు పూర్తిగా చదివి కామెంట్ పెడితే అర్ధం ఉంటుంది. పంచాంగం పెరుతో దోపిడీ నీ కళ్లకు కనపడడం లేదా ? లేదా కళ్లుండీ చూడలేని మూర్ఖుడివా ? వేమన కమ్యూనిస్టు కాదు మిత్రమా ? అశాస్త్రీయ భావాలు తొలగించడానికి కమ్యూనిస్టులే కానవసరం లేదు.

   Delete
 3. అయ్యా పంచాంగం వల్ల నష్టం జరిగిందోలేదో తెలీదుగానీ, కొందరికి మాత్రం పనేమీచెయ్యకుండానే బొజ్జలుపెంచుకొనే అవకాశమ్మాత్రం కలిగింది.

  అయినా... ప్రతిసమస్యగురించీ "ఎన్నోసమస్యలుంటే, మీకిదే దొరికిందా అంటే?", ఇహ దెనిమీద పోరాడాలో మీదగ్గర అనుమతితీసుకొని పోరాడాలన్నమాట. బావుంది. జ్యోతిష్యం లాంటి చెత్తశాశ్త్రాలతో అంతమందిని దోచుకుతింటున్నారో, మోసపోయినవారిని "అది జ్యోతిష్యుడి తప్పేకానీ, శాస్త్రం తప్పుకాదు" అని చెబుతూ వాళ్ళనే మళ్ళీమళ్ళీ ఎలా మోసగిస్తున్నారో తెలియడంలేదా!?

  ReplyDelete
  Replies
  1. బాగా చెప్పారు, డాక్టర్ల దగ్గరికి పోయి, రకరకాల మందులు తిని టపా కట్టే వాళ్ళను చూసి డాక్టర్ని తప్పు పడతామా? వైద్యశాస్త్రాన్నా?
   thank you sir.

   Delete
  2. Good one. వైద్యుణ్ణే తప్పుపడతాం ఎందుకంటే శాశ్త్రాన్ని సరిగ్గా అభ్యసించకపోవడం వైద్యుడిదే తప్పబుతుంది కాబట్టి. ఇక్కడ ప్రశ్నలు

   జ్యోతిష్యం శాశ్త్రమా?

   అప్పుడు ఏజ్యోతిష్యం శాశ్త్రము? (మేదినీ జ్యోతిష్యమూ, ఇంకోరకమైన జ్యోతిష్యమూ పరస్పర విరుధ్ధమైన ఫలితాలను predict చేసినా రెండూ శాస్త్రాలుగానే చలామణీ అవుతాయని
   మనకు తెలిసిందే!). జ్యోతిష్యమూ, హస్తసాముద్రికమూ వేర్వేరు ఫలితాలను ఊహిస్తే ఇప్పుడె ఏది ఏమేరకు జరుగుతుంది? ఏది శాశ్త్రము?

   బుధుడు ఫలానా స్థానంలో ఉంటే ధనలాభమో, ఇంకోలాభమో ఎందుక్కలుగుతుంది? అన్న ప్రశ్నకి జ్యోతిష్యంలో సమాధానముందా?

   పై ప్రశ్నకి మీరు axioms అని చెప్పి తప్పించుకోవచ్చుకాక. కానీ... axioms మీద ఆధారపడిన theory నూటికినూరుపాళ్ళూ ఎప్పుడైనా ఒక physical reality ని predict చెయ్యగలిగిందా?

   జ్యోతిష్యం శాశ్త్రమే అయితే, ఏం జరిగినప్పుడు, దాన్ని తప్పని ఋజువుచెయ్యగలం.

   Delete
 4. పంచాంగాన్ని విశ్వసించడంలో నష్టమా? స్వాంతన కలుగుతుందా? వ్యక్తిగతం. దానిని పనిగట్టుకుని విమర్శించి మార్చాల్సిన అవసరం లేదు.కానీ పంచాంగం పై విశ్వాసాలను ఆధారం చేసుకుని ప్రజలను మోసం చేసేవారిపట్ల అప్రమత్తం గా ఉంచాల్సిన బాధ్యత తో ఈ పోస్టు ఉంచడం జరిగింది.

  ReplyDelete
 5. దోపిడీ, అణిచివేత వైఖరి అన్నవి వాడటం అనౌచిత్యం. ఇలాంటి పదప్రయోగాల దోపిడీ అన్న మాటకు అర్థం పలుచనైపోతోంది. మోసం అన్నది వాడి వుండవచ్చు. ఈ దోపిడి సార్వత్రికం కాదు, అలాంటి నమ్మకాలుండే వారిలో కొద్దిమందికే జరిగే అవకాశాలున్నాయి. నమ్మిన వాళ్ళే ఆ రిస్క్ తీసుకుంటారు. దోపిడీ అన్నది నమ్మినా నమ్మకున్నా దోచబడతారు. దోపిడీలో దోచబడేవారి నమ్మకం లేదా అంగీకారం కోసం దోపిడీదారులు ప్రయత్నించరు. కమ్యూనిస్టులకు తాము చేసేది తప్ప ప్రపంచమంతా దోపిడీ గానే అనిపిస్తూ వుంటుంది, దానికి ప్రతీకారంగా దోపిడీ చేసి వున్నవాళ్ళది దోపిడీ చేయాలనడమే కమ్యూనిస్టు భావజాలమని తెలిసిందే. దాన్ని కాదని వీళ్ళు చేసేదీ అదే దోపిడీ. తమ ఇజం ఔన్నత్యం మీద కాక, ఎదుటివారి తప్పులు, బలహీనతలను ఎత్తిచూపి పైకి రావాలనుకోవడమే టిపికల్ మార్కిజం.

  ReplyDelete
  Replies
  1. @ Anonymous గారికి ,

   మీరు చెప్పిన దానిలో దోపిడీ - మోసం తేడా ఓకే కానీ ఈ క్రింది వాక్యం మీ అభిప్రాయమే తప్ప మార్క్సిజం కాదు.

   " దానికి ప్రతీకారంగా దోపిడీ చేసి వున్నవాళ్ళది దోపిడీ చేయాలనడమే కమ్యూనిస్టు భావజాలమని తెలిసిందే. దాన్ని కాదని వీళ్ళు చేసేదీ అదే దోపిడీ. తమ ఇజం ఔన్నత్యం మీద కాక, ఎదుటివారి తప్పులు, బలహీనతలను ఎత్తిచూపి పైకి రావాలనుకోవడమే టిపికల్ మార్కిజం."

   దోపిడీ చేసిన వారిని దోపిడీ చెయడం మార్క్సిజమని ఎవరు చెప్పారు?

   మీరనుకున్నది మార్క్సిజం కాదండి, దోపిడీకి అవకాశం లేని సమసమాజం మార్క్సిజం లక్ష్యం.

   ఉత్పత్తి సాధానాలు సమాజపరమయ్యే సోషలిజం ద్వారా మాత్రమే అది సాధ్యం తప్ప మీరనుకుక్నేది మీకు ఎవరు చెప్పారో నాకు తెలీదు కాని ఆ అభిప్రాయం తప్పు .

   అలా మార్క్సిజం చెప్పదు.చెప్పలేదు. సినిమాలలో మాత్రమే అలా చూపుతారు.

   ముల్లును ముల్లుతో తీయడం - వజ్రాన్ని వజ్రం తో కోయడం - ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం మార్క్సిజం కాదు.

   ఈ వ్యవస్థలో ఉన్న వాడూ , లేనివాడూ సాధారణం గా దోపిడీకే ప్రయత్నిస్తాడు. ఉన్నవాళ్లలో మంచి వాళ్లు - లేనివాళ్లలో దుర్మార్గులు ఉండొచ్చు. అది సమస్య కాదు. మొత్తం వ్యవస్థలో మార్పు ద్వారా మాత్రమే దోపిడీని రద్దు చేయగలమని మార్క్సిజం చెపుతుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top