ఇంటర్మీడియెట్ పాసైతే చాలు, ఉద్యోగం కోసమంటూ పట్టణాల దారి పట్టేస్తోంది యువతరం. 'దానివల్ల ఎన్నో సమస్యలు. ఉద్యోగాలను వెతుకుతూ యువత వెళ్లకూడదు. ఉద్యోగాలే వారి ముంగిటికి వెళ్లాలి. అప్పుడే అన్నిరకాలుగా మేలు..' అంటున్నారు ఉల్లగంటి మురళి. బెంగుళూరులో తాను ప్రారంభించిన 'రూరల్ షోర్స్' సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోని రెండున్నర వేల మందికి ఉపాధినిస్తున్న ఆయన తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు.

ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి, ఆర్థిక ప్రగతి అంతా నగరాలకు, ఎగువ మధ్య తరగతికే పరిమితం. గ్రామీణ యువత జీవితాల్లో వస్తున్న మార్పు తక్కువే. ఇంటరో డిగ్రీనో చదివి ఉన్న ఊళ్లో చేసేదేం లేక పట్టణాల బాట పడుతున్నారు వాళ్లు. అక్కడ పెద్ద ఉద్యోగాలకు తమ చదువూ నైపుణ్యాలూ సరిపోవు. మరీ చిన్న కొలువులైతే అరకొర జీతాలు. దీంతో రెంటికీ చెడిన రేవడిలా నెట్టుకొచ్చేవాళ్లే ఎక్కువమంది. 'ఎందుకీ దురవస్థ? హాయిగా ఉన్న ఊళ్లోనే చిన్న నౌకరీ దొరికితే బాగుండు' అని రోజుకోసారైనా అనుకోనివాళ్లుండరు. అలాంటి యువతకు తగిన శిక్షణనిచ్చి తమకు అనువైన మానవ వనరులుగా మార్చుకుని ఉపాధినివ్వడమే 'రూరల్ షోర్స్' చేస్తున్న పని.

అందరికీ మంచిదే

చిన్నాపెద్ద సంస్థలన్నిటికీ డేటా ఎంట్రీ, బుక్ కీపింగ్, జమా ఖర్చుల లెక్కలు, డాక్యుమెంట్ల డిజిటైజేషన్ వంటి పనులు బోలెడుంటాయి. వాటిని బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్) కేంద్రాలు నిర్వహిస్తాయి. అయితే ఇప్పటివరకూ ఇవికూడా పెద్దపెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. 'వాటిని గ్రామాలకు తరలిస్తే మంచిది కదా' అన్న ఆలోచనే మురళిని 'రూరల్ షోర్స్' స్థాపించేలా చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఫ్రెంచ్ సంస్థ క్సాన్సాలో ఉన్నత స్థానానికి ఎదిగారు. మన దేశంలో క్సాన్సాకు కావలసిన బీపీఓల నిర్మాణం, నిర్వహణలను పర్యవేక్షించడమే ఆయన విధి. "చెన్నై, పూణె, నోయిడా వంటి చోట్ల బీపీఓలను నిర్మించడం, నెలకో ఐదొందల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం చేసేవాణ్ని. నగరాల్లో సరిపోయినంతమంది ఉద్యోగులు దొరక్క గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకునేవాళ్లం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్... ఇలా చాలాచోట్లకు వెళ్లి అక్కడి కుర్రకారును నగరాల్లోని ఉద్యోగానికి తీసుకురావాలి.

పది పన్నెండు వేల రూపాయల జీతమిచ్చినా వారి జీవనశైలి మెరుగయ్యేది కాదు. ఆ డబ్బుతో మహానగరాల్లో ఒక్కరు బతకడమే కష్టం. అలాంటిది కుటుంబాన్ని పోషించడమంటే మాటలా? అందువల్ల బీపీఓ ఉద్యోగులు కుటుంబాన్ని తమతోపాటు తెచ్చుకోలేరు, పోనీ ఎంతోకొంత మిగిల్చి ఊళ్లో ఉన్నవారికి పంపలేరు. ఈ పరిస్థితుల్లో ఏడాదో రెండేళ్లో పనిచేసి ఐదొందలో వెయ్యో ఎక్కువ వస్తుందంటే మరో సంస్థలో చేరిపోతారు. దీనివల్ల వాళ్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు, మరోవైపు శిక్షణ కోసం అంతంత ఖర్చు పెట్టిన సంస్థలకూ నష్టమే. ఈ విషయాన్ని గమనించిన తర్వాత అప్పుడొచ్చింది నాకీ ఆలోచన. శిక్షణనిచ్చి నగరాలకు ఎందుకు తీసుకురావాలి యువతను? వాళ్ల దగ్గరకే ఉద్యోగాలు తీసుకెళితే మంచిదికదా అని. అలా పుట్టింది రూరల్ షోర్స్' అంటూ చెప్పుకొచ్చారు మురళి. ఆలోచనను అమల్లో పెట్టడానికి తన ఉన్నత ఉద్యోగాన్ని 2005లో వదిలేశారాయన.

ఆత్మవిశ్వాసమే కీలకం

పల్లెసీమల్లో బిజినెస్ ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పాలన్న మురళి ఆలోచనకు అప్పటికే పుట్టపర్తిలో ఇరవై మందితో చిన్న బీపీఓను నిర్వహిస్తున్న సుజాతా రాజు స్ఫూర్తినిచ్చారు. ఆమె సహకారంతో దాన్ని వందమంది ఉద్యోగుల కేంద్రంగా విస్తరించారు ఆయన. 'అది నాకు చాలా విలువైన పాఠాలు నేర్పింది. గ్రామీణ యువతకు ఉద్యోగం అంటే ఏదో నాలుగు రాళ్ల జీతం వచ్చే మార్గం కాదు. వాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యే సాధనం అది. మరీ ముఖ్యంగా యువతులకు. అందుకే ఇప్పుడు మా కేంద్రాలన్నింటిలోనూ సగంమంది అమ్మాయిలు ఉండేలా చూసుకుంటున్నాం. ఒకప్పుడు తలెత్తి ఎదుటి మనిషితో మాట్లాడటానికే భయపడిన గ్రామీణ యువతులు ఇప్పుడు చకచకా పనిచేస్తూ ఆత్మస్థైర్యంతో వ్యవహరించడాన్ని మీరు చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పేది కాదు. తాగుబోతు తండ్రులను హెచ్చరించి దారికి తెచ్చుక్ను దాఖలాలున్నాయి' అని నవ్వుతూ చెబుతున్నారు మురళి.

నిజానికి గ్రామీణ బీపీఓల వల్ల ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటివల్ల వలసలు తగ్గి పల్లెల్లో ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యమవుతుంది. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినా ఇంటిపట్టునే ఉండే యువత దుబారా ఖర్చులకు, వ్యసనాలకు దూరంగా ఉంటారు. దానివల్ల కుటుంబానికి ఆసరా అవుతారు, మరోవైపు పైచదువులు చదువుకునే అవకాశమూ ఉంటుంది. వీటిని మించి ఉన్నచోటనే ఉద్యోగం వస్తుందన్న భరోసా ఉంటే ఎక్కువమంది గ్రామీణులు తమ పిల్లలను బడికి పంపుతారు. 'అన్ని లాభాలున్నాయి కనుకనే రూరల్ షోర్స్‌కు అందరి సహకారమూ లభిస్తోంది' అంటున్నారు మురళి. ఆయన ప్రయత్నాలకు ఇంకొందరు స్నేహితులు కూడా కలిసొచ్చారు. వారు కూడా బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారే. అయితేనేం, అందరూ వాటిని వదిలేసి గ్రామీణ యువతను ప్రోత్సహించే పనిలో పడ్డారు.

పెద్ద ప్రయాణానికి చిన్న అడుగులు

ప్రస్తుతానికి 'రూరల్ షోర్స్' ఆధ్వర్యంలో ఎనిమిది రాష్ట్రాల్లో పదిహేను బీపీఓ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈశాన్యభారతంలోని షిల్లాంగ్‌లో కూడా త్వరలో ఓ కేంద్రం ప్రారంభం కాబోతోంది. సుమారు రెండువేల మంది యువతకు ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2014 మార్చికల్లా మరో రెండున్నరవేల మందికి పనివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఊళ్లలో ఉంటాయీ కేంద్రాలు. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇంటర్మీడియెట్ పాసయినవారు. మొదటి మూడు నెలల్లో కంప్యూటర్ వినియోగం, ఇంగ్లీషు, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఉంటుంది. మరో మూడు నెలల పాటు వారు చెయ్యబోయే ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఉంటుంది. అంగ వికలురకూ అంతంత మాత్రపు ఆదాయమున్నవారికీ ప్రాధాన్యత ఉంటుంది'' అంటున్నారు మురళి. 'అలాగని అంతా బ్రహ్మాండంగా ఉంటుందని, చిటికెలో అయిపోతుందని నేనేం చెప్పటం లేదు. మహానగరాల్లో ఒకలాంటి సమస్యలుంటే గ్రామాల్లో మరొకలాంటి సమస్యలుంటాయి. 

ఉదాహరణకు విద్యుత్ సరఫరా. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో ఏమీ తెలియదు. అలాగే గ్రామీణ బీపీఓకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు సాధించడం కష్టం. ఇలాంటివాటిని పరిష్కరించడానికి చాలా సహనం అవసరం. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని సోనారీ గ్రామంలో మా బీపీఓ పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడుస్తుంది. దీన్నే మిగిలిన కేంద్రాలకూ అనువర్తింపచెయ్యాలనుకుంటున్నాం. ప్రారంభంలోనే పెద్దపెద్ద సంస్థల జోలికి పోకుండా, చిన్నవాటితో మొదలెట్టాం. దేశీయ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ వంటివాటికి ప్రాముఖ్యతనిచ్చాం. ఇప్పటికీ ఆ సంస్థ పనులు పుట్టపర్తి బీపీఓ నుంచే నడుస్తున్నాయి' అంటూ తమ పనిలోని కష్టనష్టాల గురించి చెప్పుకొచ్చారు మురళి.

ట్రెండ్ మారుతుంది

నాణ్యతలో రాజీపడకుండా ఒక గ్రామీణ బీపీఓ నెలకొల్పడానికి సుమారు 70 - 80 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా. 'అందువల్లనే మేమింకా లాభాల బాట పట్టలేదు. కానీ దానికి మాకు బాధ లేదు. గ్రామీణ బీపీఓలు పనితీరులో మరి దేనికీ తీసిపోవు' అని ప్రపంచానికి చాటి చెప్పడమే ఇప్పటికి మా లక్ష్యం. ఇది నెరవేరితే పెద్దపెద్ద సంస్థలన్నీ పల్లెటూరి ముంగిటికే వస్తాయి' అన్న ఆశాభావంతో ఉన్నారాయన. లక్షల మంది యువత నగరాలకు వలస పోతున్నప్పుడు కొన్ని వందల మందిని నిరోధించడ ం - సముద్రంలో నీటిబొట్టు చందమే కావొచ్చు. కానీ నెమ్మదిగా ట్రెండ్ మారుతుంది. 'మరో మూడేళ్లు తిరిగేసరికి వంద కేంద్రాల్లో పదివేల మంది పనిచెయ్యాలన్నదే రూరల్ షోర్స్ లక్ష్యం' అంటున్న మురళి దాన్ని సాధిస్తారనే ఆశిద్దాం. 
- అరుణ పప్పు
from : navya,andhrajyoti daily , for orijinal article pl click here
Reactions:

Post a Comment

 1. అభినందనలు మురళి గారూ !

  ReplyDelete
 2. It is development from below.Village manpower should be utilized properly in village it self.Cream of intelligentia should come to villages and teach the youth,educate them.Think and do something to rural unemployed.Eternal vigilance is the price of democracy.Let us make rural people vigilant through eduction knowledge self employment and put full stop to urbanisation.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు సూర్య ప్రకాశ్ గారు. మీరన్నట్లు గ్రామీణ యువతకు చైతన్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పల్లెప్రపంచాన్ని , పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉన్నది. నగరీకరణను , అనవసర వస్తూత్పత్తికోసం ఏర్పడే పారిశ్రామికీకరణను అడ్డుకోవాలి. మార్కెట్ మరియూ ప్రొడక్షన్ అనేది ప్రజల అవసరం కోసం ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. ఆ దిశగా పల్లెప్రజలలో చైతన్యం నింపేందుకు నా వంతుగా కృషి చేస్తాను.

   Delete
  2. చైతన్యం నింపాలి అని చెప్పినందుకు ధన్యవాదాలు. పర్యావరణం, పచ్చదనం కాపాడుకోవాలంటే జన్మభూమి కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. బ్లాగుల్లో కబుర్లు, ప్రచారఆర్భాటం కాదు. కార్యాచరణ వుండాలి. అప్పుడే మానవాభివృద్ధి, వికాసం, మరేదైనా.

   Delete
  3. బ్లాగుల్లో కార్యాచరణ అంటే ప్రచారమే అజ్ఞాతా!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top