తెలుగువారందరికీ తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు.



కామెంట్ విధానంపై నా కామెంట్స్ ! ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు వ్రాయలేదని విజ్ఞప్తి !!


పల్లె ప్రపంచం - ప్రజ లో నేనడిగిన ""  అన్న ప్రశ్నకు సమప్ సమాధానంగానూ, శ్యామలీయం గారి బ్లాగులో "వ్యాఖ్యారంగ విమర్శనం - వ్యాసాలకు ఆహ్వానం!" అన్న పిలుపుకు వ్యాసంగానూ వ్రాసినదానికి కొద్దిగా మార్పులు చేసి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. ఓపికగా చదివిన వారు ఈ పోస్టుపైనా, కామెంట్ విధానంపైనా తమ అభిప్రాయాలు చెప్పగలరని విజ్ఞప్తి. ఎవరినీ నొప్పించేందుకు ఇది వ్రాయలేదని విజ్ఞప్తి. అదే సందర్భంలో మీతో ఉన్న అనుభవాలు ఈ పోస్టు వ్రాయడంపై ప్రభావం ఉన్నాయని ముందుగా విన్నవిస్తున్నాను.


భూమి మీద 84 లక్షల జీవరాసులు నివసిస్తున్నాయని ఓ అంచనా! ఇన్ని జీవ రాసులలో మనిషి ప్రత్యేకత 'మనసు'. మనసుకు నిర్వచనం 'మనిషి యొక్క ఆలోచనా విధానం'. మనిషిలో ఇతర అవయవాలు దేని పని అది చేసినట్లుగానే మెదడు చేసే పని "ఆలోచించడం". ఈ ఆలోచన అనేది మనిషికీ - ఇతర జీవులకు తేడాని తెలియజేస్తున్నది. . 

మనిషి మాత్రమే పాత దానిని బేరీజు వేసుకుని కొత్తగా ఎలా అయితే తనకు బాగుంటుందో అని ఆలోచించి మరీ ప్రయత్నం చేస్తాడు. ఇది మనిషికి కావలసిన అన్ని రంగాలలో నిరంతరం జరిగే ప్రక్రియ. జంతువులు లేదా మిగతా జీవరాసులు అలా కాదు. సహజాతంగా తరతరాలుగా తమకున్న నాలెడ్జ్ మేరకు మాత్రమే అలాగే మారకుండా జీవిస్తున్నాయి.  కేవలం ఒక్క మనిషి మాత్రమే ఆలోచించి తను మారుతూ,  పరిస్తితులను మార్చుతూ ఉంటాడు. 

ఇక్కడే మనిషికీ - మనిషికీ మధ్య కొంత ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కొన్ని విషయాలలో కొంత కాలం, ఇంకొన్ని విషయాలలో అనంతంగా జరిగినా భగవద్గీతలో చెప్పినట్లు 'ఎప్పటికప్పుడు పరివర్తనం చెందడమనేది లోకం పోకడ'గా ఉంటుంది. ఈ పరివర్తనకు కారణం మానసిక సంఘర్షణే - మనసే అనేది మనసున్న మనం చాలా సార్లు మరచిపోతుంటాం. మనుషుల మధ్య మనసుల పోట్లాటా అందుకే జరుగుతుంటుంది.

మనిషికుండేవి 2 సంబంధాలు మాత్రమే : 1) ప్రక్రుతి తోటి 2) మనిషి తోటి. సహజంగా మనిషి సంఘజీవి. తమ అవసరాలకోసం మనుషులంతా కలసి ప్రక్రుతిని ఆధారం చేసుకుని సాంఘిక జీవనం సాగిస్తుంటారు. సంఘ జీవనం కోసం ఎప్పటికప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు. తాను ఏర్పరచుకున్న ఈ నియమాలతో పాటు, సృష్టి రహస్యాలయిన ప్రక్రుతిలో తన చుట్టూ జరిగే అనేక అంశాలను, తనకు ఆటంకంగా ఉన్నవాటిపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ సందర్భంగా తన మెదడులో తొలిచే అనేక ఆలోచనలను తన తోనూ ఇతరులతోనూ చర్చిస్తూ పరిష్కారం కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగమే పరస్పర చర్చలు లేదా భావ ప్రకటన అని నా అభిప్రాయం.

మనిషి తను పుట్టి పెరిగిన పరిస్తితుల మేరకు కొన్ని భావాలను అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. ఈ సందర్భంగా కొన్ని అలవాట్లూ ఏర్పడతాయి. కానీ పైన చెప్పినట్లు లోకం ఎప్పుడూ మార్పుకు గురవుతుంటుంది. ఎవరాపినా ఆగదు. సమాజం ఎప్పటికప్పుడు ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి మారుతుంది. ఇది అనివార్యం - అవసరం కూడా. 

ఒక్కోసారి ఉన్నతంగా కంటే దిగజారే పరిస్తితులూ కల్పించేలా కొందరు మనుషులు ప్రవర్తిస్తుంటారు. అది వారి స్వార్ధం. ఇంకొందరు చిన్నప్పటినుండి తామేర్పరచుకున్న భావాలు - ఆచార వ్యవహారాలు తొలగిపోతుంటేనో, తొలగించబడుతుంటేనో తట్టుకోలేరు. సమాజం చెడిపోతున్నదని, దిగజారి పోతున్నదని, కావాలని కొందరు దిగజారుస్తున్నారని ఆందోళన చెందుతుంటారు. అది వారి భయం. మరికొందరు సమాజంలో ఆచార వ్యవహారాలు ఆటంకంగా ఉన్నవి పాత చింతకాయ పచ్చడిలా తయారయ్యాయని చాదస్తమనీ వాదిస్తుంటారు. అది వారి అసహనం.  ఇలా రకరకాలుగా వివిధ అంశాలపై అభిప్రాయాలున్నా అందరూ ఒకరిపై మరొకరు ఆధారపడుతూ కలసే జీవిస్తుంటారు. 

ఇక్కడే ప్రధానమైన ఓ అంశమేమిటంటే, విడి విడిగా మనసులలో ఏర్పరచుకున్న భావాలు బయటకు వెలిబుచ్చినప్పుడే అదే భావాలున్నవారి మధ్య ఓ ఐక్యత ఏర్పడుతుంది. అది క్రమంగా ఓ శక్తిగా మారుతుంది. ఓ అంశం పట్ల మార్పుకు ఈ శక్తి దోహదం చేస్తుంది. ఇక్కడే మళ్లీ భిన్న భావాలు భిన్న గ్రూపులుగా ఏర్పడతాయి. ఏ భావం రైటూ ఏ భావం తప్పు అనే విచక్షణ లేకపోతే మనుషుల మధ్య ఈగోలు పెరిగి అవి 'గ్రూపు ఈగో'లుగా మారి గొడవలవుతుంటాయి. ఎన్ని గొడవలయినా ఎవరెంత ఈగో పెంచుకున్నా కాలక్రమంలో ఆచరణలో అవసరమైన కంఫర్టబుల్ అంశాలే ఆచార వ్యవహారాలుగా నిత్యం వికసిస్తుంటాయి. ఈ భావ సంఘర్షణ వల్ల మంచి భావాలు అంతిమంగా విజయం సాధిస్తాయి. కార్యాచరణకు అనువుగా లేకుంటే బలవంతంగా ఏదైనా భావాలను సమాజం మీద రుద్దుదామనుకుంటే అది ప్రజల ఆమోదం పొందదు. బలవంతం కాదెపుడూ ఫలవంతం !

ఈగోలను పక్కనబెట్టి అంశాల వారీగా విచక్షణకు పదును బెడితే ఎప్పటికప్పుడు వ్యక్తి ఉన్నతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఈగోల మాటున, గ్రూపుల లేదా ఇజాల మాటున బందీ అయితే చైతన్యం వికసించదు. బయట అయినా బ్లాగులలో అయినా విచక్షణ అనేది మనిషి చైతన్యం మరియూ వ్యక్తిత్వం ఏర్పడడానికి కీలకమైనదని నా అభిప్రాయం. దీనికి ఏమిటి? ఎందుకు? ఎలా? అనే శాస్త్రీయ ధృక్పథం అలవరచుకోవడమొక్కటే పరిష్కారం. ఏ ఒక్కరికీ ఎప్పటికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు కనుక అందరూ అందరికి గురువులే. అందరూ అందరికీ అవసరాన్ని బట్టి శిష్యులే అని నా నమ్మకం. నేర్పడానికీ - నేర్చుకోవడానికీ కూడా భావ ప్రకటన చాలా అవసరం. అది సరిగా ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది. మనిషికీ మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు భావ ప్రకటన అనే కళనును ఇంప్రూవ్ చేసుకోవడానికి కామెంట్లు ఉపయోగపడతాయి. తినగ తినగ వేము తియ్యగుండును అనగననగ రాగమతిశయిల్లుచునుండునన్నాడుగదా మన వేమన్న. అలాగే సాధనమున కామెంట్లు చక్కగా ఉంటాయి.

బ్లాగర్లకు చెప్పదలచుకున్నవి :- 
కొత్తవారిని ఓపికగా ప్రోత్సహించండి!
మీరు చెప్పదలచుకున్న అంశాలను నిర్మొహమాటంగా చెప్పే అవకాశం బ్లాగులు కల్పిస్తున్నాయి. అయితే కొత్త బ్లాగర్లను ప్రోత్సహించడానికి మీరు ఓపిక చేయండి. ఓపిక అంటే బాగాలేని వాటిని, మీరు చెత్త అనుకునే వాటిని గురించి. మీ బిడ్డ తొలిసారిగా మాట్లాడినప్పుడు, కాగితంపై ఓ బొమ్మ తొలిసారి వేసినప్పుడు మీకెంత ఆనందం ఉంటుంది? ఆ బిడ్డకెంత ఆనందం ఉంటుంది. గుర్తుకు తెచ్చుకోండి. అలాగే కొత్త వారు వ్రాయడం ప్రారంభించినప్పుడు వారేది వ్రాసినా మీరు చిరాకు పడకండి. మీరే అన్ని తెలిసిన గొప్పవారిలా నెగెటివ్ గానో, సర్వజ్ఞులలానో ప్రవర్తించకండి. దయచేసి ఇలాంటి లక్షణాలున్నవారు ఓపిక చేయడమనే కళను ఇంప్రూవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి భావాలను స్వేచ్చగా ఆహ్వానించేలా ప్రోత్సహించండి. మీరూ వారి నుండి నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త బ్లాగర్లు చిన్నపోస్టులు వ్రాస్తే వారిని అభినందించే చిన్న కామెంటయినా మనం వ్రాస్తే వారు చిన్నపోకుండా ఉంటారు. ఈ రోజే ఆ పని ప్రారంభించండి.

బాగు చేయడానికే కామెంటండి తప్ప బాధ పెట్టకండి!
అదే విధంగా మీరు వ్రాసినదానికి భిన్నాభిప్రాయం వస్తే ఆలోచించి మీరు నేర్చుకునేది ఉంటే నేర్చుకోండి. లేదా మీ అభిప్రాయం సూటిగా చెప్పేయండి. బాగున్నదానిని బాగున్నదన్నట్లే బాగాలేనిదానిని బాగాలేదనీ అనాలి. అలా ఎందుకంటున్నామో చెప్పేది బాగు చేయడానికి కావాలి గానీ బాధ పెట్టడానికి కాకూడదని మనవి.

విషయాన్ని బట్టి కామెంటండి తప్ప వ్యక్తులను బట్టి కామెంట్లు వద్దు! 
వ్యక్తుల గత ఆలోచనలను బట్టి అంచనాతో కాకుండా ఎప్పటి భావాలను,విషయాలను అప్పుడే గమనిస్తూ కామెంట్ చేయడం మంచిది. ప్రవీణ్ తో చర్చించేటప్పుడు మార్క్సిస్టు అనో, శ్రీరాం గారితో చరంచేటప్పుడు బీ.జే.పీ వారనో , శ్యామలీయం గారు రామభక్తులనో, శ్రీకాంత్ చారి గారితోఅయితే తెలంగాణావాదనో చూడకూడదు. భావమేది అందులో మన అభిప్రాయమేమిటి? అనేలా మాత్రమే చూడాలి. అలాగే మనిషిని బట్టిగాక విషయాన్ని బట్టి కామెంట్ చేయడం అలవాటుగా మార్చుకుంటే అత్యధిక సమస్యలు తగ్గుతాయి. ఇది అసాధ్యమేమి కాదు కూడా.

నేర్చుకోవడానికి నామోషీ వద్దు!
మన అభిప్రాయం తప్పని తేలితే వెంటనే నేర్చుకోవడానికీ, మార్చుకోవడానికీ వెనుకాడకూడదు. మనం చర్చలలో పాల్గొనేది ఖచ్చితంగా నేర్చుకోవడానికీ లేదా తెలిసింది పదిమందితో చర్చించి మరింత మెరుగు పరచుకోవడానికి లేదా తెలియంది తెలుసుకోవడానిక్ అయి ఉండాలి. నేర్చుకోవడానికి నామోషీ వద్దు.

అనవసర సమర్ధన వద్దు!
మనమంతా కొన్ని విషయాలలో కొన్ని విషయాలలో కొన్ని బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. అలాంటి వాటికి ఎదురు గట్టిగా విమర్శ తగిలినప్పుడు మనం తట్టుకోలేము. అటువంటప్పుడు కొందరు ఈగోను వదిలి బయటకు రాలేరు. పదే పదే దానిని సమర్ధించుకునే విపరీత పైత్యం మనపట్ల మరింత ఏహ్యభావం కలగడానికే ఉపయోగపడుతుంది. మనలోని అహంకారాన్ని - అజ్ఞానాన్ని బయటపెట్టడానికి పనికి వస్తుంది.

మితిమీరిన విమర్శలు సలహాలు మంచిది కాదేమో !
అవసరం లేని విషయాలలోనూ, మితిమీరి దూరి సలహాలు విశ్లేషణలు చేయకండి. ఏకంగా మనుషుల గురించో - బ్లాగుల గురించో, పోస్టుల గురించో పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారాలు చేయకండి. పాజిటివ్ అయితే ఫర్వాలేదు. ఒకరిని ప్రోత్సహించినట్లవుతుంది కనుక. మీకు చికాకు అనిపిస్తే తప్పుకుని పోవచ్చు తప్ప, మీరు తప్పు చేసి మరీ ఎదుటివారి తప్పులను సరిచేయాల్సిన అవసరం లేదు. ఇది ఓ రకమైన పైత్యమే అని నా అభిప్రాయం!

పాలకుల ప్రాంతాల భజన ఎంతమేరకు అవసరం?
పాలకులను, ప్రాంతాలనూ దృష్టిలో ఉంచుకుని ఓ వైపు నిలబడి ఎంతకైనా సాగదీస్తూ ఎబ్బెట్టుగా వాదించడం అభిమానం కంటే దురభిమానమే ఎక్కువగా కనిపిస్తుంది. మీకున్న నాలెడ్జ్ ని ఈ ప్రవర్తన మసకబారుస్తుందని నా అభిప్రాయం. అభిమానానికీ దురభిమానానికీ విమర్శకీ కువిమర్శకీ తేడాని గమనించి వాదించడం మంచిది.

ఇతరుల ఆసక్తులను గౌరవించండి!
మీకు ఆసక్తిగా ఉన్నవే ఇతరులకీ ఆసక్తిగా ఉండాలని కోరుకునే వాదనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఏది ఎవరికి ఇష్టంగా ఉండాలో అది వారి వ్యక్తిగతం. మీరు అందుకు కష్టంగా ఫీలవడం అంటే అసహనం ఎక్కువవుతున్నట్లే. లేదా స్వార్ధపరులైనా అయి ఉండాలి. ఎదుటివరిని గౌరవించడం తెలీనివారైనా అయీ ఉండాలి. అన్ని భావాలను, అందరి భావాలను స్వీకరిచలేకపోయినా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఏవి ఎక్కువ బాగుంటాయో వాటికే ఆదరణ లభిస్తుంది. చిన్న గీతను చెరపకుండానే పెద్ద గీతను గీయడానికి మార్గాలను అన్వేషించండి.

అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పండి!
అలాగే భావోద్వేగంలో వ్యక్తిగతంగా మాట జారితే వెంటనే వెనుకకు తీసుకోండి. క్షమాపణ చెప్పండి. అనవసరమైన, కించపరచే శాడిస్టు లక్షణాలను వెంటనే తగ్గించుకోండి. ఇది కొందరిలో ఎప్పుడూ, అందరిలో(?) అప్పుడప్పుడూ అసహనంతో జరిగినా వెంటనే మార్చుకోవాలి.  పొరపాటున నోరు జారితే వెంటనే క్షమాపణ చెప్పండి. ఒక్క అడుగు వెనుకకు వేస్తే రెండడుగులు ముందుకు పడతాయంటే తప్పక ఓ అడుగు ముందుకే వెళుతుందనేది విజయమేనని గుర్తించండి.

ఎందరినైనా ఎదిరించండి!
మన అభిప్రాయం సరయినదని మనం గట్టి ఆధారాలుతో నమ్మినప్పుడు లక్ష మంది వ్యతిరేకించినా జంకవద్దు. మనమెలా రైటో ఓపికగా వివరించే ప్రయత్నం చేయండి.ఓ విషయంపై ఎంత అధ్యయనం చేస్తే అంత పట్టు పెరుగుతుంది. విషయ సేకరణ + ఆధారాలతో నిర్ధారించుకుని వాదించేటప్పుడు కామెంటుకు వేల్యూ పెరుగుతుంది. ఎందరు ఎన్ని రకాలుగా వాదించినా మీరు సమాధానం చెప్పగలరు.

మూకగా కాకిగోల చేయొద్దు!
మూకలుగా ఒక అభిప్రాయానికి వ్యతిరేకంగా కాకిగోల చేయకండి. మనం కాకులం కాదు దాడి చేయడానికి. మనసున్న మనుషులు కాకి గోల చేసినా ప్రయోజనం ఉండదు కంఠశోష - శాడిస్టిక్ పైత్యానందం తప్ప. ఇది ఓ రకంగా వికృత రేగింగ్ లాంటిదే. పదిమంది కలసి కాకిగోల చేస్తే ఒక మంచి అభిప్రాయం చెప్పే గొంతు నులిమివేయలేరు. అరచేతితో సూర్యకాంతినాపాలనుకోవడమెంత అజ్ఞానమో అహంకారంగా,అడ్డగోలుగా మంద బలంతో, మంది బలంతో వాదించడమూ అంతే అజ్ఞానం. భూమి గుండ్రంగా ఉన్నదన్న వారిని చంపేసినా భూమి గుండ్రంగానే ఉన్నదన్నదే నిజం కదా!

సెన్సేషన్ కోసం తాపత్రయపడేవారిని జస్ట్ ఇగ్నోర్ చేయండి!
కొంతమంది సెన్షేషన్ కోసం కొన్ని కామెంట్లు చేస్తుంటారు. కావాలనే దీనినో మార్గంగా చేసుకుని పబ్లిసిటీ పొందాలనుకుంటారు. తామేదో గొప్ప విషయాలపై చర్చిస్తున్నామనుకుని ఎప్పుడూ వార్తలలో ఉండేందుకూ ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు మనం రాం గోపాల్ వర్మ ను తీసుకుంటే ఈ విషయం అర్ధమవుతుందని నా ఆరొపణ. అతను ఏ విషయంపై ఎప్పుడు ఎందుకు ఎలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడో దానివల్ల సమాజానికి ఏదైనా మేలు ఉన్నదా? అనేది మనం ఆలోచిస్తే ఇలాంటి కామెంటర్లు ఏమి ఆశిస్తుంటారో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమైనదేమీ కాదు. నేను ఇక్కడ చెప్పదలచుకున్న పరిష్కారం ఇలాంటివాటిలో దూరితే ఎవరి ప్రయోజనం నెరవేరుతుందో ఆలోచన చేయండోసారి. అందుకే అలాంటివారి కామెంట్లకు బదులివ్వకుండా ఇగ్నోర్ చేస్తే మేలు. అందరూ ఇదే చేస్తారు కొంత కాలం చూసి. ఎక్కువమంది ఈ టెక్నిక్ ఉపయోగిస్తే అలాంటివారి రోగం కుదురుతుంది. వారితో వాదించి వారేదో మారతారనుకోవడం ఇక్కడ మాత్రం భ్రమే అవుతుంది. ఎండమావుల్లో నీరు వెతుక్కోవడమే అవుతుందది.

మొండివాళ్లను మార్చాలనుకోవద్దు! వదిలేయడమే ముద్దు!!
మరి కొందరు మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లుంటారు. వీరు మంచివారే. చాలా విషయాలలో మాత్రం మంచిగానే వాదిస్తారు. తాము తెలుసుకోవలసి వస్తే ఎవరైనా ఎదురువాదనలో వీరికి భిన్నంగా నిర్ధారణగా ఆధారాలతో తేలిస్తే తట్టుకోలేరు. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడడమో , తరువాత వస్తానని చెప్పి ఆ విషయం నుండి బయటపడడమో చేస్తుంటారు. నేర్చుకోవడానికి ఈ జ్ఞానులు అంగీకరించరు. నేర్పడానికే హుషారు పడుతుంటారు. వీరిని చూసి ఎదుటివారెలా నవ్వుకుంటారో వీరికి తెలీదు. వీరిని ఇలాంటి సమయాల్లో వదిలేయడమే మంచిది. వీరి గురించి మారుద్దామని చూసినా మన టైమే తింటారు తప్ప వీరు మారరు.

ఫలాయనవాదం ఎవరికి మేలు!?
మరికొందరు ఎవరైనా ఘాటుగా కామెంటితే తట్టుకోలేరు. అవసరమైనప్పుడు ఘట్టిగా నిలబడాల్సి వచ్చినప్పుడు ఫలాయనం చిత్తగించి నాలాంటి వాళ్లకలా కుదరదంటూ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఎంత మంచివారైనా ఇదీ మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం.

భావ ప్రకటనలోనూ సమైక్యత చాటండి!
బయటి ప్రపంచంలో ఉన్నట్లే బ్లాగు ప్రపంచంలోనూ బద్మాష్ గాళ్లుంటే వారిని అందరం సమైక్యంగా ఎదుర్కోవాల్సిన సమయంలో మీరు పరారు కావడం ధర్మమా? అభిప్రాయ బేధాలుండడం వేరు కనీస సంస్కారం కు భిన్నంగా వాదించేవారిపట్ల కాఠిన్యత ప్రదర్శించలేక పరారు కావడం వేరు. దుర్మార్గులను భావప్రకటనలోనూ ఎదుర్కోవలసిందే.

మహిళలపట్లా సున్నిత మనస్కుల పట్లా మర్యాద పాటించండి!
ఆడవారిపట్లా, సున్నిత మనస్కుల పట్లా కొందరు తింగరి కామెంట్లు చేస్తుంటారు. అంటే వీరెలా ఉంటారంటే గ్రామాలలో చిన్న సైజు రౌడీ వెధవలు త్రాగి నోరు పారేసుకుంటే అందరూ వీడితో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని వెళితే... చూశారా.. నా ప్రతాపం! అనుకునే రకంగాళ్లన్నమాట. ఇక్కడా ఈ వీరులు కనపడతారు. మనం పరారైతే బరితెగిస్తారు.

అలగడమూ అతి మర్యాదలు ఆశించడమూ చర్చలలో మంచిది కాదు!
మరికొందరుంటారు. చాలా పద్ధతిగా ఉంటారు. కొన్ని భావజాలాలకు బందీ అవుతారు. ఆ భావజాలాలకూ లేదా నమ్మకాలకు మనం విరుద్ధంగా వాదిస్తే వారిని అవమానపరచినట్లు ఫీలవుతారు. వ్యక్తితో వాదానికి అభిప్రాయంపై వాదానికి ఉన్న సన్నని గీత లాంటి తేడాను వీరు కావాలని కాదు గానీ మరచిపోతారా సందర్భంలో. ఒకరకంగా వీరు అలుగుతుంటారు అనవచ్చు. ఒకప్పుడున్న హుషారు వారి భావాలకు మనం వ్యతిరేకమని వారు ముద్ర వేసుకున్నాక మన బ్లాగులవైపు ఇక కనిపించడం మానేస్తారు. అందరూ అందరి అభిప్రాయాలతో అన్నివేళలా ఏకీభవించడం అసాధయం అని వీరు గుర్తించాలి. ఎవరు ఏ అభిప్రాయంతో ఉన్నా అలక మంచిది కాదు. వ్యక్తిగతంగా బ్లాగుప్రపంచంలో మనమెవరమూ అంతగా ఒకరికొకరం పరిచయాలుండవు. వ్రాతలు భావాలపరంగానే పరిచయస్తులం కదా? అలాంటప్పుడు అలకలు మంచిదంటారా!? వారే చెప్పాలి.

మొత్తం మీద సందర్భాన్ని బట్టి అలుసుకీ - అహంకారానికీ మధ్య మన కామెంట్లు ఉంటే మంచిదనేది నాకున్న అభిప్రాయం.

స్వీయ నియంత్రణ ఉత్తమం!
కామెంట్లను ఓ బ్లాగరుగా ఎలా నియంత్రించాలనేది ఎవరికివారే చేసుకునే అవకాశం ఉన్నట్లే దానికంటే ముందుగా కామెంట్ చేసేవారు స్వీయ నియంత్రణ పాటించడం మెరుగైన పద్ధతి. ఆ చైతన్యం తెలుగు బ్లాగర్లలో పెరగాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆర్టికల్ చదివినవారు ఈకపై ఎవరినీ బాధపెట్టేందుకు గాక బాగు చేసేందుకు కామెంట్స్ ఉంచుతారని ఆశిస్తున్నాను.


ఇక అగ్రిగేటర్లలో మాలిక విధానం బాగున్నది (నేను ఎక్కువగా మాలికను చూస్తుంటాను). అందులోనే విడిగా బ్లాగుల వారీగా కూడా కామెంట్లు చూసుకునే అవకాశం కల్పిస్తే మంచిది. ఆ విధంగా వారు ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. చాలామందితో వాదించిన అనుభవంతో కొన్ని ఉదాహరణలిచ్చాను. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టేందుకు ఇది వ్రాయలేదని విజ్ఞప్తి.
- Palla Kondala Rao
Reactions:

Post a Comment

  1. మీరు చాలా మంచి నిర్ణయానికి వచ్చారు...చాలా బాగా కామెంట్ చేసేవాళ్ళను పరిశీలించి వ్రాసారు...

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top