ఇదెలా సమైక్యం?
ఆంద్రప్రదేశ్ ని విడదీయడం ద్వారా తెలుగు ప్రజలకు గానీ, తెలంగాణా ప్రజలకు గానీ ఒనగూరే ప్రయోజనాలేమీ లేవు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారా గతంలో జరిగిన తప్పిదాలు జరుగకుండా  రాయలసీమ, తెలంగాణా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి. ఇంతదాకా వచ్చాక, తెలుగు ప్రజలంతా దాదాపుగా మానసికంగా విభజనకు సిద్ధపడ్డాక, ఓ ప్రాంతంపై మరో ప్రాంతం వారు అపనమ్మకం అభద్రతాభావంతో ఉన్నాక అది సాధ్యమయ్యేది కాదు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదు కనుకనే పాలకుల దోపిడీకి, అన్యాయానికీ గురయిన తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. కానీ సీమాంధ్ర ప్రజలు పోరాడేది కేవలం హైదరాబాద్ కోసమే. తెలంగాణా ఉద్యమానికి అర్ధం ఉంటే సీమాంధ్ర ఉద్యమం వెనుక అభద్రత మాత్రమే ఉన్నది. నాయకులెవరూ అటు సీమాంధ్ర వారు గానీ, తెలంగాణా వారు గానీ సీమాంధ్రులకు ధైర్యాన్ని, భరోసానీ ఇవ్వడం లేదు. అలా ఇస్తే మంచో చెడో నిజానికి విభజన ప్రక్రియ ఇంత సంక్లిష్టంగా తయారయ్యేది కాదు. కే.సీ.ఆర్ లాంటివారయితే కావాలనే మరింత రెచ్చగొడుతున్నారు. సీమాంధ్ర నేతలు సమైక్యం అనకుంటే ఇప్పుడున్న పరిస్తితిలో ప్రజలు తమను రాజకీయంగా బొంద పెడతారని జడిసి అన్నీ తెలిసే సమైక్యమంటూ నాటకాలేస్తున్నారు. సమైక్యమంటే పార్టీలకతీతంగా నాయకులు అందరూ ఐక్యంగా ఉండాలి. రాష్ట్రమంతా 23 జిల్లాలలో ఉద్యమo జరగాలి.కేవలం 13 జిల్లాలలో అదీ నాయకుల అనైక్యతతో , డ్రామాలతో జరిగేది ఎలా సమైక్య ఉద్యమం అవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం ఎవరూ చిత్తశుద్ధితో ప్రయత్నించలేదనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఎవరికి వారే ఎదుటి వారిపై బురదజల్లడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప సీమాంధ్ర ప్రయోజనాలకోసం ప్రయత్నించకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
అలాంటి నేతలేరీ?
ఎన్.టీ.ఆర్,  రాజశేఖర రెడ్డిలాంటి పవర్‌ఫుల్ నేత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయమంతా కుక్కలు చింపిన విస్తరిలా తయారయింది. వారి వారసులుగా చెప్పుకుంటున్నవారితో సహా ప్రస్తుతం ఉన్న నేతలెవరికీ ధైర్యంగా తాము ఫలానా వాదం చేస్తున్నామని చెప్పే సత్తా లేదు. చెప్పినా జనం వారిని నమ్మే పరిస్తితి లేదు. రాష్ట్రంలో విభజన ఉద్యమాలు రాజకీయ కారణాలతో ఎప్పుడూ ఉండేవే అయినా ప్రజలెప్పుడూ ప్రస్తుతం ఉన్నంత అండగా లేరనే చెప్పాలి. దానికి కారణం ఎంతో కొంత ప్రజలకు విశ్వాసం కలిగించేలా పాలన సాగించిన నేతలు. అలాంటివారిలో ఎన్.టీ.ఆర్, రాజశేఖరరెడ్డిలను ఉదహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు సీ.ఎం గా ఉన్నంత కాలం పాలనాపరంగా మంచి పరిపాలనా దక్షుడనిపించుకున్నా రాజకీయంగా తమ పార్టీ నేతలను గానీ, ప్రజలను గానీ నమ్మించలేకపోతున్నారు. ఈ విషయంలో ఆయన ఘోరంగా విఫలం కావడానికి కారణం ఆయన ప్రజలకంటే,తమ నేతలకంటే మీడియానే ఎక్కువగా నమ్ముకోవడమని చెప్పాలి.పాలకుడిగా సక్సెస్ అయినా జననేతగా చంద్రబాబు ఎదగలేదు. నిత్య అభద్రతా జీవిగా ఉండడమే దీనికి కారణం. ప్రజలు ఆయనను నమ్మలేకపోవడమూ ప్రస్తుత స్తితికి ఓ కారణంగా చెప్పవచ్చు.
ఎవడిగోల వాడిదే!
మనం ఎదుటివారిని వేలెత్తి చూపేటప్పుడు మనవైపు మన మూడు వేళ్లు చూపుతాయనేది ఆత్మవిమర్శ కోసం చెప్పే సూచన. నేటి మన రాష్ట్ర రాజకీయానికి ఇది సరిగ్గా నప్పుతుంది. ఆంధ్రప్రదేశ్ తో ఢిల్లీ పెద్దలు ఆడుకోవడానికి తమ లోపమెంతో సమీక్షించుకోకుండా ఇప్పటికీ సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్న వీర సమైక్య సైనికుల అనైక్యతా రాగం గందరగోళంగా ఉంది. ఎవరికి వారే సమైక్య సెంటిమెంట్‌ను వాడుకునేందుకు విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతుందని తెలిసి కూడా నాటకాలేస్తున్నారు. ఎవరి శక్తి మేరకు వారు నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని కాంగ్రెస్ విభజిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు ముందే సంకేతాలున్నా నిజంగా అధిష్ఠానం అంత ధైర్యం చేస్తుందా? అనుకున్నారు. తెలుగుదేశం కూడా ఆ నమ్మకంతోనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. జగన్‌దీ అదే తంతు. వీటన్నింటికీ భిన్నంగా తెలంగాణా పోరు బిడ్డలకు సైతం నమ్మశక్యం కాని రీతిలో తన బిడ్డ భవితవ్యం కోసం అమ్మ దయతలచి తెలంగాణా ప్రకటించింది. విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు బంట్లను పురికొల్పింది. ఎలా వచ్చినా దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతుండడంతో తెలంగాణా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీమాంధ్రులు ఏదో ఒక దశలో మాయ చేసి నోటికందిన ముద్దను కాజేస్తారేమోనని భయపడుతున్నారు. తమనేతలు ఏదైనా చేసి సమైక్యాంధ్రప్రదేశ్ ని కాపాడుతారేమోనని సీమాంధ్ర ప్రజలు దింపుడు కల్లెం ఆశతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఓ బ్రహ్మపదార్ధం కనుక ఎపుడైనా, ఏమైనా చేస్తుంది కనుక విభజన నాటకం ఆద్యంతం రసవత్తరంగా సా...గు..తు..న్నది.
అంతా నాటకమే!
ఈ నాటకంలో ప్రధాన నేతలు చంద్రబాబు, జగన్ , కిరణ్ కుమార్ రెడ్డి లు సీమాంధ్ర ప్రజల మద్ధతు కోసం తెగ ఇబ్బంది పడుతున్నారు. ఐక్యతలేని సమైక్య ఉద్యమాలు చేస్తున్నారు. అవసరం లేని ఆర్భాటాలు చేస్తున్నారు. తెలిసీ, కావాలనే తమ స్వార్ధం కోసం సీమాంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు. వారిని వాడుకునేందుకు చూస్తున్నారు. రాహుల్‌ని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని చీల్చాలని ఇటలీ తల్లి నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. స్వంత పుత్రుడి కోసం దత్తపుత్రుడి తో కలిపి తమను మోసం చేస్తున్నారని ఆ పార్టీ పెద్దలే ఇప్పుడు తీరిగ్గా ఆరోపిస్తున్నారు. రెండేళ్లనుండే రాష్ట్ర విభజన సంకేతాలు కాంగ్రెస్ ముఖ్యులకు తెలిసినా వారు అడ్డుకున్నదిలేదు. పైగా విభజనకు తాము సహకరిస్తామని చెప్పారు. ఇప్పటికీ సహకరిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలలో అంత వ్యతిరేకత వస్తుందని వారు ఊహించలేదు. ప్రజాందోళనకు జడిసి ఇప్పుడు ప్లేటు ఫిరాయించేవారూ ఉన్నారు.

రెంటికీ చెడ్డ చంద్రబాబు!?
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ లేని సంకట స్తితిలో ఉంది. చంద్రబాబు చంద్రశేఖరరావుకు మంత్రిపదవి ఇవ్వకపోవడంతో నిద్రాణమై ఉన్న తెలంగాణా అంశాన్ని టీ.ఆర్.ఎస్ పార్టీ స్థాపించి వెలుగులోకి తెచ్చారు. అప్పటినుండి తెలుగుదేశం పతనమే లక్ష్యంగా కే.సీ.ఆర్ అడుగులు వేశారు. ఎన్.టీ.ఆర్ రాజకీయాలలోకి వచ్చాక సమైక్యవాదిగానే గట్టిగా ఉన్నారు. ఆయన ప్రజలను నమ్మారు. ప్రజలు ఆయనను నమ్మారు. కానీ ఆయన వారసులుగా చెప్పుకుంటున్న చంద్రబాబు తన నీడను తానే నమ్మడు. ఎప్పుడూ అసంబద్ధ నిర్ణయాలే తీసుకోవడంతో రెండు ప్రాంతాలలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్తితి దారుణంగా ఉంది. ప్రజలు ఆ పార్టీని ఏ విషయంలోనూ విశ్వసించేలా లేరు. తెలంగాణాకు అనుకూలమంటూనే సమన్యాయం, రెండు కళ్ల  సిద్ధాంతమంటూ నానా గందరగోళం చేస్తున్నారు. కాంగ్రెస్ ని విమర్శించడమే ఎజెండా తప్ప తమ వైఖరి ఇదీ అని చెప్పలేని అయోయ గందరగోళ పార్టీగా తెలుగుదేశం ఉంది. బీ.జే.పీతో పొత్తు ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవడం , తిరిగి రాష్ట్రం లోనూ కేంద్రంలోనూ చక్రం తిప్పాలని బాబు చేస్తున్న ప్రయత్నాలకు బీ.జే.పీ అంతగా స్పందిస్తున్నట్లు లేదు. బాబుని నమ్మడానికి లేదని రాష్ట్ర బీ.జే.పీ గట్టిగానే విశ్వసిస్తున్నది. జగన్-కే.సీ.ఆర్ లు కూడా బాబును బీ.జే.పీకి దగ్గర కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి స్తితిలో చంద్రబాబు సీమాంధ్రులకు గానీ, తెలంగాణా వారికి గాని నమ్మకమైన నేతగా లేరు. బీ.జే.పీ తో పొత్తుద్వారా ఏవో అద్భుతాలు జరుగుతున్నాయంటూ బాబుకు అనుకూలమైన ఓ మీడియా తన చానల్ లోనూ పత్రికలోనూ ఊదరగొడుతున్నా ఆచరణలో అంత సీన్ కనిపించడం లేదు. తెలుగు తమ్ముళ్లు ఒకే వేదిక సాక్షిగా తెలంగాణా వాదం,  సమైక్యవాదం వినిపిస్తూ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అయోమయ కిరణం!
ఇక సీమాంధ్రులపట్ల అయోమయ ఆశాకిరణంగా సీ.ఎం ఉన్నారు. ఆయనేమి చేస్తాడో, ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. కిరణ్ కుమార్ రెడ్డి సోనియాను ఒక్క మాట అనకుండానే తాను అధిష్టానం నిర్నయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వీర సమైక్యవాదం వినిపిస్తున్నారు. చివరి బంతి వరకూ పోరాడతానని ఆట అప్పటిదాకా ఉంటుందని అంటున్నాడు. కిరణ మంచి ప్లేయరేగానీ మంచి కెప్టెన్ కాదని మంత్రి సీ. రామ చంద్రయ్య అంటున్నాడు. ఆయన సహచరులే సీమాంధ్రలో విభజనకు అనుకూలంగా ఉన్నట్లు చెపుతున్నారు. బొత్స సత్యనారాయణ ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులను ఒక్కొక్కరిగా అధిష్టానం తన దారిలోకి తెచ్చుకుంటున్నది. రచ్చబండల్లో సైతం సమైక్యం గట్టిగా వినిపిస్తున్నా ఆచరణలో ఆయన చేసింది సున్నా. అదిష్టానం ఆయన మాటలు ఖాతరు చేయడం లేదు. అసలిదంతా అధిష్టానం అండతోనే చేస్తున్నారనే వార్తలూ వస్తున్నాయి. దిన దిన గండం నూరేళ్ల ఆయుస్షుగా మూడేండ్లు పదవిని లాక్కొచ్చిన ఆయన తన హయాంలో రాష్ట్రం విడిపోదంటున్నారు. విభజన వల్ల అనేక సమస్యలున్నాయని అంటున్నారు. ఇందిరా నెహ్రూల నిర్ణయాన్ని తమ పార్టీ తోసిరాజంటున్నదంటున్నారు. విభజనవల్ల తెలంగాణాకే ఎక్కువ నష్టం అంటున్నారు. ఎన్ని చెపుతున్నా ఆయన మాటను అధిష్టానం లెక్క చేయడం లేదు. సీమాంధ్రలోనూ సీ.ఎం కు కాంగ్రెస్ వారే అందరూ సహకరించడం లేదు. ఆయన వ్యూహమేమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. స్వంత పార్టీ పెట్టి సీమాంధ్ర ఉద్యమాన్ని కేష్ చేసుకోవాలని చూస్తున్నాడనేది టాక్. అశోక్ బాబు వెనుక సీ.ఎమ్మే ఉన్నారంటున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో అధిష్టానం ఆజ్ఞలమేరకు సమ్మెను సీ.ఎమ్మే నీరుగార్చాడనీ అంటున్నారు. కిరణ్ ఏమి చేయబోతున్నాడో  ఆయన పాలనలాగే గందరగోళంగా ఉంది. అసెంబ్లీకి బిల్లువచ్చాక దానిని వ్యతిరేకించి అప్పుడు రాజీనామా చేస్తారనీ ఈలోగా కోర్టులో కేంద్రంపై రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తున్నారని కేసు వేయనున్నారనీ అంటున్నారు. ఇవన్నీ ముందునుండీ తెలిసి అధిష్టానాన్ని ఆనాడే అడ్డుకోలేదని ఇప్పుడు ఆయన చేసేదంతా సొనియా స్క్రిప్టు మేరకు డ్రామాలేనని కొందరు విమర్శిస్తున్నారు. కిరణ్ సమైక్యంలో నిజాయితీ ఎంత అనేది భవిష్యత్తులో మాత్రమే తేలుతుంది.

అంతా జగన్నాటకం!
ఇక జగన్ అయితే కొత్త డ్రామాలు వేస్తున్నాడు. కేంద్రం లో జాతీయ పార్టీలన్నింటినీ ఆయన కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజిస్తున్నారనీ మీరంతా ఆదుకోవాలనీ కోరుతున్నారు. బీ.జే.పీ - కాంగ్రెస్ రెండూ విభజనకు మద్దతిస్తే వీరందరినీ కలసి ఆయన ఏమి చేస్తారో ఆ దేవుడికే ఎరుక. తెలిసే కావాలని జగన్ తాను సమైక్యం కోసం ఎంత పోరాడినా ఫలితం లేకుండా పోయిందని చెప్పడానికి మాత్రమే ఈ దేశాటన ఉపయోగపడుతుంది తప్ప మరెందుకూ కాదని అందరికీ తెలిసిందే. అయినా తన మీడియాలో ఊదరగొడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తెగ కష్టపడ్డానని చెప్పుకోవడం ద్వారా సీమాంధ్రలో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.అయితే ప్రస్తుతం జగన్ చేసేవి డ్రామాలేనని సీమాంధ్రులు అనుమానిస్తున్నారు. ఆయన తల్లి కాంగ్రెస్ తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు అంగీకరించే ఇలా జగన్నాటకం ఆడుతున్నాడనేది అందరి అనుమానం. జగన్ కాంగ్రెస్ కు దత్తపుత్రుడిగా మారారని కాంగ్రెస్ నేత లగడపాటి ఆరోపిస్తున్నారు. బెయిల్ డీల్ కోసం జగన్ సోనియా ముందు డీలాపడిపోయాడని అంటున్నారు. గతంలో సీమాంధ్రలో పాజిటివ్‌గా ఉన్న జగన్ గ్రాఫ్ ఈ ఆరోపణలతో దారుణంగా  దెబ్బ తింటోందని సమాచారం. మొదట్లో విభజనకు అనుకూలమని చెప్పిన జగన్ తెలంగాణాలో సురేఖ లాంటి వాళ్లంతా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి కొంత సేపు సమన్యాయమని ఇప్పుడేమో తానసలు సమైక్యం కోసమే పుట్టినట్లు శంఖారావాలు పూరిస్తున్నా ఆ నాదం సీమాంధ్రప్రజలను ఉత్తేజితులను చేయడం లేదు.  ప్రస్తుతం జగన్ ని సమైక్యపోరాట యోధునిగా ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదు. 23 జిల్లాలలో సమైక్య పోరాటం చేస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జగన్ దేశాటన చేస్తూ మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.దేశాటనతో వచ్చే సీట్ల మద్దతు ఎంత? కాంగ్రెస్, బీ.జే.పీ లను, రాష్ట్రాన్ని వదిలేసి విచిత్ర విన్యాసాలు చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఎలా ఉంటుందో ఈ జగన్నాటకం ఎందుకో ఎవరికి తెలియనిది?
వామపక్షాలదీ అదే తంతు!
వామపక్షాలలో గతంలో విశాలాంధ్ర అన్న సీ.పీ.ఐ , న్యూ డెమొక్రసీ లాంటి పార్టీలు సైతం కొత్తగా ఏ మార్పు జరిగిందో తెలీదు కానీ తెలంగాణా రాగం అందుకోగా సీ.పీ.ఎం సమైక్యం అంటూ నికరంగానే ఉన్నా  సన్నాయి రాగాలు పలుకుతున్నది.  సీ.పీ.ఎం ఎక్కడా సమైక్యం కోసం ఉద్యమించలేదు. అందుకు సరయిన కారణాలు చెప్పలేదు. మొత్తంగా తెలంగాణా ప్రజలలో, పార్టీలలో నేతలలో ఉన్న ఐక్యత సీమాంధ్రులలో లేదనే చెప్పాలి. అసలు సీమాంధ్రులు చేసేది ఏ రకంగానూ సమైక్యం కాదనే చెప్పాలి.
తెలుగుజాతి ఐక్యంగా ఉండాలి!
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మాని ఇరు ప్రాంతాల వారికీ భరోసా కల్పించాలి. పార్టీలన్నీ డ్రామాలు కట్టి పెట్టి విభజన ఎలా జరిగితే ప్రయోజనమో చర్చలు చేయాలి. ఇక కేంద్రం ఏ మాత్రం బాధ్యత లేకుండా కేవలం రాజకీయ లాభం లెక్కల ఆధారంగా రోజుకో రకంగా లీకులిస్తూ కావాలనే గందరగోళం చేస్తున్నది. ఈ రాష్ట్రం తమ జాగీరు అయినట్లుగా వ్యవహరిస్తుండడం చూస్తుంటే చివరికి కాంగ్రెస్ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కాంగ్రెస్ అధిష్టానం కేవలం రాజకీయ ప్రయోజనాలే చూడకుండా ఇరుప్రాంతాల ప్రయోజనాలను శాశ్వత దృష్టితో ఆలోచన చేస్తూ ఆ దిశగా విభజన చేయాలి. మొత్తంగా చూస్తే రాష్ట్ర విభజన ఆగదని తెలిసినా ఏ ఒక్క పార్టీ కూడా జనానికి నిజాలు చెప్పడం లేదు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి అంతా ఐక్యంగా ఉండాలి. చైతన్యంతో నేతల డ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- పల్లా కొండలరావు 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top