----------------------------------------------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాశరధికి అన్యాయం జరిగిందన్న కే.సీ.ఆర్ వాదనతో ఏకీభవిస్తారా?
----------------------------------------------------------------------------------------------------
కే.సీ.ఆర్ నోటిదూలను పక్కనబెడితే తెలంగాణా ఉద్యమం ఊరికే పుట్టలేదనే విషయం అనేక విషయాలలో అవగతమవుతుంది. నిన్న దాశరధి 89వ జయంతి వేడుకల్లోనూ కే.సీ.ఆర్ నోటిదూల కనపడినా తెలంగాణాకు సంస్కృతి, సంస్కారం ఒకరు నేర్పలేదనే విషయం దాశరధి లాంటివారు నిరూపించారనే చారిత్రక వాస్తవాన్ని ఎలుగెత్తారు. ఆయనకు సముచితరీతిన తమ ప్రభుత్వం గౌరవం ఇస్తుందన్నారు. ఉత్తమ కవులకు ఏటా దాశరధి పురస్కారం ఇస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా కవులకూ, కళాకారులకు సరైన న్యాయం జరుగలేదనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? దానిని సరిచేయడంలో తెలంగాణా ప్రభుత్వం ఏమి చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం తెలియజేయండి. ఆంధ్రజ్యోతిలోని దాశరధి జయంతి ఉత్సవ వార్తను క్రింద ఉంచడం జరిగింది.
- వర్సిటీకి లేదా విద్యాసంస్థకు కృష్ణమాచార్య పేరు
- త్వరలో విగ్రహం ఏర్పాటు
- ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం
- రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
- తెలంగాణ సాంస్కృతిక వేదికగా రవీంద్రభారతి
- ఏడాదికి రూ.30 లక్షల నుంచి కోటికి గ్రాంట్ పెంపు: కేసీఆర్
- ఘనంగా దాశరథి 89వ జయంతి వేడుకలు
- అధికారికంగా నిర్వహించిన టి-సర్కారు
- దాశరథి పురిటిగడ్డ గూడూరులో జయంతి సందడి
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’’ అని నినదించిన మహా కవి దాశరథి కృష్ణమాచార్య పేరిట ఏటా దాశరథి స్మారక పురస్కారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఉత్తమ కవిని ఎంపిక చేసి, దాశరథి జయంతి రోజున ఈ పురస్కారాన్ని, రూ. 1,00,116 నగదు పారితోషికాన్ని అందజేస్తామన్నారు. దాశరథి 89వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి అధ్యక్షతన రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాశరథి చిత్రపటానికి సీఎంతో పాటు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలోని ఒక విశ్వ విద్యాలయానికి లేదా విద్యా సంస్థకు దాశరథి పేరు పెడతామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌తో పాటు మరికొన్ని చోట్ల అవసరం లేని వారి విగ్రహాలు చాలా ఉన్నాయని మండిపడ్డ కేసీఆర్..మహోన్నత కవి దాశరథి విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఒక ముఖ్యమైన చోట ప్రతిష్ఠిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు సంస్కారం, సంస్కృతి నేర్పామని చెప్పుకొనే వారికి దాశరథి లాంటి వారు.. ‘‘అద్భుత భాష, సంస్కృతి మాదే’’నని తమ కవితల ద్వారా చాటిచెప్పారని ఆయన అన్నారు.
‘‘దాశరథి కుటుంబాన్ని ఆదుకుంటాం.. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామ’’ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగు భాష, సంస్కృతి వికాసానికి అన్ని చర్యలూ తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంస్కారం, సంప్రదాయాలు ప్రపంచానికి చాటేలా రవీంద్రభారతిని తీర్చిదిద్దుతానని.. దానికి ప్రస్తుతం కేటాయిస్తున్న రూ.30 లక్షలను ఏటా రూ. కోటికి పెంచుతామని, దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. రవీంద్ర భారతి మరమ్మతులకు కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే.. తెలుగు విశ్వ విద్యాలయాన్ని కూడా త్వరలోనే తాను స్వయంగా సందర్శిస్తానని, దానిని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కాళోజీ నారాయణరావు, ఆచార్య జయశంకర్‌ల జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహిస్తామన్నారు. భాష, సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిసేందుకు.. భాషాభిమానిగా, ఒక సామాన్య కార్యకర్తగా తన వంతు సహకారాన్ని అందజేస్తానని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. రాజకీయాల కారణంగా సాహితీ సభల్లో పాల్గొనలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. వేదికపైనే ఉన్న తన గురువు తిరుమల శ్రీనివాసాచార్యులుకు కేసీఆర్ వందనం చేశారు. కాగా.. ఈ సభలో కేసీఆర్‌ను ఘనంగా సన్మానించారు. అలాగే, దాశరథి కుమారుడు లక్ష్మణాచార్యులును కేసీఆర్ సహా వేదికపైనున్న పెద్దలు సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... దాశరథి స్పూర్తి అని రమణాచారి అన్నారు. తెలంగాణ కోసం తొలి దెబ్బతిన్న తొలి వ్యక్తి దాశరథి అని ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్యులు అన్నారు. దాశరథి కవిత్వ పటిమను తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఎలుగూరి శివారెడ్డి వివరించారు. సభ అనంతరం తెలంగాణ ప్రముఖ కవుల గొప్పతనాన్ని చాటుతూ ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు.. దాశరథి పురిటిగడ్డ.. వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడూరులో మంగళవారం ఆయన 89వ జయంత్యుత్సవాన్ని విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
(from andhrajyothy daily)
------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.