మీరు ఒక native English speakerతో ఇంగ్లిష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ "She loves me more than you" అన్నారనుకోండి, ఆ వాక్యంలో రెండు అర్థాలు ఉన్నాయని ఆ మనిషికి వెంటనే తెలిసిపోతుంది. దాని అర్థం "She loves me more than you love me" కావచ్చు లేదా "She loves me more than she loves you" కావచ్చు. అవతలివాళ్ళు తమ మొదటి భాషగా ఇంగ్లిష్ మాట్లాడేవాళ్ళైనప్పుడు మనం వాళ్ళతో ఇంగ్లిష్‌లో వ్యాకరణ దోషాలతో మాట్లాడితే ఆ దోషాలని వాళ్ళు వెంటనే గుర్తుపట్టేస్తారు, తమ మొదటి భాష మాట్లాడడంలో తమకి ఉన్న అనుభవం వల్ల. అలాగే phonological errorsని కూడా. భారతీయులు "V &W"లని ఒకేలా పలుకుతారు కాబట్టి ఎవరైనా ఇంగ్లిష్‌లో volley ballని wally ball అంటే ఒక భారతీయుడు ఆ తేడాని గుర్తుపట్టలేడు. కానీ native English speakers ముందు volley ballని wally ball అంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి "V & W"లని వేరువేరు ధ్వనులతో పలుకుతారు కాబట్టి. "V" ధ్వని తెలుగులోని "వ" ధ్వనిని పోలి ఉంటుంది. నోరు తెరుస్తూ పలికేటప్పుడు పైభాగపు దంతాలు కింది భాగపు పెదవికి తగిలితే "V" ధ్వని వస్తుంది. రెండు పెదవులూ తెరిచి కంఠముతో ధ్వని ఉత్పత్తి చెయ్యడానికి ప్రయత్నిస్తే "W" ధ్వని వస్తుంది. భారతీయ భాషలలో ఉర్దూలో మాత్రమే "W" ధ్వని ఉంటుంది. హిందుస్తానీ (హిందీ-ఉర్దూ కలిపిన భాష) మాట్లాడేవాళ్ళు "V & W"ల మధ్య తేడా పాటించరు. కానీ ఇంగ్లిష్‌లో ఆ తేడా పాటించాలి. Vetarinaryని wetarinary అంటే native English speakers విచిత్రంగా చూస్తారు.

మనిషికి మాట్లాడే శక్తి ఎలా అలవడుతుందో చర్చించే ముందు భాషకి సంబంధించిన కొన్ని విషయాలు చర్చిద్దాం. మనిషి మనసులో ఏముందో తెలియచేసేది భాష. ఏ భాష అర్థం కావాలన్నా దానికి వ్యాకరణం ముఖ్యం. వ్యాకరణం అంటే ఏమిటి? ఒక భాషని మొదటి భాషగా మాట్లాడేవాళ్ళు (native speakers) ఏ పద్దతిలో మాట్లాడుతారో తెలియచేసేది వ్యాకరణం. "ఉదయం నుంచి వానపడుతోంది" అని చెప్పడానికి "It has been raining since morning" అని ఒక native English speaker అంటాడు కానీ Indian English మాట్లాడేవాడైతే "It is raining since morning" అని అంటాడు. "ఇంగ్లిష్‌లో ఎక్కడ perfect tenses ఉపయోగించాలి, ఎక్కడ simple tenses ఉపయోగించాలి" అనేది native English speakersకి తెలిసినంతగా Indian English speakersకి తెలియదు. సొంత భాషలో ఎవరికైనా tenses & prepositions సరిగా ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. కానీ Indian English అనేది కేవలం ఒక సంక్రమిత భాష కనుక ఇంగ్లిష్‌లోని tenses & prepositionsని native English speakers ఉపయోగించినంత సులభంగా Indian English speakers ఉపయోగించలేరు.  వ్యాకరణం అనేది భాష మాట్లాడే సామర్థ్యానికి సంబంధించిన విషయం కనుక Indian Englishని ungrammaticalగా పరిగణించాలి. Indian English మాట్లాడేవాడు కేవలం స్కూల్ పుస్తకాలలోని ప్రశ్నలు & జవాబులని బట్టీ పట్టి పరీక్షలలో వ్రాయగలడు కానీ అతను ఇంగ్లిష్‌లో సొంతంగా పది వాక్యాలు నిర్మించలేడు. పరీక్షలు పాస్ అవ్వడానికి కేవలం బట్టీపడితే చాలు కానీ సొంతంగా వాక్యాలని నిర్మించడానికి వ్యాకరణం అవసరం.

"A grammar of a language tells you what you need to know in order to have native-like competence in the language. (i.e. to be able to speak the language like a fluent speaker) - Andrew Radford

తెలుగువాళ్ళకి తెలుగు నేర్పడంలో ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. కానీ తెలుగువాళ్ళకి ఇంగ్లిష్ నేర్పించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. ఒక తెలుగువాడు ఒక సంఘటన చూసినప్పుడు, దాని గురించి మాట్లాడడానికి తన భాషలో ఏ syntax (వాక్య నిర్మాణం) ఉపయోగించాలో అతనికి సులభంగానే తెలిసిపోతుంది. అతని రెండవ భాష హిందీ, మూడవ భాష ఇంగ్లిష్ అనుకుందాం. అతను వాక్యాలని తన మొదటి భాషలో నిర్మించినంత సులభంగా రెండవ భాషలో నిర్మించలేడు, రెండవ భాషలో నిర్మించినంత సులభంగా మూడవ భాషలో నిర్మించలేడు. Syntax విషయంలో అతనికి తన మొదటి భాషలో ఉన్నంత పట్టు రెండవ, మూడవ భాషలలో ఉండదు. వాక్యాన్ని నిర్మించేటప్పుడు పదాలు ఏ క్రమంలో ఉన్నాయో చూడడం అన్నిటికంటే ముఖ్యం. "ఒక పంది బురద గుమ్మిలో పొర్లుతోంది" అని ఇంగ్లిష్‌లో చెప్పాలనుకున్నప్పుడు "A pig is swimming in the mud pool" అనొచ్చు, "A pig is swimming in the pool of mud" అని కూడా అనొచ్చు కానీ "A pig is swimming in the pool mud" అనకూడదు. "A pool of mud" అంటే "బురద ఉండే ఒక గుమ్మి" అని అర్థం, "the mud of a pool" అంటే "ఒక గుమ్మిలో ఉండే బురద" అని అర్థం. పదాల క్రమం మారినా వాక్యం యొక్క అర్థం మారిపోతుంది.

వ్యాకరణంలో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి. అవి phonology (ధ్వనులు పలికే విధానం), morphology (పద నిర్మాణం) & syntax (వాక్య నిర్మాణం). ఈ మూడు విడి భాగాలైనా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. మన సంభాషణలో వాక్య నిర్మాణం సరిగా ఉండి అందులో ఒక అసహజమైన పదాన్ని చొప్పించినా విన్నవాడు విచిత్రంగా చూస్తాడు. ఉదాహరణకి ఆడ గుర్రాన్ని ఇంగ్లిష్‌లో mare అనాలి కానీ she-horse అనకూడదు, ఆడ మేకని మాత్రం she-goat అనొచ్చు. పదాలని ఎలా నిర్మించాలో చెప్పేది మర్ఫాలజీ అయితే ధ్వనులని ఎలా పలకాలొ చెప్పేది ఫొనాలజీ. ఫొనాలజీ అనేది నోటి భాగాలతో చేసే ప్రయత్నానికి సంబంధించినది. British Englishలో "V" అనేది పెదవులు & దంతములతో పలికేది (labiodental) కాగా "W" అనేది పెదవులు & కంఠముతో పలికేది (labiovelar). Indian Englishలో "V & W"ల మధ్య తేడా పాటించరు. అది నోటి భాగాలతో చేసే ప్రయత్నంలోని లోపం. పిల్లలకి ఇంగ్లిష్ నేర్పే ఉపాధ్యాయులు కూడా "V &W"లని ఒకేలా పలికితే పిల్లలు అలాగే పలుకుతారు. భాష నేర్పించే పద్దతిలోని లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది కానీ ఇది మెదడుకి సంబంధించిన లోపం కాదు. Morphology & syntax ఉపయోగించేటప్పుడు మెదడుతో ఆలోచించి కంక్లూజన్‌కి రావడం జరుగుతుంది. మెదడులోని ఆలోచనని బయట పెట్టడానికే నోటితో ప్రయత్నం జరుగుతుంది. నోటిలోని ఏ భాగాలతో ధ్వనిని ఉత్పత్తి చేస్తాము అనేది ఫొనాలజీకి సంబంధించినది. పద నిర్మాణం & వాక్య నిర్మాణం అనేవి calculationకి సంబంధించినవి కాగా ఫొనాలజీ అనేది outputకి సంబంధించినది.

చిన్నప్పుడు మేము "శ, ష, స"లని వేరువేరు ధ్వనులతోనే పలికేవాళ్ళం. మేము చదివినది ఇంగ్లిష్ మాధ్యమంలోనే కానీ మా తెలుగు ఉపాధ్యాయురాలు "శ, ష, స"లని వేరువేరు ధ్వనులతో పలకడం వల్ల మేము ఆవిణ్ణి అనుకరించి ఆ మూడు ధ్వనులని తేడాతో పలికేవాళ్ళం. అప్పట్లో ఫొనాలజీ అంటే ఏమిటో మాకు తెలియదు. కేవలం మా తెలుగు ఉపాధ్యాయురాలు ఉపయోగించిన ధ్వనులు విని, వాటిని అనుకరించి, ధ్వనులు సరిగ్గా పలకడం నేర్చుకున్నాం. అప్పట్లో నేను చదువుకున్నది కరీమ్‌నగర్‌లో. ఉర్దూ యాసతో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చదివినా నాకు తెలుగు బాగానే వచ్చింది. ఇప్పుడు తెలంగాణాలోనే కాదు, కోస్తా ఆంధ్రలో కూడా పిల్లలు "శ, ష, స"లని ఒకే ధ్వనితో పలుకుతారు. మన స్కూల్‌ల యజమానులు తక్కువ జీతానికి పని చేసే ఉపాధ్యాయులని పెడతారు కానీ వాళ్ళకి భాష సరిగా వచ్చో, రాదో చూడరు. అందుకే తెలుగు కూడా సరిగా రానివాళ్ళు ఉపాధ్యాయులై పిల్లలు తెలుగు సరిగా నేర్చుకోలేకపోతున్నారు. హిందీ, ఒడియా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూడా phonetics విషయంలో కొన్ని స్థిర నియమాలు పాటిస్తారు. ఉదాహరణకి హిందీవాళ్ళు "డ" (మూర్ధన్య "ద")కి ముందు "ణ" (మూర్ధన్య "న") ఉపయోగిస్తారు. వాళ్ళు "పాండే" అనే పేరుని "పాణ్డే" అనే పలుకుతారు, వ్రాస్తారు కానీ "పాన్డే" అనరు. అలాగే ఒడియావాళ్ళు "పండా" అనే పేరుని "పణ్డా" అనే పలుకుతారు, వ్రాస్తారు. వాళ్ళు చదువు నేర్చుకునేటప్పుడే ఈ నియమాలు నేర్చుకుంటారు కనుక సొంతంగా మాట్లాడేటప్పుడు & వ్రాసేటప్పుడు కూడా వాళ్ళు ఈ నియమాలు పాటిస్తారు. ఆ ప్రాంతాలలో కూడా చదువుకున్నవాళ్ళు మాత్రమే "ణ"కీ, "న"కీ మధ్య తేడా పాటిస్తారు.

పిల్లలు భాష నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం మొదట ఇంటిలోనే జరుగుతుంది. ఇంగ్లిష్ మాట్లాడే కుటుంబంలో పుట్టిన ఒక చంటివాణ్ణి ఉదాహరణగా తీసుకుందాం. అతను 12 నెలల వయసులో రెండు పదాలు మాత్రమే పలకగలడు. అవి mama(అమ్మ) & dada(నాన్న). అతను నెలకి 5 పదాలు నేర్చుకుంటూ 18 నెలలు వయసు వచ్చేసరికి 30 పదాలు పలకగలడు. శారీరక ఎదుగుదలని బట్టి ఈ విషయంలో ఒక బిడ్డకీ, ఇంకో బిడ్డకీ మధ్య తేడా ఉండొచ్చు. కేవలం ఒక పదంతో మాట్లాడే దశలో వ్యాకరణాన్ని గ్రహించే శక్తి పిల్లలకి ఉండదు. వాళ్ళు plural nounsకి చివర "-s" ఉపయోగించరు, అలాగే past tenseలో verb చివర "-d" ఉపయోగించరు. ఆ దశలో వాళ్ళు రెండుమూడు పదాల వాక్యాలని కూడా నిర్మించలేరు. 18 నెలలు దాటిన తరువాతే వాళ్ళు వ్యాకరణాన్ని గమనించడం మొదలుపెడతారు. Doggyని plural formలో doggies అనడం, "go" అనే uninflected verbతో పాటు "gone" అనే inflected verbని ఉపయోగించడం నేర్చుకుంటారు. "Want teddy, Eating cookies, Daddy gone office"లాంటి రెండుమూడు పదాల వాక్యాలని నిర్మించడం కూడా ఆ దశలో నేర్చుకుంటారు.

ఇంగ్లిష్ మాట్లాడే కుటుంబాలలో పిల్లలకి 30 నెలలు వయసు వచ్చేసరికి inflected nouns & verbs ఉపయోగించడం చాలా వరకు వచ్చేస్తుంది. "Where's Mummy gone?, What's Daddy doing? Can we go to the zoo?" లాంటి వాక్యాలని కూడా వాళ్ళు ఉపయోగించగలరు. కానీ ఆ సమయంలో కూడా వాళ్ళు syntactic errorsతో మాట్లాడే వాక్యాలు ఉంటాయి. ఉదాహరణకి "Where goed there with Daddy? What we can do?" లాంటివి. పిల్లలకి నాలుగేళ్ళు దాటిన తరువాతే వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడే శక్తి వృద్ధి చెందుతుంది. పిల్లలు పూర్తి స్థాయిలో భాష నేర్చుకోవడానికి పదేళ్ళు పడుతుంది. పదేళ్ళ వయసు దాటిన తరువాత కొత్త భాష నేర్చుకోవడం కష్టమే. ఇంగ్లిష్ మాట్లాడే కుటుంబంలో పుట్టినా, తెలుగు మాట్లాడే కుటుంబంలో పుట్టినా పదేళ్ళ వయసు దాటిన తరువాత నేర్చుకున్న భాషలని ధారాళంగా మాట్లాడడం కష్టం. అందుకే మన దేశంలో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లలో చదువుకున్న పిల్లలు syntactic errorsతో ఇంగ్లిష్ మాట్లాడుతుంటారు.

మొన్న లైబ్రరీలో Andrew Radford వ్రాసిన "English Syntax" అనే పుస్తకం చదివాను. Puberty (శరీర అవయవాలు ఎదుగుదలకి వచ్చే వయసు) దాటిపోయొన తరువాత దశలో ఏ భాష నేర్చుకున్నా దాని syntax నేర్చుకోవడం కష్టం అని చెప్పడానికి అతను Genie అనే బాలికని ఉదహరించాడు. ఆమె తండ్రి ఆమెని 13 ఏళ్ళ పాటు ఒక గదిలో బంధించి ఆమెకి మాటలు వినిపించకుండా చేశాడు. మాటలు వినిపించకపోతే భాష నేర్చుకునే అవకాశం ఉండదు. ఆమెని నిర్బంధం నుంచి విడిపించిన తరువాత ఆమెకి భాష నేర్పించారు. ఆమె lexicon (పదాలు, వాటి అర్థాలు) నేర్చుకోగలిగింది కానీ syntax మాత్రం నేర్చుకోలేకపోయింది. మన దేశంలో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లలో చదివే పిల్లలకి కూడా English lexicon అర్థమవుతుంది కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం syntactic errors వస్తాయి. మన దేశంలో Anglo-Indiansకి తప్ప అందరికీ ఇంగ్లిష్ ఒక పరాయి భాషే. భాషా పరిజ్ఞానం పెంచుకోవడానికి ఇంగ్లిష్ నేర్చుకోవడం అవసరమే కానీ బలవంతపు చదువుల వల్ల ఇంగ్లిష్ రాదు. ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునేవాళ్ళు లైబ్రరీలకి వెళ్ళి ఇంగ్లిష్ పుస్తకాలు చదువుతూ అందులో రచయితలు ఉపయోగించిన వ్యాకరణాని గమనిస్తూ ఉండాలి. కేవలం స్కూల్ చదువుల్ని నమ్ముకుంటే ఇంగ్లిష్ రాదు.

- Praveen Kumar
*Re-published
మీరూ జన విజయం శీర్షికకు రచనలు పంపాలనుకుంటే వివరాలకు ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top