తెలుగు వెలుగుజాడ గురజాడ

రాజభక్తికీ, దైవభక్తికీ పరిమితమైన సాహిత్యాన్ని దేశభక్తికి మరల్చడం గురజాడ అతిగొప్ప సేవ. అందులోనూ ప్రజలకు అర్థం కాని భాషలనూ, భావాలనూ వదలిపెట్టి సులభ సుందర భాషలో సామాన్య ఇతివృత్తాలను తీసుకోవాలని చెప్పడమే గాక చేసి చూపించాడు. పెట్టుబడిదారీ విధానంలోకి ప్రవేశించే ఆ సమయంలో అన్ని దేశాల్‌ కమ్మవలెనోరు దేశి సరుకుల నమ్మవలెనోరు అంటూ స్వదేశీ ఉత్పత్తి అవసరాన్ని చెబుతారు.

గురజాడ అప్పారావు (1862-1915)ను తెలుగు జాతి వైతాళికుడిగా పరిగణించడానికి చాలా కారణాలున్నాయి. భౌగోళికంగా తెలుగువారు రెండు రాష్ట్రాలైన తర్వాత కూడా తెలుగు భాషలో ఆయన స్థానం చెరిగిపోదు. ఆయన తన దేశ కాలపు గీతలను అధిగమించి చాలా దూరం చూడగలిగిన దార్శనికుడు. అడుగుజాడ గురజాడది అన్న శ్రీశ్రీ కూడా ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇది గురజాడ శతవర్ధంతి సంవత్సర ప్రారంభం. భాషా సాంస్కృతిక సామాజిక రంగాల్లోనూ, దేశాభివృద్ధి విషయంలోనూ ఇప్పుడు మనం చూస్తున్న అనేకానేక లక్షణాలకు విరుగుడు విశ్లేషణ గురజాడలో లభిస్తాయంటే ఆశ్చర్యం కలగొచ్చు. అందుకే కవులను క్రాంత దర్శులంటారు. అందులోనూ తెలుగు జాతి మహాకవి, ప్రజా కవి గురజాడ. సనాతన కుటుంబంలో పుట్టి సామాన్యులు పడే కష్టాలన్నీ ఎదుర్కొన్న గురజాడ అప్పారావు కేవలం స్వయం కృషితోనే నిలదొక్కుకున్నారు. ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర శాస్త్రి నుంచి విజయనగర మహారాజు ఆనందగజపతి వరకూ ఆయనకు అండగా నిలబడిన వారు చాలా మంది ఇందుకు సహకరించారు. అదే సమయంలో తన నూతన భావాల కారణంగా ఆయన అనేక మంది నుంచి విమర్శలను, విద్వేషాన్ని కూడా ఎదుర్కొన్నారు. అయితే నాది ప్రజల ఉద్యమం, ఎవరిని సంతోషపెట్టడానికీ దాన్ని వదులుకోను అని దృఢంగా ప్రకటించి చివరి వరకూ పోరాడారు. గురజాడ గొప్పతనాన్ని జీవిత కాలంలోనే గుర్తించిన వారున్నారు. కానీ అంతకంటే ఆయనపై దాడి చేసిన వారే ఎక్కువ. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం, అవాంఛనీయ ప్రచారాలు అన్నిటిపై పోరాడుతూ అర్థ శతం నిండీ నిండకుండానే తన యాభై మూడవ ఏట కన్నుమూశారు.

అప్పటి వరకూ రాజభక్తికీ, దైవభక్తికీ పరిమితమైన సాహిత్యాన్ని దేశభక్తికి మరల్చడం గురజాడ అతిగొప్ప సేవ. అందులోనూ ప్రజలకు అర్థం కాని భాషలనూ, భావాలనూ వదలిపెట్టి సులభ సుందర భాషలో సామాన్య ఇతివృత్తాలను తీసుకోవాలని చెప్పడమే గాక చేసి చూపించాడు. తాను గజపతి రాజు ఆస్థానంలో ఉన్నాడు గనక రాజులే గొప్పవాళ్లని చెప్పలేదు. ప్రకృతినో, శిల్పాలనో కీర్తించి అదే దేశమనీ చెప్పలేదు. దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు అన్నాడు. తిండి కలిగితే కండ కలదోరు కండకలవాడేను మనిషోరు అని ఒక గొప్ప జీవిత సత్యం చెప్పాడే గాని ఆధ్యాత్మిక బోధనలో ముంచెత్తలేదు. మనిషి చేసిన రాతిబొమ్మకు మహిమగలదని సాగిమొక్కడం కన్నా సాటి మనిషిని తక్కువ చేసి చూడడం తగదన్నాడు. కుల, మత, జాతి భేదాలు వదలిపెట్టి చెట్టపట్టాల్‌ కట్టుకుని దేశస్తులందరు నడవవలెనన్నాడు. పైగా ఏది రాసినా హృద్యంగా ఉండాలనీ, అది వింటే దేశంపై అభిమానం కలగాలని పిలుపునిచ్చాడు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్య్రోద్యమం ఇంకా పుంజుకోకముందే దేశమనే భావనను ఇంతగా చెప్పడంలో స్వాభిమానం సుస్పష్టం. రాచరికం నుంచి పెట్టుబడిదారీ విధానంలోకి ప్రవేశించే ఆ సమయంలో అన్ని దేశాల్‌ కమ్మవలెనోరు దేశి సరుకుల నమ్మవలెనోరు అంటూ స్వదేశీ ఉత్పత్తి అవసరాన్ని చెబుతారు.
                 ఇప్పటికీ వాస్తు పేరిట, నమ్మకాల పేరిట ప్రజాధనం కోటానుకోట్లు వృధా చేస్తున్న నేపథ్యంలో చూస్తే గురజాడ వందేళ్ల కిందటనే వీటిపై ధ్వజమెత్తాడు. తోకచుక్క కనిపిస్తే కీడేమీ లేదు, సంఘ సంస్కరణ పతాక అన్నాడు. పుస్తకమ్ములలోని చదువులు వల్లెవేయుచు శుకములగుదురు వట్టి శాస్త్రజ్ఞుల్‌ అని శాస్త్రం చెప్పిందంటూ ఊరేగే పండితులను ఖండించాడు. మతములన్నియి మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అంటూ నిజమైన జ్ఞానం ఏమిటో ఎరుకపరిచాడు. గురజాడ రచనలన్నీ మహిళలకు పట్టం కట్టినవే. మగువలకు మగవారికొక్కటే నీతి ఉండాలన్నాడు. మగడు వేల్పు కాదు ప్రాణమిత్రుడ నీకు అని ప్రకటించాడు. పూర్ణమ్మ, కన్యక వంటి వారంతా సజీవ స్త్రీ మూర్తులే.
                 రాసిన విషయం గొప్పదవడమే గాక రాయడానికి ఉపయోగించిన భాషలోనూ గురజాడ విప్లవం తీసుకొచ్చాడు. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో రాశాడు. గిడుగుతో కలసి వ్యవహారిక భాషా ఉద్యమ నాయకత్వం వహించాడు. అటు సాహిత్యంలోనూ, ఇటు విద్యా బోధనలోనూ వ్యవహారిక భాష వస్తేనే బ్రాహ్మణేతరులు కూడా చదువుకోవడం సాధ్యమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. స్త్రీల అంగాంగ వర్ణన చేసే 125 పదాలెందుకని అక్కడా వారి గౌరవం పట్ల ప్రజాస్వామిక దృష్టిని ప్రదర్శించాడు. నాటి పరిస్థితుల్లో సరిహద్దుల్లోని జిల్లాల్లో భాషపై ఇరుగు పొరుగు భాషల ప్రభావం ఉంటుంది గనక మధ్య కోస్తా భాషను ప్రామాణికంగా తీసుకోవాలన్నాడు. ఆయన అభిప్రాయంపై ఎవరి అంచనా ఎలా ఉన్నా ఇది విశాల కోణంలో తీసుకున్నదే. లేకుంటే తామున్న ఉత్తరాంధ్ర భాషనే ఆయన ఎందుకు ఎంచుకోలేదంటే ఒరియా ప్రభావం ఉంది గనక. అప్పటికి ఇంకా నిజాం సంస్థానం కలవలేదు గనక తెలంగాణ మాండలికాన్ని తీసుకునే అవకాశం లేదు. కన్నడ దేశ ప్రభావం ఉన్నందున రాయలసీమనూ ఎంచుకోలేదనుకోవాలి. ఈ ఎంపిక కూడా కేవలం రాతకోతలకూ, పాఠాలకూ తప్ప సాహిత్యానికి కాదని గుర్తుంచుకోవాలి. తన రచనల్లో ఆయన అన్ని వ్యవహారాలూ ఉపయోగించాడు. ఈ క్రమంలో గురజాడ, గిడుగు ఛాందసులతో చేసిన పోరాటం చరిత్రాత్మకమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ సంఘానికి ఆయన సమర్పించిన అసమ్మతి పత్రం అందరూ చదవాల్సింది.
             ఆ విధంగా చూస్తే సజీవ భాషకూ, భావాలకూ కూడా శాశ్వతత్వం కలిగించింది ఆయన కన్యాశుల్కం. 1892లో తొలిసారి ప్రదర్శితమైన ఈ నాటకాన్ని అనేక మెరుగులు దిద్ది ప్రస్తుత రూపంలో 1909లో కొత్తగా ప్రదర్శించారు. జీవితమంత విశాలమైన కన్యాశుల్కంలో లేని అంశం లేదు. ఇందులో సనాతన పాత్రలు దాదాపు ప్రగతినిరోధకత్వాన్ని ప్రదర్శిస్తే వేశ్యావృత్తిలో ఉన్న మధురవాణి నవభావాలకు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప ధిక్కారం. రామప్పపంతులు, అగ్నిహౌత్రావధాన్లు, లుబ్దావధాన్లు, అందరినీ వంచించే గిరీశం కూడా అగ్రకులం నుంచి వచ్చిన వారే కావడం యాదృచ్ఛికం కాదు. అప్పుడప్పుడే పొటమరిస్తున్న ఆంగ్ల భాషా వ్యామోహం గిరీశం వంటి వారు ఎలా ఉపయోగించుకుని టోకరా వేసేది కూడా చూస్తాం. ఇక బుచ్చమ్మ, పూటకూళ్లమ్మ, మీనాక్షి, వంటి మహిళలందరూ ఏదో విధంగా దురాచారాలకు, మోసాలకు బలైన వారే. సంస్కర్తగా పేరొందిన సౌజన్యారావు కూడా సగం సగం సాహసంతో నీళ్లు నమిలితే మధురవాణి ఎదురు తిరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వస్తే మా ఊళ్లో కానిస్టేబులు మారిపోతాడా అనే ప్రశ్నతో ప్రజల నిజమైన ఆలోచనలేమిటో కూడా గురజాడ చెబుతారు. ఈ నాటకం మొత్తం వ్యవహార భాషలో నడవడమే గాక పాత్రోచిత భాషణకు ప్రాణం పోసింది.
గురజాడ గొప్పతనాన్ని గౌరవించి ఆయన రచనలు విస్తారంగా అందుబాటులోకి తెచ్చిన వారు అభ్యుదయ వాదులూ, కమ్యూనిస్టు నేతలే. ఇప్పటికీ ఆంధ్రభూమి వంటి పత్రికలలో మూడు మాసాల కొకసారి గురజాడ వ్యతిరేక వ్యాసాలు వస్తూనే ఉంటాయంటే ఛాందసులకు ఆయన పట్ల ఎంత ద్వేషమో తెలుస్తుంది. ప్రాంతీయ ఉద్యమాలు, అస్తిత్వ వాదనల కోణంలోనూ ఆయన పాత్రను పునరంచనా వేయాలనే వారున్నారు. అలాటి ప్రయత్నం పొరబాటు కాదు గాని అలా చేసే కొద్దీ ఆయన మరింత ఉన్నతుడని అర్థమవుతుంది. కనుకనే శతవర్థంతి సంవత్సరంలో గురజాడ జీవిత సాహిత్యాలపై అనేక కోణాల్లో అధ్యయనాలు జరగాలి. వాటి విశిష్టతను ఇప్పటికీ అన్వయించే అంశాలను నిగ్గు తేల్చాలి. ఆ దిశలో ఇదో రేఖామాత్ర నివాళి.
(ఈ రోజు గురజాడ జయంతి) 
- తెలకపల్లి రవి
(from prajaskthi daily)
Reactions:

Post a Comment

  1. రెండూ సమాజానికి మేలు చేస్తాయి. అయితే వాటిలో ఆధ్యాత్మిక బోధనలు అత్యున్నతమైనవి అనుటలో ఎటువంటి సందేహం అక్కరలేదు. మనలో ఉన్న మన శత్రువును జయించటానికి ఆధ్యాత్మికత మాత్రమే శరణ్యం. కానీ కడుపుకాలే కష్టజీవులకు ఆధ్యాత్మిక బోధనలు ఎక్కుతాయా? జీవిత సత్యాలు లేని ఆధ్యాత్మిక బోధనలు, పునాదులు లేని భవనం లాంటివి. అవి నిలబడవు. కాబట్టి సాహిత్య లక్ష్యం అనేది ఏమిటంటే ప్రజలకు జీవిత సత్యాలు వివరిస్తూ, వారిని చైతన్యపరుస్తూ ఒకస్థాయికి తీసుకెళ్లిన తరువాత మాత్రమే ఆధ్యాత్మిక బోధనలవైపు తీసుకెళ్లాలి. అప్పుడే అవి నిలబడతాయి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top