సీఎం నోట హంతక భాషా?


ధ్వజమెత్తిన జాతీయ మీడియా
పాతరేస్తారా? మెడలు విరిచేస్తారా?
‘హిట్లర్‌ సీఎం’ అంటూ టైమ్స్‌ నౌ ఫైర్‌
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?
సీ్ట్రట్‌ గ్యాంగ్‌ను నడుపుతున్నారా?
మీడియా మీకు భజన చేయాలా?
‘టైమ్స్‌ నౌ’ అర్ణబ్‌ సూటి ప్రశ్నలు
కేసీఆర్‌ తీరు ఆందోళనకరం: ఎన్డీటీవీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. మెడలు విరిచేస్తాం. తెలంగాణలో బతకదలచుకుంటే మాకు శాల్యూట్‌ కొట్టాల్సిందే’ అంటూ మీడియాకు హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును జాతీయ మీడియా ముక్తకంఠంతో ఖండించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా చర్చలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలతో ముప్పేట దాడి చేసింది. ‘ఇవేం మాటలు? ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ఇలాగా మాట్లాడాల్సింది?’ అంటూ విరుచుకుపడింది. ఆయనది హంతక భాషగా నిరసించింది. ఆయా చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నేతలకు సూటి ప్రశ్నలు సంధించింది. తెలంగాణలో మూడు నెలలుగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేయగా... మంగళవారం వరంగల్‌లో జరిగిన సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో విషయం జాతీయ స్థాయిలో రచ్చకెక్కింది. 
చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నేతలు చీటికి మాటికి టీవీ9 ప్రసారం చేసిన కార్యక్రమంలోని వ్యాఖ్యలను ప్రస్తావించారే తప్ప... ఏబీఎన్‌ చేసిన తప్పేమిటో చెప్పలేకపోయారు. ఇదేవిషయాన్ని సూటిగా అడిగేసరికి నీళ్లు నమిలారు. ‘ప్రసారాల నిలిపివేతతో మాకు సంబంధంలేదు. ఎంఎస్‌వోలను అడగండి’ అంటూ పాతపాటే పాడారు. ఆయా చానళ్లలో చర్చలో పాల్గొన్న పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు కేసీఆర్‌ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. 
హిట్లర్‌ కేసీఆర్‌...
‘హిట్లర్‌ను... హిట్లర్‌ తాతను’ అంటూ గతంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ‘టైమ్స్‌ నౌ’ ఇప్పుడు గుర్తు చేసింది. మంగళవారం కేసీఆర్‌ చేసిన హెచ్చరికలను ప్రస్తావిస్తూ... ‘ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? వీధి ముఠాను నడుపుతున్నారా?’ అని ప్రశ్నించింది. ‘21వ శతాబ్దపు హిట్లర్‌ ముఖ్యమంత్రి’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ‘టైమ్స్‌ నౌ’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆర్ణబ్‌ గోస్వామి కేసీఆర్‌ వ్యాఖ్యలను దునుమాడారు. ఈ చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ను ఉద్దేశించి.. ‘చంపేస్తారా? పది కిలోమీటర్ల లోతున పాతేస్తారా? మెడలు విరిచేస్తారా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ది ‘హంతక భాష’ అని స్పష్టం చేశారు. ఆయనపై కేసు పెట్టాలన్నారు. ఇంతచేసినప్పటికీ కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని ఈ చర్చల్లో పాల్గొన్న ఇతర ప్రముఖులు విస్తుపోయారు. కేసీఆర్‌ వైఖరి చాలా ఆందోళనకరమని, ఆయన మీడియాతో ఘర్ష్షణ వైఖరిని అవలంబిస్తున్నారని ఎన్డీటీవీ విమర్శించింది. ఈ చానల్‌ నిర్వహించిన చర్చలో ఏబీఎన్‌-ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని మేం ఎప్పుడు అవమానించాం?’ అని రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. టీవీ9 ప్రసారాల గురించే పదేపదే ప్రస్తావించారు. 
సీనియర్‌ జర్నలిస్టుల హితవు: పాత్రికేయ వృత్తిలో తలపండిన కులదీప్‌ నయ్యర్‌, ఎస్‌.వెంకట్‌నారాయణ వంటి సీనియర్‌ జర్నలిస్టులు కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. 13 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌, మీడియాతో శత్రుత్వం పెంచుకోవడం సరికాదని కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.వెంకట్‌ నారాయణ హితవు పలికారు. తాను ముఖ్యమంత్రినన్న విషయం మరిచిపోయి ఉద్యమకారుడిలా హద్దుమీరి మాట్లాడడం సరైంది కాదన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛకేగాక, ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ విమర్శించారు. ‘కేసీఆర్‌కు ఏమైంది..’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తంచేశారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని పిల్లచేష్టగా అభివర్ణించారు. అధికారంలోకి వస్తూనే మీడియాపై దాడి చేయడం కేసీఆర్‌ అసహనానికి నిదర్శనమని మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మండిపడ్డారు. తన 40 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ‘ఔట్‌లుక్‌’ ఎడిటోరియల్‌ చీఫ్‌ వినోద్‌ మెహతా పేర్కొన్నారు.
పిల్లచేష్టలు: కుల్దీప్‌ 
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి):కేసీఆర్‌ వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛకేగాక, ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ విమర్శించారు. ఆ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా అభివర్ణించారు. ‘‘ కేసీఆర్‌కు ఏమైంది..’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ఆయనకు పరిపక్వత లేదని, విశాల హృదయం ఉన్న ప్రజాస్వామికవాది కాదని ఈ వ్యాఖ్యలతో తేలిపోయిందంటూ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అనేది ఏర్పడింది. జరిగింద ంతా చరిత్ర. అవన్నీ మరిచిపోయి, విమర్శకులందర్నీ కలుపుకొని పోవాలి. అందరూ చేతులు కలిపితేనే తెలంగాణ అభివృద్ది జరుగుతుంది’’ అంటూ ఆయన హితవు పలికారు. తెలంగాణ ఏర్పాడటంలో మీడియా పాత్రకూడా ఉందన్నారు. చానెళ్ల నిలిపివేతకు మద్దతునీయడం, తెలంగాణలో ఉండాలంటే శాల్యూట్‌ కొట్టాలనడం ముఖ్యమంత్రివి పిల్ల చేష్టలని నిరూపిస్తోందన్నారు. కేసీఆర్‌ ఇకనైనా చానళ్లు పునఃప్రసారమయ్యేలా చూసి, ప్రజాస్వామి కంగా పాలనపై దృష్టి కేంద్రీకరించాలని, అభివృద్దికి పాటుపడాలని ఆయన హితవు పలికారు.
హద్దు మీరడం సరికాదు: వెంకట్‌నారాయణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): మీడియా సంస్థలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని కరీంనగర్‌కు చెందిన జాతీయ జర్నలిస్టు ఎస్‌.వెంకట్‌నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే మీడియాతో ఘర్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌, మీడియాతో శత్రుత్వం పెంచుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో అప్రతిష్ఠపాలవుతారని, నియంత, నిరంకుశుడన్న పేరు వస్తుందని హెచ్చరించారు. మీడియాలో ఏమైనా తప్పుడు వార్తలు వస్తే వాటిపై చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలు, ప్రెస్‌ కౌన్సిల్‌తో సహా అనేక వేదికలున ్నాయని, మీడియా యాజమాన్యంతో కూడా మాట్లాడవచ్చునని సూచించారు. 
అలా కాకుండా ముఖ్యమంత్రినన్న విషయం మరిచిపోయి ఉద్యమకారుడిలా హద్దు మీరి మాట్లాడడం సరైంది కాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఢిల్లీలో ఉండి, ప్రపంచాన్ని చూసిన జర్నలిస్టుగా తాను కేసీఆర్‌కు హితవు పలుకుతున్నానని ఆయన పేర్కొన్నారు. కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా మీడియాను నియంత్రించడం సరైంది కాదని, ప్రజలే ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు. చట్టం, న్యాయస్థానాలు ప్రజాస్వామిక వ్యవస్థలపై గౌరవం పెంచాల్సిన ముఖ్యమంత్రి, అరాచకాన్ని ప్రోత్సహించరాదని స్పష్టంచేశారు. దీనివల్ల జాతీయ స్థాయిలో కూడా భ్రష్టుపడతారని, ఎన్ని మంచి పనులు చేసినా ఎవరి దృష్టికీ రాదని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలు వదిలేసి తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. తెలంగాణలో ఉండాలంటే శాల్యూట్‌ కొట్టాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగవని వెంకటనారాయణ హితవు చెప్పారు. ‘‘దయచేసి అలా మాట్లాడకండి.. మీ వైఖరి మార్చుకోండి.. సంయమనం పాటించండి.. వెంటనే ఆ రెండు చానళ్లనూ ప్రసారం చేయండి’’ అని ఆయన అభ్యర్థించారు. ఒకవైపు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతుంటే కేసీఆర్‌ మీడియాను నరికేస్తా.. పాతిపెడతా అన్న రీతిలో ప్రవర్తించడం సరైన సంకేతాలు పంపదన్నారు. 
కేసీఆర్‌ అసహనానికి నిదర్శనం: రాజ్‌దీప్‌ 
కేసీఆర్‌ తాను అప్రజాస్వా మికవాదినని నిరూపించారని మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే మీడియాపై దాడి చేయడం ఆయన అసహనానికి నిదర్శనమని విమర్శించారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

  1. మొత్తం ఈ వ్యవహారమంతా ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనాన్ని కళ్ళకు కడుతోంది. ప్రజాస్వామ్యమన్నది నియంతలు అధికారాన్ని చేజిక్కించుకునే ఒక ప్రక్రియే తప్ప, నియంతృత్వాన్ని నియంత్రించ గలిగే వ్యవస్థ కాదని ఈ విధంగా రూడ్హీ అవుతోంది. ప్రజాస్వామ్యాన్ని, మీడియాని నిచ్చెనగా వాడుకుని అధికారానికి ఎగబాకి ఇప్పుడు ఆ వ్యవస్థలనే నిస్సిగ్గుగా, బహిరంగంగా వెక్కిరిస్తుంటే యే ఒక్క వ్యవస్థా కూడా, గుడ్లప్పగించి చూడడమూ, చవుకబారు గోష్టులను నిర్వహించడం తప్ప ఏమీ చేయలేకపోవడం విస్తు గొలుపుతోంది. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నాయకులను 'కనీసం క్షమాపణన్నా చెప్పలేదన్న' దేబిరింపులు తప్ప చట్టపరంగా చేయవలసిన చర్యలేవి?

    ఉద్యమం మొదలైనప్పటి నుంచీ తెరాస వాళ్ళు వేర్వేరు సందర్భాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సందర్భాలు ఎన్నో లెక్ఖ తీస్తే అదొక ఉద్గ్రంధమౌతుంది. పట్టపగలు, బహిరంగంగా గౌ// హరీష్ రావు గారు ఢిల్లీ ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు సంబందించిన అధికారిని పట్టుకు చితక బాదితే no కేసు. అందాల మెక్కించి మంత్రివర్యుడ్ని చేస్తారు. అదే ఫేస్బుక్ లో జస్ట్ like బటన్ నొక్కినోడ్నిగాలించి, వెదికి పట్టుకుని అరెస్ట్ చేసి జైలు లో పెడతా రు? ఇదెక్కడి న్యాయం??? ఇదేం వ్యవస్థ !!!

    ఈ దేశం ఇలా భ్రష్టు పట్టిపోవడానికి ఇలాంటి సామాజిక అవ్యవస్థలూ, తేడాలే కారణం. సరిదిద్దాల్సిన వ్యవస్థలు కేవలం అధికారం, కండబలం ఉన్నవాళ్లకు తాబేదారు వ్యవస్థలుగా మిగిలిపోవడం దేశ దౌర్భాగ్యం !!!

    సరిదిద్దే అవకాశం ఇప్పటి వ్యవస్థల నుంచి ఆశించడం "తివిరి ఇసుమున తైలం ...

    ReplyDelete
    Replies
    1. యెందుకిలా జరిగిందనే దానికి నేను ఒక పోష్టు వేసాను, చదవగలరు:
      ref:http://harikaalam.blogspot.in/2014/09/blog-post_6.html

      గాంధీ చెసిన ప్రయత్న మంతా అప్పటి రాజుల్నీ,జమిందార్లనీ క్లుప్తంగా చెప్పాలంతే ప్రాచీన భారత దేశపు రాజేశ్వరాధముల్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ముసుగులోకి తెచ్చి వారిని ఆదర్శ ప్రభువులుగా నిలబెట్టటమే.దానికి సాక్ష్యం మన ఆంధ్రాలో జస్టిస్ పార్టీ పేరు తోనూ అక్కడ స్వరాజ్ పేరు తోనూ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించిన జమిందారులే చివరి కొచ్చేసరికి కాంగ్రెసులోకి దూకేసి మంత్రులుగా మన ముందు నిలబడటం - పింగళి వెంకయ్యలూ, గరిమెళ్ళ సత్తెయ్యలూ అధికారానికి పనికిరాని చెల్లని సరుకులుగా మిగలటం..

      మధ్య యుగాల్లో యే కులా లయితే రాజ్యాధికారాన్ని అనుభవించాయో ఆ కులాల సమీకరణల్ని గానీ సామాజిక దృశ్యాన్న్ని గానీ యే మాత్రమూ మార్చకుండా కేవలం బొమ్మల్ని మార్చినంత తామాషాగా కధ నడిపించాడు!

      Delete
    2. మీ వ్యాసం చదివాను. గాంధీ చేయబట్టే ఇలాంటి నేతల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారంటారా?

      Delete
    3. he made the old system to be continued in the same frame work. Th eframework is important for any society.

      Delete
  2. నేషనల్ మీడియా కాస్త గట్టిగానే జవాబిచ్చింది. తెలంగాణా ఉధ్యమం తీవ్ర తరమైనప్పటి నుండీ ఇటువంటి మాటలు ఉంటూనే ఉన్నాయి. అప్పుడన్నది సీమాంద్రులని కాబట్టి, అందరికీ తెలంగాణాలో రాజకీయ అవసరాలున్నాయి కాబట్టి ఎవరూ పెద్దగా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడన్నది జర్నలిస్టులనవ్వడముతో మహా సీరియసుగా తయారయింది విషయం.

    బయటే కాదు, ప్రజ బ్లాగులో కూడా, తిట్టడం ... ఏమిటని అడిగితే, మేము సీమాంధ్రులని అందరినీ అనడం లేదు కేవలం కొంత మందిని మాత్రమే అంటూ దాన్ని సమర్ధించుకోవలనుకోవడం జరుగుతూనే ఉంది. కవిత ఆర్నాబ్ దగ్గర కూడా అలానే మాట్లాడింది. కే.సీ.ఆర్ అన్నది అందరు జర్నలిస్టులనీ కాదని, కేవలం ఆ రెండు ఛానెల్లనే అని. దానికి ఆర్నాబ్ గోస్వామి, సో.. ఆ రెండు ఛానెల్ల జర్నలిస్టులనూ అయితే మర్డర్ చేస్తారా? అని ప్రశ్నించేశాడు. ఈ షో మొత్తం ఆర్నాబ్ గోస్వామి ఫుల్ అటాకింగులోనే ఉన్నాడు. ఇలాంటి అతితెలివితేటలు అందరి దగ్గరా పనిచేయవు కదా..!!

    కనీసం ఇప్పటికైనా తెలంగాణా సెంటిమెంటును అడ్డం పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆపితే బావుంటుంది. తమ మాటలకు తాళం వేయని ఛానెల్లని తొక్కడానికి ఒక సాకును కారణంగా తీసుకుని, అందుబాటులో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా తీసుకుని (ఛానెల్లను మేముకాదు, ఎం.ఎస్.వోలు తీసేశారని చెప్పడం) ఆడుతున్న తొండి ఆట ఇకనైనా ఆపేస్తే బాగుంటుంది. ఛానెల్లకి స్వేచ్ఛ కల్పించడం తెలంగాణా ప్రజలకే మంచిది.

    ఆంధ్రజ్యోతీ, టి.వీ9 ను ఎవరూ కోరుకోక పోతే... చూడ్డం మానేస్తారు. అంతేకానీ, వాటి ప్రసారాలను నిలిపేయాల్సిన పనిలేదు.

    ReplyDelete
    Replies
    1. >>> ఆంధ్రజ్యోతీ, టి.వీ9 ను ఎవరూ కోరుకోక పోతే... చూడ్డం మానేస్తారు. అంతేకానీ, వాటి ప్రసారాలను నిలిపేయాల్సిన పనిలేదు.

      చాలా బాగా చెప్పారు. V6, T ఛానెల్ లను ప్రజలు కోరుకోక పొతే... చూడ్డం మానేస్తారు. అంతే కాని వాటి ప్రసారాలను ఆంధ్రాలో ఎందుకు నిలిపివేశారో కాస్త చెప్తారా శ్రీకాంత్ గారూ? ముందు అవి ప్రసారమయ్యేటట్టు చూడండి. ఆ తర్వాత హంతక భాష మాట్లాడే వారి గురించి, సిసలైన హంతకుల గురించి చర్చిద్దాం.