కుల, వర్గ రహిత సమాజమే అంబేద్కర్‌ అభిమతం

డాక్టర్‌ అంబేద్కర్‌ భారత దేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారులలో అగ్రగణ్యుడు, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అంబేద్కర్‌ ప్రభావం అనన్య సామాన్య మైంది. తరతరాలుగా కులపీడనకు గురై, సమాజం నుండి వెలివేయబడిన బానిసత్వం కంటే హీనంగా చూడబడుతున్న అసృశ్య అణగారిన ప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడంటే అంబేద్కర్‌ గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందెంతో ఉంది. డా|| అంబేద్కర్‌ దళితుడుగా జీవించడమే కాదు అమానుష అంటరానితనం, కుల వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. తాను స్వయంగా పేదరికాన్ని అనుభవించాడు. భూస్వామ్య విధానం యొక్క దుష్టస్వభావాన్ని గ్రహించాడు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. సమ సమాజం కావాలన్నాడు. ''బోధించు, సమీకరించు, పోరాడు'' అన్న డా|| అంబేద్కర్‌ నినాదం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. అంబేద్కర్‌ తన అభిప్రాయాలను నిర్భయంగా బోధించాడు. వాటి అమలుకై సమీకరించాడు. లక్ష్య సాధనకై నిరంతరం పోరాడాడు. చాలా మంది అంబేద్కర్‌ రచనలను అధ్యయనం చేయకుండానే కేవలం కుల సమస్య గురించే ఆయన అధ్యయనం చేశాడని, అంటరాని వాడు కాబట్టి అంటరాని తనానికి వ్యతిరేకంగా కృషి చేశాడని, దళితుల రిజర్వేషన్స్‌ కల్పించడం కొరకు కృషి చేశాడనే చులకన భావము కలిగి ఉన్నారు. కాని డా|| అంబేద్కర్‌కు దేశ ఆర్థిక విధానం ప్రభుత్వ స్వభావం ఉత్పత్తి సాధనాలు, కార్మికోద్యమం, భూస్వామ్య విధానం స్త్రీ సమస్యల, ఫాసిజం, దేశ సమగ్రత, కుల వ్యవస్థ దాని అమానుషత్వం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు. కాని ఆయన వాటన్నింటిని అధ్యయం చేసింది, తనదైన రీతిలో బాష్యం చెప్పింది సుస్పష్టం. డా|| అంబేద్కర్‌ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలనే పరిశీలిద్దాం. ఉత్పత్తి గుర్తించాలన్నాడు. ప్రజలందరికీ భూమిపై సమాన హక్కులుండాలన్నాడు. కులమతాల కతీతంగా భూములను కౌలుకివ్వాలన్నాడు. గ్రామాల్లో భూస్వామిగాని, కౌలుదారుగాని వ్యవసాయ కూలీలు గాని ఉండరాదన్నాడు. అందరు సమానమే అన్నాడు. అందరు ఉత్పత్తిలో భాగం కావాలన్నాడు. ప్రభుత్వమే నీరు, పని చేసే పశువులు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందచేయాలన్నాడు. అందుకయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నాడు. భూస్వామ్య విధానం సమాజ పురోగతికి ఆటంకమన్నాడు. చెప్పడమే కాదు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆనాటి మహారాష్ట్రలోని 'కొంకణ' ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కూలీలు భూమిని దున్ని పండిస్తుంటే ఆ భూమి మీద హక్కులు మాత్రమే 'ఖోటీ'లనబడే భూస్వామ్య వర్గ చేతుల్లో ఉండేవి. వారు రైతులపై శిస్తు రూపాన అధికంగా డబ్బు వసూలు చేసేవారు. అదే విధంగా పండించిన పంటల్లో కూడా దౌర్జన్యంగా భాగం తీసుకొనేవారు. ఇది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఈ 'ఖోటీ' పద్ధతికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ రైతు ఉద్యమాన్ని నడిపాడు. 1929 ఏప్రిల్‌ 14న రత్నగిరి జిల్లా బిప్లాన్‌లో వేలాది రైతులతో పెద్ద ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. రత్నగిరి, సతారా, నాసిక్‌ ప్రాంతాలలో రైతు ఉద్యమాన్ని నిర్మించాడు. లక్షలాది రైతులను ఉద్యమంలో భాగస్తులను చేశాడు. అటు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మహారాష్ట్ర శాసనసభలో తానే 'ఖోటీ' నిర్మూలన కొరకు 1937లో బిల్లు ప్రవేశపెట్టాడు. అది చివరకు 1949లో చట్ట రూపం ధరించే వరకు పోరాడాడు. అదే విధంగా దేశ సౌభాగ్యం దేశ పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంది. జాతీయ యాజమాన్యంలో అది జరగాలేకాని ప్రయివేటు వ్యక్తుల పరంగా కాదు' అంటూ ప్రైవేటీకరణను అంబేద్కర్‌ ఖండించారు.
             దేశంలో ప్రస్తుతమున్న కుల, వర్గ పీడనకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కార్మికవర్గమే నాయకత్వానికి అవసరమన్నాడు. 'దేశానికి నాయకత్వం అవసరం. అయితే ఆ నాయకత్వాన్ని వారు వహిస్తారా అన్నది ప్రశ్న. దేశానికి అవసరమైన అలాంటి నాయకత్వాన్ని శ్రామికవర్గం మాత్రమే సమకూర్చగలదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను'' అని 1942 డిసెంబర్‌లో ''శ్రామికవర్గం - ఆదర్శవాదం'' అనే విషయంపై మాట్లాడుతూ స్పష్టపరిచారు. కార్మికవర్గ సమస్యలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కార్మికవర్గ భవిష్యత్తుకి సాంఘిక న్యాయం, సాంఘిక భద్రత పునాదులు కావాలని పటిష్టమైన కార్మిక చట్టాలు దోహదపడుతాయని భావించాడు. అందుకు ముఖ్య కార్మిక చట్టాలైన కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం కార్మిక సంఘాల గుర్తింపు చట్టాల కొరకు కార్మికుల ప్రతినిధిగా ప్రభుత్వ కమిటీలలోనూ, లాయర్‌గా కోర్టులోనూ, చట్టసభల్లో సభ్యునిగా ఆవిరళ కృషిచేశాడు.
డా|| అంబేద్కర్‌కి ఫాసిజం ప్రమాదం పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది. అది మానవాళి మనుగడకి ముప్పని గ్రహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఆయన ఆకాశవాణిలో 1942లో చేసిన ప్రసంగం గమనిస్తే 'ఈనాడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ప్రపంచాల విభజన కోసం మాత్రమే కాదు. నియంతృత్వం మీద విజయం సాధించి స్వేచ్ఛా సమానత్వాలు నెలకొల్పడానికి మన కార్మికులు తమ సంపూర్ణ మద్దతినివ్వాలి. సాధించబోయే విజయం నూతన, సామాజిక వ్యవస్థకు దోహద పడాలి. స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన సరిపోదు స్వాతంత్య్ర ఫలితాలు మనం నిర్మించుకోబేయే సమతా సమాజం మీద ఆధారపడి ఉండాలి' అంటూ ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో కార్మికవర్గ ప్రయోజనాలు ఎలా ఉపయోగించు కోవాలో కూడా సూచించాడు. డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ సమగ్రత కాపాడాలని కోరారు. కులాలు, మతాలు, జాతులు, అనేక సంస్కృతులున్న ఈ దేశంలో ఐక్యంగా ఉంటేనే ప్రయోజనమని భావించాడు. 'పాకిస్తాన్‌'లాగా 'దళితస్తాన్‌' 'హరిజన్‌స్థాన్‌' లాంటి నినాదాలివ్వడం ఆ రోజుల్లో పెద్ద సమస్యయేమి కాదు. అయినా ఇవ్వలేదంటేనే ఆయనకు దేశ సమగ్రతపట్ల ఉన్న చిత్తశుద్ధిద్యోతకమవుతుంది.
కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలన్నాడు. అలాంటి రాజ్యం కావాలంటే దానంతటదే రాదన్నాడు. అందుకు పోరాటమే శరణ్యమన్నాడు. రాజ్యాధికారమే పీడిత, వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం. రాజ్యాధికారం లేకుండా మన అభివృద్ధి అసంభవం అని డా|| అంబేద్కర్‌ స్పష్టంగా చెప్పాడు. స్త్రీలు భారత సమాజంలో నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని 'ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి' చేయాలన్నాడు. ఈ లక్ష్యం చేరుకొనే క్రమంలో 'హిందూకోడ్‌' బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. ఆనాటి సనాతన, సాంప్రదాయ అగ్రకుల పాలకులు నిరాకరించారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన ఆదర్శంతుడు, త్యాగశీలి.
శ్రామిక మహిళల 'మెటర్నటి బెనిఫిట్‌ యాక్ట్‌' కొరకు పోరాడిన వారిలో డాక్టర్‌ అంబేద్కర్‌ ముందుపీఠిన ఉన్నాడు. ఈ దేశము అభివృద్ధి కాకపోవడానికి శ్రామికులంతా ఐక్యం కాకపోవడానికి దోపిడి కొనసాగ టానికి కుల వ్యవస్థపెద్ద ఆటంకమని గుర్తించాడు. అందుకే కుల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేశాడు. రాజ్యాధికారంకై శ్రమజీవు లను ఐక్యం కాకుండా చేస్తున్న ప్రతిబంధకాల్లో కుల వ్యవస్థ చాలా కీలకమైందిగా గుర్తించాడు. ఈ దేశంలో శ్రమ విభజనే కాదు శ్రామికుల మధ్య విభజన అనే తరతరాల అగాధం ఉందన్నాడు. ఇది అగ్రకుల దోపిడివర్గాల రక్షణకు పెట్టనికోటలా ఉందన్నాడు. శ్రామికుల మధ్య ఐక్యతకై ప్రత్యేక ప్రయత్నం, నిరంతర ప్రయత్నం జరగాలన్నాడు. 'విప్లవం తేవడానికి భారతదేశంలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? నా దృష్టిలో ఆ శక్తి ఒక్కటే... అదేమిటంటే తనతోపాటు విప్లవంలో పాల్గొంటున్న వారిలో ఒకరి పట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసం చూపగల్గాలి' అన్నాడు. 'మనుషులు (తరతరాలుగా సాంఘిక అణచివేతకు గురవుతున్నారు). ఆస్తి సమానత్వం కొరకు మాత్రమే విప్లవంలో పాల్గొనరు. విప్లవం సాధించిన తర్వాత కులమత భేదాలు లేకుండా సమానత్వంగా చూడబడతామనే గ్యారంటీ ఉంటేనే అరమరికలు లేకుండా విప్లవోద్యమంలో పాల్గొంటా రన్నాడు.అందుకే 'కుల నిర్మూలన' అనే చారిత్రాత్మకమైన గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. భారతదేశం సామాజిక విప్లవోద్యమ ఆవశ్యకత మిగతా దేశాలన్నింటికంటే ఎక్కువగా ఉందని భావించారు. సామాజిక ఉద్యమంలో కీలకమైనది 'కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం' అని భావించాడు. స్వకుల వివాహాలే కులవ్యవస్థను కొనసాగించడంలో కీలకపాత్ర వహిస్తున్నాయని అందుకు స్వకుల వివాహాలను నిరుత్సాహపర్చాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఏదైనా పోరాడితేనే పోతుందని కాబట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితేనే కులం బలహీనపడు తుందన్నాడు. కుల వ్యవస్థ బలహీనపడటం వర్గ ఐక్యత పటిష్టతకే తోడ్పడుతుందన్నాడు. కుల వ్యవస్థ వర్గ దోపిడీని రక్షిస్తుందన్నాడు. వాస్తవానికి కమ్యూనిస్టుల అభిప్రాయాలకు అంబేద్కర్‌ ఆలోచనలకు సామీప్యమే ఎక్కువ. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు 1998 నవంబర్‌ 20న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్‌ అభిప్రాయాలకు కమ్యూనిస్టుల అభిప్రాయాలకు పెద్దతేడా లేదు. కొన్ని విషయాల్లో కమ్యూనిస్టుల కన్నా ముందున్నారు కూడా. దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలని చెప్పడం ఎంతో ముందు చూపుతోకూడింది. హిందూ ధర్మశాస్త్రాలను తూర్పారాపట్టాలని, వాటిని ఓడిస్తే తప్ప కుల వ్యవస్థ పోదని చెప్పడం అంబేద్కర్‌ చాలా ప్రధానంశంగా తీసుకున్నాడనే అంశాన్ని రుజువు చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయాధికారం కావాలన్నారు. నిజానికి కమ్యూనిస్టులతో అత్యంత చేరువగా అభిప్రాయమున్న వ్యక్తి అంబేద్కర్‌. అయితే రాజ్యాంగ యంత్రం, ప్రజాస్వామ్యం తదితర విషయాల్లో కొన్ని విభేదాలున్నాయి' అని చెప్పిన అంశాలు సదాగమనంలో ఉండటం అవసరం. డా|| అంబేద్కర్‌ 58వ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అర్పించడమంటే కుల, వర్గ రహిత సమాజం కొరకు పోరాడటమే.
- జి రాములు , (తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర కన్వీనర్‌) 

(Note: అంబేద్కర్ 58వ వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తిలో  వచ్చిన ఈ వ్యాసాన్ని కత్తిరింపులు శీర్షికన పల్లె ప్రపంచంలో ఉంచాను.)
Reactions:

Post a Comment

 1. భోదించు:అణగారిన వర్గాలవాళ్ళు కూడా అత్మభిమానాన్ని పెంపొందించుకోవాలని
  సమీకరించు:వేర్వేరు గా ఉన్న బడుగు బలహీన వర్గాలనన్నిటిని సమీకరించాలి
  పోరాడు:పేదరికంగా,సామాజికంగా అణగద్రోక్కేవాళ్ళతో నీ హక్కులకై పోరాడాలి ,
  ఈ మూడు జరిగితేనే అణగారిన వర్గాలలో చైతన్యం నిండిన ఆశ పరిడవిల్లుతుంది...
  కాని ఈ దేశం లో నేను కూడా ఆత్మాభిమానం తొ బ్రతకగలను ...అనే ఆశ కూడా లేని,అసలు ఆత్మాభిమానం అంటే కూడా తెలియని జనాలు ఉండడం దౌర్భాగ్యం....అందుకే వాళ్ళకి బోధించాలి..సమీకరించాలి...ఆ తర్వాత పోరాడమనాలి....

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ బాగుంది శ్రీనివాస్ గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top