ప్రజలో ' గీతపై సుష్మ ప్రకటన - ప్రతి పక్షాల అభ్యంతరం ' అంశంపై మీరేమంటారు? పోస్టు పైనా,  భగవద్గీత లో మీకు నచ్చిన అంశమేది? నచ్చని అంశమేది? అనేపోస్టు పైనా చాలా కామెంట్లు వచ్చాయి. వాటిలో అనేక భిన్నాభిప్రాయాలూ ఉన్నాయి.  గీతపై పరిశోధనకు ప్రజాశక్తిలోని ఈ వ్యాసం ఎవరికైనా రిఫరెన్సుగా పనికి వస్తే ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని ఇక్కడ ఉంచుతున్నాను.  గీతపై అనేక వ్యాఖ్యానాలు, అభిప్రాయాలూ ఉన్న నేపథ్యంలో అన్ని కోణాలలో గీతను అధ్యయనం చేయడానికి మీ వద్ద ఉన్న ఆర్టికల్స్‌ని మాకు పంపగలరు.  మీ వద్ద గీతకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైనా ఉంటే మాకు పంపితే జనవిజయం , కులం-మతం అనే శీర్షికలలో పబ్లిష్ చేస్తాము. 

సుష్మ 'గీతారహస్యం'


బిజెపి చెప్పేది ఆర్యులే హిందూ మత సృష్టికర్తలని. నిజానికి వారు బ్రాహ్మణ మత స్రష్టలు మాత్రమే. హిందూత్వవాదుల కథనం ప్రకారం ఇది, ''శకులు, హూణులు వంటి బయట నుంచి వచ్చిన వారంతా హిందూ మతంలో కలిసిపోయారు. కేవలం మహమ్మదీయులు, క్రైస్తవులే కలవలేదు. అందుకు వారు హిందువులు కావాలి, లేకపోతే ఎటువంటి అధికారాలూ లేకుండా బతకాలి లేదా దేశం నుంచి వెళ్ళిపోవాలి. ఆర్యులు భారతదేశపు ప్రాచీన మూల వాసులు.'' ఇది రుజువు చేయటమే వారి ముఖ్య ఉద్దేశం.
              బిజెపి తాను ముందుగా ఎంచుకున్న బాటలోనే పయనిస్తున్నది. ఇప్పుడు వారి కొత్త ఎజెండా గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించటం. ఈ డిమాండ్‌ను బిజెపి అగ్రనేత, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ పెట్టారు. ఆమె రెండు పదాలు వాడినట్లు మీడియా వెల్లడించింది. అవి జాతీయ గ్రంథం, జాతీయ మతగ్రంథం. గులాబీని ఏ పేరుతో పిల్చినా అది ఒకే రకం పరిమళాన్ని అందిస్తుంది. ఇక్కడ గులాబీ, పరిమళం రెండు పదాలనూ మార్చేయాలి. నిజానికి వ్యాపించేది దుర్వాసన. బాబా రాందేవ్‌, కొత్తగా ఎన్నికైన హర్యానా ముఖ్యమంత్రి సుష్మాను సమర్థించారు. ప్రకటన కూడా ఢిల్లీ ఎర్రకోట నుంచి వెలువడింది. ఎర్రకోట ఇప్పుడు బిజెపి సొంత ఆస్తిగా మారింది. ఇప్పటి వరకు దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఇక్కడ ఉపన్యసించేవారు. ఇప్పుడు ప్రతి అడ్డమైన వారూ ఇక్కడ ఉపన్యాసాలు గుప్పిస్తున్నారు. బిజెపి కార్డ్‌ హోల్డర్‌ అయితే చాలు.
                  ప్రధాని నరేంద్ర మోడీ ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడికి గీతను కానుకగా ఇచ్చారో అప్పటి నుంచే ఒబామా స్పర్శ వల్ల అది జాతీయ 'మతగ్రంథం' హోదా పొందిందట! ఒక మత గ్రంథం జాతీయ గ్రంథం లేక జాతీయ మత గ్రంథంగా ఎలా గౌరవం పొందుతుంది? భారత్‌కు ఏదైనా జాతీయ మతం ఉన్నదా? లేదు. భారత్‌ రాజ్యాంగం ద్వారా ఆమోదించబడిన ఒక లౌకిక దేశం. భిన్న మతాల సమాహారం. లౌకిక దేశంలో ఒక మతానికి చెందిన గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా డిమాండ్‌ చేయరాదు. లౌకికవాదమంటేనే మతాతీత అని అర్థం. దేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగుతుంది. మతం అనేది పౌరుల వ్యక్తిగత ఆచరణకు సంబంధించింది. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని అనుసరించ వచ్చు. ప్రభుత్వం వారిపై ఏ మతాన్నీ రుద్దజాలదు. కానీ మనది లౌకిక దేశమైనప్పటికీ అనేకమంది నేతలు, ప్రభుత్వాధికారులూ పలు రకాలుగా దీన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. గుళ్ళు, మసీదులు, చర్చీలకు వెళ్ళటం వారి నిత్య కార్యక్రమంగా మారింది. ప్రభుత్వ కట్టడాల పని ప్రారంభించేటప్పుడు భూమిపూజ, కొబ్బరికాయ కొట్టడం, జ్యోతిష్యుడు సూచించిన విధంగా నడుచుకోవటం చేస్తున్నారు. ఇవన్నీ సాధారణమైనవిగానే అనిపించ వచ్చు. సాధారణ ప్రజలు అలా ఆచరించవచ్చు. కానీ లౌకిక దేశపు రాజ్యాంగాన్ని రక్షించేవారు కూడా ఇలా చేస్తారా?
జాతీయ గ్రంథమని ఏదైనా ఉండవచ్చా? గర్వించదగ్గ ఏదేని మహాకావ్యం ఉండవచ్చు. ఉదాహరణకు రామాయణం, మహాభారతం, ఇలియడ్‌, ఆడిసీ వంటివి. కానీ అవి మహాకావ్యాలు మాత్రమే. వాటికి జాతీయ గ్రంథంతో ఏ సంబంధమూ లేదు. హర్యానా ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకేసి 'గీత అన్నిటికీ అతీతమైనది, రాజ్యాంగానికీ అతీతమైనది' అని అన్నారు. రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ మంత్రి పదవిని అధిష్ఠించిన ఒక వ్యక్తికి ఇలా అనే హక్కు ఉందా? రాజ్యాంగమనేది కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ అమలు చేయాల్సిన గ్రంథం. ఇది అందరికీ తప్పనిసరి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం చట్టపరంగా శిక్షార్హమైన నేరం. జాతీయ గ్రంథమనేది ఎలాగైతే ఏమీ లేదో, అలాగే రాజ్యాంగానికి అతీతంగా ఏ గ్రంథమైనా ఉండటం అనేది కూడా అసాధ్యం.
                 ఇలాంటి డిమాండ్‌ లేవనెత్తటానికి సందర్భం ఏమిటి? హిందూత్వ సంస్థ ప్రకారం ఈ ఏడాదికి గీత రచించబడి 5151 ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే గీత 5151 ఏళ్ళ పురాతన గ్రంథం అన్న మాట! కానీ అది ఎలా సాధ్యం? 5151 ఏళ్ళ క్రితమంటే పూర్తిగా వికసించిన హరప్పా నాగరికత కంటే ముందటిదన్న మాట. క్రీస్తుపూర్వం 3000 ఏళ్ళు అనగా నేటికి 5000 ఏళ్ళ క్రితం హరప్పా నాగరికత తన వికాసక్రమంలో ఉచ్ఛ స్థాయిని చేరుకుంది. అప్పటికి ఇంకా కాంస్య యుగం స్థాయిలోనే మానవుడు ఉన్నాడు. ఇంకా ఇనుము ఆవిష్కరించ బడలేదు. అంటే లోహ(ఇనుప) యుగం ఆరంభం కాలేదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటికి హరప్పా నాగరికత అంతరించే దశకు చేరుకున్నది. భారత్‌కు ఆర్యుల ఆగమనం కూడా ఇంచుమించు అదే సమయంలో జరిగింది. ఆర్యులు భారత్‌లోకి ప్రవేశించేటప్పుడు వారికి ఏ లిపీ లేదు. అయితే దానికంటే 1500 సంవత్సరాల ముందు గీత ఎలా రచించబడింది? దానిని ఎవరు రాశారు? ఆర్యులకు పూర్వం ఉన్న ఏదో ఒక జాతి సమూహం ద్వారానే హరప్పా నిర్మించ బడింది. వారి లిపి నేటి వరకూ కనుగొనబడలేదు. ఆర్యులు భారత్‌కు వచ్చాక వేదాలు ఆ నోట ఈ నోట పడి వ్యాపించాయి. వేదాలకు సుమారు వెయ్యేళ్ళ తరువాత లిఖిత రూపం వచ్చింది. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నాటికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మనుస్మృతి, గీత రచనలు ప్రారంభమ య్యాయి. క్రీస్తు శకం 200 వరకు ఈ రచనల సంకలనం, రచన జరిగింది. బౌద్ధమతం ప్రభావం విస్తరిస్తున్న పూర్వరంగంలో బ్రాహ్మణీయం ఆత్మరక్షణ కోసం ఆ గ్రంథాలు రచించటం, సంకలన చేయటం జరిగింది. 
               కాంస్య యుగం, లోహ(ఇనుప) యుగం ప్రస్తావన ఎందుకు వచ్చింది? మొహంజొదారో, హరప్పాలకు చెందిన పురాతత్వ నిదర్శనాల ఆధారంగా పురాతత్వవేత్తలు ఇవి కాంస్య యుగానికి చెందినవని ఏకాభిప్రాయానికి వచ్చారు. పురాతత్వవేత్తలు కాంస్య యుగం తరువాతే లోహ యుగం వచ్చిందనే ఏకాభిప్రాయంతో ఉన్నారు. లోహ యుగం అంటే ఇనుము ఆవిష్కరించబడి వాడుకలోకి వచ్చిన యుగం. లోహ యుగంలో ఇనుప పార, నాగలి రావడంతో గంగా-యమున లోయలోని దట్టమైన అడవులను నరికి వ్యవసాయం విస్తరించేందుకు సాధ్యమైంది. ఇక్కడ మనం మహాభారతంలోని ఖాండవ దహనం గుర్తు చేసుకోవాలి. ఇది వ్యవసాయం కొరకు అడవులను నరికేయటాన్ని సూచిస్తుంది. క్యాలెండర్‌ ప్రకారం ఇది క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దం. మహాభారతం మొత్తం కథంతా లోహయుగ కాలం నాటిదే కావటం వల్ల లోహయుగం ప్రస్తావన తెచ్చాను. మహాభారతంలో భాగమే కురుక్షేత్ర యుద్ధం- కౌరవ, పాండవుల మధ్య జరిగిన మహాసమరం. ఈ యుద్ధం కురుక్షేత్రం అనే స్థలంలో జరిగిందట. ఈ యుద్ధం మొదలయ్యే సమయంలోనే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడట. గీతను ప్రజాకర్షకంగా మార్చేందుకు దీన్ని కృష్ణునికి ఆపాదించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన పని. ఎందుకంటే అప్పుడు కృష్ణుని భక్తివాదం ఉచ్ఛస్థాయిలో ఉంది. ఆయనే ఆనాటి అత్యధిక పలుకుబడిగల దేవుడు. ఆర్యులు భారత్‌లోకి వచ్చిన తొలిరోజుల్లో హరప్పా నాగరికత మూలవాసులతో ప్రతినిత్యం యుద్ధాలు జరుగుతూనే ఉండేవని ఋగ్వేదం చదివితే తెలుస్తుంది. మొదట్లో యుద్ధాలు ఆర్యులు, అనార్యుల మధ్య జరిగినా తరువాత తరువాత జరిగిన యుద్ధాల్లో రెండువైపులా ఇద్దరూ ఉండేవారు. (ఋగ్వేదంలో 'పది రాజుల యుద్ధం'లో దీని గురించి వివరణ ఉంది). మొదటి దశలో ఈ యుద్ధాల్లో నాయకుడు ఆర్యుల నాయకుడు ఇంద్రుడు. కాని తరువాతి కాలంలో ఆర్య-అనార్య సమూహాల నాయకుడిగా కృష్ణుడినే పేర్కొన్నారు. ఈ 'ఇంద్రుడు' లేక 'కృష్ణుడు' నిర్దిష్టమైన వ్యక్తులు కాదు. మొదటి దశలో ఆర్య వీరులను, నాయకులను 'ఇంద్ర' పేరుతో పిలిచారు. అలాగే మొదట అనార్యుల నాయకుడు, తరువాత ఇంద్ర వ్యతిరేక ఆర్య-అనార్య వీరులందరినీ 'కృష్ణ' అనే పేరుతో పిలిచారు. ఋగ్వేదంలో ఉన్న కృష్ణుడి కథకు, మహాభారతంలో ఉన్న కృష్ణుడి కథకు సుమారు అయిదారు వందల ఏళ్ళ తేడా ఉంది. ఈ కాలంలో 'కృష్ణుడు' ఆర్యులలో అందరి కంటే ఎక్కువ పలుకుబడిగల దేవుడు అయిపోయాడు. ఇంద్రపూజ క్రమంగా తగ్గుతూ వచ్చింది. కృష్ణుడికి, ఇంద్రుడికి మధ్య విరోధానికి ముఖ్య కారణం ఇంద్రుడు పశుపాలనపై ఆధారపడిన సమాజపు దేవుడు, కృష్ణుడు వ్యవసాయంపై ఆధారపడిన సమాజపు ప్రతీకాత్మక దేవుడు. ఆ కారణంచేతనే గీతను ప్రజాకర్షకంగా చేయటానికి దాన్ని కృష్ణుడికి ఆపాదించటం జరిగింది. 
                     ఒకవేళ గీత మహాభారత కాలంలోనే రచించ బడిందని అనుకున్నా దాని వయసు 5151 ఏళ్ళు ఎలా అవుతుంది? మహా అయితే అది రెండున్నర వేల ఏళ్ళ నాటిది అవుతుంది. ఇప్పుడు ప్రశ్నేమంటే మహాభారత కథ వాస్తవమేనా? నిజంగానే మహాభారతంలో చెప్పినట్టు కురుక్షేత్ర యుద్ధం జరిగిందా? సంస్కృతంలో రచించబడిన రామాయణం, మహాభారతం చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాయి. సాహిత్యంపై ఆధారపడి చాలామంది రామాయణ, మహాభారతాలు నిజమేనని వక్కాణించారు. మహాభారతం నిజమైన సంఘటనేనని ఎందరో రుజువు చేయటానికి ప్రయత్నించారు. కానీ వారు సాధారణ సాహిత్యం నుంచే సాక్ష్యాలు సంగ్రహించే ప్రయత్నం చేశారు. అయితే సాహిత్యంతో పురాతత్వ తవ్వకాల ఫలితాలు కలవకపోతే దాని చారిత్రాత్మకత రుజువు కాదు. వైదిక యుగంలో చాలా యుద్ధాలు జరిగాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఒకవేళ కురుక్షేత్రంలో ఏదైనా యుద్ధం జరిగి ఉన్నా అది క్రీస్తుపూర్వం 950 ఏళ్ళ నాడు అయి ఉండాలి. దానర్థం అది కురు-పాండవుల మధ్యే జరిగిందని కాదు. వేదాలు, పురాణాల్లో ఎక్కడా రామాయణ, మహాభారతాల ప్రస్తావన లేదు. వాటిలో ఎన్నో కథలు, యుద్ధాల ప్రస్తావన ఉంది కానీ రామాయణ, మహాభారతాల ప్రస్తావన లేదు. ఇవన్నీ సూచించేదేమంటే కరడుగట్టిన జాతీయవాదులు ఎంత కష్టపడినా నిజం కాని దాన్ని నిజంగా ప్రామాణిక గ్రంథాల్లో, ఆధారాల్లో చొప్పించ జాలరు.
                     గీత 5151 ఏళ్ళ క్రితం రచించబడినదనటానికి ఏ చారిత్రక ఆధారాలూ లేవు. కానీ ఇలా నొక్కి చెప్పాలంటే ఆర్యులు భారత్‌కు బయట నుంచి రాలేదని రుజువు చేయటమే మార్గం. 'వారే భారతదేశ మూల వాసులు. వారే హరప్పా నాగరికతను నిర్మించారు' అని చెప్పడానికే. వాస్తవానికి ఆర్యులు భారత్‌కు బయట నుంచి వచ్చారు. వారికి హరప్పా మూలవాసులకు తేడాలున్నాయి. (1) గుఱ్ఱం ఆర్యుల పెంపుడు జంతువు. అది సింధు లోయలో లేదు. (2) ఆర్యులు ఇరుసు ఉన్న చక్రాలు వాడేవారు. హరప్పా నాగరికతలో చక్రం ఉంది కానీ అది ఇరుసు ఉన్నది కాదు. (3) ఆర్యులు తమ అంబుల పొదిలో ధనుర్భాణాలు ఉంచుకుని యుద్ధం చేసేవారు, హరప్పా వారు అలా చేయలేదు. (4) ఆర్యులు అగ్నిపూజ, హోమం, ఉపాసన, పశుబలి, అశ్వమేధ యాగం ఆచరించారు, హరప్పాలో ఇవేవీ లేవు. (5) హరప్పా వాసులకు లిఖిత భాష ఉంది. ఆర్యులకు లేదు. (6) హరప్పా సమకాలీన మెసపుటోమియా నాగరికత లిపి ద్వారా తెలిసేదేమంటే వారు హరప్పాను 'మెలుహ హా' పేరుతో, నల్ల మనుషుల దేశమని పేర్కొన్నారు. ఋగ్వేదంలో కూడా రెండు వర్ణాల మనుషుల గురించి ప్రస్తావన ఉంది. తెలుపు, నలుపు. ఆర్యులు తెల్లగా ఉన్నారు. హరప్పావారు నలుపు. బిజెపి చెప్పేది ఆర్యులే హిందూ మత సృష్టికర్తలని. నిజానికి వారు బ్రాహ్మణ మత స్రష్టలు మాత్రమే. హిందూత్వవాదుల కథనం ప్రకారం ఇది, ''శకులు, హూణులు వంటి బయట నుంచి వచ్చిన వారంతా హిందూ మతంలో కలిసిపోయారు. కేవలం మహమ్మదీయులు, క్రైస్తవులే కలవలేదు. అందుకు వారు హిందువులు కావాలి, లేకపోతే ఎటువంటి అధికారాలూ లేకుండా బతకాలి లేదా దేశం నుంచి వెళ్ళిపోవాలి. ఆర్యులు భారతదేశపు ప్రాచీన మూల వాసులు.'' ఇది రుజువు చేయటమే వారి ముఖ్య ఉద్దేశం. దానికోసం ఎటువంటి అభూత కల్పనలనైనా ప్రచారం చేయటానికి వారు వెనుకాడరు. వారు నెమ్మదిగానే అయినా ఆ దారిలోనే పక్కా పథకం ప్రకారం ముందుకు పోతున్నారు.

- శ్యామల్‌ చక్రవర్తి
Reactions:

Post a Comment


 1. గీత కో రహస్యమున్నదని అది ఇప్పుడే బట్ట బయలు అయిందని తెలుస్తోంది స్మీ !!

  జిలేబి

  ReplyDelete
 2. చరిత్ర ,చరిత్రే మార్చేసిన ఘనులు ...చరిత్ర కాని చరిత్రను చరిత్రలో కలిపెయ్యాలని చూసే వీరులు...ఉన్న ఈ కాలంలో
  నిజమైన చరిత్ర తెల్సుకోనేదేట్లు?

  ReplyDelete
 3. *పురాతత్వ తవ్వకాల ఫలితాలు కలవకపోతే దాని చారిత్రాత్మకత రుజువు కాదు*

  మార్క్సిస్ట్ చరిత్రకారులు ఇటువంటివి విశ్లేషణలు చేయటం కొత్త కాదు. రుజువులు లేకుండా మాట్లాడేది రాసేది వాస్తవానికి వారే. మచ్చుకి ఉదాహరణ ఇస్తాను. ఒకప్పుడు రామజన్మ భూమి విషయంలో అక్కడ మందిరమే లేదని మార్క్సిస్ట్ చరిత్రకారులు వాదనలు దేశంలోని అన్ని పేపర్లలో వినిపించేవారు. హిందువులు అసత్య ప్రచారం ప్రచారం చేసున్నారని ప్రాపగండా చేసారు. సహజంగా హేతుబద్దం, శాస్త్రీయం, పదలాను వాడుతూ రాయంగానే ప్రతి హిందువు, మార్క్సిస్ట్ లు చెప్పేదానిలో నిజాయితి ఉందని నమ్మేస్తూంటారు. అందువలన ఆ కోణంలోనే నిజాలను నిగ్గుతేల్చాలి అనుకొంటారు. చివరికి రామజన్మ భూమికేసు కోర్ట్ గుమ్మం లోకి వెళ్ళిన తరువాత, మార్క్సిస్ట్ చరిత్రకారుల అసలు రంగు బయటపడింది. బాబ్రి మసీదు కింద అలయమే లేదని, కుప్పలతెప్పలుగా వ్యాసాలు రాస్తూ, సంవత్సరాల తరబడి వాదించిన చరిత్రకారులు, తవ్వకాలు జరిగిపితే మసీదు కింద ఆలయం ఆనవాళ్ళు కనిపించాయి. ఇక చూస్కోండి కోర్ట్ లో విరి అసలు రంగు బట్టబయలు అయ్యింది. కోర్ట్ వీరిని సాక్షాలు అడిగితే, ఇన్ని వ్యాసాలు రాసిన ఒక్కరు కూడా చిన్న పాటి సాక్షం సమర్పించలేదు, సరికదా వాళ్ళు బాబ్రిమసీదు స్థలంకూడా కనీసం చూడ్కుండా, ఇంట్లో కుచొని పేపర్లలో వచ్చేవార్తలను సేకరించి, అవే ఆధారాలు అయినట్లు వీరు వాటిని ఆధారంగా మళ్ళి పేపర్లకి వ్యాసాలు రాస్తుండేవారు. అంటే ఒకడు రాసిన అబద్దాన్ని నిజమనుకొని, ఇంకొకడు దాని నాధారం చేసుకొని పాంజి స్కీం లా ప్రచారం చేసి చివరికి కోర్ట్ లో అందరం అబద్దాలు చెప్పామని,ఒప్పుకొని, వారికి వారే బొక్క బోర్ల పడ్డారు.
  రామజన్మభూమిపై వచ్చిన తీర్పు ,కోర్ట్ లో మార్క్సిస్ట్ చరిత్రకారుల వివరణ గురించి ఈ వ్యాసం సాక్ష్యంగా ఇస్తున్నాను. ఇది నిరాధారణ ఆరోపణ కాదు.

  http://www.firstpost.com/india/babri-demolition-how-hc-verdict-discredited-eminent-historians-547549.html

  ReplyDelete
 4. ఆర్యులు, ద్రవిడులు (అనార్యులు) తప్పుడు సిద్దాంతమని ఇప్పుడు అందరికి తెలుసు. విదేశాలలో ఏ పెద్ద యునివర్సిటి లో ఎవ్వరు ఇప్పుడు దానిపైన మాట్లాడరు. కారణం బోగస్ అని తేల్చాశారు గనుక మాట్లాడటానికి ధైర్యం రాదు. ఇప్పుడు రోమిల్లా థాపర్ కూడా మాట్లాడటంలేదు. ఆ అంశంపై చర్చకు అహ్వానించినా రాదు. ఆమే రాసిన ఆర్య ద్రవిడ థిసీస్ ను ఖండిస్తూ హిందూ పేపర్లో సుబ్రమణ్య స్వామి వ్యాసం రాస్తే ఆమే నుంచి ఇప్పటి వరకు బదులు లేదు.

  ReplyDelete

 5. శ్రీ రాం గారు,

  సరి ఐన పాయింటు గుర్తు చేసారు ! సుబ్రహ్మణ్యం స్వామీ వారి కి బదులివ్వ డానికి దమ్ములు లేవు !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. @జిలేబి, కొండలరావుగారు ఈ అబ్దాల వార్తలను చర్చకు పెట్టటం మానుకొంటే, అందరి సమయం ఆదా చేసి దేశానికి ఎంతో సేవచేసినవారౌతారు.

   Delete
  2. dwaraka city was one of the evidence in
   mahabharatha period

   Delete
 6. మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. బైబిల్ ప్రకారం సృష్టి జరిగి, భూమి ఏర్పడి, 5000 సంవత్సరాలే అయ్యింది. అప్పటి నుంచే చరిత్ర కూడా మొదలయ్యింది. ఆ లెక్కన చూసుకుంటే, డైనోసార్లు కూడా పుట్టి, అంతరించి మొదతి వెయ్యేళ్ళలోనె అయ్యింది. ఎందుకంటే, నోవా పడవలో చోటు లేకపోవడం వల్ల జలప్రళయంలో అవి అంతరించిపోయాయి. ఒకరోజులోనే మొత్తం ప్రాణులన్నీ సృష్టించబడ్డాయి. ఇంకేమన్నా కావాలా? తెలియని విషయాలు నన్ను అడిగి తెల్సుకోండి.

  ReplyDelete
 7. ఈమధ్యనే పోప్ ఫ్రాన్సిస్ గారు ఎవల్యూషన్,బిగ్ బాంగ్ థియరీ నిజమని ప్రకటించారు మీరు ఒక్క వాక్యములో ఒకరోజులోనే మొత్తం ప్రాణులన్నీ సృష్టించబడ్డాయి అని ఎలా చెప్పగలుగుతారు మీరు ప్రకటించిన వాక్యం ఫై ముందు పరిశోదించి సమధానం ఇవ్వగలరు

  ReplyDelete
  Replies
  1. bible speaks earth was flat but modern science
   speaks it was wrong bible speaks world create
   only 4000 years but modern science speaks it
   was wrong

   Delete
 8. theinmae sware china government kill so many people
  but communists always blames hindus

  ReplyDelete
 9. కొండలరావుగారు,
  ఈ ఆర్టికల్ లో చెప్పినట్లు బ్రాహ్మణ మతం అనేదే ఒకటి ఉంటే,దానిని ప్రపంచ మతాలలో ఒకటిగా గుర్తించినట్లు ఎక్కడైనా ఉందా? ఉంటే ఏ ఏ దేశాలలో ఉంది. వ్యాస రచయిత చెప్పినప్రకారం బ్రాహ్మణ మతం అంటే అది బ్రాహ్మణుల దొక్కరిదే అనే ఉద్దేశం ఈ వ్యాసంలో స్పష్ట్టంగా కనిపిస్తున్నది. మరి వారు పూజించే దేవుళ్లనే ఎంతో మంది ఇతర కులాల వారు పూజిస్తూంటారు. అలా ఎందుకు జరుగుతున్నాది? బ్రాహ్మణులు వేరే మతమైనపుడు మనదేశంలోని కులాలు ఏ మతం కింద వస్తాయి ? మన ప్రభుత్వం బ్రాహ్మణ,బలిజ, కమ్మ, రెడ్డి,రాజు, మాల,మాదిగ మొదలైన ఇతర కులాల వారిని స్కుల్ రికార్డ్ లనుంచి ప్రభుత్వోద్యాగాల వరకు వారి మతం అనే కాలం లో హిందువులు రాస్తారు గదా! బ్రాహ్మణులను ఎందుకు హిందువులుగా ఇతరకులాలవారితో పాటు గుర్తిస్తున్నాది? మీరు నా ప్రశ్నలకు తప్పక సమాధానం మిస్తారని ఆశిస్తాను. మీదగ్గర సాక్షాలు ఉంటే వాటిని జతపరిస్థే మరీ మంచిది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top