Note : ఆంధ్రజ్యోతిలో కొత్తపలుకు వ్యాసం ఇది. ఆలోచనాపరులకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఉంచుతున్నాను.

భక్తిలో కూడా ఆత్మ వంచన ఉంటుందా? అని మనకు అనిపించవచ్చు గానీ, ఇప్పుడు భక్తిలోనే ఆత్మ వంచన ఎక్కువగా ఉంటోంది. గుళ్లకు వెళ్లకపోయినా, స్వాములకు నమస్కరించకపోయినా కీడు జరుగుతుందేమోనన్న భయంతో, ఎందుకన్నా మంచిదన్న ఉద్దేశంతో అటు దేవుళ్లకు, ఇటు స్వాములకు దండం పెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత సమాజంలో వెల్లివిరుస్తున్న భక్తిలో అధిక శాతం భయంతో, ఆశతో కూడినది మాత్రమే!

పాపం దేవుళ్లు! మనుషుల్లో పేరుకుపోతున్న స్వార్థచింతన దైవ చింతనగా మారి దేవుళ్లను ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తోంది. ఆంగ్ల నామ సంవత్సరంతోపాటు వైకుంఠ ఏకాదశి కూడా ఒకేరోజు రావడంతో తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. నూతన సంవత్సర వేడుకలను విందు, మందు, చిందుతో ఆనందించి, ఆస్వాదించి ఇళ్లకు చేరుకునేవారు కొందరైతే, స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో గుళ్లకు బయలుదేరిన వారు మరికొందరు. ఒకే సమాజంలో ఎంత వైరుధ్యం! మొత్తంమీద తెలుగునాట భక్తిరసంలో మునిగి తేలుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేవుళ్లకు ఊపిరి సలపనంతగా! వైకుంఠ ఏకాదశి పేరిట దేవుళ్లను కనీస విశ్రాంతి కూడా తీసుకోనివ్వలేదు. ప్రసాదాలను ఆరగించే టైమ్‌ కూడా ఇవ్వలేదు. దేవేరులతో ముచ్చటించే సమయం అసలే ఇవ్వలేదు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామికి ఉండడానికి ఇద్దరు భార్యలున్నారు గానీ, వేల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో వారి ఆలనా పాలనా చూసుకునే సమయం కూడా ఆ దేవదేవుడికి లభించలేదు. మన సమస్యలను, కోర్కెలను దేవుళ్లకు చెప్పుకొంటున్నాం గానీ, తమ సమస్యలను ఆ దేవుళ్లు ఎవరికి చెప్పుకోవాలి? అంతమంది కోర్కెలను గంటలకొద్దీ వింటూ వాటిని తీర్చడం దేవుడికి మాత్రం ఎలా సాధ్యం? ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రార్థనలు చేసిన భక్తుల్లో ఎంతమందిని మన దేవుళ్లు కనికరిస్తారో తెలియదు గానీ- భక్తుల తాకిడి నుంచి తమకు రక్షణ కల్పించవలసిందిగా దేవుళ్లే వేడుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా, తెలుగునాట దైవ చింతన ఇంతలా పెరగడానికి కారణం ఏమిటి? దైవ చింతన ఉన్నచోట అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఉండకూడదు కదా? భక్తితో పాటు ఇవి కూడా పెరుగుతుండటం ఏమిటి? బహుశా దేవుడు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమల కొండకు వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్లడంతో తొక్కిసలాట మాత్రమే కాదు- ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు పేరున్న దేవుడు కనుక భక్తులు పెరుగుతున్నారని అనుకోవ డానికి లేదు. ఎందుకంటే, చిన్నాచితక దేవుడి గుళ్లకు కూడా ఇటీవలి కాలంలో గిరాకీ పెరుగుతోంది. దేవుళ్లను దర్శించు కుంటున్న వారిలో ముసలీ ముతక ఉన్నారనుకోవడానికీ లేదు. ఆధునిక జీవనానికి అలవాటుపడిన యువత కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారు. గతంలో లేనంతగా ఇటీవలి కాలంలో మనలో ఇంత భక్తి పెరగడానికి కారణం ఏమిటి? నిజంగా దేవుడి మీద భక్తితో వెళుతున్నామా? లేక భయంతో, ఆశతో వెళుతున్నామా? ఆత్మ పరిశీలన అవసరం అనిపించడం లేదూ!

కొత్త వ్యాపారం.. భక్తి!
దేవుళ్లు మాత్రమే కాదు- ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చెప్పే నయా దేవుళ్లు కూడా పెరుగుతున్నారు. వారికి కూడా వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి సొంత అనుచర గణం, భక్తులు ఏర్పడుతున్నారు. మొత్తంమీద తెలుగు రాష్ర్టాలలో ఇప్పుడు భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారం అని ఎందుకు అనవలసివస్తున్నదంటే- దేవుళ్లకు, ఆయా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఇటీవలి కాలంలో విశేష ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా రోజు మా దేవుడిని దర్శించుకుంటే మీ పాపాలన్నీ పోయి, మీరు పునీతులు అవుతారంటూ ప్రకటనలు చేస్తుంటారు. అంటే, మామూలు రోజుల్లో దేవుడిని దర్శించుకుంటే ఏమీ లాభం లేదన్నమాట! ప్రలోభాలకు లోనుకాకుండా, మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవడానికై గతంలో దేవాలయాలకు వెళ్లి కొద్దిసేపు గడిపేవారు. ఇప్పుడు గంపెడు కోర్కెలతో దేవాలయాలకు వెళుతున్నారు. భక్తుల ఈ కోర్కెల చిట్టాలను ఓపిగ్గా వినలేక, దేవుళ్లకు తలపోటు వస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, మనలా దేవుళ్లు ఆ విషయం బయటకు చెప్పుకోలేరు. అమృతాంజనం గట్రా పట్టించుకోలేరు. ప్రచార హోరు పెంచి దేవుడిని కూడా వ్యాపార వస్తువుగా మార్చిన వాళ్లను ఏమనాలి? ఫలానా గుడిలో వెలిసిన దేవుడు పవర్‌ఫుల్‌ అంటారు. దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదా! ఫలానా గుడిలోనే ఆయన పవర్‌ ఫుల్‌గా ఎందుకుంటారు? అంటే, తమ గుడికి ఆదరణ పెరగాలని ఆయా గుళ్లను కట్టించినవారు కల్పిస్తున్న ప్రచారమే కారణం. హిందూ మతం మూలాల్లోకి వెళితే.. మానవ సేవే మాధవ సేవ అన్నారు. సాటి మనిషి ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోనివారు, దేవుళ్లకు మాత్రం కోట్ల రూపాయల విలువైన నగలను కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చే వాటిని బహుమతులు అనడం కంటే లంచం అనడం మేలు! బళ్లారి, ఓబుళాపురంలో ఇనుప ఖనిజం గనులను అడ్డంగా దోచుకున్న గాలి జనార్దన్‌ రెడ్డి కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, వజ్ర వైఢూర్యాలతో కిరీటాన్ని తయారు చేయించి, తాను మరింతగా దోచుకోవడానికి అవకాశం కల్పించాలని మనసులో కోరుకుంటూ శ్రీవారికి లంచంగా ఇచ్చారు. దేవుడు మాత్రం పాపులు ఇచ్చినా, పుణ్యాత్ములు ఇచ్చినా, ఏమిచ్చినా ఒకటే విధంగా స్వీకరిస్తాడు. లంచం ఇచ్చిన వారి పట్ల మన అధికారులు, రాజకీయ నాయకుల వలే ప్రత్యేక అభిమానం చూపడు. అందుకే రూ.40 కోట్ల కిరీటాన్ని సమర్పించుకున్న గాలి జనార్దన్‌ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తించకుండా అడ్డుకోలేదు. నిజం చెప్పాలంటే, దేవుడు కూడా చిలిపివాడే! పేదవాడి చెమటతో తడిసిన రూపాయిని ఎంత గౌరవంగా స్వీకరిస్తాడో, పాపులు ఇచ్చిన విలువైన బహుమతులను కూడా అంతే ఆప్యాయంగా స్వీకరిస్తాడు. అయితే, ఎవరికి ఏమి చేయాలో అదే చేస్తాడు. ఖరీదైన బహుమతులు ఇచ్చినంత మాత్రాన ఉబ్బితబ్బిబ్బు కాడు. అలా అవుతున్నది గుళ్ల నిర్వాహకులే! అందుకే హుండీ కలెక్షన్‌ గురించి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. భక్తుల మధ్య పోటీ పెంచి రాబడి పెంచుకోవడమే దీని వెనక ఉన్న ఆంతర్యం! ‘దేవుడు చేసిన మనుషుల్లారా- మనుషులు చేసిన దేవుళ్లారా’ అని ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌ పాడతారు. దేవుళ్లను వ్యాపార వస్తువుగా మార్చారని దశాబ్దాల క్రితమే ఆ పాట రాసిన శ్రీశ్రీ గుర్తించారు. ఇప్పుడు ఈ విషయంలో మరింత పురోగతి సాధించాం. దేవుడు మనుషులను సృష్టించడం ఏమో గానీ, మనుషులే దేవుళ్లను ఎడాపెడా సృష్టించి పారేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త దీక్షలను తెరమీదకు తెస్తున్నారు. ఆయా దీక్షలకు తగినట్టుగా రంగురంగుల వస్ర్తాలను ధరిస్తున్నారు. దేవుడి పేరిట సాగుతున్న ఈ వ్యాపారం ఇంతలా విస్తరించడానికి ప్రధాన కారణం మన మధ్యనే ఉన్న స్వాములు, పీఠాధిపతులు! ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వీరి హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికి వారు పీఠాధిపతులుగా ప్రకటించుకుంటూ ప్రవచనాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నారు. గతంలో ఒకటో రెండో పీఠాల గురించి మాత్రమే మనకు తెలుసు! ఇప్పుడు లెక్కలేనన్ని పీఠాలు, ఆశ్రమాలు. వీరికితోడు, భక్తులను ఉద్దేశించి ఉపన్యాసాలు చేసేవారు మరికొందరు. వారికి ప్రచారం కల్పించేవారు ఇంకొందరు! మొత్తంమీద వీరంతా ఒక ముఠాగా ఏర్పడి స్వార్థపూరిత భక్తిని మనలో నింపుతున్నారు. పేరు రాస్తే నొచ్చుకుంటారు కనుక ఆ వ్యక్తి పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, ఆయన ప్రసంగాన్ని ఇటీవలే ఒక టీవీలో విన్నాను. సారాంశం ఏమిటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కార్తీక పౌర్ణమి నాడో, వైకుంఠ ఏకాదశి నాడో దీపాలు వెలిగించి దేవుడిని వేడుకుంటే చాలునట! అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఇంకో మతలబు ఉంది. దేవుడి పేరిట ఉపన్యాసాలు ఇస్తున్న ఇలాంటి వాళ్లంతా దేవుళ్లుగా మారిపోతున్నారు. అమాయక భక్తులు వారి కాళ్లకు మొక్కుతున్నారు. వారి చిత్రపటాలను తమ పూజా మందిరాల్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అంటే, గాడ్‌మెన్‌ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందన్నమాట! భక్తి అనేది ఒక బలహీనతగా మారడంతో, భక్తి పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించి లాభాలు గడించేవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటి దాకా విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం గురించి విన్నాం. ఇకపై భక్తి వ్యాపారం గురించి వినబోతున్నాం. భక్తి వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, నాస్తికులుగా ఉన్నవారు సైతం ఆస్తికులుగా మారి భక్తి వ్యాపారానికి బృహత్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.

అహం.. ప్రలోభాలు వారికే!
దేవుడి పేరిట మనల్ని మూర్ఖులుగా మారుస్తున్న స్వాములు, పీఠాధిపతుల విషయానికి వద్దాం. మనిషిలో స్వార్థ చింతన ఉండకూడదు. అసూయ ద్వేషాలు అసలే ఉండకూడదని వీరంతా చెబుతుంటారు. నిజానికి, ఈ పీఠాధిపతులు, స్వాముల మధ్య ఉన్నంత అసూయా ద్వేషాలు మరెవరిలోనూ కనిపించవు. ఏ ఇద్దరు పీఠాధిపతుల మధ్య సఖ్యత ఉండదు. ఎవరి అహం వారిది. మనకు మాత్రం అహన్ని వదిలించుకోవాలని చెబుతారు. ఫలానా పీఠాధిపతికి మీడియాలో అధిక ప్రచారం లభిస్తోందని ఒకరు మధనపడిపోతుండగా, ‘వాడి మొహం. వాడికేం తెలుసు- అనవసరంగా ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని మరొకరు నొసలు చిట్లిస్తుంటారు. పనిలో పనిగా, మీడియా మిత్రులను కూడా ప్రలోభాలకు లోను చేస్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పేటప్పుడు మాత్రం, ప్రలోభాలకు లొంగకూడదనీ, కామ క్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. మన మధ్య విలాసవంతంగా జీవిస్తున్న అనేకమంది స్వాములు, పీఠాధిపతులకు ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. అయినా, వారికి భక్తుల సంఖ్యకు కొదువ ఉండటం లేదు. అందుకే కాబోలు, ‘మీరు చెప్పేది మీరు చెప్పండి. మేం చేసేది మేం చేస్తూ ఉంటాం’ అని భక్తులు కూడా భావిస్తున్నారు. భక్తిలో కూడా ఆత్మ వంచన ఉంటుందా? అని మనకు అనిపించవచ్చు గానీ, ఇప్పుడు భక్తిలోనే ఆత్మ వంచన ఎక్కువగా ఉంటోంది. గుళ్లకు వెళ్లకపోయినా, స్వాములకు నమస్కరించకపోయినా కీడు జరుగుతుందేమోనన్న భయంతో, ఎందుకన్నా మంచిదన్న ఉద్దేశంతో అటు దేవుళ్లకు, ఇటు స్వాములకు దండం పెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత సమాజంలో వెల్లివిరుస్తున్న భక్తిలో అధిక శాతం భయంతో, ఆశతో కూడినది మాత్రమే! వ్యాపారం ప్రారంభించే ముందు గుళ్లకు వెళుతున్నాం. పరీక్షలు రాసే ముందు దేవుళ్లను గుర్తు చేసుకుంటున్నాం. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తుకురాడు! లేనిది కావాలనుకున్నప్పుడే దేవుడి అవసరం ఏర్పడుతోంది. అలాంటి పరిస్థితి కల్పించింది కూడా మనలో ఒకరైన స్వాములు, పీఠాధిపతులు! స్వార్థానికి, భక్తికి చక్కగా ముడి వేయడంతోపాటు దేవుళ్లను కూడా పావులుగా ఉపయోగించుకుంటున్నారు. కాలినడకన దేశాటన చేసి ప్రజలను చైతన్యవంతులను చేసిన శంకరాచార్యుడు నడయాడిన ఈ నేల మీదే విలాసవంతమైన కార్లలో తిరిగే స్వాములు పుట్టుకొచ్చారు.

స్వాములు అంటరానివారా!?
ఈ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘పీకే’ చిత్రంపై తలెత్తిన వివాదం గురించి చర్చించుకుందాం. హిందూ మత పరిరక్షకులమని చెప్పుకొంటున్నవారు ఈ చిత్రాన్ని నిషేధించాలని గొడవ చేయడం మొదలెట్టారు. దేశ చలనచిత్ర చరిత్రలో గతంలో ఏ సినిమా సాధించనంత విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అందుకు కారణం హిందువులే! మెజారిటీ హిందువుల్లో ఉన్న మనోభావాలకు ఈ చిత్రం అద్దం పట్టింది. భక్తి పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని ఈ సినిమా ఎత్తిచూపింది. దేవుళ్ల పేరిట కొంతమంది కంపెనీలు పెట్టి వాటికి మేనేజర్లుగా, అంటే స్వాములుగా వ్యవహరిస్తున్నారని సుతిమెత్తగా ఇందులో విమర్శించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సృజనాత్మకంగా నిర్మించిన ఈ చిత్ర దర్శకుడిని అభినందించవలసిందే! హిందూ మతంలోని దొంగ స్వాములను ఎత్తి పొడిచినట్టుగా క్రైస్తవ మతం, ఇస్లాం గురించి ఎత్తి పొడవలేదన్న కొందరి విమర్శలో కొంత నిజం ఉంది. అయితే, ఇస్లాంలో మతం పేరిట ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పడంలో భాగంగా రైలు పేల్చివేత ఘటనను దర్శకుడు చూపించారు. క్రీస్తును ప్రార్థిస్తే సర్వ రోగాలూ నయమవుతాయని ఆ మతానికి చెందిన కొందరు చేస్తున్న ప్రచారాన్ని కూడా ఎత్తి చూపించి ఉండవలసింది. అయితే, క్రైస్తవ మతం పేరిట మోసపోతున్న వారికంటే హిందూ మతంలో మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువ. కాబట్టి, ఆ అంశాలను ప్రధానంగా తీసుకుని ఉంటారు. ఏదైతేనేమి, ఈ ‘పీకే’ చిత్రంపై దేశంలో అక్కడక్కడా నిరసనలు వినిపించాయి. ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా చిత్రాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. హిందూ మత రక్షకులుగా చెప్పుకొంటూ ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరుతున్న వారు ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హిందూ మతం పేరిట కొంతమంది వ్యక్తులు తమకు మహిమలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ తమను తాము దేవుళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ముందుగా కట్టడి చేయాలి. మత మార్పిడిలు జరగడానికి కారణం ఏమిటో అన్వేషించాలి. ‘‘చర్చి ఫాదర్‌ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు- హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?’’ అని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నించారు. చర్చి ఫాదర్‌లలో కూడా అవలక్షణాలు ఉన్నవారు ఇటీవలి కాలంలో ప్రవేశిస్తున్నారనుకోండి. ఆ విషయం పక్కన పెడితే సాటి మనిషిని అంటరానివాడిగా పరిగణించాలని హిందూ మతంలో ఎక్కడ చెప్పారో సదరు స్వాములు, పీఠాధిపతులు చెప్పాలి. కొంతకాలం క్రితం ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులు, అక్కడికి వచ్చిన ఒక పీఠాధిపతిని పూలమాల, శాలువాతో సత్కరించాలని కోరారు. నేను ఆ పని చేయడానికి ఉపక్రమించగానే, సదరు పీఠాధిపతి శిష్యుడు అడ్డుకుని, ‘‘మీరు స్వామిని అంటుకోకుండా వాటిని చేతుల్లో పెట్టండి’’ అని అన్నారు. సాటి మనిషిని అంటుకోవడానికి కూడా ఇష్టపడని సదరు స్వామి మనుషుల మధ్య తిరగడం ఎందుకు? ఏ అడవుల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవచ్చు కదా? మరో స్వామి విషయానికి వద్దాం. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఆయన శిష్యుడు కూడా పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోకూడదు. ముందు సీటు- వెనక సీటుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో స్వామిగారి పాదాల చెంత కూర్చోవాలి. ఇలాంటి దృశ్యాలను చూసిన నాబోటివాళ్లకు సదరు స్వాములను గౌరవించాలని ఎందుకు అనిపిస్తుంది? తాము చేసేదంతా మానవాళి శ్రేయస్సు కోసమని చెప్పే ఈ స్వాములు, సాటి మానవులనే అంటరానివారుగా పరిగణించడం ఏమిటి? మరే ఇతర మతంలోనూ ఈ దురాచారం లేదు. శరీరంలో రోగాలను పెట్టుకుని ఏ రోగం లేదని డాక్టర్‌ వద్ద బుకాయిస్తే కుళ్లిపోయేది శరీరమే! హిందూ మతంలో ఉన్న అవలక్షణాలను ప్రక్షాళన చేయవలసింది పోయి, లోపాలను ఎత్తిచూపిన వారిపై దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ‘పీకే’ సినిమాను ప్రేక్షకులు ఎందుకు అంతలా ఆదరిస్తున్నారో ముందుగా గ్రహించాలి. ఆ సినిమాను, అందులోని హీరోను, చిత్ర దర్శకుడిని నిందించే బదులు ఆ చిత్రంలో ఎత్తి చూపిన లోపాలలో నిజం ఉందా? లేదా? అని హిందూ మత రక్షకులుగా చెప్పుకొంటున్న వాళ్లు ప్రశ్నించుకోవాలి. అంతేగానీ, ఎడాపెడా స్వాములను తయారు చేస్తూ దేశం మీదకు వదలడం వల్ల హిందూ మతం పరిఢవిల్లదు. ఆశ్రమాలు, పీఠాలు నెలకొల్పుకున్న వారు సమాజానికి ఏమి చేస్తున్నారు? సామాన్య ప్రజలను కనీసం అంటుకోకుండా వారికి దూరంగా విలాసవంతమైన సింహాసనాలపై కూర్చొని ప్రవచనాల పేరిట ఏవేవో చెబుతూ ప్రజలను స్వార్థంతో కూడిన భక్తిలో ముంచెత్తడం వల్ల హిందూ మతం పదిలంగా ఎలా ఉంటుందో సదరు హిందూ మత రక్షకులే చెప్పాలి. ‘పీకే’ చిత్రం అద్భుతంగా ఉందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ కూడా ప్రశంసించారు కదా! అంటే, ఆయన కూడా దైవ ద్రోహి, హిందూ మత ద్రోహి అవుతాడా? నిజానికి, హిందూ మతానికి అపచారం జరుగుతోందని అల్లరి చేస్తున్న వారే ఆ మతానికి అపకారం చేస్తున్నారు. చేతులకు రకరకాల తాళ్లు కట్టుకుని స్వాముల వెంట తిరిగినంత మాత్రాన హిందూ మత రక్షకులు కాజాలరు. దేవుడిపైనా కూడా నమ్మకం పోయే విధంగా భక్తిని వ్యాపారంగా మారుస్తున్న వారిని ముందుగా అరికట్టాలి. దేవుళ్లకు కనీస విశ్రాంతి కూడా లేకుండా జనాన్ని వారి వద్దకు పరుగులు పెట్టిస్తున్న వారిని అదుపు చేయాలి. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. మనం ఆచరించే ధర్మాన్ని బట్టి మన మతం ఉంటుంది. శాస్త్ర ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రచారాన్ని, ప్రవచనాలను తక్షణం అరికట్టాలి. పాపం చేసిన వాడు అనుభవించవలసిందేనని దేవుడితో చెప్పించిన ఈ దేశంలోనే, పాపం చేసినా పర్వాలేదు- దీపాలు వెలిగించండి లేదా దేవుళ్లను దర్శించుకోండి అని చెబుతున్న వాళ్లు పుట్టుకొచ్చినప్పుడు ధర్మానికి మనుగడ ఉంటుందా? ‘ధర్మం నశించిననాడు నేను వస్తాను’ అని గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. చూద్దాం.. అధర్మంగా సాగుతున్న ప్రస్తుత భక్తి వ్యాపారాన్ని అరికట్టడానికి ఏ దేవుడు వస్తాడో! అంతవరకైనా దేవుళ్లకు విశ్రాంతి ఇద్దాం! లేకపోతే, మన స్వార్థానికి భయపడి, మన కోర్కెలు తీర్చలేక దేవుళ్లు మనకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

హిందూ మతంలో ఉన్న అవలక్షణాలను ప్రక్షాళన చేయవలసింది పోయి, లోపాలను ఎత్తిచూపిన వారిపై దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ‘పీకే’ సినిమాను ప్రేక్షకులు ఎందుకు అంతలా ఆదరిస్తున్నారో ముందుగా గ్రహించాలి. ఆ సినిమాను, అందులోని హీరోను, చిత్ర దర్శకుడిని నిందించే బదులు ఆ చిత్రంలో ఎత్తి చూపిన లోపాలలో నిజం ఉందా? లేదా? అని హిందూ మత రక్షకులుగా చెప్పుకొంటున్న వాళ్లు ప్రశ్నించుకోవాలి. అంతేగానీ, ఎడాపెడా స్వాములను తయారు చేస్తూ దేశం మీదకు వదలడం వల్ల హిందూ మతం పరిఢవిల్లదు. ఆశ్రమాలు, పీఠాలు నెలకొల్పుకున్న వారు సమాజానికి ఏమి చేస్తున్నారు? సామాన్య ప్రజలను కనీసం అంటుకోకుండా వారికి దూరంగా విలాసవంతమైన సింహాసనాలపై కూర్చొని ప్రవచనాల పేరిట ఏవేవో చెబుతూ ప్రజలను స్వార్థంతో కూడిన భక్తిలో ముంచెత్తడం వల్ల హిందూ మతం పదిలంగా ఎలా ఉంటుందో సదరు హిందూ మత రక్షకులే చెప్పాలి.
Reactions:

Post a Comment

 1. ఈ విధంగా స్వాములు ప్రదర్శంచే అహంకార ధోరణి, అంటరానితనం వంటి విషయాలు ఏ హిందూ గ్రంధంలోను చెప్పలేదు.... హిందూ ధర్మానికి స్వార్దంతో తప్పుడు దోరణలు అంటకట్టిన కొన్ని వర్గాలు చేసిన ఫలితమే ఇది.... హిందూ సంస్థలు ముందుగా చేయవలసిన పని-దొంగ బాబాలను, మూఢాచారాలను, కుల ప్రభావాన్ని నిర్ముాలించటమే... కాలానికి తగ్గట్టు కొన్ని విషయాలలో మార్పులు చేసుకోకతప్పదు....

  ReplyDelete
  Replies
  1. నిజంగా పాజిటివ్ గా తీసుకోగలిగితే మీరన్న సూచనలు నిజమైన హిందువులు ఆలోచించాల్సిన విషయాలు. కామెంటుకు ధన్యవాదములు వెంకట్ గారు.

   Delete

 2. పుండు ఉంటె డాక్టర్ దగ్గిరికి వెళ్లి కట్టు కట్టించు కోవాలిస్మీ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అందుకా ఈ స్వాములు మనుషులను అంటారానివారిని చేసేది. ఎంత తీయగా చెప్పారు జిలేబి గారు. రోగిమీది ప్రేమతో వీరు వారిని డాక్టర్లవద్దకు పంపెందుకే ఇలా చేస్తున్నారన్నమాట :))

   Delete
  2. see for some logic
   http://harikaalam.blogspot.in/2015/01/blog-post_4.html

   Delete
 3. మతాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించి..సొంతంగా ఒక విమానాన్నే కొనుక్కున్న బ్రదర్ గురించి రాయలేమి?

  కట్టుకోడానికి సరైన గుడ్డ కూడా లేని వాడు ఫాదర్ గా ఎదిగి ఆస్థులు కూడబెట్టు కున్న వారు లేరా..

  కులానికో చర్చి ...కుల వివక్షతలు మీకు కనబడ లేదా...
  కింది కులపు క్రిష్టియన్ని పై కులపు క్రిష్టియన్ తో పెళ్ళి సంబంధం కలుకోడానికి ఇష్ట పడరు భయ్యా..

  భయపెడుతూ ...మభ్యపెడుతూ ఇతరులను తమ మతం లోకి లాక్కునేది ఎవరు??
  కాని వీళ్ళ కోసం ఎవరూ ఏమీ రాయరు...సినిమాలు తియ్యరు..తీసి చూడండి ఏం జరుగుతుందో....

  ReplyDelete
  Replies
  1. మతాన్ని , దేవుడిపై మనుషులకున్న విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని వెధవ్వేషాలు వేసే ఎవడి బాగోతాన్నైనా బయటపెట్టాల్సిందే. వీళ్ల తప్పులు కడిగేటప్పుడు ఇంకొకరి తప్పులు సాకుగా చూపాల్సిన అవసరం లేదు. దేవుడు వేరు , దేవుడి పేరుతో స్వామీజీల అహంకారాలు వేరు.

   Delete
 4. పుండు కడగటానికి నర్స్ చాలు, చర్చ్ ఫాథర్ దాక ఎందుకు? పేదలకి చర్చ్ ఫాథర్ లు, స్వాములోర్లు కాదు సేవ చేయాల్సింది. ఆసుపత్రిలో డాక్టర్ లు,నర్సులును. ఐలయ్య మేధావి అయితే, ఈవ్యాస రచయిత ఎవరో మహా మేధావి.

  ReplyDelete
  Replies
  1. పుండు కడగగలిగిన ఫాదర్లు ఉన్నప్పుడు స్వామీజీలు సాటి మనిషిని అంటరానివాడిగా చూడకూడదు కదా? పుండు నయం కావడానికి హాస్పిటల్ కు వెళ్లడమే బెటర్. నర్స్ ను, సాటి మానవుడికి సేవ చేసే ఫాదర్ ను అభినందించాలసిందే. మానవసేవే మాధవ సేవ అని బోధించిన హిందూ మత ధర్మాన్ని పాటించకుండా దొంగ నాటకాలేస్తున్న ఈ అహంకార స్వాముల భాగోతం పై మీ అభిప్రాయం ఏమిటి శ్రీరాం గారు?

   Delete
  2. అహంకార స్వాములదగ్గరికి వేళ్లి వారికి మరింత అహంకారం పెంచటమెందుకు? వాళ్లని పట్టించుకోకుండా వదిలేస్తే సరి. భక్త జనం లేక వెలవెల పోతారు. వ్యాపారం మూతపడుతుంది. ఇక మథర్ థెర్రెస్సా వంటి మహానుభావురాలే, పేదలకుసేవ చేయాలంటే వారుక్రైస్తవం మతంలోకి మారినతరువాతే అని కండిషన్ లు ఉన్నాయి. ఫాథర్ గారు ఎంత? వారు ఇంతమందికి పుడ్లు కడిగాను అని పోటొలు తీసుకొని విదేశాల లో ఉండే వారి పెద్దలకి చూపించి సొమ్ములు చేసుకొన్నా ఆశ్చర్యపోవలసిన అవసరంలేదు. ఆ పుండ్లు కడగటం వెనుక వ్యాపారం ఉంది.

   Delete
  3. మదర్ తెరిస్సా సేవలకు కండీషన్ ఉన్న సంగతి నాకు తెలీదు. ఏ కండీషన్ లేనిదే సేవ అవుతుంది. కండీషన్లతో చేసేది స్వార్ధమే అవుతుంది. చర్చి ఫాస్టర్ల వ్యాపారాలనీ అరికట్టాలి. ప్రతి గ్రామానికి ఈ మధ్య లెక్కకు మించిన చర్చిలు వెలుస్తున్నాయి. ఎవడి గ్రూపు వాడిదే ఇందులోనూ. భక్తి వ్యాపారంగా మారుతోంది. ఇది అరికట్టాల్సిన అంశమే.

   Delete
  4. ఏ హిందూ దేవాలయం లోనైనా ఒక కమిటీ వుంటుంది..ఆ కమిటీ వారు దేవాలయం జరిగే అన్ని కార్యక్రమాల్లోను భక్తులకు ఇబ్బంది లేకుండా చూడడం తో బాటు ఆ దేవాలయ ఆదాయ వ్యయాలను, జమా ఖర్చులను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తారు..అన్నదానం పథకం ద్వారా ఈ రోజున దాదాపు అన్ని దేవాలయాల్లోను నిత్యాన్నదాన సేవ నడుస్తోంది... ఇక స్వామి మాలలు, అమ్మవారి మాలలు వేసుకున్న వారు ఎంతో నియమ నిష్టలతో వుండి అన్నదానం మరియు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తారు..ఇక్కడ కులాల అంతరాలు వుండవు..భక్తి ప్రధానం..ఎవరో ఒకరిద్దరు స్వాములు చేసే పనులను అడ్డం పెట్టుకుని ఏక మొత్తం హిందూ దేవుళ్ళ్ను, విశ్వాసాలను అవహేళన చెయ్యడం సరికాదు..ఈ రోజున..ప్రపంచంలో మారణ హోమాలు సృష్టిస్తూ..అనేక దేశాలు ఆధిపత్యం పోరులో...ఎంతో మందిని బలితీసుకుంటున్నారు..ప్రధానంగా ఆ రెండు మతాల వారి వలననే ఎంతో విధ్వంసం జరుగుతోంది..ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది..ఇవేమీ ఆ సినిమాలు తీసిన పెద్దమడిసికి కనబడవు..సుధీర్గ వుపన్యాసారు రాసే వారికి వినబడవు..
   పరమత హింసలను ప్రోత్సహిస్తున్న వారిపై ఒక ఆర్టికల్ రాయండి.. జనం పేదరికాన్ని అడ్డం పెట్టుకునో భక్తిని వ్యాపారన్ని చేసిన వారి గురించి రాయండి..   Delete
  5. ఓలేటి గారు మీరు చెప్పిన అంశాలపై ఈ వ్యాసమ్లో విమర్శలు లేవు. హిందూ మతమ్లో మంచి గురించి మీరు చెప్పిన అంశాలు వేరు ఈ వ్యాసమ్లో చెప్పినవి వేరు. విమర్శను విమర్శగా చూడాలి. విమర్శలో లోపాలను కప్పిపుచ్చడానికి ఈ వాదనలు పనికివస్తాయి. విమర్శను పాజిటివ్ గా తీసుకుని దొంగ స్వాములను, అహంకారం ప్ర్దదర్శిస్తున్న వారిని , అంటరాని తనాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటే హిందూమతానికి మేలు జరుగుతుంది తప్ప మిగతా మతాల లోపాలను చూపి వారికంటే మేము నయం అనే ధోరణి విమర్శకు సరిపడే సమాధానం కాదని నా అభిప్రాయం. దళితులను దేవాలయాలలోకి రానివ్వకపోవడానికి కారణాలేమిటి? మీరు చెప్పిన ఆలయకమిటీలు ఈ అన్యాయాన్ని రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? మాలలు ధరించడం - దీక్షలలో కొంతమేరకు ఈ లోపం లేకుండడం జరుగుతున్న మాట వాస్తవం.

   Delete
  6. ఏ స్వామీజీ దగ్గరకైనా బలవంతంగా ఎవరూ వెళ్ళరు...ఇష్టం వుండి, నమ్మకం కల్గి వెడతారు..ఇప్పుడు హిందూ దేవాలయాల్లోకి అన్ని కులాల వారు యదేచ్చగా వెళ్తున్నారు..కాని మతం పేరుతో వ్యాపారం చేస్తూన్న వారి గురించి..ఒక్కొక్క ప్రార్ధనకి ఒక్కొక్క రేటుని పెట్టుకుని డబ్బు సంపాదించే వారి గురించి, మతం పేరుతో యుద్దాలు చేస్తూ మారణ హోమం చేస్తున్న వారి కంటే మీ వ్యాసం లో పేర్కొన్నవారు ప్రమాద వ్యక్తులు కాదు...వీటిపై స్పందించి ఇలాగే పుంఖాను పుంఖాలుగా వ్యాసం ఎందుకు రాయరు అని చిన్న సందేహం..అంతే..   Delete
  7. ఇది నా వ్యాసం కాదండీ. ఆంధ్రజ్యోతిలో కొత్తపలుకులో వచ్చినది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top