విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషికి సుఖంతో పాటు కష్టం కూడా వెంటవస్తున్నది. శారీరక శ్రమ తగు మోతాదులో లేకుంటే ఆరోగ్యపరంగా మనిషి కొన్ని చిక్కులు ఎదుర్కుంటూ కొత్త కొత్త జబ్బులు కొనితెచ్చుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఆహారం విషయంలో కూడా మనిషి విజ్ఞాశాస్త్రం తీసుకొచ్చిన మార్పులతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు. గతంలో సహజ సిద్ధంగా ఆహారాన్ని వండుకునేదాని స్థానంలో ప్రతీదానికి యంత్రాలను వాడం వల్ల లాభం కంటే ఎక్కువ అనర్ధాలే జరుగుతున్నాయి. విజ్ఞానం ద్వారా విపరీతమైన వస్తువినియోగం పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది. మనకు ఏది లాభమో, పర్యావరణానికి మనకీ ఏది మేలు చేస్తుందో, ఆ అలవాట్లను కొనసాగించడమే మంచిది. అలాంటివాటిలో ఇప్పుడు కనుమరుగవుతున్న పాతతరం వస్తువులను కొన్నింటిని చూద్దాము. కొన్ని చోట్ల ఇప్పటికీ వీటిని వాడుతూనే ఉన్నారు. కొన్ని ఉపయోగం లేనివి వాటికంటే అన్ని విధాలా మెరుగైనవి వచ్చినవి, అవసరం రీత్యా తప్పనిసరిగా మార్పు చెందాయి.

ఇప్పుడు  మీ ఇంట్లో ఈ వస్తువులున్నాయా?
ఇసుర్రాయి:-
ఇసుర్రాయి దీన్నే కొన్ని చోట్ల  తిరుగలి అని కూడా అంటారు. కందులూ  పెసలూ వంటి పప్పు గింజలను పప్పుగా విసరడానికి వాడే రాతి సాధనం . గుండ్రముగా రెండు మందపాటి రాతి పలకలు ఒక దాని మీద మరొకటి కూర్చుని ఉంటాయి. క్రిందది కదలదు. ఈ క్రింది రాతి పలకకు  మధ్య రంధ్రంలో ఒక చెక్క ముక్క బిగించి ఉంటుంది. పైన ఉండే పలక కూర్చోడానికి వీలుగా దానికి ఒక రంధ్రం ఉండి రెండు పలకలూ సరిగ్గా అమరేలా ఏర్పాటు ఉంటుంది. ఆ రంధ్రంలో పప్పు గింజలను పోసి పైపలకను తిప్పుతూ ఉంటే  పచ్చెలుగా (బద్దలుగా) పప్పు విడివడి రెండు పలకల నడుమ నుండి క్రిందకు జారుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించి పప్పు విసరడం  అదనపు వ్యాయామం. అందులోనూ ఇసుర్రాయిని తిప్పేటప్పుడు వచ్చే శబ్దం భలేగా ఉంటుంది .
రోలు:-

ఆ రోజుల్లో ఏదైనా పిండివంటకం చేయాలంటే రోలు, పొత్రం, రోకలిబండ ఉండాల్సిందే! ఇప్పుడంటే మిక్సీ,గ్రైండర్ లాంటివి ఉన్నయి. కానీ గ్రైండర్ ఉన్నా కూడా కొందరు ఇప్పటికీ రొటిలోనే రుబ్బుతారు. ఎందుకోగానీ రోటిలో రుబ్బి చేసిన పిండివంటకానికీ , గ్రైండర్లో రుబ్బిన పిండివంటకానికీ తేడా ఉంటుంది.  ఏది ఏమైనా  కానీ రోట్లో రుబ్బి చేసిన వంటకం ఏదైనా  సరే ఆ రుచే వేరు?   చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తుంటే యశోద  చిన్నికృష్ణుణ్ణి రోలుకు కడితే ఈడ్చుకు వెళ్ళి రెండు మహావృక్షాల నడుమ నుంచి లాగాడు. మరి ఇప్పుడు అల్లరి చేస్తే  ఏం చేస్తారు?. 
కవ్వం:-
అడవిలో పుట్టింది.అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. ఏమిటది? అనగానే వచ్చే సమాధానం కవ్వం. పెరుగు చిలికి మజ్జిగ చేసి వెన్న తియ్యడానికి వాడే ఈ కవ్వం  అమ్మమ్మ వాళ్ళ  కాలంలో చాల పెద్దది ఉండేది... దూలానికి కట్టి కింద ఒక పెద్ద కుండ పెట్టి అందులో మజ్జిగ చేసేవారు ఇప్పుడు ఈ బుల్లి బుల్లి కవ్వాల తోటి చెయ్యడమే చాల ఎక్కువ అనే పద్దతిలో పడిపోయాము.
కుండ:-
కుండ ఇప్పటికీ చాలా ఇళ్ళల్లో వాడుతున్నారు. కానీ ఫ్రిజ్ వాడకం మొదలైనప్పటినుండి వీటి వాడకం తగ్గిపోయింది. ఇప్పుడు కుండలకు కూడా టాప్ లను బిగించి వస్తున్నాయి.  వేసవి కాలం లో ఎండలు మండిపోతుంటాయి. కానీ మన ఇంట్లొ ఉన్న కుండలో నీరు మాత్రం చల్లగా ఉంటాయి. ఎందుకంటే కుండకు సాధారణంగా అత్యంత సన్నని రంధ్రాలు ఉంటాయి. కుండలో నీరు పోయగానే, ఈ ఖాళీ లలో నీరు మెల్లగా నిండుతుంది. ఇలా జరగటం వల్ల నీరు ఎంత ఎత్తైతే ఉంటాయో అంతవరకు కుండ తడిగా అవుతుంది. కుండలోని  నీటి ఒత్తిడి బయటకు ఉంటుంది. ఆ నీరు రంద్రాలలో నుంటి బయటకు వస్తుంది. అక్కన్నుంచి మరి ఎక్కడికెళ్ళగలదు? ఆ కుండ గోడలలో ఉన్న వేడిని వాడుకొని అది ఆవిరైపోతుంది. ఇలా కుండ యొక్క ఉష్నోగ్రత క్రమంగా తగ్గిపోతుంది, అలానే అందులోని  నీటి ఉష్నోగ్రత మరియూ ఆ నీటి ఎత్తు కూడా తగ్గుతుంది.        
మట్టి.. కుండ ఆకారంలోకి వచ్చాక అది దృఢంగా మారడానికి 900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కాల్చేవారు. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో అంత వేడి సృష్టించడం చాలా కష్టమయ్యేది. అందుకోసం ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో ఉండే ఇలాంటి కొలిమిని నిర్మించేవారు.
మోట బావి -  గిలక బావి
పై ఫోటోలలో కనిపిస్తున్నవి ఒకటి మోటబావి కాగా రెండోది గిలక బావి. వాస్తవానికి అలా పిలిచినా బావిలోని నీరు తోడే పద్ధతిని బట్టి ఆ పేర్లు వచ్చాయని చెప్పాలి. మోట బావి అంటే ఇప్పుడంటే బావిలోని నీటిని మోటార్లతో తోడుతున్నాము. లేదా చేతి పంపును వాడుతున్నాము. వ్యవసాయాలకు ఆయిల్ ఇంజన్లు లేదా కరెంటు మోటార్లు వాడుతున్నాము. పూర్వం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో మాత్రం మోట ద్వారా బావిలోని నీటిని తోడి రైతులు పంటలు పండించేవారు. గిలక ద్వారా బావిలోనికి మోటను వదులుతారు. దానిలో నీటిని నింపి దానిని ఎద్దులు లేదా దున్నపోతుల ద్వారా లాగించి నీటిని పైకి వచ్చాక కాలువలో ఒంపేవారు. ఇలా కేవలం ఎడ్లు లేదా దున్నపోతుల శ్రమను ఉపయోగించి మోట ద్వారా పంటలు పండించేవారు. ఎడ్లు వెనుకకు ముందుకు నడిచేవి మోట తోడడం కోసం. టెక్నాలజీ పెరిగాక విద్యుత్ మోటార్లు లేదా ఆయిల్ ఇంజన్ల ద్వారా నేడు పంటలను పండించడం, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కాలువల ద్వారా నీటిని ప్రవహింపజేసి పంట సాగుకు నీరందించడం చూస్తున్నాము. ఇలా టెక్నాలజీ పెరిగాక ఎడ్లకు-దున్నపోతులకు ఈ శ్రమనుండి విముక్తి కలిగింది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మోట పద్దతి ఉంది. రెండోది గిలక బావి. ఇప్పుడంటే అన్ని ఇళ్లలో బోరు బావుల నిర్మాణం ఉంటున్నది గానీ పూర్వం ఊరందరికీ లేదా ఊరిలోని కొన్ని ప్రాంతాలవారికి త్రాగు నీటికి ఒకటే పెద్ద బావి ఉండేది. ఆ బావులలఒ నీరు కూడా చాలా లోతులో ఉండేది. నీటిని ఈజీగా లాగడం కోసం బావిపై ఓ గిరకను ఉంచి దాని మీద తాడును వదలడం ద్వారా నీటిని తోడేవారు. ఇలా నీటిని తోడేఅ బాబులను గిరక బావులంటారు. ఇప్పటికీ పల్లెల్లో చాలా చఒట్ల, కొన్ని ఇళ్ల్లలో గిరక బావులున్నాయి. కానీ బోర్ల సంఖ్య పెరగడం ఇళ్ల స్థలాలు ఇరుకు కావడం వల్ల గిరక బావులు అంతరించిపోతున్నాయి.

రేడియో :-


రేడియో గురించి ఇప్పటికి తెలియని వారు లేకపోవచ్చు కానీ రానున్న తరాలవారికి రేడియో అనేది ఓ చరిత్రగా చెప్పాల్సి వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ చాలామంది రేడియో అభిమానులున్నారు. ఒకప్పుడు గ్రామాలలో రేడియో ఉండడం స్టేటస్ సింబల్. ఊరందరికీ కలిపి గ్రామఫోన్ రేడియో ఉండేది. అది గ్రామ పంచాయతీ వారు పెట్టేవారు. రేడియో కార్య్క్రమాలు ఆహ్లాదకరంగా ఉండేవి. ఇప్పటికీ రేడియో కార్యక్రమాలు పని చేస్తున్నా ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. బుల్లి తెర వచ్చాక రేడియో ప్రాభవం తగ్గింది. పైన బొమ్మలలో కనిపించేవి కొన్ని మోడల్స్ మాత్రమే. చిన్న రేడియోలు ఇంకా కొన్ని పెద్దవి ఉన్నాయి. టేప్ రికార్డులలో కలిపి ఉండేవీ ఉన్నాయి. ప్రస్తుతం మొబైల్‌లోనే రేడియో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఎడ్ల బండి
 ఎడ్లబండి గతంలో వ్యవసాయంలోనూ ప్రయాణాలకూ కీలకంగా ఉపయోగించిన ఎడ్లబండి నేడు అంతగా వాడడం లేదు. పెట్రోల్ - డీజిల్ ఖర్చు లేకుండా పర్యావరణానికి హాని లేకుండా నెమ్మదిగా సాగే ప్రయాణాలకు , వ్యవసాయంలో అనేక విధాలుగా సాయం చేసిన ఎడ్లబండిని ఇప్పుడు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. రానున్న రోజులలో ఇది బహుశా కనిపించకపోవచ్చు. దున్నపోతులను ఉపయోగించి కూడా బండిని తోలేవారు. వ్యవసాయానికే గాక బాడుగ బండ్లు కూడా ఉండేవి. కొందరు బాదుగలే జీవనాధారంగా బ్రతికేవారు. ఆటోలు ఇతర గూడ్స్ ట్రావెల్స్ వచ్చాక బాడుగ వృత్తి తగ్గింది. ఎద్దులు - దున్నపోతులే గాక కొన్ని చోట్ల గాదిదలు - గుర్రాలను కూడా బండ్లతోలకానికి ఉపయోగించేవారు. ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. నేటి స్పీడ్ యుగంలో ఈ వాహనాలకు ప్రాధాన్యత ఉండదు. అయితే కాలుష్య నివారణకు, తక్కువ ఖర్చుకూ, కొన్ని ఇరుకు ప్రాంతాలకూ నేటికీ ఈ బండ్లు అనువుగానే ఉన్నాయి.
ఆశ్రమం - ఆశ్రమ విద్య 
పూర్వకాలంలో ఆశ్రమ విద్య ఉండేది. విద్యాభ్యాసం గురువుల సమక్షంలో ఆశ్రమాలలో జరిగేది. విద్య అనేది ముఖ్యంగా నైతికప్రవర్తనను పెంచేదిగా ఉండేది. అంతే గాక గాంధీజీ లాంటి పెద్దలు ఆశ్రమాలలో నివాసం ఉండేవారు. మానసిక ప్రశాంతతను ఇచ్చే ఆశ్రమవాసం నేడు అంతగా కనిపించడంలేదు.
పూరిల్లు - పెంకుటిల్లు 
 

గ్రామాలలో పాతకాలంలో పూర్తిగా పూరిల్లు లేదా పెంకుటిల్లు ఉండేవి. పెంకుటిల్లు ఉంటేనే గొప్పగా ఫీల్ అయ్యేవారు. వాటిని భవంతులు అని కూడా అనేవారు. మన రాష్ట్రంలో అయితే ఎన్.టీ.ఆర్ అధికారంలోకి వచ్చాక పక్కా గృహనిర్మాణం తరువాత పూరిల్లు కనిపించడంలేదు. డాబాలు వచ్చాక పెంకుటిల్లు కూడా కనుమరుగవుతున్నాయి. సాదా పెంకు , బెంగుళూరు పెంకు అని రెండు రకాల పెంకులతో ఇళ్ల నిర్మాణం జైరిగేది. ఇప్పుడంతా స్లాబులు , పట్టణాలలో అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది. పెంకుటిళ్లకు కావలసిన సామాగ్రి అంతా దాదాపు గ్రామాలలోనే ఏర్పాటు చేసుకునేవారు. సున్నం, ఇటుక, మట్టి, బండలు, కలప వంటి అన్నింటినీ సమీప గ్రామాలలోనుండే సమకూర్చుకునేవారు. గ్రామం మొత్తానికి ఒక గానుగను ఏర్పాటు చేసుకుని త్రిప్పడం ద్వారా ఇంటికి కావలసిన సున్నంను ఎవరికి వారు తయారు చేసుకునేవారు. అప్పట్లో సున్నంతో కట్టిన నిర్మాణాలలో నాణ్యత ఎక్కువ ఉండేది. ఆ ఇళ్లలో వేసవి కాలంలో చల్లదనం కూడా ఎక్కువగా ఉంటుంది.

పాతకాలంలో వాడినవాటిలో పర్యావరణానికి, మన ఆరోగ్యానికీ మేలు చేసేవాటిని ఇప్పటికీ వాడుకోవడమే మంచిది. వాటికంటే కాలక్రమంలో మెరుగ్గా వచ్చినవి పర్యావరణానికి హాని కలిగించనవీ వాడుకుందాం. ఇలాంటి చాలారకం వస్తువులను మనం ఉదహరించవచ్చు. మారుతున్న జీవనశైలిలో శాస్త్రీయంగా ఆలోచించి పాతకొత్తల మేలు కలయికగా మనం ముందడుగు వేయాలి తప్ప పాతొక రోత కొత్తొక వింతగా వ్యవహరించడం మంచిది కాదు. ప్రకృతి సిద్ధంగా వీలయిననతవరకూ జీవించేందుకు ప్రయత్నిద్దాం. పర్యావరణాన్న్ని కాపాడుకోవడం ద్వారా మనకు మనం మేలు చేసుకుందాం. 
- Palla Aravind
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top