మా మతం దేశం! - మతపరమైన వివక్షకు తావే లేదు - మా గ్రంథం రాజ్యాంగం .. మా భక్తి భారత భక్తి - మా నినాదం ఇండియా ఫస్ట్‌..  మా ప్రార్థన వికాసం - పార్లమెంటులో మోదీ ఉద్వేగభరిత ప్రసంగం - నేడే కేంద్ర బడ్జెట్‌
‘మా ప్రభుత్వానికి దేశమే మతం! దేశం తర్వాతే ఇంకేదైనా!’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మతం పేరిట వివక్షకు తావే లేదన్నారు. ‘‘మత ప్రాతిపదికన వివక్ష చూపిస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. ఘర్‌ వాపసీ వివాదం, సొంత పార్టీ ఎంపీల వివాదాస్పద వ్యాఖ్యలు, ఢిల్లీలో చర్చిలపై దాడులు, దీనిపై విపక్షాల విమర్శల నేపథ్యంలో... మోదీ ఈ అంశంపై సూటిగా స్పందించారు. విపక్ష కాంగ్రెస్‌పై చెణుకులు విసురుతూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ 70 నిమిషాల పాటు చెలరేగిపోయారు. మోదీ నోట వస్తున్న మాట మాటకూ అధికారపక్షంవైపు ఉన్న సుమారు 300 మంది సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
 • అవిగవిగో ‘అచ్ఛే దిన్‌’
 • 8% పైగా వృద్ధి రేటు అంచనా
 • ఆర్థిక సర్వే ఆశావహ చిత్రం
ఔను... మంచి రోజులు వస్తాయట! 2015-16లో 8 శాతానికిపైగా వృద్ధి రేటు నమోదవుతుందట! అంతేకాదు... వృద్ధిరేటు రెండంకెలకు చేరడం అసాధ్యమేమీ కాదట! శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సారాంశం ఇది! వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.1 నుంచి 8.5 శాతం మధ్య నమోదవుతుందని తెలిపింది. 2014-15లో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందని పేర్కొంది. వ్యవసాయంలో 4 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోవచ్చునని పేర్కొంది. ఇక... రాయితీలకు అడ్డుకట్ట వేయాలని ఆర్థిక సర్వే నివేదిక సర్కారుకు సూచించింది. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు వీలుగా ఖర్చులకు కళ్లెం వేయాలని తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ... దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ మరోసారి భావోద్వేగ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. పలు అంశాలపై సూటిగా, స్పష్టంగా స్పందించారు. ప్రభుత్వ విధానాలను వెల్లడిస్తూ... వాటిని అమల్లోకి తీసుకురావడానికి వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై మోదీ స్పందించిన తీరు....
‘ఇండియా ఫస్ట్‌’ ఇదొక్కటే మా ప్రభుత్వ మతం. భారత రాజ్యాంగం ఒక్కటే మేం అనుసరించే మతగ్రంథం! మా భక్తి.. ‘భారత భక్తి’. మేం చేసే ప్రార్థన... ‘ఈ దేశంలోని 125 కోట్లమంది చల్లగా ఉండాలి’. మా కర్తవ్యం... ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం’ (సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌)! జాతీయ జెండాలోని మూడు రంగులు తప్ప మాకు మరేవీ కనిపించవు! ఉగ్రవాదం, పేదరికంపై పోరాడాలని త్రివర్ణ పతాకం మాకు బోధిస్తుంది. మత రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారు. హృదయాలను గాయపరిచారు. హిందువులు, ముస్లింలు పరస్పరం గొడవపడాలా? లేక అందరూ కలిసి పేదరికంపై పోరాడాలా? అని గతంలోనే నేను ప్రశ్నించాను. అన్ని మతాలు వికసించాలని, అభివృద్ధి చెందాలని మేం ఆకాంక్షిస్తున్నాం. భారత్‌లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈ దేశానికి చెందిన వేల సంవత్సరాల ఆలోచనలను పుణికిపుచ్చుకున్న రాజ్యాంగం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. మన దేశంలో ఎంతో భిన్నత్వం. ఆ భిన్నత్వంలోనే ఏకత్వం. ఇదే మన బలం. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా ఈ దేశానికి ముందుకు తీసుకెళతాం!
అవినీతి చీడతో దేశం దెబ్బతినిందనడంలో సందేహం లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో చర్చించడం వృథా! ‘ఎవరు స్వచ్ఛంగా ఉన్నారు? మీరు, మేము’ అంటూ చర్చలు, పరస్పర ఆరోపణలు అనవసరం. అవినీతిపై మనందరం కలిసి పోరాడదాం రండి. వ్యవస్థల్లో అవినీతిని పారదోలడం సాధ్యమే. ఇన్నాళ్లూ దేశంలో నల్లధనమే లేదు అని వాదించిన వారు... ఇప్పుడు అదే అంశంపై చర్చిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నల్లధనం గురించి మాట్లాడుతుంటే వారి ముఖాల్లో రంగులు మారుతున్నాయి. కానే, మేం ధైర్యంగా చెబుతున్నాం! సుప్రీంకోర్టు ఆదేశించిన మూడేళ్ల తర్వాత కూడా వాళ్లు సిట్‌ వేయలేదు. కానీ మేం... మా మొదటి కేబినెట్‌ మీటింగ్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. నల్లధనంపై చర్చ జరిగి తీరేలా మేమే చూశాం. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ విషయంలో ఆర్థిక మంత్రి జైట్లీ తీసుకున్న చర్యలు అభినందనీయం.
 • సహకార సమాఖ్యకు శ్రీకారం...
రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఏ పార్టీ అధికారంలో ఉంది, వారి జెండా రంగు ఏది అన్నది మేం చూడం. మాకు జాతీయ జెండాలోని రంగులు తప్ప మరేవీ కనిపించవు. అందుకే... సహకార సమాఖ్యకు శ్రీకారం చుట్టాం. ఈ దేశంలో మొట్టమొదటిసారి కేంద్రం 38 శాతం నిధులను ఉంచుకుని... రాష్ట్రాలకు 62 శాతం నిధులు కేటాయించాం. రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తే దేశం దానందటదే పురోగమిస్తుందని బలంగా నమ్ముతాం. ఈ దేశ ప్రస్థానం 1947లో మొదలైందనే అభిప్రాయంతో మేం అంగీకరించం. మనది వేల సంవత్సరాల చరిత్ర. ప్రభుత్వాలూ పోతున్నాయి, వస్తున్నాయి. ఏ దేశమైన తన సిద్ధాంత ప్రాతిపదికన నిర్మితమవుతుంది. భారత దేశ సిద్ధాంతం... ‘సర్వేజనా సుఖినోభవ’! మనకు వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలపై కలిసి పోరాడాలి.
 • బిల్లులో మార్పులకు సిద్ధం
విమర్శలను నేను సానుకూలంగానే తీసుకుంటాను. ఎక్కడైనా మరింత జరగాల్సి ఉంటే చేసేందుకు సిద్ధమే. ఈ విషయంలో నాకు ఎలాంటి ‘ఈగో’లు లేవు. మీరు (యూపీఏ) భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు మేం మద్దతిచ్చాం. 1896 నుంచి ఉన్న బిల్లులో లోపాలు... 120 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ గుర్తుకు రాలేదా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, హడావుడిగా బిల్లు తెస్తున్నారని తెలిసినా ఊరు కున్నాం. కానీ... మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులంతా ఒకే మాట చెప్పారు. ‘రైతులకు సాగునీటి వసతి కావాలి. మౌలిక సదుపాయాలు కావాలి. ఈ చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉంది. దీని గురించి ఆలోచించండి’ అని కోరారు. రక్షణ శాఖ కూడా ఆ చట్టంలో మార్పులు అవసరమని చెప్పింది. సమాఖ్య వ్యవస్థలో ముఖ్యమంత్రుల సూచనలు పట్టించుకోకుండా అహంకార ధోరణి ప్రదర్శించాలా? రైతుల గురించి పట్టించుకోవద్దా? ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే... సరిదిద్ద వద్దా? అందుకే, మేం సవరణ బిల్లు తీసుకొచ్చాం. ఇక్కడా ఏదైనా సరిదిద్దాల్సి ఉంటే చెప్పండి. సహకరించండి. ఇందులో భేషజాలు అక్కర్లేదు.
 • పేరు ఏదైతేనేం...
పాత పథకాలకే పేర్లు మార్చేసి అమలు చేస్తున్నామని అంటున్నారు. యూపీఏ ‘నిర్మల్‌ భారత్‌’ అంది. మేం ‘స్వచ్ఛ భారత్‌ అంటున్నాం. పేరు ఏదైనా కావొచ్చు, సమస్య పరిష్కారమే ముఖ్యం. స్వచ్ఛత అనేది మనసుకు సంబంధించింది.
 • అన్నదాతా సుఖీభవ...
బొట్టు బొట్టుకూ అదనపు దిగుబడి రావాలన్నది మా నినాదం. రైతులు తమ భూమి సారాన్ని పరీక్షించుకోవాలి. ఏ ఎరువు అవసరమో, అదే వాడాలి. దీనివల్ల రైతులకు చాలా డబ్బు ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా భూసార పరీక్షల ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం.
 • కాంగ్రెస్‌ ‘ఉపాధి’కి ఢోకా లేదు!
ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేస్తామని విపక్షాపలు వదంతులు సృష్టిస్తున్నాయి. అలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను. ఉపాధి పథకాన్ని ‘తగిన గౌరవ మర్యాదలతో’ కొనసాగిస్తూనే ఉంటాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా పేదలను ఇంకా మట్టి తవ్వుకోవడానికి పంపించిన మీ ఘనతను ఢంకా భజాయించి మరీ చెబుతాం. మీ అడుగులను చెదరనివ్వం. కాంగ్రెస్‌ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరిచిపోకూడదు కదా!
ఇంకా ఏమన్నారంటే...
 • అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంతా చేసేస్తామని మేం ఎప్పుడూ చెప్పలేదు.
 • మా ప్రభుత్వానికి ‘వారసత్వం’గా కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తాం.
 • మా ప్రభుత్వం పేదల సేవకే అంకితం.
చిన్న చిన్న విషయాలే సామాన్యులకు పెద్ద మేలు చేస్తాయి.‘సెల్ఫ్‌ అటెస్టేషన్‌’ ఇలాంటిదే.సమస్యలు చిన్న వేర్లలాగా మొదలవుతాయి. అలాగే వదిలేస్తే... వృక్షాల్లాగా పెరుగుతాయి.నేను చేసిన విదేశీ పర్యటనలపైనా విమర్శలు గుప్పించారు. పార్లమెంటులోకి రావాలంటే నాకు వీసా కావాలని కూడా వ్యాఖ్యానించారు. కానీ... అంతర్జాతీయ వేదికపై ప్రధానిగా చాలా చేయాల్సి ఉంటుందనే విషయాన్ని మరిచిపోయారా? నన్ను విమర్శించేందుకు ఇంకేమీ దొరకలేదా? నేను ఏ దేశంలో పర్యటించినా నా ఆలోచనలు మాత్రం పేదలు, రైతులు, గిరిజనుల చుట్టూనే తిరుగుతాయి. 2014 పంద్రాగస్టు రోజున జనధన పథకం ప్రకటించాం. గడువులోగానే పూర్తి చేశాం. బాలికల కోసం సుమారు 65 వేల మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తి కావస్తోంది.
(from andhrajyothy daily)

హిందూ - ముస్లిం లు కలసి పేదరికంపై పోరాడాలంటున్న మోడీ పిలుపుపై మీ కామెంట్?


Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top