డిసెంబర్ 8, 2013న  idontwantdowry.com వారు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్‌లోని భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన స్వయంవరం కార్యక్రమానికి నేను వెళ్ళాను. వారి ఆబ్జెక్టివ్ కట్నం లేకుండా చేసుకునే వివాహాలని ప్రోత్సహించడం. వారి సభ్యులు కులాంతర వివాహాలు చేసుకుంటారా లేదా స్వకుల వివాహాలు చేసుకుంటారా, మతాంతర వివాహాలు చేసుకుంటారా లేదా స్వమత వివాహాలు చేసుకుంటారా, విధవా వివాహాలు చేసుకుంటారా లేదా కన్యా వివాహాలు చేసుకుంటారా వంటి విషయాలతో ఆ వెబ్‌సైట్‌వారికి సంబంధం లేదు. కానీ కట్నం, కానుకలు లాంటివి తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలనే నియమానికి మాత్రం వెబ్‌సైట్‌ వారి సభ్యులందరూ కట్టుబడి ఉండాలి. బెలూచిస్తాన్ జాతీయ విముక్తి పోరాటం చేస్తున్నవాళ్ళలో కొందరు భూస్వామ్య వర్గానికి చెందినవాళ్ళైతే, కొందరు పెట్టుబడిదారీ వర్గానికి చెందినవాళ్ళు, వాళ్ళలో కొందరు మార్క్సిస్ట్‌లు కూడా ఉన్నారు. రాజకీయ విషయాలలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నా, బెలూచిస్తాన్‌ని పాకిస్తాన్ నుంచి వేరు చెయ్యాలనే ఒకే ఒక్క విషయంలో వాళ్ళు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. idontwantdowry.com  వారు వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా నడుపుతోన్న ఉద్యమానికి కూడా ఇలాగే ఇతర అభిప్రాయాలతో సంబంధం లేదు. వాళ్ళకి తెలిసిన విషయంలో మాత్రమే వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్‌ని ఏర్పరుచుకున్నారు కాబట్టి, ఇందులో వారి తప్పేమీ లేదనే చెప్పాలి. ఆ వెబ్‌సైట్‌వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగా మనం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయాలు మాత్రం ఉన్నాయి.

ఆ రోజు జరిగిన స్వయంవరం కార్యక్రమానికి హాజరైనవాళ్ళలో కొంత మంది తమకి కుల పట్టింపులు లేవన్నారు, కొంత మంది తమకి ఉప శాఖ పట్టింపులు లేవన్నారు, కొంత మంది తమకి మత పట్టింపులు కూడా లేవన్నారు. అక్కడ ముగ్గురు మగవాళ్ళు మాత్రమే తమకి భర్త చనిపోయిన స్త్రీని లేదా విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి తమకి అభ్యంతరం లేదన్నారు. ఆ ముగ్గురిలో నేను ఒకణ్ణి. అక్కడ ఒక్క మగవాడు మాత్రమే వయసులో తన కంటే పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి తనకి అభ్యంతరం లేదన్నాడు. ఆ ఒక్కణ్ణి నేనే. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళలో విడాకులు తీసుకున్న స్త్రీలు ముగ్గురే. మన దేశంలో విడాకులు తీసుకున్న స్త్రీలు ఇప్పటికీ పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దీన్ని బట్టి అర్థమైపోతోంది. అక్కడికి వచ్చిన విడాకులు తీసుకున్న స్త్రీలలో ఇద్దరు మాత్రమే డైరెక్ట్‌గా స్టేజ్ మీద మాట్లాడారు, ఇంకొక స్త్రీ తన బంధువు చేత తన తరపున మాట్లాడించింది. అక్కడికి భర్త చనిపోయిన స్త్రీలు ఎవరూ రాలేదు. భర్త చనిపోయిన స్త్రీకి రెండో పెళ్ళి చేస్తే స్వర్గంలో ఉన్న ఆమె భర్త ఆత్మ క్షోభిస్తుందని నమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

మగవానికి భార్య చనిపోతే అతనికి వెంటనే రెండో పెళ్ళి చేస్తారు కానీ పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వమని అతనికి ఎవరూ చెప్పరు. మరి ఆడదానికి భర్త చనిపోతేనే పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వమని ఆమెకి పది మందీ ఎందుకు చెపుతారు? పెళ్ళి అనేది మగవానికే ఎక్కువ అవసరం అనీ, పిల్లల పెంపకం అనేది ఆడదానికే ఎక్కువ అవసరం అనీ మన సమాజం నమ్ముతోందా లేదా అలా నమ్ముతున్నట్టు నటిస్తోందా? మగవాడు తన రెండో భార్య కొడుకుకి ఆస్తిని కట్టబెట్టడానికి మొదటి భార్య కొడుకుని హత్య చేసిన వార్తలు ఉన్నాయి కానీ ఆడది తన రెండో భర్త కొడుకుకి ఆస్తిని కట్టబెట్టడానికి మొదటి భర్త కొడుకుని హత్య చేసిన వార్తలు లేవు. అయినా మగవాడు రెండో పెళ్ళి చేసుకుంటే పిల్లలు చెడిపోరనీ, ఆడది రెండో పెళ్ళి చేసుకుంటేనే పిల్లలు చెడిపోతారనీ నమ్మేవాళ్ళు ఉన్నారు.

ఆ స్వయంవరానికి విడాకులు తీసుకున్న స్త్రీలు ముగ్గురు మాత్రమే ఎందుకు వచ్చారనే సందేహం కూడా ఉదయిస్తోంది. కట్నం కావాలనుకునేవాడు ఎవడూ విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోడు. అతను కట్నం అడిగితే ఆమె అతనికి కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి అతను భర్త దగ్గరే పడి ఉండే సంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీనే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు, అతను విడాకులు తీసుకున్న స్త్రీల ముఖాలు చూడాలనుకోడు. కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళలోనే విడాకులు తీసుకున్న స్త్రీలని పెళ్ళి చేసుకునేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు. అయినా ఆ స్వయంవరానికి విడాకులు తీసుకున్న స్త్రీలు ముగ్గురే ఎందుకు వచ్చినట్టు? మన దేశంలో విడాకులు తీసుకున్న స్త్రీలు ఇప్పటికీ పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారా? విడాకులు తీసుకున్న స్త్రీలలో కూడా రెండో పెళ్ళి గురించి ఆలోచించేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉందా? ఈ సందేహాలు వదలడం లేదు. ఆత్మలని నమ్ముకునే స్థితిలో ఉన్నవాళ్ళు భర్త చనిపోయిన స్త్రీని స్వర్గంలో ఉన్న ఆమె భర్త ఆత్మ యొక్క ఆస్తిగా చూస్తారు. కానీ విడాకులు తీసుకున్న స్త్రీ విషయం వేరు. ఆమె తన భర్త నుండి విడిపోయిన తరువాత ఆమె ఎవరిని పెళ్ళి చేసుకున్నా అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు. ఆమె పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని శాసించే అధికారం ఎవరికీ లేదు. అయినా మన దేశంలో విడాకులు తీసుకున్న స్త్రీలు కూడా పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నట్టు?

జనంలో ఉన్న అభివృద్ధి నిరోధక నమ్మకాలని నిర్మూలించడానికి మన పాలక వర్గంవాళ్ళు ప్రయత్నించడం లేదు, పైగా ఆ అభివృద్ధి నిరోధక నమ్మకాలకి పాలక వర్గమే ప్రోత్సాహమిస్తోంది. మన పాలకులు విడాకులు తీసుకున్న స్త్రీలకి కూడా భర్త ఆస్తిలో వాటా వచ్చే చట్టం చెయ్యాలనుకుంటున్నారట! ఈ చట్టం చేస్తే తమని వదిలేసిన భర్త ఆస్తి కోసం రెండో పెళ్ళి చేసుకోకుండా కావాలని ఒంటరిగా ఉండిపోయేవాళ్ళు తయారవ్వగలరు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో స్త్రీలకి ఆస్తి హక్కులు లేవు. అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీలకి భర్త నుంచి ఆస్తి వచ్చేది కానీ పుట్టింటి నుంచి ఏ ఆస్తీ వచ్చేది కాదు. భర్త చనిపోయిన స్త్రీ యొక్క ఆస్తి ఎటూ పోకుండా ఉండేందుకు ఆమెకి రెండో పెళ్ళి చెయ్యకుండా గుండు గియ్యించి తెల్ల చీర కట్టేవారు. కొన్ని కుటుంబాలలో అయితే భర్త చనిపోయిన స్త్రీలని రవికెలు కూడా వేసుకోనిచ్చేవాళ్ళు కాదు. ఆ స్త్రీల బంధువులు వావివరసల పట్టింపులు కూడా లేకుండావాళ్ళని అనుభవించేవాళ్ళు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో మన దేశంలో మూఢనమ్మకాలు ఆ స్థాయిలో ఉండేవి. విడాకులు తీసుకున్న స్త్రీ రెండో పెళ్ళి చేసుకోకుండా ఆస్తి కోసం ఒంటరిగా ఉండిపోయినా ఆమె ఆస్తిని కాజెయ్యడానికి ఆమె బంధువులు ప్రయత్నించరని గ్యారంటీ లేదు. భార్యకి విడాకులు ఇచ్చేసిన మగవానికి భార్య ఆస్తితో సంబంధం లేనప్పుడు భర్తకి విడాకులు ఇచ్చిన స్త్రీకి కూడా భర్త ఆస్తితో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకున్న స్త్రీ రెండో పెళ్ళి చేసుకుంటే ఆమె రెండో భర్త ఆస్తి ఆమెదే అవుతుంది. ఆమెకి మొదటి భర్త ఆస్తిలో వాటా ఇస్తే అది అపాత్రదానం అవుతుంది. అపాత్రదానం ఎప్పుడైనా ఆమోదయోగ్యం కానిదే.

ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా చదువుకునే స్వేచ్ఛని ఇచ్చారు, మగవాళ్ళతో సమానంగా విమానాలు నడిపే స్వేచ్ఛని కూడా ఇచ్చారు. కానీ పెళ్ళి, పిల్లల పెంపకం లాంటి విషయాలలో మాత్రం సంప్రదాయాలని మగవాళ్ళకి అనుకూలంగానే ఇప్పటికీ ఉంచుతున్నారు. అందుకే హిందూ స్త్రీలు అమెరికాలో స్థిరపడినా భర్త చనిపోయిన తరువాత బొట్టు పెట్టుకుంటే ఏదో అయిపోతుందని భయపడిపోతున్నారు. కొంత మందికి మత విశ్వాసాలు అంతగా లేకపోయినా, స్త్రీ-పురుష సంబంధాల విషయంలో మాత్రం వెనుకబాటు నమ్మకాలే మిగిలి ఉంటాయి. వీళ్ళు కులం పోవాలంటారు, మతం నాశనమవ్వాలంటారు కానీ భర్త చనిపోయిన స్త్రీని లేదా విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ముందుకి వస్తామనే ధైర్యం చెయ్యరు. కొంత మంది భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ముందుకి వస్తారు కానీ వయసులో తన కంటే పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ధైర్యం చెయ్యరు. వీళ్ళు కొన్ని అడ్డుగోడలు దాటుతారు కానీ మిగితా అడ్డుగోడలు దాటడానికి ధైర్యం చెయ్యరు. స్త్రీలలో కూడా ఇలాగే ఆలోచించేవాళ్ళు ఉన్నారు. తమకి చదువుకునే హక్కు వచ్చింది, ఉద్యోగం చేసే హక్కు వచ్చింది కదా అని భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకునే హక్కు అడగరు. హక్కుని అవతలివాళ్ళు ఇవ్వకపోయినా తమంత తాముగా దాన్ని తీసుకోవాలి. అంతే కానీ కొన్ని హక్కులు పొందాము కనుక మిగితా హక్కులు అవసరం లేదని అనుకోకూడదు. అభివృద్ధిని సాధించాలంటే అన్ని అడ్డుగోడలనీ కూల్చాలి కానీ కొన్ని అడ్డుగోడలని మాత్రమే కూల్చి మిగతా అడ్డుగోడల మధ్య బతకకూడదు.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top