మాట మరిచావా మోదీ?


 • అన్నను అన్నావు.. అనాథను కానివ్వను అన్నావు
 • ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తానన్నావు
 • సీమాంధ్రను నెంబర్‌ వన్‌ చేస్తానన్నావు కానీ
 • అధికారంలోకి వచ్చాక తొండిచేయి
 • 2 బడ్జెట్లలో పైసా కూడా నిధుల్లేవు
 • మరో ‘కర్నూలు’ తప్పదా అన్న ఆందోళన!
 • నాటి మోదీ మాట..

తిరుపతిలో...
నా కళ్లముందు వెంకటేశ్వర స్వామిని చేరుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలంటే చెప్పండి. నేను మీతోనే ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం!’’

గుంటూరులో...
‘కాంగ్రెస్‌ మిమ్మల్ని అనాథలుగా మార్చిందనే ఆవేదన వద్దు. మీకు అన్నగా, అండగా నేనుంటాను. మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. అధికారంలోకి రాగానే అండగా ఉంటా!’

‘ఒక్కడంటే ఒక్కడు కూడా మా మొర ఆలకించలేదు’ అనే ఆక్రోశం! నిరసనలు, ఆందోళనలు ఎన్ని చేసినా కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం! రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన! కాంగ్రెస్‌పై అంతులేని కసి! ఈ అనిశ్చితి నుంచి బయటపడేసేదెవరు? మమ్మల్ని ఆదుకునేదెవరు? అనే ప్రశ్నలు! ఈ సమయంలో... మోదీ అనే నాయకుడు వారి కళ్లకు ‘మెసయ్య’ (రక్షకుడు)లాగా కనిపించారు. ఆయన మాటలు సూటిగా వారి హృదయాలను తాకాయి. ‘మీరు అనాథలు కాదు. అన్నలా నేనున్నాను’ అని మోదీ చెప్పగానే భావోద్వేగంతో కళ్లు తడుపుకొన్నారు. ‘ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తాం’ అని ప్రకటించగానే... ‘నిజమే కాబోలు’ అని అనుకున్నారు. మోదీ ప్రధాని అయ్యారు. ఒక బడ్జెట్‌ ముగిసింది. ‘ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదులే!’ అని సరిపెట్టుకున్నారు. నిన్నటికి నిన్న మరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ... నవ్యాంధ్రకు ఇచ్చింది ఏమీ లేదు. ‘విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం’ అంటూ మరో హామీ తప్ప! విభజన చట్టంలో ఏముంది? మోదీ ఏం చెప్పారు? నవ్యాంధ్రకు చేయాల్సింది ఏమిటి? ఇప్పటిదాకా ఏం చేశారు? ఇవీ ప్రశ్నలు! 

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)  అది.. 2014 మే ఒకటో తేదీ! మండే ఎండాకాలం.. ఆపై రోళ్లు పగిలే గుంటూరు.. రాష్ట్ర విభజన నిర్ణయంతో మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక గంభీర స్వరం అంతకంటే ఉద్రేకంగా ప్రసంగిస్తోంది. ‘‘ఆంధ్రులని అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచీ ఉన్నదే. అప్పట్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి (రాజీవ్‌ గాంధీ) మీ ముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్ట్‌లో అవమానించారు. ఇందిరా గాంధీ తెలుగువారైన నీలం సంజీవ రెడ్డిని పోటీకి నిలిపి వెన్నుపోటుతో ఓడించారు. ఇప్పుడేమో అమ్మా కొడుకుల పాలన మిమ్మల్ని అనాథలుగా వదిలేసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరు, తల్లీ కొడుకుల (సోనియా - రాహుల్‌) వ్యవహారం మీకు ఆవేదన కలిగించింది. మీరు అనాథలు కాదు. మీ అన్నను నేను, మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని ఏనాటికీ అనాథలను చేయను. మీ భవిష్యత్‌కి భరోసా ఇస్తున్నా. మీకు అండగా ఉంటాను. సీమాంధ్ర కోసం పార్లమెంటులో పోరాడి సాధించిన హామీలన్నీ అమలు చేస్తా’’ అంటూ ఆ గంభీర స్వరం మరింత గంభీరంగా ప్రజలకు కొండంత భరోసా ఇచ్చింది. ఆ స్వరం పేరు నరేంద్ర మోదీ. ఒక్కసారి ఎన్డీయే కూటమికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత భవిష్యత్‌ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం చిన్నబోయేలా సీమాంధ్ర రాజధానిని నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. మీ కలలని నెరవేరుస్తా. అధికారంలోకి వస్తే అండగా ఉంటా. ఢిల్లీ మీ వెంట ఉంటుంది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేనా.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల కలిగిన బాధను అర్థం చేసుకోగలనని, హైదరాబాద్‌ నుంచి రావడమంటే తల్లిని వదిలి బిడ్డ రావడమేనని కూడా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి తన మస్తిష్కంలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ, ఢిల్లీలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇవి ముఖ్యమంత్రిని, సర్కారును ఏర్పాటు చేసే ఎన్నికలు కావు. సీమాంధ్రను నిర్మించుకునే ఎన్నికలు. మీరు మంచి నిర్ణయం తీసుకోకుండా... సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారి చేతికి ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఎంపీ సీట్లన్నీ గెలిపించండి. సీమాంధ్ర నెంబర్‌ వన్‌ అవుతుందో, లేదో చూడండి!’’ అంటూ నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి ఆంఽధ్రావని స్పందించింది. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సరైన పునాది కూడా లేకపోయినా.. ఏకంగా రెండు ఎంపీ, నాలుగు అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. అయితే, ఎన్నికలకు ముందు ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ స్వరం ఇప్పుడు మూగవోయింది. ఏ జిల్లాలో అయితే ఆయన ‘మీరు అనాథలు కారు.. అన్నగా అండగా ఉంటా’ అన్నారో అదే జిల్లాలో ఏర్పాటవుతున్న నవ్యాంధ్ర రాజధానికి మాత్రం తొండి చేయి చూపించారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధానిని నిర్మిస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఇప్పుడు.. అందుకు కనీసం ఒక్కపైసా నిధులను కూటా బడ్జెట్లో కేటాయించలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటినీ అమలు చేస్తామని పదే పదే స్పష్టం చేసిన మోదీ ఇప్పుడు చంద్రబాబు పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రులను కాంగ్రెస్‌ అనాథలను చేసినట్లే.. బీజేపీ కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆశల్ని కృష్ణా నదిలో కలిపేసింది. దిక్కూ మొక్కూ లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అనాథగా మిగిలింది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు రాష్ట్రాల రాజధానులు దేశంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో, ఏపీ రాజధాని మాత్రం ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

చట్టంలో స్పష్టంగా ఉన్నా...
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి, శాఖాధికారుల కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు, ప్రభుత్వ అతిథి గృహాలు తదితరాలను నిర్మించడానికి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందజేస్తుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఆ మేరకు నవ్యాంధ్ర రాజధాని కోసం కేంద్రం నిధులు ఇచ్చి తీరాలి. రాజధాని నిర్మాణం అంటే నాలుగు భవన సముదాయాలు కట్టడం కాదు. భవిష్యత్‌ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితిని చూస్తుంటే కర్నూలు చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోందని సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రులకు రాజధాని లేదని, గుడారాల్లో ఉన్నారంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తదితరులు పదే పదే ఎద్దేవా చేశారని, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, సీమాంధ్రుల్లో ఇటువంటి మనోభావాలను గుర్తించే.. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. దాదాపు 40 వేల ఎకరాలను సేకరించడమే కాకుండా సింగపూర్‌ సహకారంతో ఆ దేశాన్నే తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని శపథం చేశారు. రైతులను బతిమలాడి, బామాలి, ఒప్పించి భూ సమీకరణను అయితే పూర్తి చేశారు. కానీ, కోట్ల రూపాయల నిధులు ఎక్కడినుంచి తెస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇప్పటికి రెండు బడ్జెట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ, రెండింటిలోనూ పైసా కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సీమాంధ్ర నేతల్లోనూ కేంద్ర సాయంపై ఆశలు అడుగంటుతున్నాయి. అదే సమయంలో, ఏపీ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. రుణ మాఫీని అమలు చేయడానికే తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ సదుపాయాలతో ప్రపంచ శ్రేణి రాజధానిని నిర్మించాలంటే అథమ పక్షం లక్షా పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ కూడా దానికంటే తక్కువే. నాలుగైదేళ్లలో రాజధానిని నిర్మించాలంటే ఏటా కనీసం పాతిక వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. వాటిని బడ్జెట్లో కేటాయిస్తే ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు కూడా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి కేంద్రమే దిక్కు. కానీ, తాజా బడ్జెట్‌తో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చబోదని స్పష్టం కావడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Reactions:

Post a Comment


 1. నిజంగా చంద్రబాబునాయుడు మోదీ మాటలు నమ్మాడా? మనల్ని మోసగించడానికి ఇద్దరూ నాటకం ఆడారు.

  ReplyDelete
 2. కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రులని మోసం చెయ్యడం ఏమిటి? తెలంగాణా బిల్‌కి వెనుక నుంచి సపోర్త్ ఇచ్చి దాన్ని ఆమోదింపచేసింది భాజపా. భాజపాతో పొత్తు లేకపోతే తెలుగు దేశం ఓడిపోతుందని సమైక్యవాద పత్రికలన్నీ భాజపాకి సపోర్త్ ఇచ్చినాయి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top