మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు. ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు. కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు. తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.

కార్మిక వర్గం పెరుగుదల

మొట్టమొదట కార్మికవర్గం ఇంగ్లండులో పుట్టింది. 1764లో నూలువడికే యంత్రం స్పిన్నింగ్‌ జెన్నీ వచ్చింది. జేమ్స్‌వాట్‌ ఆవిరియంత్రాన్ని కనుగొన్నాడు. యంత్రాల ఉపయోగించడం, భారీ పరిశ్రమల ద్వారా కార్మికవర్గం పెరిగింది. 1755లో ఇంగ్లండ్‌ 50 లక్షల పౌండ్ల పత్తిని దిగుమతి చేసుకుంటే 1844 వచ్చేటప్పటికి 60 కోట్ల పౌండ్ల పత్తిని దిగుమతి చేసుకొనే స్థాయికి ఎదిగింది. బ్రిటన్‌లోని నగరాలన్నీ నేతకార్మికులతో నిండిపోయాయి. రంగులద్దడం, చలువ చేయడం, అద్దకం పనులు, వీటితో రసాయనశాస్త్రం అభివృద్ధి చెందింది. ఆవిరి యంత్రానికి అవసరమైన బొగ్గుగనుల త్రవ్వకం కోసం, ఎగుమతి, దిగుమతి అవసరాలకు సముద్ర, రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి అయ్యాయి. యంత్రాలకు అవసరమైన ఇనుము, రాగి, తగరం, సీసం, గాజు పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి.

8 గంటల పనిదినం కోసం పోరాటం

పెట్టుబడిదారీ విధానపు తొలి దశలో పనిగంటలకు పరిమితులు లేవు. రోజుకు 14 నుంచి 20 గంటల వరకు పని చేయించే వారు. పనిగంటల తగ్గింపు కోసం తొలి నుండి కార్మికవర్గం పోరాడుతూ వచ్చింది.అనేక ఉద్యమాల ఫలితంగా 1837లో అమెరికాలో, 1848లో ఇంగ్లండ్‌లో రోజుకు 10 గంటల పనిదినం చట్టాలొచ్చాయి. ఆ తరువాత 1864లో మొదటి కార్మిక ఇంటర్‌నేషనల్‌ ఏర్పడింది. అందులో పని గంటల సమస్యపై పోరాడాలని తీర్మానించారు. 

అప్పట్లో అమెరికా పరిస్థితి - చికాగో ప్రత్యేకత

1492 అక్టోబరు 12 'క్రిస్టోఫర్‌ కొలంబస్‌' వెస్ట్‌ ఇండీస్‌ దీవులలో కాలుపెట్టింది మొదలు ఐరోపా ఖండంలోని వివిధ దేశాల నుండి వలసల వెల్లువ ప్రారంభమైంది. అక్కడ సాగించిన నరహంతక హింసోన్మాదం, రక్తపాతం ''రెడ్‌ ఇండియన్‌'' మూలవాసుల జాతి యావత్తునూ తుడిచిపెట్టేసే కార్యక్రమం. అది దాదాపు 250 సంవత్సరాలు సాగింది. కోట్లమంది యూరోపియన్లు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. దురాశాపరులైన లాభాపేక్షాపరులతో పాటు, బ్రతుకుదెరువు కోసం ఇక్కడకు చేరినవారూ ఉన్నారు. ఆఫ్రికా ఖండం నుండి సేచ్ఛా మానవులను బంధించి ''బానిసలుగా'' లక్షల సంఖ్యలో అమెరికా ఖండానికి తరలించారు.ఇంగ్లండ్‌కు వలసలుగా వున్న 13 అమెరికన్‌ రాష్ట్రాలు 1776లో స్వాతంత్య్రం ప్రకటించు కున్నాయి. తొలుత వ్యావసాయిక దేశంగా వున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. అనేక దేశాల కార్మికులు ఇక్కడ పనిచేసేవారు.

ప్రారంభంలో బ్రిటన్‌లో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానం 1870-1900 లకు మధ్య అమెరికాలో అభివృద్ధి చెందింది. అమెరికాలో 1870లో 16 లక్షల టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి బ్రిటన్‌ను మించిపోయి 180 లక్షల టన్నులకు చేరింది. బ్రిటన్‌లో అది 52% పెరిగితే అమెరికాలో 966% పెరిగింది. ఇతర రంగాల్లోనూ అదే పరిస్థితి.

అమెరికా ఉత్తరభాగాన ఉన్న 'చికాగో' నగరం పెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది.1830-48 మధ్యకాలంలో జర్మనీ, ఐరిష్‌ కార్మికులు పెద్దసంఖ్యలో వలసవచ్చారు. వారికి పోటీగా జెక్‌, పొలెండ్‌ కార్మికులను పోటీ కార్మికులుగా రప్పించారు.

పోరాటాల్లో ముందుండే చికాగో కార్మికులు

కార్మిక పోరాటాల్లో చికాగో కార్మికులు ముందుండే సంప్రదాయం వుంది. 1877 రవాణా సమ్మె సందర్భంగా 8 వేల మందితో జరుగుతున్న సమావేశంపై పోలీసులు దాడిచేశారు. ముగ్గురు కార్మికులు చనిపోయారు. అనేక పోరాటాల్లో పాల్గొంటూ రాటుదేలిన కార్మికవర్గం చికాగోలో ఉంది.

మేడే ఎలా వచ్చింది?

1884లో 'అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌' చికాగోలో సమావేశమై 1886 మే 1 నుంచి 8 గంటల పని అమలు జరిపించుకోవాలని, అందుకోసం అన్నీ కార్మికసంఘాలు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చింది. రెండు సంవత్సరాల కాలం పాటు యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయడం, కార్మికవర్గంలో విస్తృత ప్రచారం జరగాలని అమెరికన్‌ కార్మిక సంస్థ నిర్ణయించింది. ఈ పిలుపును అమెరికన్‌ కార్మికవర్గం ఉత్సాహంతో స్వీకరించింది. 1886 మే 1న అమెరికా అంతట 12 వేల పరిశ్రమల్లో 3,40,000 మంది కార్మికులు సమ్మెచేశారు. ఒక్క చికాగో నగరంలోనే 80 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. ఆ మే 1వ తేదీన చికాగో నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. అమెరికాలోని పెట్టుబడిదారీవర్గమంతా ఈ ఉద్య మాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. పత్రికల్లో సామాజిక యుద్దం, పెట్టుబడి పట్ల అసహ్యం అనే పేర్లతో సమ్మెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 

కార్మికులకు సంఘం విజ్ఞప్తి

కార్మిక వర్గం శ్రామికుల్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నించింది. ''పీడిత కార్మికులారా మేల్కొనండి. మే 1, 1886 నాడు పనిముట్లను కింద పడవేయండి. ఆ రోజు విశ్రాంతి కోసం కాదు. తిరుగుబాటు కోసం. ఆ రోజు 8 గంటల పని కోసం, 8 గంటల విశ్రాంతి కోసం, 8 గంటల మన ఇష్టమైన పనుల కోసం జీవి తాన్ని అనుభవించడం మొదలయ్యే రోజు'' అంటూ విజ్ఞప్తి చేసింది.

'మేడే' నుండి చికాగో ఘటనలు

ఆ మే 1న 20 వేల మందితో భారీ ప్రదర్శన జరిగింది.

2వ తేదీన కూడా అనేక చోట్ల ప్రదర్శనలు, సభలు జరిగాయి.

ఇక, ఆ మే 3న ఒకపక్క ''మెక్‌ కోర్మిక్‌ రీపడ్‌ వర్క్స్‌'' కార్మికుల సమావేశం జరుగుతోంది. అప్పటికే 1886 ఫిబ్రవరి 16 నుండి ఆ కంపెనీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కంపెనీలోని కార్మికులు, 6 వేల మంది మున్సిపల్‌ కార్మికులు ఆ పరిశ్రమకు దగ్గరలో సభ జరుపుతున్నారు. ఆ సభపై యాజమాన్యం ప్రోత్సాహంతో పోలీ సులు కాల్పులు జరపగా ఆరుగురు కార్మికుల మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఇది కార్మికుల్లో ఆగ్రహావేశాలను కలిగించింది. దాంతో, నిరసనగా 4వ తేదీన ''హే మార్కెట్‌ చౌక్‌'' వద్ద సభ జరపాలని నిర్ణయించారు.

ముందుగా ఏర్పాట్లేవి సక్రమంగా చేయలేదు. 20 వేల మంది వస్తారనుకుంటే 3వేల మంది మాత్రమే వచ్చారు. అంతకు ముందురోజు కాల్పులు జరిగివుండటంతో నగర మేయర్‌ కూడా ఆ ప్రాంతానికి వచ్చి సభ వద్ద వున్నాడు. ఉపన్యాసకుల ఆలస్యంతో సభ రాత్రి 8 గంటలకు ప్రారం భమైంది. రాత్రి 10 గంటల వరకు ఉపన్యాసాలు సాగాయి. వర్ష సూచనలతో త్వరగా ముగించి అందరూ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు సభపైకి దూసుకువచ్చారు. పోలీసుల మధ్య ఒక బాంబు పేలింది. ఒక పోలీసు చని పోయాడు. పోలీసులు కాల్పులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోయారు. వందల మందికి గాయాలయ్యాయి.

అక్రమ కేసు - నిర్బంధకాండ

హే మార్కెట్‌ ఘటన సాకుతో అమెరికా అంతటా కార్మిక వర్గంపై నిర్భంధం ప్రారంభమైంది. చికాగోలో సైన్యాన్ని దించారు. కార్మికవాడలన్నింటిపైనా దాడిచేశారు. వందల మందిని అరెస్టుచేశారు. 50 మందిపై కేసు పెట్టారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి 8 మందిని విచారించారు. 1886 ఆగస్టు 19న తుది తీర్పు వెలువడింది. ఏడుగురికి మరణశిక్ష, ఒకరికి యావజ్జీవ శిక్ష విధించారు. అయితే వీరెవరూ బాంబు వేసినట్లు ఋజువు చేయలేకపోయారు. కేవలం వారు కార్మిక వర్గానికి మద్దతుగా వున్నందుకు మాత్రమే శిక్షించబడ్డారు.

కోర్టులో స్పీస్‌ ప్రసంగం - జన నీరాజనం

శిక్ష పడిన కార్మికుల్లో ఒకరైన స్పీస్‌ కోర్టులో ధాటిగా తన మాట వినిపించారు. ''మమ్మల్ని ఉరి తీసి కార్మికోద్యమాన్ని, తీరని కోరికలతో, దీనంగా అట్టడుగున వున్న లక్షలాది కార్మికులు తమ విముక్తిని సాధించుకోవడానికి సాగించే పోరాటాన్ని ఆపగలం అనుకుంటే అలాగే ఉరితీయండి. ఇక్కడే మీరు నిప్పురవ్వను రగలిస్తున్నారు. అక్కడా, ఇక్కడా మీ ముందు, మీ వెనుక ఎక్కడ పడితే అక్కడ జ్వాలలు లేస్తాయి. అది భూమి అడుగున రేగే జ్వాల. దాన్ని మీరు ఆపలేరు''.

1887 సెప్టెంబర్‌ 14న సుప్రీంకోర్టు అప్పీలును తిరస్కరించింది. క్షమాభిక్ష కోసం గవర్నర్‌కు ప్రపంచమంతటి నుండి అప్పీళ్ళు వచ్చాయి. గవర్నర్‌ అంగీకరించలేదు. ఒకరిని బాంబు పేల్చడం ద్వారా జైలులోనే చంపేశారు. తమను రక్షించాల్సిందంటూ ఇద్దరు గవర్నర్‌కు విన్నవించగా మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. మిగిలిన నలుగురినీ 1887 నవంబర్‌ 11న ఉరితీశారు. నవంబర్‌ 8 న చికాగో నుండి నిందితులను ఉరితీసే ప్రాంతం వరకు కార్మికవర్గం ప్రత్యేకమైన రైలు నడిపింది. ఉరి తీసిన తరువాత ఊరేగింపు జరిగిన దారిలో లక్షా యాభైవేల నుండి 5 లక్షల మంది వరకు నిలబడి నివాళులర్పించారు.

న్యూయార్క్‌లో కుట్ర - పార్సన్‌ ప్రకటన ఇంతకూ హే మార్కెట్‌ సంఘటనలో బాంబు వేసిందెవరు? అది తేలకుండానే మమ్మల్ని ఎలా శిక్షిస్తారని పార్సన్స్‌ కోర్టులో గర్జించారు. అయినా పెట్టుబడిదారీ తాబేదార్లయిన న్యాయమూర్తులు ఉరిశిక్ష విధించారు. ఎనిమిది గంటల పని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడటమే వారి లక్ష్యం. అది నెరవేర్చడం కోసమే బూటకపు విచారణ చేశారు.

బాంబు విసిరే మనిషిని న్యూయార్క్‌ నుంచే పంపించారు. పోలీసు వ్యవస్థను, న్యాయవ్యవస్థను వారు కంట్రోలు చేయగలిగారు. ఇందులో ''మెక్‌ కార్మిక్‌'' పరిశ్రమ యాజమాన్యానిది ముఖ్యమైన పాత్ర. దేశమంతటా 8 గంటల పని ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడిదారీ పత్రికలన్నీ కార్మికవర్గంపై విషం చిమ్మారు. 8 గంటలకు పని కుదిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మొత్తం నష్టాల పాలవుతుందని ప్రచారం చేశారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు భారీగా నష్టపోతాయని స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌పై కూడా ప్రభావం చూపుతుందని వారి ప్రచార సారాంశం.

1886 ఏప్రిల్‌ 26న 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక ఇలా వ్రాసింది. ''ప్రస్తుతం ప్రముఖంగా వున్న సమస్య సమ్మె. అది అనేక విధాల అవాంఛనీయం. దీన్ని పరిష్కరించడానికి సులభమైన అడ్డదారి ఒకటి వుంది. సమ్మెలో పాల్గొన్న ప్రతివాడి మీద కుట్రకేసు మోపి ఖైదు చేయడం. మరో పద్ధతి నాయకులను ఎంచి శిక్షపడేటట్లు చేయడం''.

న్యూయార్క్‌ ట్రిబ్యూన్‌ ఇలా వ్రాసింది - ''కార్మికులను చట్టవ్యతిరేక పద్ధతుల్లో పాల్గొనేటట్లు చేయడం, రెచ్చగొట్టడం ఉత్తమమైన పద్దతి''.

వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం రూపొందించుకున్న పథకం ప్రకారం హే మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ బోనఫ్‌ఫీల్డ్‌ సహకారంతో వ్యూహాన్ని అమలుచేశారు. అమెరికన్‌ కార్మికవర్గానికి గుండెకాయ లాంటి చికాగో నగరంలోని కార్మిక నాయకులందరిపైన నేరం చేయడం, చేయకపోవడం అనే దానితో నిమిత్తం లేకుండా శిక్షకు గురిచేశారు. వారు అనుకున్న లక్ష్యాన్ని కొంతమేర సాధించారు.

బాంబు పేలుడుతో జైలులోనే అసువులు...

లూయీ లింగ్‌: జర్మనీలో పుట్టాడు. వడ్రంగి కార్మికుడు. స్విట్జర్‌ల్యాండ్‌లో సోషలిస్టుగా మారాడు. పని కోసం చికాగో వచ్చి వడ్రంగి పనివారల సంఘం నాయకునిగా 8 గంటల పని ఉద్యమంలో పాల్గొన్నాడు.

యావజ్జీవ శిక్షలు పడ్డవారు

అస్కార్‌ నీబే న్యూయార్క్‌లో 1812లో జన్మించారు. పనికోసం చికాగో వచ్చారు. నెక్‌ కార్మిక్‌ ఫ్యాక్టరీ ప్రాంతంలోని ఒక సెలూన్‌లో వెయిటర్‌గా చేరారు. ఆ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మెలు అనేకం చూశారు. కార్మిక సంఘాల్లో పనిచేశారు. హే మార్కెట్‌ సభ సమయంలో ఇంటి వద్దే ఉన్నాడు. 15 సంవత్సరాల కఠినశిక్ష పడింది. ఈ ఇద్దరికీ ఉరిశిక్ష పడింది. అప్పీలు మేరకు యావజ్జీవంగా మారింది.

సామ్యుయేల్‌ ఫీల్డ్‌న్‌: ఇంగ్లండ్‌లోని ''థాడ్‌మోర్‌టాన్‌'' నగరంలో 1847 ఫిబ్రవరి 25న జననం. తండ్రి నేతపని కార్మికుడు. 10 గంటల పని ఉద్యమంలో, ఛార్టిస్ట్‌ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎనిమిదేండ్ల వయస్సులోనే పత్తిమిల్లులో పనికి వెళ్ళాడు. 1868లో అమెరికా చేరి అనేక పనుల తరువాత చికాగోలో స్థిరపడ్డాడు. కూలి పనులకు వెళుతూనే గ్రంథాలయంలో కష్టపడి చదువుకున్నాడు. 1883 నుంచి కార్మిక సంఘాల సభలకు ప్రతినిధులుగా హాజరవుతూ ఉన్నారు. గుర్రపుబండి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుతున్నాడు. 1886 మే 1,2,3 తేదీల్లో అనేక సభల్లో ప్రసంగించారు. 4వ తేదీన పార్సన్స్‌తో కలసిహాజరయ్యారు.

మైకేల్‌ స్వాగ్‌: జర్మనీలో పుట్టాడు. బైండర్‌గా వృత్తి ప్రారంభించి కమ్యూనిస్టుగా మారాడు. జర్మన్‌ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు. పనికోసం చికాగో వెళ్ళి బైండింగ్‌ వృత్తిలో వుంటూ కార్మికుల పత్రికైన అర్బీటర్‌ జీటుంగ్‌ కు అనువాదకునిగా అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు.మే 4 ఘటనలో లేడు.అయినా శిక్ష పడింది.

అమెరికా నుండి అంతర్జాతీయతకు

ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.

ఉరికొయ్యకు వేలాడిన వీరుల కథ

1) అల్బర్ట్‌ ఆర్‌, పార్సన్స్‌ : అమెరికాలోని అలబామా రాష్ట్రం మౌంట్‌ గోమరీ సిటీలో 1848 జూన్‌ 24న జననం. పార్సన్‌ పూర్వికులు 1632లోనే అమెరికాకు వలస వచ్చారు. 1776లో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో వారి పూర్వీకులు ముఖ్యమైన పాత్ర వహించారు. వారి కుటుంబానికి జార్జీ వాషింగ్‌టన్‌తోనూ సంబంధాలు వున్నాయి. రెండేళ్ళ వయస్సులోనే తల్లిని, 5 ఏండ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన పార్సన్‌ పెదనాన్న సంరక్షణలో పెరిగాడు. సైనిక శిక్షణపొందారు. 7 సంవత్సరాల పాటు డైలీ న్యూస్‌ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేశారు. తనను పెంచిన ఈస్టర్‌ మామా అనే బానిస పెంపకం వల్ల బీదలపట్ల సానుభూతిగా వుండేవాడు. 1872లో చికాగోచేరి ఇంటర్‌ ఓషియన్‌ పత్రిక సబ్‌ఎడిటర్‌గా, టైమ్‌ విలేకరుగా పనిచేశారు. 1871లో చికాగోలో జరిగిన భారీ అగ్నిప్రమాదం సహాయ నిధుల దుర్వినియోగంపై కార్మికుల పక్షాన మాట్లాడారు. క్రమంగా సోషలిస్టులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1877 రవాణాసమ్మెకు మద్దతిచ్చినందుకుగాను పోలీసులు, పెట్టుబడిదార్ల నుంచి వేదింపులకు గురయ్యారు. 1878లో చికాగో కార్మికసంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. టైఫోగ్రాఫికల్‌ యూనియన్‌ కు ప్రతినిధిగా చాలా సంవత్సరాలు వున్నారు. 1879 లో 8 గంటల పనిదినం జాతీయ సదస్సులో పాల్గొన్నారు.ఒక సమయంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించబడ్డారు. వయస్సు చాలక పోటీచేయలేదు. సోషలిస్టుల ''అలారం''వారపత్రిక కు సంపాదకునిగా పనిచేశారు. చికాగో నుంచి కార్మికుల పక్షాన సెనెట్‌కు పోటీచేశాడు. 1886 మేడే ఘటనల సందర్భంలో ఇతర పట్టణాల్లో సభల్లో పాల్గొనడానికి వెళ్ళాడు.4వ తేదీన చికాగో వచ్చిన పార్సన్స్‌ ముందస్తు పిలుపు లేక పోయినా కార్మికుల ఒత్తిడిమేరకు హె మార్కెట్‌ సభలో ప్రసంగించారు. ఘటన తరువాత 50 రోజుల అజ్ఞాత జీవితం అనంతరం కోర్టులో లొంగిపోయాడు.

2) ఆగస్ట్‌ స్పీస్‌: జర్మన్‌లో పుట్టాడు. 17వ ఏట అమెరికాచేరి చికాగోలో స్థిరపడ్డాడు. సోషలిస్టు లేబర్‌ పార్టీలో చేరి మార్క్‌ ్స, ఎంగిల్స్‌ అనుచరులుగా వున్నారు. సొంత ఫర్నిచర్‌ దుకాణం నడుపుకుంటూ జర్మన్‌ భాషా పత్రిక అర్భీటర్‌ జిటుంగ్‌ పత్రిక యాజమాన్యం స్వీకరించి వార్తల ద్వారా చికాగో పట్టణంలోని పెట్టుబడిదార్లకు, దోపిడీదార్లకు హడల్‌ పుట్టించాడు. కార్మికసంఘాల నిర్మాణంలో పాల్గొన్నాడు. హే మార్కెట్‌ సభలో ప్రధాన ఉపన్యాసకుడు.

3) జార్జి ఎంజెల్‌ : జర్మనీలో పుట్టాడు. తల్లిదండ్రులను చిన్నవయస్సులో పోగొట్టుకున్నాడు. అనాధగా పెరిగాడు. చెప్పులు కుట్టే పనితో ప్రారంభించి అమెరికా చేరి అనేక ఫ్యాక్టరీల్లో పనిచేశాడు. కార్మిక సంఘాల్లో పనిచేస్తూ సోషలిస్టుగా మారాడు. హె మార్కెట్‌ ఘటనలోలేడు.

4) అడాల్ఫ్‌ ఫిషర్‌ : జర్మనీలో పుట్టి 15 ఏళ్ళ వయస్సులో అమెరికా చేరి కంపోజిటర్‌గా పనిలో చేరాడు. 1883 నుండి కార్మికుల పత్రిక అర్బిటర్‌ జీటింగ్‌ కంపోజిటర్‌గా చివరివరకు పనిచేశారు. టైపో గ్రాఫికల్‌ యూనియన్‌ సభ్యుడు ఉపాధ్యాయుడి ద్వారా సోషలిజం పట్ల పరిచయమై కార్మికసంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. హే మార్కెట్‌ ఘటన నిర్వహణలో పాలు పంచుకున్నాడు. 

కారుసాల శ్రీనివాసరావు  , (from : jeevana desk , prajasakti daily )
Note : Re-Published post
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top