బట్టీ పడితే మార్కులతో పాటు అలసట వస్తుంది తప్ప, జ్ఞానం రాదు.
స్కూల్ ఎంత పెద్దదైతే చదువు అంత బాగా చెపుతారని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. నిజానికి కొన్ని పెద్ద స్కూల్‌లలో కంటే దుంపల బడులు అనబడే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే మార్కులు ఎక్కువ వస్తున్నాయి. జీవితంలో సమస్యలను, ఆటుపోటులను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తి కూడా వీరికే అబ్బుతోంది. బట్టీ పడితే మార్కులు వస్తాయి తప్ప జ్ఞానం రాదు. జ్ఞానం రాని చదువులపై మోజు దేనికోసం అని నేడు ప్రతి తల్లిదండ్రులు, సామాజిక హితాన్ని కోరుకునేవారు ఆలోచించాలి. జీవితానికి ఉపయోగానికి మించి ఇంగ్లీషుపై మోజుతో విద్యార్ధుల మనసులపై అవసరానికి మించి ప్రయి'వేటు' పడుతోంది. నేటి విద్యావిధానం, తల్లిదండ్రుల ఆలోచనలు మారాల్సి ఉంది.  భ్రమలలో నుండి వాస్తవాలలోనికి రావాల్సి ఉంది.

మా చిన్నప్పుడు మా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో సి.ఎల్. నాయుడు అనే ఆయన ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ బస్ మా అమ్మమ్మ గారి గ్రామమైన వండువ వరకు వచ్చేది. వండువ గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లల్ని సి.ఎల్.నాయుడి స్కూల్‌లో వేశాడు. కానీ అతని పిల్లలకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులవి కంటే తక్కువ మార్కులు రావడంతో తన పిల్లలకి ఆ స్కూల్ మానిపించి, తాను పని చేసే ప్రభుత్వ పాఠశాలలోనే వేసాడు.కొంత కాలం తరువాత చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆ స్కూల్ మానిపించి, తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలకి పంపించడం మొదలుపెట్టారు. సి.ఎల్. నాయుడి స్కూల్ ఇప్పటికీ ఉంది కానీ దాని బస్సు చుట్టుపక్కల గ్రామాల్లో తిరగడం లేదు.

ప్రైవేత్ స్కూల్‌లలో మంచి నీళ్ళూ, మరుగుదొడ్లూ లాంటి సౌకర్యాలు ఉంటాయి కనుక డబ్బున్నవాళ్ళు తమ పిల్లల్ని అక్కడికి పంపిస్తారు కానీ పాఠాలు చెప్పే పద్దతిలో ప్రైవేత్ స్కూల్‌కీ, ప్రభుత్వ పాఠశాలకీ మధ్య పెద్ద తేడా ఉండదు. పట్టణానికి 13 కి.మి. దూరంలో ఉన్న గ్రామం నుంచి కూడా విద్యార్థుల్ని బస్సులో తెచ్చుకున్న పెద్ద స్కూల్‌లో కంటే పల్లెటూరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి మార్కులు ఎక్కువ వచ్చేవంటే దాని అర్థం ఏమిటి? అది పేరుకి పెద్ద స్కూల్ అయినా అందులో పదో తరగతివాళ్ళని తక్కువ జీతానికి ఉపాధ్యాయులుగా పెట్టి పాఠాలు చెప్పించి ఉంటారనే కదా!

ఈ మధ్య ఒరిస్సాలోని రాయగడ పట్టణంలో ఒకాయన CBSE స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ ఫీ ఏడాదికి 36,000 రూపాయలు. ఏడాది మొత్తం ఫీ ఒకేసారి కట్టాలి. ఏడాదికి 36,000 అంటే నెలకి 3,000. ఆ పట్టణంలో ప్రైవేత్ ఉద్యోగి జీతం నెలకి 3,500.ఒక స్కూల్ ఫీ, ఒక ప్రైవేత్ ఉద్యోగి జీతానికి దాదాపుగా సమానం! అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే తమ పిల్లల్ని ఆ స్కూల్‌కి పంపిస్తారు. కానీ ఏడాదికి 36,000 ఖర్చు పెట్టి తమ పిల్లల్ని చదివించినా వాళ్ళకి అక్షరాలు సరిగా వ్రాయడం రాదు. మా పెద్దమ్మ గారి మనవడికి ఇంగ్లిష్ అక్షరాలు వ్రాయడం సరిగ్గా రాకపోయినా వాడికి మార్కులు వస్తున్నాయి. అక్కడి ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పకుండా మార్కులు మాత్రం వేసేస్తుంటారు. మా పెద్దమ్మ గారేమో తన మనవడికి చదువు సరిగా రావడం ముఖ్యం కానీ మార్కులు కాదు అంటూ ఏడుస్తున్నారు.

మా పెద్దమ్మ గారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు ముగ్గురూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. కొడుకు & చిన్న కూతురు ఒడియా మాధ్యమంలో చదివారు, పెద్ద కూతురు తెలుగు మాధ్యమంలో చదివింది. కొడుకు బడిలో పంతుళ్ళు కొడుతున్నారని బడి మానేస్తానంటే అతన్ని కష్టపడి ఒప్పించి బి.ఎ.(ఒడియా) వరకు చదివించారు. అతను బి.ఎ.(ఒడియా) చదివినా అతనికి ఒడియా సామెతలు తెలియవు. చిన్న కూతురు కూడా బడిలో పంతుళ్ళు కొట్టడం వల్ల 8వ తరగతిలోనే చదువు మానేసింది. ఆమెని ఇంటిలోనే ప్రైవేత్‌గా బి.ఎ. వరకు చదివించారు. పెద్ద కూతురు తెలుగు మాధ్యమంలో చదివింది. ఒరిస్సాలోని తెలుగు మాధ్యమ విద్యార్థులకి పుస్తకాలు ఆలస్యంగా అందుతున్నాయని ఆమెని బొబ్బిలిలోని మా పిన్నిగారి ఇంటికి పంపించి చదివించారు.

ఆమె పిల్లల తరం పోయి మనవళ్ళ తరం వచ్చింది. వెనుకబడిన ప్రాంతమైన రాయగడ పట్టణంలో కూడా ప్రైవేత్ స్కూల్‌లు పుట్టుకొచ్చాయి. రాయగడ పట్టణంలో కమ్మవాళ్ళూ, వెలమదొరలూ, కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ దాని చుట్టుపక్కల పల్లెటూర్లలో మాత్రం ఎక్కువ మంది దళితులూ, ఆదివాసులు. ఆ వెనుకబడిన ప్రాంతంలో కూడా ఏడాదికి 36,000 వసూలు చేసే స్కూల్‌లు ఉన్నాయి. కానీ ఆ స్కూల్‌లలో చదివేవాళ్ళకి ప్రభుత్వ స్కూల్‌ల పిల్లలకి వచ్చినంత చదువు కూడా రాదు.

విశాఖపట్నంలో కూడా ప్రైవేత్ స్కూల్‌లో చదవడానికి ఏడాదికి 36,000 ఖర్చవుతుంది. హైదరాబాద్‌లో IT కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో IT ఉద్యోగాల కోసం ఇంగ్లిష్ చదువులకి ఎక్కువ ఖర్చుపెడతారు. ఇక్కడ కూడా చాలా మంది ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకి వలసపోతున్నారు. ఒరిస్సా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల కంటే వెనుకబడిన రాష్ట్రం. పశ్చిమ ఒరిస్సాలో 40% మంది ఆదివాసులే. దక్షిణ ఒరిస్సా పెక్కు భాగం కొండలతో నిండి ఉన్న ప్రాంతం. అంత వెనుకబడిన ప్రాంతంలో ఏడాదికి 36,000 ఖర్చుబెట్టి చదివితే ఏమొస్తుంది? కేవలం విజ్ఞానం కోసమైతే ప్రభుత్వ పాఠశాలలో చదివితే సరిపోతుంది. మార్కుల కోసమైతేనే ప్రైవేత్ స్కూల్ అవసరం. విశాఖపట్నంలోని ప్రైవేత్ స్కూల్‌లలో study hours పేరుతో స్కూల్ అయిపోయిన తరువాత కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు. అక్కడ ప్రత్యేకంగా మంచిగా చెప్పడం ఏమీ ఉండదు కానీ ఎక్కువ సేపు చదవడం వల్ల మార్కులు ఎక్కువ వస్తాయి.

కేవలం మార్కుల కోసం చదివేదాన్ని విజ్ఞానం అని భ్రమపడక్కరలేదు. నెలకి పాతికవేలు జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం లేదా యాభై వేలు జీతం వచ్చే IT ఉద్యోగం కోసం విజ్ఞానం ముసుగు వేసి ఈ నాటకాలు ఆడుతున్నారు. పిల్లల్ని చదువు పేరుతో కొట్టని తల్లితండ్రులు కూడా ఉన్నారు. పిల్లల్ని కొట్టి చదివిస్తే పరిగెడుతూ పాలు తాగినట్టు ఉంటుంది కనుక కొంత మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టరు. కేవలం విజ్ఞానం కోసమైతే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపితే సరిపోతుంది, దానికి ప్రైవేత్ స్కూల్ అవసరం లేదు అని నా వాదన. నక్కపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తమ పిల్లల చదువుల కోసం విశాఖపట్నంలో తమ కుటుంబాన్ని ఉంచి, వారానికి ఒకసారి విశాఖపట్నం వెళ్ళివచ్చినవాళ్ళని చూసాను. విశాఖపట్నంలోని కార్పరేత్ స్కూల్‌లు అన్నిటిలోనూ study hours వల్లే పిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయి తప్ప అక్కడ పిల్లలకి ప్రత్యేకంగా మంచిగా చెప్పేది ఏమీ ఉండదు.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కొంత మంది ఉపాధ్యాయులు పిల్లల్ని కొట్టి చదివిస్తారు. వాళ్ళు child psychology తెలియక అలా చేస్తారు. ప్రైవేత్ స్కూల్‌లలో అయితే మార్కుల కోసం యజమానులు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం వల్ల అక్కడి ఉపాధ్యాయులు పిల్లల్ని కొట్టి చదివిస్తారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లల తల్లితండ్రులలో కూడా కొంత మంది తమ పిల్లలకి మార్కులు రావడం లేదని ఉపాధ్యాయులతో గొడవపడడం జరుగుతుంది. ప్రైవేత్ పాఠశాలలలో ఉపాధ్యాయులకి యజమానుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. కనుక ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేత్ పాఠశాలల్లో పిల్లలు corporal punishmentsకి గురయ్యే అవకాశం ఎక్కువ.

నేను మీ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలే మంచిదని చెపుతాను. విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రైవేత్ పాఠశాలలో పిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయి కానీ దాని వల్ల మానసిక వికాసం మాత్రం పెరగదు. రాయగడ లాంటి ప్రాంతాల్లో ప్రైవేత్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మార్కులు ఎక్కువ వచ్చినా, ఇంగ్లిష్ మాధ్యమంలో చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం సులభంగా వస్తుందనే ఆశతో తమ పిల్లల్ని ప్రైవేత్ పాఠశాలలకి పంపిస్తారు. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడానికి ఇంగ్లిష్ ప్రఫిషన్సీ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకి ఎక్కువగా పల్లెటూరివాళ్ళు వస్తారు, వాళ్ళెవరికీ ఇంగ్లిష్ రాదు. తెలుగు మాధ్యమ స్కూల్‌లో చదివి పెద్దైన తరువాత ఇంగ్లిష్ నేర్చుకున్నవాడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చెయ్యగలడు. బ్యాంక్‌లూ, రైల్వేలలో ఉద్యోగాలు చేసేవాళ్ళకి హిందీ కూడా అవసరమే కానీ ఇంగ్లిష్ మాత్రం మన దేశంలో అంత ముఖ్యం కాదు. అరబ్ దేశాల్లో కొంత మంది ఒక ఫారిన్ లాంగ్విజ్‌గా ఇంగ్లిష్ నేర్చుకుంటారు కానీ అక్కడ ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు ఉండవు. బోడిగుండుకి మోకాలితో సంబంధం పెట్టినట్టు, విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌కి ఉద్యోగంతో సంబంధం పెట్టేది ఒక మన దేశంలోనే అనుకుంటాను.
- ప్రవీణ్ కుమార్
Reactions:

Post a Comment

 1. ఒకప్పుడు నేను ప్రైవేత్ విద్యనే సమర్థించాను. ప్రైవేత్ స్కూల్‌లలో ఇంగ్లిష్ మాధ్యమం ఉండడం వల్ల అలా చేసాను. ఇంగ్లిష్ మాధ్యమంలో చదివినవాళ్ళకి మన దేశంలో అయితే ఉద్యోగాలు వస్తాయి తప్ప అరబ్ దేశాలలో ఇంగ్లిష్‌పై అంత మోజు లేదని తెలిసిన తరువాత, ఇంగ్లిష్ అంత ముఖ్యం కాదని నాకు అర్థమైంది. రైలులో పరిచయమైన పక్క రాష్ట్రం ప్రయాణికునితో హిందీలో మాట్లాడుతాం తప్ప ఇంగ్లిష్‌లో మాట్లాడం. ఇంగ్లిష్ మనకి lingua franca కూడా కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లిష్ చదువుకీ, ఉద్యోగాలకీ సంబంధం కొనసాగించడం అవసరమా?

  ReplyDelete
  Replies
  1. ప్రభుత్వ పాఠశాలలలో వసతులు పెరగాలి. ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా ఉండేలా చూడాలి. సిలబస్ లో జీవితానికి పనికి వచ్చే అంశాలు చేర్చాలి. విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదని సమాజంలో చైతన్యం పెరగాలి. ఈ దిశగా బడ్జెట్ లో విద్యకు నిధులు పెంచి ప్రయివేటీకరణను క్రమంగా రద్దు చేయాలి.

   Delete
  2. 1980కి ముందు చాలా చోట్ల ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు లేవు. మా శ్రీకాకుళంలోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌ని 1965లో పెట్టారు. ఆ పట్టణంలోని మిగితా ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు 1980 తరువాత పెట్టినవి. పాలకొండలో సి.ఎల్.నాయుడు 1990 తరువాత స్కూల్ పెట్టాడు. అంతకు ముందు ఆ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకి పంపించేవాళ్ళు. సి.ఎల్.నాయుడు అనబడే చొంగ లక్ష్మున్నాయుడు ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతను ప్రభుత్వ ఉద్యోగం మానేసి స్కూల్ పెట్టాడు. ప్రైవేత్ స్కూల్‌లు పెట్టినవాళ్ళలో చాలా మంది గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసినవాళ్ళే. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పరనేది నిజమైతే ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసిన వాళ్ళు పెట్టే స్కూల్‌లకే జనం పిల్లల్ని ఎలా పంపుతున్నారు?

   Delete
  3. నాలెడ్జ్ బాగా ఉన్నవారు, విద్యార్ధుల పట్ల సమాజం పట్ల సేవా ధృక్పథం ఉన్నవారు ఏ పాఠశాలలో ఉన్నా మంచిగానే బోధిస్తారు. అయితే ప్రయివేటు యాజమాన్యాలకు మార్కుల టార్గెట్ ఉండడం వల్ల వారు తమ ఉపాధ్యాయుల చేత పిల్లలను బలవంతంగా స్టడీ అవర్స్ పెట్టీ చదివింపజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలలో అలాంటి నిబంధనలుండవు, నియంత్రణా ఉండదు కనుక కొందరు టీచర్లే మంచిగా బోధిస్తారు. కొన్ని సబ్జెక్టులలోనే పిల్లలకు మంచి నాలెడ్జ్ వస్తుంది. హెడ్మాష్తర్ మంచివాడయితే అన్ని సబ్జెక్టులలో మంచి ఫలితారు వస్తాయి. గ్రామంలో స్కూలు గురించి పట్టించుకునే పెద్దలున్నా మంచి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తాయి. అయితే కొన్ని చోట్ల అన్ని సబ్జెక్టులకు సరిపడా టీచర్లు ఉండనందున కూడా ఆ సబ్జెక్టులను ఇతరు నైపుణ్యం లేని టీచర్లే చెప్పాల్సి రావడం వల్ల కూడా ప్రభుత్వ పాఠశాలలలో నష్టం జరుగుతున్నది.. అసలు ప్రయివేటుకు అవకాశం ఇవ్వడం అంటూ జరిగితేనే లాభం అనే ధృక్పథం పెరిగి విద్య సరుకుగా మారి, విలువలు పతనం అవుతాయి. కనుక వ్యవస్థలో మార్పు రాకుండా ప్రయి'వేటు'ను నియంత్రించడం సాధ్యం కాదు.

   Delete
  4. ప్రైవేత్ స్కూల్‌లకి లాభం రావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా చెప్పరనే ప్రచారం జరగాలి. కానీ నిజాలు ఎంత కాలం దాస్తారు? పది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి పెట్టుబడి పెట్టి ఒక స్కూల్ నడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు retirement తరువాత వేరే పని లేక, సర్వీస్‌లో ఉండగా సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా ప్రైవేత్ స్కూల్‌లలో పెట్టి, వాటి management boardsలో చేరుతారు. కొన్ని ప్రైవేత్ స్కూల్‌ల management boardsలో అందరూ పూర్వ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ప్రభుత్వ పాఠశాలలో పని చేసిన అనుభవంతోనే ప్రైవేత్ పాఠశాల నడిపి, తిరిగి ప్రభుత్వ విద్య మంచిది కాదని ప్రచారం చేస్తారు.

   Delete
  5. అవును ప్రవీణ్ గారు, మీరు చెప్పిన ఉదంతాలు సమాజంలో మన కళ్ల ముందు కనబడుతూనే ఉన్నాయి. చాలామంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలలలో చదివిస్తూ తాము వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నవారున్నారు. ఇప్పటికీ బాధ్యతగా విద్యాబోధన చేస్తున్న ఆదర్శమూర్తులూ ఉన్నారు. ఓ కుక్కను చావగొట్టాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలన్నట్లు ప్రభుత్వమే ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను భ్రష్టుపట్టిస్తూ ప్రజల చేత కూడా ప్రయివేటోళ్ళే నయం అనిపించేలా చేస్తున్న సంఘటనలు అనేకం.

   Delete
 2. ప్రభుత్వ ఉపాధ్యాయుడూ మనిషే, ప్రైవేత్ ఉపాధ్యాయుడూ మనిషే. వాళ్ళిద్దరికీ వేరువేరు మెదళ్ళూ, వేరువేరు ప్రతిభలూ ఉండవు. కానీ మధ్యతరగతివాళ్ళు సంకోచం వల్ల కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపించరు. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తే "మీ పిల్లల్ని ఆ దుంపలబడిలో వేసారేమిటి?" అని వాళ్ళ బంధువులు తప్పకుండా అడుగుతారు. "ప్రైవేత్ స్కూల్‌లలో మధ్యతరగతివాళ్ళ పిల్లలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి చదువు ముఖ్యం కనుక మార్కులు ఎక్కువ వస్తాయి, ఆ స్కూల్‌లలో ప్రత్యేకంగా మంచిగా చెప్పేది ఏమీ ఉండదు" అనే నిజం తమ బంధువులకి చెప్పాలి. తమ కుటుంబ విషయంలో మన బంధువుల జోక్యాన్ని తిరస్కరిస్తే వాళ్ళు చెయ్యగలిగేది ఏమీ ఉండదు. తమ పిల్లల్ని ప్రభిత్వ పాఠశాలలో చదివించడం వల్ల మిగిలిన డబ్బులతో వాళ్ళు పెద్దైన తరువాత వాళ్ళని మెదికల్ కాలేజ్‌లో చేర్పించొచ్చు. మెదికల్ కాలేజ్‌వాళ్ళు Board of Education ఇచ్చిన certificate మాత్రమే చూస్తారు తప్ప మనం ప్రభుత్వ పాఠశాలలో చదివామా లేదా ప్రైవేత్ పాఠశాలలో చదివామా అనేది వాళ్ళకి అనవసరం. ప్రభుత్వ పాఠశాలలో చదివినా పెద్దైన తరువాత మెదిసిన్ చదివి వైద్యుడు అవ్వొచ్చు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top