తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ హఠాత్తుగా తన బ్రాండ్‌ భాషను ఎందుకు ప్రయోగిస్తున్నారంటారు? ఈ ప్రశ్నపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. గడచిన మూడు నాలుగు రోజులుగా కేసీఆర్‌ ఉద్యమ భాషను ప్రయోగించడం, ఆ తిట్లకు ప్రజలు చప్పట్లు కొట్టడం మనం చూస్తున్నాం. ఉద్యమ ప్రస్థానం ముగిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముతక భాష వాడవలసిన అవసరం ఏమిటన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇందుకు రకరకాల భాష్యాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ ప్రజల్లో సజీవంగా ఉందా? లేదా? ఆంధ్రావాళ్లను తిడితే తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారా? లేదా? అన్నది తెలుసుకోవడానికే కేసీఆర్‌ తిట్లు లంకించుకున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, మరికొంత మంది మాత్రం గత శాసనసభ ఎన్నికల్లో అత్తెసరు మెజారిటీ మాత్రమే వచ్చినందున ఉన్నపళంగా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళితే భారీ మెజారిటీ సమకూర్చుకోవచ్చునన్న ఆలోచనతో కేసీఆర్‌ తనదైన భాషను ప్రయోగించి, సెంటిమెంట్‌ను మళ్లీ రగిలిస్తున్నారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

నిజానికి రాజకీయ ప్రయోజనం లేకుండా కేసీఆర్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళతారో లేదో తెలియదుగానీ తెలంగాణలో సెంటిమెంట్‌ను మాత్రం మళ్లీ రగిలించగలిగారు. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చి ఉండకపోతే కేసీఆర్‌ ఏడాది పాలనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ప్రారంభమై ఉండేవి. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి పట్టుబడటం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టుగా చెబుతున్న టేపులు బయటపడటంతో ప్రభుత్వ వైఫల్యాలు పూర్వపక్షంలోకి వెళ్లాయి. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి పదిహేను రోజులు కావస్తోంది. ఈ పక్షం రోజులుగా మీడియాలో వదంతులు షికార్లు చేశాయి. రాజకీయ నేతల అధీనంలో ఉన్న మీడియాల్లోనైతే కవులు, రచయితలను మించి ఊహాగానాలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్టు, ఆయన స్థానంలో ఎవరెవరినో ముఖ్యమంత్రిగా నియమిస్తూ వార్తలు వండివార్చారు. ఎవరి ఆనందం వారిది! ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా, ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వేస్తారో లేదో కూడా తెలియదు. పాఠకులు, టీవీ వీక్షకులు మాత్రం ఈ పక్షం రోజులుగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చదివిన, చూసిన అనుభూతి పొందారు. ఇకముందు ఏమి జరుగుతుందో ఇప్పటివరకు స్పష్టత లేదుగానీ, ఉభయ రాష్ర్టాల మధ్య మానుతున్న గాయాలను మళ్లీ కెలికినట్టు అయ్యింది. సెంటిమెంట్‌ అనేది ఇంతకాలం తెలంగాణకే పరిమితం అయ్యింది. ఇప్పుడు ఏపీ ప్రజల్లో కూడా సెంటిమెంట్‌ను రగిల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనను ఆత్మరక్షణలో పడవేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతివ్యూహంతో ముందుకెళ్లి ఏపీ ప్రజల్లో కూడా సెంటిమెంట్‌ను రగిలించారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు కేసీఆర్‌ వ్యాఖ్యలు కూడా ఏపీ ప్రజల్లో సెంటిమెంట్‌ మరింత వ్యాప్తి చెందడానికి దోహదపడ్డాయి. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్‌, చంద్రబాబులు పాము- ముంగిసలవలె వ్యవహరిస్తూ పరస్పరం కలహించుకుంటున్నట్టు కనిపిస్తూ, పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ‘తమలపాకుతో నువ్వు ఒకటి అంటే తలుపు చెక్కతోనే రెండంటా’ అన్నట్టుగా టేపుల వ్యవహారాన్ని కేసీఆర్‌ బయటపెట్టగా, ట్యాపింగ్‌ వ్యవహారాన్ని చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. పనిలోపనిగా హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేకుండా పోయిందని ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిలబడాలన్న ఉద్దేశంతో ఇంతకాలం మౌనంగా ఉన్న చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో తన కాళ్ల కిందకు నీళ్లు వచ్చే ప్రమాదం ఏర్పడటంతో విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టారు. మొత్తంమీద ఇటు కేసీఆర్‌ వ్యూహం, అటు చంద్రబాబు వ్యూహం ఫలించి ఎవరి రాష్ర్టాలలో వారు మరింత బలపడ్డారు. ప్రజల మధ్య మాత్రం అంతరం పెరిగింది.

అక్కడ మొదలై...
ఇంతకీ గురుశిష్యులుగా కొన్ని సంవత్సరాల పాటు మెలిగిన చంద్రబాబు- కేసీఆర్‌ మధ్య ఇంత వైరం ఎందుకొచ్చిందన్నది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న! కారణం తెలియాలంటే పూర్వపు రోజుల్లోకి వెళ్దాం. 1999కి ముందు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా కేసీఆర్‌ ఉండేవారు. తెలుగుదేశం పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. అయితే 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవదనీ, ఒకవేళ గెలిచినా చంద్రబాబు తనను తిరిగి మంత్రిగా తీసుకోరన్న అనుమానం కేసీఆర్‌లో ఏర్పడింది. ఈ విషయాన్నే ఆయన సహచరుల వద్ద ప్రస్తావించేవారు కూడా! కేసీఆర్‌ భావించినట్టుగా 1999లో తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్‌కు మాత్రం ఆయన ఊహించినట్టుగానే మంత్రి పదవి దక్కలేదు. దీంతో తన అనుమానం నిజమవ్వడంతో, అప్పటికే ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తూ తెరవెనుక నుంచి ఉద్యమానికి నాయకత్వం వహించే ప్రయత్నాలు మొదలెట్టారు. మంత్రి పదవి లభించలేదని అలకబూనిన కేసీఆర్‌కు ఉప సభాపతి పదవి ఇవ్వడం ద్వారా శాంతింపజేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్‌గా కొంతకాలం మాత్రమే ఉన్న కేసీఆర్‌, సమయం చూసుకుని పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలోకి ఉరికారు. అప్పటికే తెలంగాణ సాధన సమితి పేరిట ఉద్యమంలో ఉన్న ఆలె నరేంద్రను తమ మాటలతో ఒప్పించి తనతో కలుపుకొన్నారు. ఈ దశలోనే 2004 ఎన్నికలు రావడం, కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ కలిసి పోటీచేసి అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు తిరిగి 2009 ఎన్నికల వద్దకు వచ్చి ఆగింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం- టీఆర్‌ఎస్‌ కలిసి పోటీచేశాయి. ఇక్కడే రెండు పార్టీల మధ్య అంతరం పెరిగింది. ఆ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు పది సీట్లే వచ్చాయి. ఎన్నికలలో తమ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి చంద్రబాబు కారణమని కేసీఆర్‌ భావించారు. తాము కోరుకున్న సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల ప్రచార ఖర్చు కోసం డబ్బు కూడా ఇవ్వాలని అప్పట్లో కేసీఆర్‌ షరతు పెట్టారు. ఇందుకు అంగీకరించిన చంద్రబాబు చివరి నిమిషంలో ఇస్తానన్నంత డబ్బు ఇవ్వలేదనీ, అదే సమయంలో తాము పోటీచేస్తున్న కొన్ని స్థానాలలో తెలుగుదేశం తరఫున పోటీ అభ్యర్థులను నిలబెట్టారనీ, ఫలితంగానే ఎన్నికలలో దెబ్బతినాల్సి వచ్చిందనీ భావించిన కేసీఆర్‌కు చంద్రబాబుపై కోపం తన్నుకొచ్చింది. తాము ఇస్తామన్న డబ్బు ఇచ్చామని తెలుగుదేశం నాయకులు చెబుతుంటారు. ఇలా ఇరువురి మధ్య మొదలైన వైరం పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదని కేసీఆర్‌- కేసీఆర్‌ నమ్మదగ్గ వ్యక్తి కాదని చంద్రబాబు బలంగా నమ్మారు. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత పెరిగింది. వీలైతే అవతలి వారిని కాటేయాలని ఇరువురూ కాచుకుని కూర్చున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పాటైంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు తన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పదిహేను స్థానాలు లభించడం రుచించలేదు. తెలంగాణలో తెలుగుదేశం ఉనికి తనకు ఎప్పటికైనా ప్రమాదమన్న ఉద్దేశంతో ముందుగా ఆ పార్టీని దెబ్బతీయడంపై దృష్టిని కేంద్రీకరించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తెలంగాణలో తన పార్టీని బతికించుకోవడానికి చేయని ప్రయత్నంలేదు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి వంటివాళ్లు ఆయనకు అండగా నిలిచారు. అదే సమయంలో తెలంగాణలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న అనుమానం కేసీఆర్‌లో మొలకెత్తింది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు రేవంత్‌రెడ్డిని, ఇటు చంద్రబాబును ఇరికించే వ్యూహానికి కేసీఆర్‌ పదునుపెట్టారు. అదృష్టం కేసీఆర్‌ వెన్నుతట్టింది. తాను విసిరిన వలలోకి రేవంత్‌రెడ్డి నేరుగా వచ్చి చిక్కుకున్నారు. కేసీఆర్‌ చేతిలో దెబ్బతిన్న చంద్రబాబు, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు. ఈ అంశంపై ఢిల్లీలో పెద్దలందరినీ కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులకే కాకుండా కాంగ్రెస్‌ నాయకులకు కూడా కేసీఆర్‌ సరళిపై అనేక అభ్యంతరాలున్నాయని చెబుతారు. అందుకే కాబోలు ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు అభయహస్తం లభించింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన కేసీఆర్‌, ఓటుకు నోటు కేసును తాత్కాలికంగా పక్కనపెట్టి జల వివాదానికి తెర తీశారు. తాను తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రావాళ్లు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ అభ్యంతరకర భాషలో దాడి ప్రారంభించారు. ఈ చర్య వల్ల తెలంగాణలో కేసీఆర్‌కు లబ్ధి చేకూరినట్టుగానే ఏపీలో చంద్రబాబుకు కూడా లబ్ధి చేకూరింది. తెలంగాణ సీఎం తమకు అన్యాయం చేస్తున్నారనీ, తమ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారని సీమాంధ్రలో మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్‌ మాటలు నమ్మి సీమాంధ్రలో చంద్రబాబు పీడ వదలిపోతుందన్న ఆశతో అక్కడి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారు. సీమాంధ్రలో సీన్‌ మారుతోందన్న విషయం గ్రహించని జగన్మోహన్‌ రెడ్డికి ఉభయభ్రష్టత్వం ప్రాప్తించింది. తాజా జల వివాదంలో, ముఖ్యంగా రాయలసీమకు నీరు అందించే శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నీటిని వాడుకోబోతోందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆయన ఆత్మరక్షణలో పడిపోయారు. చివరకు చంద్రబాబు- కేసీఆర్‌ మధ్య సాగుతున్న క్రీడలో జగన్మోహన్‌ రెడ్డి ఆటలో అరటిపండుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంగానీ, ఏపీ ప్రభుత్వంగానీ లీకులు చేస్తున్నట్టుగా ఓటుకు నోటు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదుగానీ, ఈ ఇరువురు నాయకుల వత్తాసుదార్లు చివరకు ఫూల్స్‌గా మారినా ఆశ్చర్యపోవలసింది లేదు. రాజకీయ పార్టీలు ఎంతగా ఘర్షణపడినా సరిహద్దు రేఖను అతిక్రమించవు. సరిహద్దు రేఖను అతిక్రమిస్తే అన్ని రాజకీయ పార్టీలూ చిక్కుల్లో పడతాయి. అందుకే ఒక దశ తర్వాత సర్దుకుపోతుంటారు. ఈ మర్మం తెలియని సోకాల్డ్‌ అభిమానులు చొక్కాలు చించుకుంటూనే ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మొదలైన ఆధిపత్య పోరు మలుపులు తిరుగుతూ జల వివాదం వద్దకు వచ్చి చేరింది. మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. ఈ క్రమంలో ఏది జరగకూడదో అదే జరిగింది. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సాగవలసిన తెలుగువాళ్లు బద్ధ శత్రువులుగా చీలిపోయారు. ఈ పరిణామం రెండు తెలుగు రాష్ర్టాలకు మంచిది కాదు. అయినా వినేవాళ్లు ఎవరు?

 దటీజ్‌ కేసీఆర్‌!
ఈ విషయం అలా ఉంచితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన తొలి వార్షిక ఉత్సవాల విషయానికి వద్దాం. ఈ ఉత్సవాలలో కేసీఆర్‌ అంతా తానే అయి వ్యవహరించారు. ముఖ్యమంత్రి కనుక ఆయనకు ప్రముఖ స్థానమే ఉంటుంది. అయితే తెలంగాణ ఉద్యమ సందర్భంగా గజ్జెకట్టినవాళ్లు గానీ, గళం విప్పినవాళ్లు గానీ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదు అనేకంటే వారు కనిపించకుండా కేసీఆర్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నాటి ఉద్యమ ప్రముఖులైన కోదండరామ్‌గానీ, కవులు, కళాకారులు అయిన గోరటి వెంకన్న, అందెశ్రీ వంటి ప్రముఖులు మరుగునపడిపోవలసి వచ్చింది. తెలంగాణ సాధించిన క్రెడిట్‌ను ఇతరులతో పంచుకోవడం కేసీఆర్‌కు ఇష్టం ఉన్నట్టు లేదు. తెలంగాణ రాష్ర్టానికి కర్త, కర్మ, క్రియ తానే కావాలని ఆయన కోరుకుంటారు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకప్పటి ఉద్యమ ప్రముఖులు తెరమరుగవుతూ వచ్చారు. ముగింపు వేడుకలలో గవర్నర్‌ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు మాత్రమే కనిపించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు అండదండగా ఉన్నవారికి ఆహ్వానాలు అందాయో లేదో కూడా తెలియదు. దటీజ్‌ కేసీఆర్‌! క్రెడిట్‌ను ఇతరులతో పంచుకోకపోవడంలోనే కాదు... గిట్టనివారి విషయంలో కూడా కేసీఆర్‌ చాలా కఠినంగా ఉంటారు. తన వ్యవహార శైలిని విమర్శించేవారిని ఆయన సహించలేరు. ఈ విషయంలో ఆయన ఏమీ దాచుకోరు. తెలంగాణ ప్రముఖుడు దాశరథి రంగాచార్య కొద్ది రోజుల క్రితం పరమపదించారు. బతికి ఉన్నప్పుడు తనను తప్పుపట్టారన్న కోపాన్ని మనసులో పెట్టుకుని దాశరథి భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు. అదే సమయంలో ప్రజలు తనను అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం, దాశరథి రంగాచార్యకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. జీవిత కాలమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తపించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. బాపూజీ నివాసమైన జలదృశ్యాన్ని వేదికగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిష్కరించిన కేసీఆర్‌కు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండాపోయింది. బాపూజీ భౌతికకాయాన్ని సందర్శించలేదు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదంతాలు. కేసీఆర్‌లోని ఈ నైజాన్ని గ్రహించలేకపోతున్న కొందరు, తెలంగాణ సెంటిమెంట్‌ పేరిట ఆయనను గుడ్డిగా సమర్ధిస్తుంటారు. తెలంగాణ ఏర్పాటు ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును కూడా కేసీఆర్‌ తలచుకోలేదు. ఒకప్పుడు ‘ఇండియా ఈజ్‌ ఇందిర- ఇందిర ఈజ్‌ ఇండియా’ అని కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.బారువా ప్రచారంలోకి తెచ్చారు. బహుశా అది గుర్తుంది కాబోలు. ‘తెలంగాణ ఈజ్‌ కేసీఆర్‌- కేసీఆర్‌ ఈజ్‌ తెలంగాణ’ అని ప్రజలందరూ భావించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టున్నారు. అందుకే కాబోలు తెలంగాణ రాష్ట్ర సమితిని ఇంటి పార్టీగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరింటి పార్టీ? అది కేవలం కేసీఆర్‌ ఇంటి పార్టీ మాత్రమే! ఆ మాటకొస్తే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆ పార్టీ అధినేతల ఇంటి పార్టీనే అవుతుంది గానీ, ప్రజల పార్టీ కాదు. తెలుగుదేశం, డీఎంకే, అన్నాడీఎంకే వంటివి ఈ కోవలోకే వస్తాయి.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా ఒక రకంగా ఇంటి పార్టీనే! ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ కనిపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కాకుండా మరో పార్టీ ఉండకూడదని కేసీఆర్‌ కోరుకుంటూ ఉంటారు. అందుకే తన పార్టీని తమ ఇంటి పార్టీగా ప్రజలంతా భావించాలని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో తనను ప్రశ్నించే గొంతు ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈ క్రమంలో తొలి అడుగుగా మీడియాకు సంకెళ్లు వేశారు. అదే కేసీఆర్‌ తన సొంత చానెల్‌ విషయానికి వచ్చే సరికి పత్రికా స్వేచ్ఛ ఉంటుంది కదా! అని గడుసుగా చెప్పుకొంటున్నారు. తెలంగాణలో ఒకప్పటి దొరల వ్యవహార శైలిని, మనస్తత్వాన్ని కేసీఆర్‌ ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఆనాటి దొరలు తమ ఆగడాలకు అండగా పోలీసు పటేళ్లను తమ నమ్మినబంట్లుగా పక్కన పెట్టుకుని తిరిగేవారు. ఎదురుతిరిగిన వారిని పోలీసు పటేళ్లద్వారా హింసించేవారు. అదే సమయంలో ప్రజలను ప్రభావితం చేస్తారనుకున్న బ్రాహ్మణులను జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు కేసీఆర్‌ ఏం చేస్తున్నారో చూద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు అడగకపోయినా వరాలు ప్రకటించారు. అవి కూడా హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులకు మాత్రమే! దీంతో పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల సానుకూలత ఏర్పడింది. ఆయనపై ఈగవాలనివ్వని స్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడానికి పోలీసులు సదా సిద్ధంగా ఉన్నారు.  పోలీసులను సంతృప్తిపరచిన కేసీఆర్‌, బ్రాహ్మణుడైన గవర్నర్‌ నరసింహన్‌ను సంతృప్తిపరిచే పనిని కూడా పూర్తిచేశారు. బ్రాహ్మణులు అల్పసంతోషులని ఆయన భావిస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే ఇటీవల యాదాద్రి వెళ్లినప్పుడు గవర్నర్‌ దంపతులకు కేసీఆర్‌ పాదాభివందనం చేశారు. పనిలోపనిగా గవర్నర్‌ దంపతులకు అప్పుడప్పుడు పట్టువస్ర్తాలు బహూకరిస్తారట! ఎలాగైతేనేం కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టిలో మంచి మార్కులు సంపాదించుకున్నారని, అందుకే ఢిల్లీలో నరసింహన్‌ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి దొరల సైకాలజీ తెలియని నేటితరం వారికి కేసీఆర్‌లో వినయ విధేయతలు మాత్రమే కనిపిస్తాయి. ఆయనకు కావలసింది కూడా అదే కదా! అయితే అప్పటి దొరలకు ప్రస్తుతం మన ముందున్న ఈ దొరకు ఒక్క తేడా ఉంది. నాటి దొరలు ప్రజలను బానిసలుగా చూడగా, నేటి ఈ దొర తన మాటల చాతుర్యంతో వారిని రంజింపజేస్తుంటారు. చేతికి ఎముకే లేనట్టుగా అప్పుడప్పుడు ప్రభుత్వ సొమ్ముతో దానధర్మాలు చేస్తుంటారు. మొత్తంమీద ఏడాది క్రితంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్‌ మరింత బలపడ్డారు. ఇందుకు అనేక కారణాలు ఆయనకు దోహదపడ్డాయి. ఈ ఏడాదిలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థిగా ‘ఆంధ్రజ్యోతి’ని, నన్ను భావించినట్టున్నారు. ఆ కారణంగానే కాబోలు తన సొంత మీడియాలో విష ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి వాటికి బెదిరే మనస్తత్వం కాదు నాది. ఏబీఎన్‌ చానెల్‌కు సంకెళ్లు వేసి ఏడాది అయినా మేము అధికారపక్షంలో ఉన్నవారిని దేబిరించలేదు. దేబిరించం కూడా! అదే సమయంలో తెలంగాణ సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకుల లోపాలను ఎత్తిచూపుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరాదరణకు గురైనవారికి ప్రత్యామ్నాయ వేదికగా ఉంటాం! ఏదిఏమైనా తెలంగాణలో మా శక్తిని గుర్తించి, మమ్మల్ని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పుకోకుండా ఉండలేం. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసుగనుకే ఎంతగా విష ప్రచారం చేసినా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఇందుకు ప్రజలకు కృతజ్ఞతలు. కయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ సొంత మీడియాలో ఎన్ని తప్పుడు కూతలు, రాతలు రాసినా మౌనంగా ఉంటున్నాం. ఇలాంటివి మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్న వాస్తవాన్ని కేసీఆర్‌ అండ్‌ కో గుర్తిస్తే మంచిది! (from andhrajyothy)
Reactions:

Post a Comment

 1. కొండలరావు గారూ . మీరు ఆంధ్రజ్యోతి లో వచ్చిన వార్తల్ని కొలబద్దగా తీసుకుని ప్రశ్నలు అడగడం భావ్యం కాదు . ఎవరు ఎన్ని చెప్పినా ఆంధ్రజ్యోతి సమైక్యవాద లేదా ఆంద్ర ప్రయోజనాలు చూసుకునే పత్రిక . తెలంగాణా రాష్ట్రం వచ్చాక కూడా మీలాంటి సమైఖ్యవాదులు ఇంకా అంధ్ర వాడ పత్రికలకు కొమ్ముకాయడం భావ్యం కాదు . గతంలో ప్రజాశక్తి వార్తల్ని తీసుకునే మీరు ఈ మధ్య ఆంధ్రజ్యోతి వార్తల్ని తీసుకోవడం ఎంతో మందికి చేరే మీ బ్లాగుకు భావ్యం కాదు . దయచేసి న్యూట్రల్ గా వ్రాసే వార్తలనే పరిగణ లోకి తీసుకోండి . చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడినే నిలువరించిన కేసీయార్ కు ఇక రాధాకృష్ణ లాంటి వారిని ఎదుర్కోవడం బుక్ చేయడం కష్టమేమీ కాదు . అసాధ్యం కూడా కాదు . ఎన్నో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడిన రాధాకృష్ణ అదే బ్లాక్ మెయిల్ కు నాశనం కావడం మనం ముందు ముందు చూస్తం .

  ReplyDelete
  Replies
  1. కరీమ్ అన్సారి గారు,

   నాకు ఆంధ్రజ్యోతి ఎట్టి పరిస్తితులలో కొలబద్ద కానేకాదు. నేను సమైక్యవాదినే గానీ ఎపుడూ తెలంగాణా ఉద్యమాన్ని తప్పు పట్టడమో, కొందరు ఆంధ్రావాదులలా హేళన చేయడమో, దుర్భాషలాడడమో చేయలేదు. తెలంగాణా ఉద్యమం పేరుతోనో, తెలంగాణా పక్షపాతం పేరుతోనో ఆంధ్రావ్యతిరేకతను నూరిపోయడం, అడ్డగోలుగా వాగడాన్ని కూడా నేను సమర్ధించను. ఆంధ్రావాద లేదా తెలంగాణా వ్యతిరేక పత్రికల కొమ్ముకాయాల్సిన దుర్గతి నాకు పట్టలేదు. నేను కె.సి.ఆర్ బాకా అయిన నమస్తే తెలంగాణాకు కొమ్ము కాయను, కె.సి.ఆర్ వ్యతిరేక పత్రిక అయిన ఆంధ్రజ్యోతికి కొమ్ము కాయను. నమస్తే తెలంగాణా పుట్టకముందునుండే నాకు ఆంధ్రజ్యోతి చదవడం అలవాటు. ప్రజాశక్తి, ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కువగా చదివే అలవాటు మొదటినుండి ఉన్నది. ఈనాడు లోవి కాపీ చేయడానికి వీలు కాదు. ఈ మధ్య నమస్తే తెలంగాణాలోనివి కూడా ఉంచుతున్నాను మీరు గమనించడం లేదేమో. అసలు ఈ పత్రికల క్లిప్పింగులు లేకుండా ప్రశ్నలుంచడానికి ప్రయత్నించాను. సాధ్యం కాక వదిలేశాను. వీలైనంత ఎక్కువమంది ప్రశ్నలు పంపితే ఈ సమస్య తగ్గవచ్చు. ఇంకేదైనా మార్గం ఉందో కూడా ఆలోచించాలి.

   రెండు రాష్త్రాలు ఏర్పడ్డాక, నాది తెలంగాణా ప్రాంతం అయినపుడు నేనెందుకు ఆంధ్రాప్రాంతపు వారి కొమ్ము కాయాల్నో సెలవిస్తారా? అడ్డుగోలుగా కె.సి.ఆర్ భజన చేయనంత మాత్రాన అందరినీ తెలంగాణా వ్యతిరేకులుగా ముద్రవేసి ఆనందపడడం అంత మంచిది కాదు. సమైక్యవాది అయితే తప్పుకాదు. తప్పుడు వాదనలు చేస్తేనో , తప్పులను సమర్ధిస్తేనో తప్పు. ఇపుడు సమైక్యవాదం అనేదానికి అర్ధం,అవసరం ఏముంది? సమైక్యవాదం వినిపించి ఏమి సాధించాలి? ఎవడి కొమ్ము కాసి ఉపయోగం ఏమిటి?

   న్యూట్రల్ అంటే ఏ పత్రిక ఉందో చెప్పగలరా? నేను గతంలో శ్రీకాంత్ చారి గారికి చెప్పిందే మళ్ళి చెపుతున్నాను. మీరు వ్యక్తిగత దూషణలు లేకుండా ఆధారాలతో ఉన్న ప్రశ్నలు పంపండి పబ్లిష్ చేయకపోతే నేను వేమూరి రాధాకృష్ణలా పక్షపాతం వహించానని అనుకోవచ్చు. అలా చేయకుండా నేనే ప్రశ్నలు అడగాలో. ఏ ఉద్దేశంతో అడుగుతున్నానో చెప్పడం, ఊహించుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నాను.

   చంద్రబాబును , కె.సి.ఆర్ ని రాజకీయ దురంధరులని నేననుకోవడం లేదు. మీరనుకుంటే నాకు అభ్యంతరం లేదు. వీరిద్దరు ఒకే బడిలో పాఠాలు నేర్చినవారే. బాబు నిత్య అభద్రతాజీవి. కె.సి.ఆర్ రెచ్చగొట్టడంలో మంచి వ్యూహకర్త. వీరిద్దరు ప్రజాపక్షపాతులు కారనేది నా అభిప్రాయం. ఇద్దరిలో పోలిస్తే కె.సి.ఆర్ చాలా బెటర్.

   రాధాకృష్ణను తప్పు చేస్తే బుక్ చేసే అవకాశం ఉండి , అసాధ్యం కూడా కాకపోతే ఎందుకు ఆగుతున్నారు? ఏమైనా లాలూచీ పడుతున్నారా? తక్షణం బుక్ చేసి ఆధారాలతో దొంగ అని నిరూపిస్తే మంచిది. దొంగలను కాపాడాల్సిన అవసరం లేదు. ఏ దొంగలనైనా దొరకబుచ్చుకుని బజారుకీడిస్తే సంతోషమే కదా? కేంద్రం జోక్యంతోనో , కేంద్ర మంత్రి పదవులకోసమో తరువాత రాజీ పడకుండా పోరాడితే , దొంగలకు శిక్ష వేయించగలిగితే ప్ర్జజాస్వామ్యంలో ఒక అడుగు ముందుకు పడ్డట్లే.

   నేనూ వేచి చూస్తున్నాను. బాబుపై పోరాడతారా? రాజీ పడతారా? అని. ఆధారాలతో అడ్డంగా దొరికిన కేసు ఏమవుతుందా? అని. మరో జయలలితలానో , జగన్ లానో బాబు కూడా మిగిలిపోతాడా?

   ఇక్కడ నేను ప్రశ్న అడిగింది కూదా రాధాకృష్ణ స్వంత డబ్బాకు వ్యతిరేకంగానే. కె.సి.ఆర్ తో రాధాకృష్ణ సమ ఉజ్జీ అని నేనూ భావించడం లేదు. అయితే కె.సి.ఆర్ తప్పులను ప్రశ్నించడాన్ని నేను ఆహ్వానిస్తాను. కె.సి.ఆర్ ని ప్రశ్నించే ప్రతీదానిని తెలంగాణా వ్యతిరేకత బూచి చూపి ఆనందించే అమాయకత్వాన్ని చూస్తే మాత్రం నవ్వు వస్తుంది. కె.సి.ఆర్ ని వ్యతిరేకిస్తే తెలంగాణాని వ్యతిరేకించినట్లని కె.సి.ఆర్ భజనపరులు చెప్పేదానికి నేను వ్యతిరేకం. కె.సి.ఆర్ పై రాధాకృష్ణ వెళ్లగక్కే విషంలో ఏవి నిజాలో, ఏవి కావో నాకు తెలుసు. వాటిలో మీకు తెలిసినవి మీరు డెఫినెట్ గా అడ్డుకోవచ్చు కదా?

   తెలంగాణా ప్రయోజనం కాపాడాలనుకునేవి, ఆంధ్రాప్రాంతం వారు నిజంగా దోపిడీ చేస్తున్నవి ఆధారాలతో కలిపి మీరు ప్రజ కు వీలయినన్ని ఎక్కువ ప్రశ్నలు పంపండి. మీరారోపిస్తున్న సమస్యకు అదే పరిష్కారం.

   Delete
  2. మొట్ట మొదట తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసిన ఏకైక 'ఆంధ్ర' పత్రిక , పుంఖానుపుంఖల గా తెలంగాణా వార్తలు ప్రచురించినా ఏకైక 'ఆంధ్ర' పత్రిక ,
   కెసిఆర్ అండ్ కో ని మునగ చెట్టు ఎక్కించినా ఏకైక 'ఆంధ్ర' పత్రిక , తెలంగాణా సాహితివేత్తల అభిప్రాయాలకి , సాహిత్యానికి ఒక పేజి ని కేటాయించినా ఎకైకా 'ఆంధ్ర' పత్రిక ఇదే . ఇంకా మీరు ఈ పత్రిక ని 'ఆంధ్ర' పత్రిక అని ఎలా అంటున్నారో .
   కెసిఆర్ కి రాధాకృష్ణ కి మధ్య ఏదో బేరం కుదరలేదు అందుకే కెసిఆర్ ని విమర్సిస్తుందేమో కాని , తెలంగాణా కి వీసమంత వ్యతిరేఖం కాదు ఈ 'ఆంధ్ర' పత్రిక.

   Delete
  3. వెంకట్ గారు,
   తెలంగాణా ఉద్యమానికి ఊపిరిపోసేంత సీన్ ఆంధ్రజ్యోతికి లేదు. గతంలో రామోజీరావు కూడా తాను ఎన్.టి.ఆర్ ని అధికారంలోకి తెచ్చాననుకునేవాడు. తాను కూడా తెలంగాణా ఉద్యమానికి ఉప్పందించినట్లుగా రాధాకృష్ణ చెప్పుకునేదానిలో నిజం లేదు. ఉద్యమాలను, ప్రజల భావోద్వేగాలను తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేందుకు అతను చేసిన పనులు అవి. అనివార్యంగా చేయాల్సి రావడమే తప్ప తెలంగాణా ప్రజలపైనో, ఉద్యమం పైననో రాధాకృష్ణకి ప్రేమ ఉందని నేననుకోను.

   ఆంధ్రజ్యోతిని నేను కె.సి.ఆర్ వ్యతిరేక పత్రికగా గుర్తిస్తాను. తెలంగాణా వ్యతిరేకతకు కె.సి.ఆర్ వ్యతిరేకతకు తేడా ఉన్నది. కె.సి.ఆర్ కు రామోజీరావుకు సయోధ్య కుదిరింది కానీ ఆంధ్రజ్యోతికి కుదరలేదనేది నిజం. కె.సి.ఆర్ పై వేమూరి విషం చిమ్ముతున్నాడనేది కూడా నిజం. చంద్రబాబును కాపాడడానికి వేమూరి నానా తంటాలు పడుతుంటాడు. కె.సి.ఆర్ తనపై ఎమ్మెస్వోలద్వారా నిషేధం విధింపజేశాడు కనుక ఆ అక్కసంతా రాధాకృష్ణ అవకాశం ఉన్నపుడల్లా వెల్లగక్కుతుంటాదు. అందులో అవసరమైనవి స్వీకరించడమే ప్రజాస్వామ్యవాదులు చేయాల్సినపని. కేంద్రం తన పత్రికపై నిషేధాన్ని ఎత్తివేసే చర్యలు తీసుకుంటున్నదని ప్రచారం ఊదరగొట్టిన రాధాకృష్ణ అది అణువంతైనా ముందడుగు వేయకపోవడంతో ఏం చేయాల్నో పాలుపోక ఇలా సొల్లు మాటలు చెపుతున్నాడు.

   Delete
 2. Read this: http://blog.marxistleninist.in/2015/06/blog-post_14.html?m=1

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు ఆంధ్రాకు పరిమితమై తెలంగాణాను ఎవరికి వదలాలి ప్రవీణ్ గారు? ఈ పంపకాలు ఏ ప్రాతిపదికన చెపుతున్నారు మీరు? తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు-చంద్రశేఖర రావుల అబ్బ సొత్తు కాదు కదా? ఈ రెండు పార్టిలపై విసుగొస్తే కాంగ్రెస్ వైపో , భా.జా.పా వైపో ప్రజలు మళ్లవచ్చు. లేదా మరొ ప్రత్యామ్నయం వెతకవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు. తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ఉన్నది. తెరాస ఒక్క రాష్ట్రంలో ఉన్నది. ఆంధ్రాలో ఆ పార్టీకి అవకాశం ఉండదు. అక్కడ జగన్ ప్రతిపక్షంగా ఉన్నాడు.

   చేసే రాజకీయం సరిగా ఉన్నదా? లేదా? అనేది చూడాలి తప్ప తెలుగుదేశం ఆంధ్రా వరకు ఉండాలని మీరెలా సూచిస్తారు. తెలుగు రాష్ట్రాలను వీరిద్దరికి ఎంతకాలం పంచి ఇద్దామనుకుంటున్నారు?

   Delete
  2. చంద్రబాబు వల్ల ఏ ఒక్క ప్రాంతానికైనా లాభం కలిగిందా? నిజంగా లాభమనిపిస్తే చంద్రబాబు ఏమి చేసినా అభ్యంతరం చెప్పక్కరలేదు.

   Delete
  3. అలా అయితే ఆంధ్రాలో మాత్రం ఎందుకు ఉండమంటున్నారు? అసలు మీ వాదన చంద్రబాబు పై వ్యక్తిగత కోపంలా కనిపిస్తుంది. ఎవరు ఏ ప్రాంతంలో రాజకీయం చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందనే దానిమీద ఆధారపడి ఉండాలి. తప్ప చంద్రబాబును ఆంధ్రా ప్రాంతానికి, కె.సి.ఆర్ ను తెలంగాణాకు పంచడం ఏమిటి? ప్రజలకు ఎవరు ఏ విషయంలో మేలు చేసేలా ఉంటున్నారు? ఏ విషయంలో కీడు చేసేలా ఉంటున్నారు? అనే ప్రాతిపదికపై మాత్రమే విమర్శలు చేయాలి. నాయకులకు ప్రాంతాల పంపకం చేయడం తప్పుడు సిద్దాంతం.

   Delete
  4. రాష్ట్రం విడిపోయిన ఏడాది తరువాత కూడా హైదరాబాద్ కట్టింది నేనే అంటూ పాచిపళ్ళ పాటలు పాడే చంద్రబాబు ఆంధ్రాకి కూడా ఏమీ చెయ్యలేడు. అతను తెలంగాణ విషయాల్లో దూరితే మాత్రం ఏమి లభిస్తుంది? అతను ఒక పార్తీ నాయకునిగా తెలంగాణ విషయాల్లో దూరడం లేదు. ఆంధ్రావాళ్ళు హైదరాబాద్‌ని పోగొట్టుకున్నారు అని అతను ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాడు.

   Delete
  5. బాబు కంటే ముందే నిజాం కాలం నుండే హైదరాబాద్ అభివృద్ధి పథంలో ఉన్నది. అక్కడి భౌగోళిక పరిస్తితులు అందుకు అనుకూలించాయి. బాబు ప్రాపగాండా, అతని తొత్తు పత్రికలు ఎంత చెప్పినా రెండు సార్లు ఓడించారు ప్రజలు. మొన్న కూడా పవన్,మోడీ,జగన్ అనుభవలేమి వంటి కారణాలతో అతి కష్టం మీద మాత్రమే గట్టేక్కారు. ఇంకా నయం నేను పుట్టకపోతే హదరాబాద్ నాశనమయ్యేదనలేదు. హైదరాబాద్ అయినా ఇంకేదైనా అభివృద్ధి అంటే మానవవనరుల అభివృద్ధి చూడాలి తప్ప హైటేక్ టెక్కులు కాదు.

   బాబు అలా అన్నాడు కాబట్టి ప్రాంతాలను నాయకులకు పంచి ఇవ్వాలనే సిద్దాంతాన్ని మీరు వల్లెవేస్తారా? ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాలను నొక్కేసే నియంతృత్వ పోకడలను, ప్రాంతీయ దురభిమానాలను పెంచే చేష్టలను మీవంటి వారు మాట్లాడడమే వింతగా ఉన్నది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top