నిస్వార్ధ సేవా మహత్తు!
ప్రశాంతిపురం లోని శాంతమ్మ చాలా సాధు స్వభావేకాక పరోపకారం ఆకారం దాల్చినట్లు నిరంతరం అందరికీ సాయం చేస్తుండేది. ఓమారు  శివాలయంలో ఓ పండితుడు కార్తీక పురాణం చెప్పసాగాడు. ఆప్రాంత మంతా దుమ్ము ధూళితో ఉండి దోమల నివాసంగా ఉండటంతో పురాణం వినను వచ్చే వారెంతో ఇబ్బంది పడసాగారు. అది గమనించిన శాంతమ్మ అందరికంటే ముందుగానే వచ్చి ఆ ప్రదేశాన్నంతా  పరిశుభ్రంగా చిమ్మి, పేడనీళ్ళు చల్లి, చక్కని రంగ వల్లులు తీర్చేది. వచ్చిన వారికి దాహం వేస్తే త్రాగను  రెండు బానల నిండా మంచి నీరు పోసి ఉంచేది. ఎండు వేపాకు, ఆవ ఆకులు కర్పూరం తెచ్చి ఆ ఆవరణ  చుట్టూతా నాల్గు దిక్కులా మంటలు వేసేది. దోమలు రాకుండా వేప నూనెతో ప్రమిదలు చేసి చుట్టూతా పెట్టేది. పెద్దలతో వచ్చే పిల్లలు దోమల బారికి గురి కాకుండా తగు శ్రధ్ధ వహించేది. పురాణ శ్రవణం చేస్తున్న వారి బిడ్డలు ఏడుస్తుంటే తాను వారిని తీసుకువెళ్ళి ఆరు బయట ఆడించేది. ఐతే పురాణ శ్రవణo పూర్తై హారతి ఇచ్చే సమయానికి ఆమె హడావిడిగా వెళ్ళిపోయేది .

ఇదంతా గమనిస్తున్న ఆ పురాణం పండితుడు ఒక రోజున ఆమెతో  ”అమ్మా! మీరు ఇక్కడికి వచ్చేవారికంతా ఎంతో సౌకర్యo కల్పిస్తూ హారతి వేళకు వెళ్ళిపోడo  బావులేదు" అని అడుగగా  " అయ్యా! హారతి  అందుకోకపోతే దయా మయుడైన భగవంతుడు కోపించడు, కాని మాయింటి పక్కనే ఉంటున్న అనాధ వృధ్ధ మహిళ అన్నానికి అలస్య మైతే ఉండలేదు, ప్రతిరోజూ ఈ వేళకు ఆమెకు పట్టెడన్నం పెట్టడం నా పనిగా భావిస్తాను .." అంటూ శాంతమ్మ వెళ్ళి పోయింది.

పురాణం 40 రోజులూ పూర్తయ్యాక  ఆ వేద పండితుడు " అయ్యలారా! మీరంతా ఎంతో శ్రధ్ధగా ఇన్ని రోజులూ నేను చెప్పిన కార్తీక పురాణం విన్నారు, మీరు ఏమి గ్రహించారో దాన్నిఆచరణలో ఉంచండి" అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన  గ్రామం వదలి వెళ్ళే ముందు శాంతమ్మను దగ్గరకు పిలిచి "తల్లీ! ఇంతకాలం ప్రతి ఫలాపేక్ష లేకుండా ఎంతో సేవ చేశావు. మా గురువు గారు నాకు ఇచ్చిన ఈ ఈతాకుల తట్ట నీకు ఇవ్వదలచాను, స్వీకరించు" అంటూ అందించాడు.

శాంతమ్మ" అయ్యా! నేను ఒక్కరోజూ మీకేమీ కానుకలు  సమర్పించలేదు, హారతి సమయంలో ఒక్క రోజైనా ఉండలేదు, మీరు దీన్ని నాకెందుకు ఇస్తున్నారు? ఈ ఈతాకు తట్ట నేనేమి చేసుకోను? తమ గురుదేవులు ఇచ్చారం టున్న దీన్ని నాకివ్వడంలో అర్ధమేంటి? తమరేదీన్ని ఉంచుకోడం సబబేమో ! "  అంది.

" అమ్మా! ఇది  ఇంత కాలం నావద్ద ఉన్నా నేను సరిగా ఉపయోగించలేదు. నీకు ఊపయోగించవచ్చు ఉంచు తల్లీ! " అని ఆమె చేతుల్లో దాన్ని ఉంచి ఆ వేద పండితుడు గ్రామం వదలి  వెళ్ళిపోయాడు.           
                
మరునాడు  శాంతమ్మ తమ ఇంట కాసిన జామకాయలు కోసి పేద పిల్లలకు పంచుదామని ఆ తట్టలో ఉంచింది. వెంటనే అవి రెండింతలయ్యాయి. ఆమె ఆశ్చర్యంగావాటిని పక్కన ఉంచి తమ పెరటిలోని అరటి గెలలో పండిన కాయలు కోసి ఆ తట్టలో ఉంచింది, అవీ వెంటనే రెట్టింపయ్యాయి. శాంతమ్మ వాటి నన్నింటినీ పెద్ద గంపలో ఉంచుకుని ఊరి బయట ఉంటున్న పేద వాడకెళ్ళి అన్నీ పంచి వచ్చింది. ఆ మధ్యాహ్నం పక్కింటి వనజమ్మ వచ్చితాను చేసిన లడ్డు ఒకటి ఆమె కిచ్చింది రుచి చూసి చెప్పమని.  శాంతమ్మ ఆమె ముందే దాన్ని పండితు డిచ్చిన తట్టలో ఉంచగా రెండు లడ్లయ్యాయి. శాంతమ్మ ఆ రెండు లడ్లనూ తీసి మరలా తట్టలో ఉంచగా అవి నాలుగయ్యాయి, వాటిని తీసి మరలా ఉంచగా అవి 8 అయ్యాయి, అలా తన పెద్ద గంప నిండగానే శాంతమ్మ వాటిని తీసుకెళ్ళి పొలం పనులు చేస్తున్న రైతు కూలీలకు పంచి వచ్చింది. శాంతమ్మతట్ట మహత్యం వనజమ్మ ద్వారా ఆనోట ఆనోటా ఊరంతా తెలిసిపోయింది. మరునాడు శాంతమ్మ తన పొరుగు గ్రామంలోని పేదవాడలోని ప్రజలు చలికి తట్టు కోలేక పోతున్నట్లు వినగానే తన రాగికాగు అమ్మి, వచ్చిన డబ్బుతో ఒక మంచి రగ్గు కొని దాన్ని ఆ తట్టలో ఉంచగానే రెండయ్యాయి, వాటిని మరలా ఉంచగానే నాలుగయ్యాయి, అలా ఆమె వాడ వారికి సరిపడా రగ్గులు వచ్చాక వెళ్ళి  వారందరికీ మొత్తం  రగ్గులు పంచి వచ్చింది.    

మరికొన్నాళ్ళకు అతి వృష్టికి  బాహుదా నదికి ఉప్పెన రాగా కట్టు బట్టలతో సహా కొట్టుకు పోయి నిరాశ్రయులైన పొరుగు గ్రామస్తుల బాధలు చూసి, తన ఇంట మిగిలి ఉన్నఇత్తడి బిందెను అమ్మి, ఆడబ్బుతో చీర, పంచె,దుప్పటి కొని ఆ తట్టలో ఉంచగానే అవి రెట్టింపయ్యాయి, అలా వాటిని ఆ గ్రామస్తులకు సరిపడా చేసి తీసు కెళ్ళి పంచి వచ్చింది. అంతేకాక వారు తిండికి సైతం ఇబ్బంది పడుతున్నట్లు గమనించి, తన ఇoటవున్న బియ్యం, పచారీ సరుకులు ఆ తట్టలో ఉంచి, అవి రెట్టింపవుతూ పెరగగానే తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి వచ్చింది. ఇదంతా గమనిస్తున్న పక్కింటి పిసినారి భాగ్యమ్మ ఎలాగైనా మహత్తుగల ఆ తట్టను కాజేసి తన నగలను రెట్టింపు చేసుకోవాలని భావించి ఓ రాత్రి శాంతమ్మ నిద్రిస్తున్న సమయంలో అలాంటి మరో ఈతతట్టను అక్కడ ఉంచి శాంతమ్మ తట్టను తెచ్చుకుని తన బీరువాలో దాచు కుంది. మరునాడు శాంతమ్మ ఇతరులకు ఏమైనా ఎలా ఇవ్వగలదో చూడాలని ఏదో పని ఉన్నదానిలా ఆమె ఇంటికెళ్ళింది. 

శాంతమ్మ ప్రతిరోజూ ఉదయాన్నే పెద్ద బాన నిండా రాగి గంజి కాచి పల్లెలోని పిల్లలందరికీ పంచేది. ఆరోజు ఉదయాన్నే యధా ప్రకారం బాన నింపుకుని బయల్దేరింది. భాగ్యమ్మ అదిచూసి " ఏంవదినా ! నీ  నిత్యకృత్యం మొదలెట్టావా!" అని పలకరించింది ." ఔను వదినా ! ఆ పిల్లలు నాకోసం ఎదురుచూస్తుంటారు, వచ్చాక తీరు బాటుగా మాట్లాడతాను." అని చెప్పి వెళ్ళాక, భాగ్యమ్మకు అనుమానం వచ్చింది.' శాంతమ్మ ఇంత గంజి ఆ తట్టమహత్యం లేకుండా ఎలా కాచింది? నన్ను మోసం చేయను అసలు తట్టను మరోచోట దాచిందేమో! ఎందుకైనా మంచిది ఆమె వచ్చేలోగా ఆతట్ట తెచ్చి ఉంచి, అసలు తట్ట ఎక్కడుందో తెల్సుకుని  తీసుకెళ్ళ వచ్చు.' అనుకుని, తాను దొంగిలించిన తట్టను తెచ్చియధాస్థానంలో ఉంచింది.శాంతమ్మ తిరిగి రాగానే మరలా వచ్చి,   " ఏం వదినా ! గంజి పంచడం ఐపోయిందా!  ఓ ముంతెడు గంజికాస్తావా ఆబాన నిండను?"అని అడగ్గా,  " లేదు వదినా! నేను అత్యవసర మైనపుడు మాత్రమే ఆమహత్యం గల తట్టను వాడతాను, ప్రతిరోజూ నేనే రాగులు విసిరి గంజి కాస్తాను . కేవలం ఆపత్కాలంలో ఇతరులకు సాయపడను మాత్రమే దాన్ని ఉపయోగిస్తా ను. భగవంతుడు మనకు శక్తి ఇచ్చినపుడు, దాన్ని ఉపయోగించక పోడం సోమరి తనం, దొoగతనం,నేరమూ అవు తాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయను మన శక్తి  చాలనపుడు మాత్రమే ఆ శక్తిని  ఉపయోగించాలనేది నా మతం." అని చెప్పగానే భాగ్యమ్మకు ఙ్ఞానోదయమైంది.    
రచన :- ఆదూరి హైమవతి
--------------------------------------------------
మీరూ 'జనవిజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
*Republished
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top