తెలుగు అంతర్జాతీయ భాష అవడం గురించి మనకి గత కొన్ని సంవత్సరాలుగా తరుచూ వినిపిస్తోంది. తెలుగువాళ్లు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లోనూ ఉన్నారు. అందులోను ఇంగ్లీషు దేశభాషగా వున్న అమెరికా లోను, ఇంగ్లాండులోను చాలా ఎక్కువమంది వున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల మాట్లాడబడుతున్న భాష కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!

అమెరికాలోని డెట్రాయిట్‌ లోను, న్యూజర్సీ లోను, డాలస్‌ లోను తెలుగు సాహిత్యం పట్ల చెప్పుకోదగ్గ ఆసక్తి ఉన్నవాళ్ళు దాదాపుగా ప్రతి నెలా సమావేశమై సాహిత్య చర్చ లు, పుస్తక విమర్శలు ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ ఔత్సాహికులు ప్రచురణ రంగంలో కూడా తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక రకమైన అంతర్జాతీయత. కాని, ఈ సాహిత్య సమావేశాలు డెట్రాయిట్‌లో జరిగినా, ఇంకే ఊరిలో జరిగినా కూడా విజయవాడలో జరిగినట్లే ఉంటాయి. లేదా హైదరాబాదులో జరిగినట్లు ఉంటాయి. తమ చుట్టూ వున్న ఇంగ్లీషు ప్రపంచం మీద ఇవి ఏ రకమైన ప్రభావాన్నీ కలిగించవు. ఆ ప్రపంచ ప్రభావం కూడా వీటి మీద ఏమీ వుండదు. ఇది కాక ఇంకా పెద్ద యెత్తున కొన్ని లక్షల డాలర్లు ఖర్చుపెట్టి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి తానా, ఆటా లాంటి సంస్థలు ఉత్సవాలు జరుపుతాయి. వాటికి తెలుగుదేశం నుంచి పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, తెలుగు సినిమా తారలు, మతాధిపతులు డజన్ల కొద్దీ వస్తారు. వీటిలో తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు, తెలుగు భోజనాలు, కూరలో కరివేపాకు లాగా కాస్త సాహిత్యము, ఇవే తెలుగు తనమైతే ఇవి ఈ సమావేశాల్లో పుష్కలంగా కనిపిస్తాయి.

అసలు విషయమేమిటంటే ఇక్కడ తెలుగు కుటుంబాలలో తల్లిదండ్రులు తెలుగు వాళ్లు, వాళ్ల పిల్లలు అమెరికా వాళ్లు. వాళ్లు తెలుగు భాషని గుర్తించగలిగేది తెలుగు అంతర్జాతీయ భాష అయినప్పుడే. ఈ సందర్భంలో ఒక భాష అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది అనే ప్రశ్న వేసుకుని చూద్దాం. ఒక భాషలో వున్న విజ్ఞానం ప్రపంచ విజ్ఞానంలో భాగం అయి, ప్రపంచంలో విజ్ఞానులు దానిని గుర్తించవలసిన అవసరం కలిగితే, అప్పుడు అది ప్రపంచ భాష అవుతుంది. ఆ రకంగా ప్రపంచ భాషలయినవి గ్రీకు, సంస్కృతం, రోమన్‌, లాటిన్‌, చైనీస్‌, జపనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌... ఇలాంటి భాషలు. తను పుట్టి పెరిగింది ఏ భాషలోనైనా సరే ఈ భాషల్లో వున్న విజ్ఞానం తన భాషలోకి అనువదించుకుని చదివి తీరాలి. సాధ్యమైతే ఆ భాషలు నేర్చుకుని, ఆ పుస్తకాలు మూలంలో చదివి ఆ విజ్ఞానం మీద పట్టు సంపాదించాలి.

ఇలాంటి విజ్ఞానం తెలుగులో వుందా? తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమా? అలా పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే ఇదిగో నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపం చంలోని విజ్ఞానులు విన్న రోజున, ఆ మాట విని వాళ్లు తెలుగు నేర్చుకున్న రోజున, లేదా తెలుగు పుస్తకాల అనువాదాలు చదివిన రోజున, చదివి అందువల్ల వాళ్లు గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున- అప్పుడు తెలుగు ప్రపంచ భాష అవుతుంది.
తెలుగు ఇలాంటి ప్రపంచ భాష కావాలంటే తెలుగు వాళ్ళు పది మంది తెలుగు వాళ్ల మధ్య కూర్చుని తెలుగు చాలా అందమైన భాష అని, చాలా మృదువైన భాష అని, చాల తియ్యని భాష అని సరదాగా పొగుడుకుంటే చాలదు.అమెరికాలో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘాలు సమావేశమై, సరదాగా కబుర్లు చెప్పుకుని, తెలుగు భోజనాలు చేసి, ఇంటికెళ్లి తమ ఉద్యోగాల్లో పడిపోతే తెలుగు ప్రపంచ భాష అవదు.

ఈ సందర్భంలో తెలుగు దేశంలో తెలుగు స్థితి ఎలా వుంది అన్నది ముందు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణ లోనూ వున్న విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు ఏంచేస్తున్నాయి? నిష్టూరమైనా, నిజం చెప్పాలంటే వీరు పీహెచ్‌డీల పేరుతో గత యాభై యేళ్లుగా తయారు చేయిస్తున్న సిద్ధాంత వ్యాసాలలో ఏ రకమైన విజ్ఞానం కనిపిస్తుందో చెప్పడానికి పట్టుమని పది వాక్యాలు కూడా అక్కర్లేదు. తెలుగు రాష్ర్టాలలో వున్న ఈ తెలుగు శాఖలు దాదాపుగా నిర్జీవంగా వున్నాయి. వీళ్లు చెప్తున్న పాఠాలు, ఇస్తున్న పీహెచ్‌డీ డిగ్రీలు ఎవరికీ ఏ రకంగాను పనికిరాని స్థితిలో వున్నాయి. కష్టంగా తోచవచ్చు కానీ తెలుగు శాఖలకి అంతర్జాతీయ ప్రమాణాలలో పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం రాయించగలగడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు.

విశ్వవిద్యాలయాలలో ఈ శాఖల ఆకారం పాశ్చాత్య దేశాల నుంచి అరువు తెచ్చుకున్నది. లాంఛనాల దృష్ట్యా, పరిపాలనా విధానాల దృష్ట్యా, నియమాల దృష్ట్యా కాగితం మీద ఇవన్నీ చాలా పకడ్బందీగా కనిపిస్తాయి. కానీ ఇదంతా ఆకారపుష్టి మాత్రమే. అందులో వున్న అంతస్సారం చూస్తే డొల్ల తప్ప మరేమి కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం లో వున్న తెలుగు శాఖలు నిరంతర నిర్జీవస్థితిలో ఎన్నాళ్లు వుంటాయో అక్కడి వాళ్లు నిబ్బరంగా ప్రశ్న వేసుకోగలగాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలకి, తెలుగు శాఖల్లో వుండే అధికారులకి ఇవి పనికొచ్చే ఆలోచనలవుతాయని మా ఆశ.

ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య వ్యవస్థలకి ప్రతిరూపాలే కాబట్టి అవి ఎలా పని చేస్తున్నాయో అక్కడి పరీక్షావిధానాలు, పఠన పాఠన పద్ధతులు, డిగ్రీల వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో సాధ్యమైనంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన రాష్ర్టాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఎక్కువశాతం రాజకీయ అవసరాల కోసం యేర్పడ్డవి. అవి విద్యావసరాలకోసం పని చేసే పరిస్థితి కల్పించాలంటే ఆ పని లోపలి నుంచే జరగాలి. తెలుగు శాఖల్లో ప్రస్తుతం ప్రధాన స్థానాల్లో వున్నవాళ్లు ఒక స్వచ్ఛంద కూటమిగా యేర్పడి, ఏ ప్రభుత్వప్రమేయం, ఏ రాజకీయ ప్రబోధం అక్కర లేకుండా, ఇంగ్లండ్‌లోను, అమెరికాలోను, కెనడాలోను ఉన్న ఇండియన్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్లలో పని ఎట్లా జరుగుతోందో, వాళ్లు విద్యార్ధుల్ని ఎలా ఎంపిక చేసుకుని చేర్చుకుంటున్నారో, ఆ విద్యార్ధులకి ఏ రకమైన ప్రోత్సాహాలు కల్పిస్తున్నారో? ఆ సమాచారం సంపాందించాలి. ఆ విద్యార్ధులు పిహెచ్‌.డి. కోసం పరిశోధన చేసే ముందు ఏ విధమైన శిక్షణ పొందుతారో, ఏ ఏ విధానాలు, భాషలు నేర్చుకుంటారో, వాళ్లు తమ పరిశోధన ప్రణాళికని ప్రతిపాదించడం కోసం ఏ రకమైన పరిశ్రమ చేస్తారో, ఎలా తర్ఫీదు పొందుతారో తెలుసుకోవాలి. పరిశోధన ప్రణాళిక తయారు చేసిన తరువాత ఆ విద్యార్ధులు తమ పథకాన్ని అధ్యాపకుల ముందు ఎట్లా సమర్ధించుకుంటారో, వాళ్ల ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్తారో గమనించాలి. ఆ శాఖల్లో తెలుగు ఉండకపోవచ్చు. తరుచూ ఉండదు కూడా. కానీ వాళ్ల విధానాలు, శిక్షణలు తెలుసుకోవడానికి తెలుగే అక్కర్లేదు.

తెలుగులో ప్రచురణ సంస్థల స్థితి పరమ విషాదకరంగా వుంది. వాటి మీద ఆధారపడకుండా ఉండాలంటే ముఖ్యమైన విశ్వవిద్యాలయాలకి బలమైన ప్రచురణ విభాగాలు ఏర్పడాలి. పరిశోధన గ్రంథం విశ్వవిద్యాలయం ప్రచురిస్తే దానికి గౌరవం ఉంటుంది అనే సంప్రదాయం ఏర్పడాలి. అప్పుడు ఎవరి పుస్తకాన్ని వాళ్లే ప్రచురించుకునే ఇప్పటి పద్ధతినుంచి పరిశోధకులకి విముక్తి కలుగుతుంది. వ్యాపార గ్రంథాల ప్రచురణకర్తలకి, వైజ్ఞానిక గ్రంథాల ప్రచురణకర్తలకి, మన ప్రాంతంలో తేడా లేదు. ఆ తేడా ఏర్పడటానికి విశ్వవిద్యాలయాలు పరిశ్రమించాలి. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, హార్వర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాలు పుస్తక ప్రచురణలో ఏ పద్ధతులు అనుసరిస్తాయో గమనించి అవసరమైతే అక్కడ కొన్ని నెలల పాటు శిక్షణ పొంది రావడానికి తగినవాళ్లని పురమాయించి తమ ప్రచురణలని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలి.

పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఉదాహరణకి, అమెరికన్‌ ఆంత్రొపాలజికల్‌ సొసైటీ, అమెరికన్‌ హిస్టారికల్‌ సొసైటీ, అసోసియేషన్‌ ఫర్‌ ఏషియన్‌ స్టడీ్‌స, జెర్మన్‌ ఓరియంటల్‌ సొసైటీ, రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీ- ఇలా. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పడాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణ లోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరాలి. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ ముఖ్యంగా రెండు పనులు చేయాలి.

1. సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించాలి. ఈ పని తెలుగు దేశంలో అప్పుడప్పుడు యు.జి.సి ఇచ్చిన డబ్బులతో జరగడం, అక్కడి పత్రా లు పుస్తకంగా బయటకు రావడం కనిపిస్తుంది. కానీ ఈ పని ప్రతి సంవత్సరం జరగాలనీ, ఆ సదస్సుల్లో ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు అందరూ పాల్గోవాలని, అలా పాల్గోవడం వాళ్ల పరిశోధనా సామర్ధ్యానికి ఒక ప్రమాణంగా ఏర్పడాలని మా సూచన.

2. దానితో పాటు ఈ సంస్థ సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపాలి. ఆ సంచికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించాలి. ఇలాటి పత్రికలను ఇతర దేశాలలో ఇతర వైజ్ఞానిక సంస్థలు ఎలా నడుపుతున్నాయో, వారు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో క్షుణ్ణంగా చూసి వాటిలో పనికొచ్చే పద్ధతులు మనం అనుసరించాలి. (ఇలాంటి పత్రికలు ఇండియాలో కూడా ఇంగ్లీషులో వున్నాయి. ఉదాహరణకి, ఇండియన్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ హిస్టరీ రివ్యూ (ఐఉఖిఏఖ) ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఉ్కగి) , కాంట్రిబ్యూషన్స్‌ టు ఇండియన్‌ సోషియాలజీ (ఇఐఖి) వంటివి. ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తున్నాయి. ఈ ప్రమాణాలలో తెలుగు పరిశోధన పత్రిక ఒక్కటి కూడా లేదు). ఇది కొనేవాళ్లు, చదివేవాళ్లు తక్కువ మందే వుంటారు. తెలుగు దేశంలో వున్న తెలుగు శాఖల అధ్యాపకులు అందరూ ఈ పత్రిక కొనాలని, చదవాలని, అందులో తమ పరిశోధన వ్యాసం ప్రచురించబడితే అది తమకొక అర్హతగా భావించాలని, అలాంటి అర్హతల ఆధారంగానే వాళ్ల పదోన్నతులు ఉండాలని ఒక సంప్రదాయం ఏర్పరచాలి. ఏమీ ప్రచురించని వ్యక్తికి ఉద్యోగంలో ఎదుగుదల వుండకూడదు.

ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, ఆస్ర్టేలియా, జర్మనీ వంటి దేశాలలో భారతదేశాన్ని గురించి చెప్పుకోదగ్గ పరిశ్రమ జరుగుతోంది. ఈ దేశాల విశ్వవిద్యాలయాలలో ఇప్పుడిప్పుడే తెలుగు గురించి జిజ్ఞాస మొదలవుతోంది. అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ఒక ఆచార్య స్థానం ఏర్పడింది కూడా. ఇది తెలుగుకి పాశ్చాత్య ప్రపంచంలో మొదటి ఆచార్య స్థానం. మరికొన్ని సంవత్సరాలలో ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్య స్థానాలు ఏర్పడతాయి. మన తానాలు, ఆటాలు తలుచుకుంటే ఇవి చాలా త్వరలోనే యేర్పడవచ్చు.

అలా అక్కడ ఏర్పడబోయే ఆచార్య స్థానాలకి తగిన వారిని ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణ లోను వున్న విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల వారు పంపించగలరా? తెలుగు దేశంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా తయారు కాకుండా ఒట్టి డొల్ల పీహెచ్‌డీలు ఇచ్చి కాలం గడుపుతామంటే అటువంటి వారు ఈ ఉద్యోగాలకి అర్హులు కారు. అమెరికాలో వున్న తెలుగు ప్రొఫెసర్‌ స్థానానికి తగినవారు మా దగ్గర తయారయిన వారిలో ఎవరూ లేరు అనే స్థితిలో మన తెలుగు శాఖలు వున్నాయా!

కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఆధునిక విద్యని తయారుచేసే స్థానం కోల్పోయింది. చేతనైనంతవరకూ ఆధునిక విజ్ఞానులకి సమాచారాన్ని అందించే స్థానంలోనే వుంది. ప్రపంచవిజ్ఞానం పశ్చిమ దేశాల్లో ఎలానూ తయారవుతోంది కదా, మనం దానిని ఎరువు తెచ్చుకుని వాడుకుంటే చాలు, అదేగొప్ప అనే స్థాయి నుంచి, మన దగ్గిర ఆధునిక ప్రపం చం నేర్చుకోవలసిన ఆలోచనలూ, విధానాలూ ఉన్నాయని మనం వారికి చెప్పగలిగేలా ఎదగాలి. ప్రపంచీకరణ అంటే ఎరువు తెచ్చుకోవడమే కాదు, ఎరువు ఇవ్వడం కూడా అని తెలుగు విద్యార్థులూ, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలూ గుర్తించాలి. తెలుగు అంతర్జాతీయ భాష అవడానికి మనం చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణం విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో మొదలవాలి.

-వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్‌ ( ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి లోనిది )
*Republished
 -------------------------------------------------------
ప్రజ లో తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి.ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.
-------------------------------------------------------
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top