మేష్టారూ !  
ధూమ శకట గమనా గమన నిదర్శన తామ్ర పట్టిక 
లేచి ఉన్నదా? దిగి ఉన్నదా?
 • భాషాభిమానం ! - వెర్రి వ్యామోహం !! - ఆచరణలో చేయాల్సిందేమిటి? 
 • మనం తెలుగు భాషపై ప్రేమతో ఇతర భాషలను చులకనగా చూడడం, కొన్నిసార్లు కొందరు కించపరచడం చేస్తుంటారు. ప్రతీది తెలుగులో స్పష్టం గా మాట్లాడాలని ఆరాటపడుతుంటారు. తెలుగు భాషపై అభిమానముండడంలో తప్పే లేదు. ఇతర భాషలను తూలనాడడమే తప్పు. 
 •  మన తెలుగుకు మనవాళ్లెవరూ చేయని కృషి బ్రౌన్ చేశాడంటే, కన్నడిగుడైన రాయలు దేషభాషలందు తెలుగు లెస్స అన్నా, అది తెలుగులో ఉన్న గొప్పదనమే. దానిని మనం ప్రత్యేకించి వాదులాడి చెప్పాల్సిన అవసరం లేదు. 
 • ఎన్.టీ.ఆర్ వచ్చేంతవరకూ తెలుగును పట్టించుకోని తెలుగు పాలకులనేమనాలి? తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని సంతసమిల్లి పోటీ పెట్టకుండా మద్దతిస్తే పీ.వీ తరువాత ఏమి చేశాడు. పోనీ 15 భాషలు నేర్చుకున్న పీ.వీ తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగువారికి చేసిందేమిటి? 
 • కనుక, భాష గొప్పదనం భాషలోనే ఉంటుంది. ఎవడు కించపరిచినా అది తగ్గేదీ, తరిగేది కాదు. ఎప్పటికప్పుడు మెరుస్తూనే ఉంటుంది. మెరుగవుతూనే ఉంటుంది. వాడుక భాషలో కొన్ని కొత్త పదాలు కలగా పులగంగా పుట్టుకొస్తాయి. కొత్త కొత్త వస్తువులను కనుక్కున్నప్పుడు వాటిని తెలుగులో కంటే వేరే భాషలోనే పలకడం, చెప్పడం తేలిక. అలా చెపితేనే భావం అర్ధమవుతుంది మరి. 
 • అలాంటి సందర్భాలలోనూ " ఏను తెలుగు వల్లభుండా" అనుకుంటూ స్వచ్చమైన తెలుగు వాడడం లేదని అజ్ఞానులను తిట్టిపోయద్దండీ. తెలుగు భాష గొప్పదనాన్ని ,స్వచ్చతనూ, సరళతనూ, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూనే సామాన్య ప్రజానీకం వాడే వాడుక భాషనూ, వారి భాషాపటిమ స్థాయిని గమనంలో ఉంచుకోవాలి. 
 • ఉదాహరణకు సిగ్నల్ (రైల్వే కు పాత కాలం లో ఉన్నది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉన్నది) అనాలనుకోండి. "ధూమ శకట గమనాగమన నిదర్శక తామ్ర పట్టిక " అనాల్నా? సిగ్నల్ అంటే సరిపోతుందా? ఆలోచించండి. 
 • ధూమ శకటమంటే పొగబండి అదేనండి బొగ్గింజనుతో నడిచే రైలు. గమనాగమన అంటే రాక పోకలను తెలిపే, తామ్ర పట్టిక అంటే తామ్రముతో చేసిన ప్లేటు అని అర్ధం . ఇదంతా అనే బదులు సిగ్నల్ అంటే ఈజీగా అర్ధమవుతున్నప్పుడు అదే వాడుక భాషలో వాడితే తప్పు కాదు. అక్కడ భావం అవసరం మేరకు కమ్యూనికేట్ అవుతుందా ? లేదా ? అనేదే పాయింట్. 
 • భాష అనేది మానవ పరిణాం క్రమం లో వచ్చింది. మనిషి అవసరాలరీత్యా సైగలు అనుభవం తో స్వరపేటిక అభివృద్ధి అయి భాష ఏర్పడింది. తరువాత లిపి వచ్చింది. ఇది ప్రాంతాలను బట్టి సమూహాలను బట్టి వివిధ రకాలుగా విరాజిల్లుతూ వచ్చింది. విరాజిల్లుతూనే ఉంది. 
 • తరువాత కాలం లో రాజ్యాలు - వలసలు - ఆక్రమణలు ఏర్పడి దోపిడీదారుల భాషే ప్రపంచ భాషగా ఏర్పాటయింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం వల్ల ఆంగ్ల భాష రాజ భాషగా , అలా...అలా ప్రపంచ భాష అయింది తప్ప దానికేమీ ప్రత్యేకతలు లేవు. ఆ మాటకొస్తే మన తెలుగులా అందులో తీయదనమే లేదు. మన ఉభయగోదావరులంత విస్తీర్ణం లేని ఇంగ్లాండు వారి భాష ప్రపంచ భాష కావడానికి కారణం సామ్రాజ్యవాద దోపిడీయే. 
 • అన్ని అక్షరాలను స్పష్టంగా పలకగలిగే + వ్రాయగలిగే మన భాష నిజం గా గొప్పదే. అందుకే " దేశ భాషలందు తెలుగులెస్స" అన్నా, " ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్"గా పేరొందినా మన భాషలో వ్రాసిన గ్రాంధికాలూ, వాటిల్లో ఉన్న ఔన్నత్యాలూ నేటికీ సామాన్యులకు అందకపోవడం విచారకరం. 
 • అయితే మన భాష గొప్పదే. కానీ ఆ గొప్పదనం కోసం నేటి సమాజ పరిస్తితులలో మడిగట్టుకు కూచుంటే కుదరదు. శాస్త్రీయంగా ఆలోచించినా ఇది సరికాదు. తెలుగు భాషమీద ప్రేమ అంటే ఇతరభాషలను ద్వేషించడం కాదు. తెలుగును తక్కువ చేసి ఆదిపత్య పైత్యం కోసం మమ్మీ డాడీ విష సంస్కృతిని తలకెక్కించుకోవడమూ కాదు. 
 • తరతరాలుగా తెలుగు వారు జాతికందించిన అద్భుత సంస్కృతినీ అందులో ఉన్న గొప్పదనాన్ని భావి తరాలకు అందిస్తూ పతనమవుతున్న విలువలను కాపాడడమే. చాలా చాలా మంచి విషయాలు చెప్పిన మన తాత్వికులను, ఉదాహరణకు అన్నమయ్య, వేమన ల తత్వగతులు అద్భుతమైన మానవతా విలువలున్న భాండాగారాలు. వాటిని మంచి ఉదాహరణలతో సరళం గా అందరికీ పంచుదాం. 
 • మాట్లాడేది అర్ధం కావడమే ముఖ్యం తప్ప భాష కాదు. భాషను బ్రతికించుకోవాలంటే, ఇతర భాషాపదాల వాడకం తగ్గాలంటే తేలికగా ఉండే తెలుగుపదాలను సృష్టించాలి. అలా ప్రయత్నిస్తే కష్టం కాకపోవచ్చు. అలా తయారయిన తెలుగు పదాలను మాట్లాడేటప్పుడూ - వ్రాసేటప్పుడూ వాడడం ఇతరులచేత వాడించడం చేద్దాం. మన తెలుగును నిరంతరం అభివృద్ధి చేసుకుందాం.
 • ఇప్పటికే తెలుగు అభివృద్ధికి అంతర్జాలం లో చాలామంది మితృలు మంచి కృషి చేస్తున్నారు. వారికి అండగా నిలుద్దాం ! ఈ కృషి చేసే మరింత మందిని తయారు చేద్దాం !!
- పల్లా కొండల రావు.
*Re-published

Post a Comment

 1. సైన్సులో మాకు హైస్కూల్‌లో ఎనిమిది, తొమ్మిది తరగతులలో జఠర నిర్గమ సంవరణి కవాటం అన్న్ అపదం ఉండేది. అర్ధమేమిటంటే పేగులలోని ఆమ్లం వనక్కి వెళ్ళకుండా ఆపే కవాటం అని. అప్పట్లో మా సైన్స్ టీచర్ దానిని పైలోరిక్ కవాటం అనే నేర్చుకొమ్మని మాకు చెప్పారు.

  ReplyDelete
 2. ఆంగ్లంలో సిగ్నల్ అన్నాడు కాని, ట్రైన్ సిగ్నల్ అని కాని స్టీం ఇంజన్ సిగ్నలని కాని అనలేదుకదా. అటువంటప్పుడు పైత్యం కాకపోతే, సిగ్నల్ అన్న ఆంగ్ల పదానికి తెలుగులో అంత సాగతీసి ధూమశకట గమనాగమన నిదర్శన తామ్ర పట్టిక అనిచెప్పటం ఎంతవరకూ సబబు. చాలా సులభంగా, సిగ్నల్ ని "సూచి" అంటే సరిపోదా! కొత్త పదాలను తయారు చేస్తున్నామనుకుంటూ, డ్రాయింగ్ రూముల్లో కూచుని తాము మాత్రమే పండితులం అనుకునేవాళ్ళు "మాటలు" వండితే ఇలాగే ఉంటాయి. సామాన్యుల నోళ్ళల్లో అద్భుతమైన తెలుగు పదాలు పుట్టుకు వస్తాయి. అవ్వే భాషను నిలబెట్టేవి కాని, అనువాదకుల వల్ల కాదు. తెలుగులో కొత్త మాట రావటం అంటే మరొక భాష నుండి అనువాదం అన్న వెర్రి నుండి బయటపడాలి. అప్పుడే పండితులమనుకునే వాళ్ళు కూడా కొత్త మాటలను సామాన్యులతో సమంగా ఆలోచించగలుగుతారు అని నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. << చాలా సులభంగా, సిగ్నల్ ని "సూచి" అంటే సరిపోదా! కొత్త పదాలను తయారు చేస్తున్నామనుకుంటూ, డ్రాయింగ్ రూముల్లో కూచుని తాము మాత్రమే పండితులం అనుకునేవాళ్ళు "మాటలు" వండితే ఇలాగే ఉంటాయి. సామాన్యుల నోళ్ళల్లో అద్భుతమైన తెలుగు పదాలు పుట్టుకు వస్తాయి. అవ్వే భాషను నిలబెట్టేవి కాని, అనువాదకుల వల్ల కాదు. తెలుగులో కొత్త మాట రావటం అంటే మరొక భాష నుండి అనువాదం అన్న వెర్రి నుండి బయటపడాలి. అప్పుడే పండితులమనుకునే వాళ్ళు కూడా కొత్త మాటలను సామాన్యులతో సమంగా ఆలోచించగలుగుతారు అని నా అభిప్రాయం.>>

   మీ అభిప్రాయం బాగుంది ప్రసాద్ గారు. కామెంట్ కు ధన్యవాదములు.

   Delete
 3. ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి.

  ఇంగ్లీష్‌లో లక్షన్నరకు పైగా పదాలు వుంటే తెలుగులో ఎన్నున్నాయి?
  ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా?
  తెలుగు, ఇంగ్లీష్ వ్యాకరణాలలో గల తేడా ఏమిటి?
  తెలుగు వ్యాకరణాన్ని ఏవిధంగా పరిపుష్టి చేయవచ్చు?
  కొత్త తరాల వారు తెలుగంటేనే ఎందుకు హడలి చస్తున్నారు?
  తెలుగీకరించిన భౌతిక, రసాయనిక పాఠ్య పుస్తకాలను చూస్తే ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి?
  కొత్త పదాలను తెలుగీకరించినప్పుడు అవి కృత్రిమంగా ఎందుకు ధ్వనిస్తున్నాయి?
  కొత్తపదం కావాల్సిన ప్రతిసారీ సంస్కృతంపై ఎందుకు ఆధారపడుతున్నాం?
  తెలుగు పద నిర్మాణంలో గల లోపాలేమిటి? చేయవలసిన మార్పులేమిటి?

  ఇటువంటి అనేక ప్రశ్నలను వేసుకుని వాటిపై దార్శనికత గలిగిన తెలుగు పండితులు తగు మార్పులకోసం కృషి చేస్తే, ఆ మార్గదర్శకాలను అమలు చేయడానికి రెండు ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తే కొంత పురోగతి సాధించొచ్చు.

  ReplyDelete
  Replies
  1. ఇది రాజకీయసంబంధిత చర్చకాదన్న అవగాహనతో వ్రాస్తున్నాను.

   మీ "ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా? " అన్నది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. భాషలను కొన్ని విధాలుగా వర్గీకరించారు. అది భాషాశాస్త్రం. దాని గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు దానికి సంబంధించిన చర్చ బాగుంటుంది - ముఖ్యంగా అవగాహన ఉన్నవారి మధ్యనే అది పరిమితమైనప్పుడు. ఎన్ని అక్షరలున్నాయీ? ఎంత తక్కువ అక్షరాలుంటే అంత గొప్ప భాషా వంటి పశ్నలు అశాస్త్రీయం.

   వివిధ భాషావ్యాకరణాల మధ్య విచారణకూడా భాషాశాస్త్రపరమైనదే.

   తెలుగు వ్యాకరణం అన్నది కావ్యాలకు ప్రశస్తి సంప్రదాయకవిత్వమూ బాగా ఉన్నరోజుల్లో భాషాస్వరూపానికి సంబంధించిన లక్షణాలను వివరించేదిగా ఉంది. వ్యావహారిక భాషకు సరైన వ్యాకరణం లేదు. ఉన్నా దానికి అంత ప్రశస్తి రాలేదు. వ్యావహారిక భాష అనేది వివిధ ప్రాంతాల్లో వివిధంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యాక్రణమూ, ఒక పదజలమూ సహాయంతో నిర్వచించటం కష్టంగా ఉంది. ఇప్పుడు వాడుతున్న భాష శిష్టవ్యావహారికం అనేవారు నిన్నటిదాకా. ఉన్నఫణంగా దీని విస్తారంగా అన్నిప్రాంతాలకూ అన్వయింపజేయటం కూడ కొన్ని వివాదాలకు దారితీయవచ్చును. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి.

   పాఠ్యగ్రంధాల్లో రశ్మ్యుద్గారత అనే పదం చూసి అసలు ఎందరికి ఇది నోరు తిరుగుతుందా అని నాడే మా బోంట్లకు అనుమానం వచ్చింది. ఇలాంటి వింతమాటలు ఇబ్బంది కలిగించాయన్నది వాస్తవం. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నదానికి చరవాణి అన్న మాట చాలా మందే వాడుతున్నారు. అది కొందరికి నవ్వు కలిగించవచ్చును. ఆలోచించండి - తమిళులు బస్సు అన్న దానికీ తమిళ పదం తయారు చేసుకుని వాడుతున్నారట. మనకి మన తెలుగుమీదే చులకన భావం కాబట్టి ఇంగ్లీయు పదాలే బాగుంటాయి. అన్నం అనటానికి బదులు రైస్ అనటం అందంగా ఉండే జాతి మనది.

   కొత్తపదాలు బాగున్నా మన తెలుగుదనం లోపించిన తెలుగువారికి కృత్రిమంగానే తోస్తాయి. ఏనుగు అంటే మా తమ్ముడి కూతురికి అర్థం కాలేదు. ఎలిఫెంట్ అని చెప్పాక, మరి ఏనుగంటావేం? అని అడిగింది! అమ్మా అనటమే మనకు నచ్చని తరాలలో తెలుగు అన్నదే కృత్రిమంగా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం.

   తెలుగు పదాలు అజంతాలు, అచ్చులతో పూర్తయే పొట్టిపదాలు చాలావరకు. సంస్కృతంలో ధాతుజన్యమైన పదాలు ఒకదానితో ఒకటి అతుకు పెట్టి ఏకసమాసం చేయటానికి వీలుగా ఉంటాయి. భాషా లక్షణాలలో బేధమే కారణం.

   తెలుగుపదనిర్మాణంలో లోపాలేమీ లేవు. లేని బాగులు మనం చేయలేము. భాష లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను కదా తెలుగులో. అందువలన ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది.

   భాషను ముందుకు తీసుకొని పోయేది జనమే. ప్రభుత్వాలు కానేకాదు. ముందు తెలుగువారం తెలుగులో మాట్లాడటం సిగ్గు అనుకోవటం భేషజం వదిలించుకోవాలి. కొత్తతరాలవారికి తెలుగు ఎవరూ నేర్పనిదే ఎలా వస్తుంది? ఇంటా బయట గొప్పకోసం ఇంగ్లీషు. ఇంట్లో అమ్మా నాన్నా కూడా తెలుగువారై ఎక్కడి పిల్లలకు తెలుగు పట్టుబడుతుందో అన్న భయంతో, ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ ఉంటే, ఇంక పిల్లతరాలకు తెలుగు పరాయి భాషకాదా? కావుకావు మనలేని కాకి ఉంటుందా అన్నాడు జంఘాలశాస్త్రి సాక్షివ్యాసాలలో. తెలుగులో మాట్లాడినందుకు పిల్లలను శిక్షించే బడులే కాదు తల్లిదండ్రుల్నీ చూసాను నేను.

   ముందు జనానికి తెలుగులో మాట్లాడటం తప్పు కాదు తప్పనిసరి ఐన బాధ్యత అని అవగాహన కల్పించండి. క్రమంగా మంచి మార్పులు అవే వస్తాయి.

   Delete
  2. ""ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి." అన్నారు శ్రీకాంత్ చారి గారు.
   వినదగు నెవ్వరు చెప్పిన. కాబట్టి ఈ మాటా ఆలకించటమైనది.
   ప్రస్తుతం సమస్య "మాతృభాషకన్నా ఇంగ్లీషు గొప్పభాష అన్న భ్రమ కారణంగా ఇబ్బడిముబ్బడి అవుతున్న ఇబ్బందులు". మా అమ్మ మంచిది అనుకోవటం ఎన్నడూ అహంకారం కాదు. మా అమ్మకంటే ప్రక్కింటి వాళ్ళమ్మే గొప్పది అని అనుకోవటం మంచి సంస్కారం కూడా కాదు. ఆవలి వారి అమ్మకన్నా మా అమ్మ ఎక్కువ చరువుకొనక పోయినా, ఎక్కువ అందంగా లేకపోయినా, ఎక్కువ ముసలిది ఐనా, రోగిష్టిది ఐనా, మంచి మాటతీరు లేనిది ఐనా, సామాజికంగా గుర్తింపు లేనిది ఐనా, .... ఇంకా సవాలక్ష కారణాలున్నా, మా అమ్మ నాకు మంచిది అని అందరూ అనుకుంటారు. బయటివారు పోలికలు తీసుకొని వచ్చ్జి అలా మా అమ్మ మంచిది అనుకోవటం అహంకారం అంటే అది వారి అమాయకత్వమా, అజ్ఞానమా, దురుసుతనమా, మరొకటా అన్నది ఎవరికి వారు వేరువేరుగా అనుకున్నా, అలా అనటాన్ని హర్షించలేరు.

   ఈ మధ్య కొందరు భాషను ఒక పనిముట్టు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి భాష అమ్మే!

   Delete
  3. శ్యామలీయం గారు, మాతృభాషను అమ్మతో పోల్చి చెప్పిన మీ పదాలు అమ్మలా కమ్మగా ఉన్నాయండీ. ఈ ఒక్క వాక్యం చాలు భాషపై ప్రేమ ఎలా ఉండాలో చెప్పడానికి. ఏదో సినిమాలో చెప్పినట్లు అమ్మను ప్రేమించలేనివాడు భార్యను ప్రేమించలేడు అని. అమ్మను ప్రేమించినవాడు ఎవరినైనా ప్రేమించగలడు. ఎవరిని ఎలా ప్రేమించినా అమ్మ పై ఉండే ఆ ప్రేమ అది వేరే గదా! మన భాషను మనం ప్రేమించుకోవాలంటే భాష తెలిసినవారు భాషా ప్రావీణ్యం కోసం గాక అందరికీ అర్ధమయ్యేలా తేలికైన తెలుగు పదాలను తయారు చేయాలి. అందరికీ పరిచయం చేయాలి. వాడుకలో పెట్టాలి. కొన్ని కష్టమైనా ఇష్టంతో చేస్తే , చెపితే వినననే తెలుగువారుండరు. వ్యామోహంతో ఆధిపత్యపైత్యం కోసం ఇంగ్లీష్ మీడియంపై అవసరానికి మించిన మోజు పడేవారు తప్ప తెలుగును ప్రేమించవద్దని ఎవరూ అనరనే నా అభిప్రాయం.

   Delete
  4. ఒకరిని మరొకరు అర్ధం చేసుకోవడానికి భాష అనే టూల్ కావాలి. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఏది గొప్ప ఏది తక్కువ అన్న మీమాంసలు తద్వారా ఆవేశకావేశాలు వస్తాయి.

   అన్ని భాషలు (తమతమ స్థాయి వరకు) గొప్పవి. ఎలాంటి జ్ఞానం పొందడానికి ఎ భాష అవసరమో గుర్తించి దాన్ని అలా స్వీకరించాలి. భాష కోసం కుమ్ములాటలు అక్కరలేదు. మన దేశంలో భాష ఆధారంగా స్వపరబేధాలు రావడం శోచనీయం.

   Delete
  5. శ్రీకాంత్ చారి గారు, ఎన్ని అక్షరాలన్నది ఏ విధంగా సమస్య అని మీరనుకుంటున్నారు? మన భాషలో ఏ పదాన్ని ఎలా పలకాలో వ్రాసి కూడా చూపగలం. ఇంగ్లీషులో ఆ సౌకర్యం ఉన్నదా? ఉచ్చారణకు తగ్గట్లుగా మన భాషలో వ్రాసినట్లుగా అంగ్లానికి ఆ సౌకర్యం లేదుగా? వ్యాకరణంలో కూడా మనదైన ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగు భాషలో వాడుకలో లేని లు.లూ లు (అసలువి టైప్ చేయలేము) మాయమై పోయాయి. అలాగే ప్రజలకు అవసరం లేనివి ఎవరెంత బలవంతంగా నైనా ఉంచలేరు. కొనసాగించలేరు.

   మా భాష గొప్పదనుకోవడం తప్పు కాదు. మా భాషే గొప్పదని వాదిస్తే తప్పవుతుందేమో. మీరన్నట్లు పాఠ్య గ్రంధాలలో మితిమీరిన తెలుగు పదాల పైత్యం కొంత తగ్గించాలి. ఒక తెలుగు సబ్జెక్టులో మాత్రం తెలుగు భాషకు చెందిన గొప్పను కొనసాగించాలని నా అభిప్రాయం కూడా. ఆ సమస్య అనువాదకుల అతి పైత్యం వల్ల ఏర్పడినదని నా అభిప్రాయం.

   తెలుగు పదాల సంఖ్యను పెంచాల్సిన అవసరం అదీ జన సామాన్యానికి అందరికీ అనువుగా ఉండేలా తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నది. అసలు అమ్మ అని పిలిపించుకోవడం నామోషీగా కొందరు తయారు కావడం ఓ పక్క జరుగుతుంటే కొత్తపదాల తయారీ జరుగుతుందా అనేది అనుమానమే. అయినా ప్రయత్నించి సాధించాల్సిందే.

   మీరన్న మిగతా సూచనలను 2 రాష్ట్రాల వారు దృష్టిపెట్టి పరిష్కరించేందుకు పూనుకుంటారని ఆశిద్దాం.

   Delete
  6. కొండలరావు గారు,

   నేను తెలుగు పండితుడిని కాదు. అలాగని ఇంగ్లీషు పండితుడినీ కాదు. కాబట్టి మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేను.

   ఇక పోతే నాకు తెలిసినంత వరకు కేవలం 26 అక్షరాలతో కూడా మనకంటే ఎక్కువ రకాల శబ్దాలే ఆంగ్లంలో పలుక వచ్చు. నేనేదో ఇంగ్లీషుకు వకాల్తా పుచ్చుకోవడం లేదు, నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్పాను.

   అలాగే నా ఉద్దేశంలో 56 అక్షరాలు ఎక్కువే. ఒకే విధంగా పలికే అక్షరాలు రెండు రెండు అనేకం ఉన్నాయి మన భాషలో. అవన్నీ పునః పరిశీలించ వచ్చు. మన పొరుగు వారైన తమిళులు కేవలం 30 అక్షరాలు వాడుతున్నారు. ఎక్కువ అక్షరాలు ఉండడమన్నది నేర్చుకోవడానికి మొట్ట మొదటి సమస్య. ఆ తర్వాత ఏ అక్షరం వాడాలి అన్న విషయంలో సందిగ్ధాలు సరే సరి. మనం వేంకటేశ్వరుడు అని రాస్తాం, కాని వేంకటేష్వరుడు అని పలుకుతాం, కాదంటారా? ఇలాంటివి ఎన్నో వున్నాయి. అక్షరాలను రేషనలైజ్ చేయడం అన్నది భాషను సరళీకరించడంలో ముఖ్యమైనది.

   నేను భాషను గొప్పదనుకోవద్దనలేదు. నేను తెలుగు అభిమానినే. అందుకనే తెలుగు పదికాలాల పాటు మారిన ప్రపంచంలో మనగలిగే మార్పులు రావాలి అంటున్నాను. "అలా ప్రపంచ భాష అయింది తప్ప దానికేమీ ప్రత్యేకతలు లేవు. ఆ మాటకొస్తే మన తెలుగులా అందులో తీయదనమే లేదు." అనడం సరికాదు. ఏ భాష గొప్పదనం, తీయదనం ఆ భాషకుంటుంది. మాదే గొప్ప భాధ అనుకోవడం సరికాదనేదే నా భావన. ముఖ్యంగా భాషాభివృద్ధికి కృషి చేయాలంటే అలా అస్సలు అనుకోకూడదు. ఎక్కడ సంతృప్తి పెరుగుతుందో అక్కడ అభివృద్ధి కుంటు పడుతుంది.

   ఇక తెలుగు పదాల విషయానికి వస్తే "ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది." అని శ్యామలీయం గారు సెలవిచ్చారు. అది నూటికి నూరుపాళ్ళు నిజం. నేననేది భాషావేత్తలు ఆ సుళువుని తెలుగుకి కూడా తెచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనభాషలోనే కొత్తపదాలు సృష్టించుకోవచ్చు. "రష్మ్యుద్గారత" అంటూ సంస్కృత ప్రదాలను అరువు తెచ్చుకోనవసరం లేదు.

   ఆ సుళువు సంస్కృతానికే ఎందుకుండి తెలుగుకు ఎందుకు లేదు అన్న విషయంలో మరింత పరిషోధన జరగాలి. అటువంటి సుళువు తేవడం కోసం వ్యాకరణంలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. చిన్నయసూరి వ్యాకరణం దానికి సరిపోదని నా భావన. ఎలాగ అని అడిగితే మాత్రం నాకు తెలియదు, దానికి సమాధానం వెతకవలసి వుంది. ఆ విధమైన సాధికారిక వ్యాకరణం ఉన్నపుడు పదాల తయారీ నవ్వులాట వ్యవహారం కాబోదు. ఇది ఒక భారీ ప్రయత్నం కాబట్టే ప్రభుత్వాల సహకారం అవసరమని చెప్పాను.

   Delete
  7. జై గారు, ఏ జ్ఞానం పొందాలన్నా మాతృభాషలో అయితే ఈజీగా పరిపూర్ణంగా ఉంటుంది కదా? ఏ జ్ఞానాన్నైనా ఆయా మాతృభాషలలోనికి తర్జుమా చేసి చెప్తే బాగుంటుంది. ఆ సందర్భంలో భాషమీద మితిమీరిన మమకారంతో కారంగా చెప్పకుండా విషయం అర్ధం కావడమనే మొదటి ప్రాధాన్యతకు తియ్యటి విలువ ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఆ మేరకు పదాలు పొందికగా ఉండాలి. మీరన్నట్లు భాషలపై మితిమీరిన మమకారాలు అవసరం లేదనేది నా అభిప్రాయం కూడా. అదే సందర్భంలో మాతృభాషపై ఉండాల్సిన ప్రేమను పరాయి భాషలమీద అవసరం లేని మోజు ఉండకూడదు.

   Delete
  8. కొండలరావు గారూ, అన్ని విషయాలు అన్ని భాషలలో తర్జుమా చేయడానికి బోలెడంత ఖర్చు అవుతుంది. తర్జుమాలో ఎంతో జ్ఞానం కూడా పోతుంది. అనేకసార్లు మీరు చెప్పిన ధూమ శకటం తరహా గందరగోళాలు కూడా జరుగుతాయి.

   మాతృభాష, పరాయి భాష అనే తేడాలు అనవసరం. రెంటి పని & ప్రయోజనం ఒక్కటే మరియు సమానం కాబట్టి దేని మీదా అతి ప్రేమ/వ్యామోహం/మోజు ఉండకూడదు.

   Delete
  9. @శ్రీకాంత్ చారి26 November 2014 18:08:00 GMT+5:30

   తక్కువ అక్షరాలతో భాషను తగు భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించగలిగితే సంతోషమే.

   అయితే ఇక్కడ వ్రాయలేను గానీ మన భాషలో జల్లెడ , చాప(mat) అనే వాటికి ప్రత్యేక అక్షరాలున్నాయని మీకు తెలుసు. ఆ ప్రత్యేకత ఇంగ్లీషులో అయితే లేదనే అనుకుంటున్నాను. మిగతా భాషల గురించి నాకు తెలీదు.

   మీరన్నట్లు ప్రతి అక్షరానికి 2 ఉండడం అంటే , ఒత్తు కి ఏదైనా చేర్చి తగ్గించవచ్చేమో పండితులు ప్రయత్నిస్తే తప్పు లేదు.

   భాష పది కాలాలపాటు మనగలగాలనుకోవడమే తెలుగు భాషపై నిజమైన ప్రేమ ఉన్నవారెవరైనా మీరన్నట్లు కొన్ని మార్పులు చేయాల్సినదని నేనూ అంగీకరిస్తున్నాను.

   ఇంగ్లీషు భాష ప్రపంచ భాష కావడానికి కారణం సామ్రజ్యవాదమే. అయితే ఆ భాష గొప్పదనాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదనే మీ వాదనతో ఏకీభవిస్తూ నా తప్పును సరి చేసుకుంటున్నాను.

   నాకు తెలుగు వ్యాకరణం కొంతమేరకు తెలుసు కానీ సంస్కృతం అసలు తెలీదు. ఇంగ్లీషు ది మిడిమిడి జ్ఞానమే కనుక నేనేమీ వ్యాఖ్యానించలేను.

   తెలుగు పదాలు సులువుగా తయారు చేయాలనేదే నా బాధ కూడా. నెట్ లో కూడా చాలామంది ఉదాహరణకు వీవెన్ గారి లాంటి వాళ్లు తెలుగుపదాల పెంపుకు ప్రయత్నిస్తున్నట్లు అప్పుడప్పుడు చూస్తున్నాను. ఈ కృషి బాగా పెరగాల్సిన అవసరం ఉన్నది.

   మీరన్నట్లు తెలుగు పది కాలాలపాటు మనగలగాలంటే పండిత భాషతో పాటు పామరులకూ తెలుగువారందరికీ అర్ధమయ్యేలా అన్నింటా తెలుగుపదాల సంఖ్యా పెరగాల్సిన అవసరం ఉన్నది.

   ఆ బాధ్యత పండితులు తెలిసినవారూ తీసుకుంటారని ఆశిద్దాం.

   Delete
  10. Jai Gottimukkala26 November 2014 18:37:00 GMT+5:30 గారు,

   < మాతృభాష, పరాయి భాష అనే తేడాలు అనవసరం. రెంటి పని & ప్రయోజనం ఒక్కటే మరియు సమానం కాబట్టి దేని మీదా అతి ప్రేమ/వ్యామోహం/మోజు ఉండకూడదు >

   రెంటి పనీ ప్రయోజనం ఒక్కటి కావు. ఎవరి మాతృభాషలో వారికి బాగా అర్ధమవుతుంది. కాబట్టి ఎవరి భాషలో వారికి జ్ఞానం అందేలా విజ్ఞాన విషయాలు తర్జుమా చేయాలని నా అభిప్రాయం.

   దేని మీదా అతి ప్రేమ, మోజు ఉండకూడనేది అంగీకరిస్తాను. కానీ మాతృభాష మీద మమకారం తప్పక ఉంటుంది. ఆ మమకారం వేరే భాషపై ద్వేషం పెంచేదిగా ఉండకూడదు. అంటే భాషోన్మాదం ఉండకూడన్నమాట.

   అందరూ అన్ని భాషలూ నేర్చుకోలేరు గనుక ముఖ్యమైన వైజ్ఞానిక విషయాలను ఆయా ప్రభుత్వాలు ఆయా మాతృభాషలలో తర్జుమా చేసి అందిస్తే బాగుంటుంది. చైనాలాంటి దేశాలలో అయితే ఒకటే భాష కనుక సమస్య లేదు.

   Delete
  11. కొండలరావు గారు,

   ౘాపకు, చాపకు పలకడంలో తేడా ఏమిటో నాకు తెలియదు. బహుషా ఆ అక్షరం వాడడం వాడుకలో లేనందువల్ల ననుకుంటా.

   ౙ అనే అక్షరాన్ని ఆంగ్లంలో Z అనే అక్షరంతో పలుకుతారు. ZOO అనే పదాని మనం ౙూ అని పలకాలి, కాని చాలామందికి తెలియక అలా పలకరు. "జ" కారాన్ని పలకడానికి ఆంగ్లంలో J, G, Z, X అక్షరాలను రకరకాల ధ్వనులతో వాడతారు.

   రోజురోజుకు పెరుగుతున్న ఙ్ఞాన సముద్రానికి అణుగుణంగా పెరిగే శక్తి మన భాషకు లేదని ఇప్పటికే తేలిపోయింది. అలా అందుకోవడానికి చేసే ప్రయత్నంలో సంస్కృతాన్ని, ఆంగ్లాన్ని ఆశ్రయిస్తూ కృతకమైన పదాలను సృష్టిస్తున్నాం. ఆ భాషల వెంట పరిగెత్తుతూ ఆకాశమార్గం పట్టిన తెలుగుని భూకంపం తెప్పించి భూమార్గం పట్టించాలి. భూమి మీదకి తెచ్చి వదిలెయ్యక దానికి బలమైన పునాది వేయాలి, మరో వెయ్యి సంవత్సరాల వరకూ తిరుగులేని విధంగా దన్ని మార్చాలి. అందుకోస్మ్ పండితులు చాదస్తాన్ని కాస్త వదిలేసి వినూత్న ధృక్పథంతో ఆలోచించాలి.

   Delete
  12. శ్రీకాంత్ చారి గారు,

   ౘాప, పప్పు చారు ఈ రెండూ వేరు వేరు ఉచ్చారణలండీ. తెలుగులో ఒకప్పుడు పెద్ద బాల శిక్ష అనేది ఉండేది. తరువాత కొందరు తెలుగు మాస్టార్లు మంచిగా చెప్పేవారు. తరువాత చాలామంది టీచర్లకు తెలుగు సరిగా వ్రాయని వారు నాకు తెలుసు.

   మన భాషలో పదాలను పెంచాల్సిన అవసరం అందుకు పండితులు తమ పైత్యాన్ని పక్కకు పెట్టకపోతే మీరన్నట్లు తెలుగుకు ప్రమాదం ఏర్పడుతుంది. దళితుల్ని ఆలయ ప్రవేశం వద్దంటే దళితుల దగ్గరకే దేవుడొచ్చినట్లు తెలుగు పదాల సంఖ్యని పెంచకపోతే మన భాష కలగాపులగం కావడం ఖాయం. మీరన్నట్లు కృతకమైన పదాలు గాక అచ్చ తెనుగు పదాల పెంపుకు తగిన కృషి జరగాలని ఆశిద్దాం. 2 ప్రభుత్వాలు కూడా ఆ విధంగా పొందికైన తెలుగు పదాల పెంపుకై కంకణం కట్టుకోవాలి.

   ౙల్లెడ అని వ్రాయడం మీ వల్ల నేర్చుకున్నాను. ౘాప వ్రాయడమూ వచ్చింది. ఈ పోస్టు మీతో చర్చా లేకుంటే ఇది రాకపోయేది. రోజూ లేఖిని వాడుతున్నా ఆ అవసరం రాలేదు. మీరెలా వ్రాసి ఉంటారని చూసి నేర్చుకున్నాను. ఇంగ్లీషులో సిలబుల్స్ ఉన్నా తెలుగు అంత సౌకర్యం లేదు.

   Delete
  13. నా అభిప్రాయాలు క్రోడీకరించి వ్రాసిన టపా శ్యామలీయంలో చూడండి :‌ పల్లెప్రపంచంలో తెలుగు భాష పైన ప్రశ్న - నా అభిప్రాయాలు
   ఈ టపాలో నా మూడవ వ్యాఖ్య మరింత పెద్దగా ఉంది. అందుకే‌ టపా.

   Delete
  14. కొండలరావు గారు,

   టైపింగు కోసం లేఖినిలో "సహాయము" అన్న లింకు నొక్కితే వివరంగా వుంటుందండీ.

   ఇక పోతే తెలుగు లిపి పరిణామం గురించి ఇక్కడ కొంచెం తెలుసుకోవచ్చు. కేవలం సంస్కృత పదాలు దిగుమతి చేసుకోవడానికోసమే 19 అక్షరాలు పుట్టించారని చెప్పారు ఇక్కడ. తమిళులు సంస్కృత పదాలు స్వీకరించినా, తమ లిపి లోకే మార్చుకుంటారు.

   ఒకటి మాత్రం నిజం. భాషను సరళీకృతం చేయకుండా సార్వజనీనం చేయడం కష్టం. కాని చాదస్తులకు అది నచ్చదు. ఒకప్పుడు భాషని క్లిష్టతరంగా వుంచి సామాన్యుల దరి చేరనివ్వకుండా చేయవలసిన అవసరం కులీనులకు వుండింది. కాని ఇప్పుడంత సీను లేకపోయినా, చాదస్తం మాత్రం వదలటం లేదు. కాని అటువంటి వారు ఎంత అడ్డు పడాలని చూసినా గత శతాబ్ద కాలంలోనే తెలుగు అనేక మార్పులను చవిచూసింది. ఎవరికి ఇష్టమున్నా లేక పోయినా ఇకముందు మరిన్ని మార్పులు జరగడం కూడా తథ్యం.

   Delete
  15. అవును శ్రీకాంత్ చారి గారు లేఖినిలో "సహాయము" ద్వారానే నేర్చుకున్నానిప్పుడు. కానీ మీరు ౘ,ౙ లు వ్రాసేవరకూ , శ్యామలీయం గారు ఌ,ౡ లు వ్రాసేవరకూ రోజూ లేఖిని వాడుతూనే ఉన్నా నాకింతవరకు తెలీదు. అందుకు మీ ఇద్దరికీ ధన్యవాదములు.

   ఇటీవలే గూగుల్ వాడు మొబైల్ చాటింగ్ కు తెలుగు కీ టూల్ విడుదల చేశాడు. వాట్సప్ వంటి వాటిలో కూడా తెలుగులో డైరెక్టుగా మెసేజ్ చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుందనుకుంటాను.

   మీరిచ్చిన సమాచారం తెలుగులో అసలు అక్షరాలు 37 పోస్టు ఆసక్తి కరంగా ఉన్నది. ఆ వెబ్సైట్ లో వివరాలు వీలుని బట్టి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు ధన్యవాదములు లింకు ఇచ్చినందుకు.

   ఎందుకంటే మా పల్లె ప్రపంచం విజన్ లో తెలుగు భాషాభివృద్ధికి కృషి అనేది ఓ అంశమే.

   భాషను సరళీకృతం చేయకుండా సార్వజనీనం చేయడం కష్టమనేద్ మీ అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను. అసలందరం చేయాల్సినది ఆ కృషే. చాదస్తం ఎందులోనైనా అభివృద్ధికి ఆటంకమే.

   మన భాషపై ప్రేమ ఉన్నవారు దానిని మీరన్నట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. అది సక్రమంగా శాస్త్రీయంగా జరగాలి తప్ప చాదస్తంగానైతే కాదు. సామాన్యుల దరి చేరనీయకుండా చేసే కుట్ర మనస్తత్వం ఎందైనా ప్రమాదమే.

   కులీనులు అంటే సరైన అర్ధం ఏమిటండి?

   ఎవరికో ఇష్టం కోసం కాదు. మన తెలుగువారందరికోసం ప్రపంచం లో తెలుగు భాష కూడా తన గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలని ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు మనమంతా కూడా మద్దతిద్దాం.

   మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నందుకు ధన్యవాదములు.

   Delete
  16. " తమిళులు సంస్కృత పదాలు స్వీకరించినా, తమ లిపి లోకే మార్చుకుంటారు."
   ఏమి వింతమాట! సంస్కృతపదాలను తెలుగువారం ఏ లిపిలో వ్రాస్తున్నామండీ? తెలుగులిపిలో కాదా?
   మీరు బహుశః పొరబడ్డారు. తమ భాషలోనికి మర్చుకుంటారు అనదలచుకున్నారా? ఐనా అసంగతంగానే ఉంది.

   ఏదో చారస్తం అన్నారు. (చాదస్తం అన్న మాట ఛాందసం అన్నమాటకు భ్రష్టరూపం) చాదస్తం ఏమీ ఎవరికీ లేదండీ. పానుగంటివారూ, చిలకమర్తీ అంతా వ్యావహారికంలో వ్రాసినా మన తెలుగువాడకం తగ్గేసరికి అవి నేటి కాలం వారికి గ్రాంథికం ఐపోయింది. మాట్లాడేభాషకన్నా వ్రాసే భాషారూపానికి కొంచెం హెచ్చు ప్రామాణికత కావలసి ఉటుంది కాబట్టి ఉత్తరాలూ, పత్రికలూ అన్నీ కొద్దిగా పదిలమైన తెలుగులో ఉండేవి. ఇప్పుడు తెలుగువాడకం మీడియాలో ఎంతందంగా ఉందో మీరూ చూస్తున్నారు కదా? అక్షరాలు పదాలు, వాక్యనిర్మాణాలు అన్నీ బండబూతుల్లా తయారయ్యాయి. కారణం తెలుగుభాషలోపమా మన తెలుగుమట్లాడటమే తగ్గించిన మన అవివేకమా?

   Delete
  17. చాదస్తం అంటే అవసరానికి మించీ అవసరం లేకున్న పాతదానినే పట్టుకునే వేళ్లాడడం అని నేననుకుంటున్నాను. ఆ పదాన్ని అలా వాడడం సరయినది కాదాంటారా సర్?

   Delete
  18. శ్యామలీయం గారు,

   >>> ఏమి వింతమాట! సంస్కృతపదాలను తెలుగువారం ఏ లిపిలో వ్రాస్తున్నామండీ? తెలుగులిపిలో కాదా?

   మీ మాటలే వింతగా వున్నాయి. తమిళంలో కేవలం 30 అక్షరాలు మాత్రమే వాడతారని ఇదివరకే చెప్పాను. సంస్కృత పదాలను కూడా ఆ ముప్పై అక్షరాలతోనే రాస్తారు తప్ప మరో 19 దిగుమతి చేసుకోరని ఆవేశం తగ్గించి చర్చ మొత్తం చదివితే తమకు అర్థమై వుండేదనుకుంటాను.

   >>> ఏదో చారస్తం అన్నారు. (చాదస్తం అన్న మాట ఛాందసం అన్నమాటకు భ్రష్టరూపం) చాదస్తం ఏమీ ఎవరికీ లేదండీ.

   మీరు చాదస్తులని ఎవరూ అనలేదే? అయినా ఎవరికీ లేదని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నారు?

   Delete
  19. కొండలరావు గారు,

   కులీనుఁడు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
   సం. విణ. (అ.ఆ.అ.)
   మంచికులమునఁ బుట్టినవాఁడు.
   కులీనుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
   n. a man of good lineage, high descent or respectable family, one who is well-born.

   Delete
  20. ....... మరో 19 దిగుమతి చేసుకోరని......

   అవునాండీ? నామాటలే వింతగా ఉన్నాయా? తెలుగులిపిలోనికి 19 అక్షరాలను దిగుమతి చేసుకున్నామా? ఎక్కడినుండి? అచ్చతెలుగులో మహాప్రాణాలు (వత్తు అక్షరాలు) లేవు. నిజమే. ఉదాహరణకు బ అనే అక్షరం అచ్చతెలుగులో ఉంది కాని భ అనే అక్షరం లేదు. ఆ భ అనేది సంస్క్ర్తతంలోని भ అనే మహాప్రాణాక్షరం వాడటంకోసం తెలుగువారు బ నుండి సాధించుకున్న కొత్త అక్షరం. అంటే బ అనే అక్షరానికే కొంత రూపాంతరం చేసి వత్తు అక్షరాన్ని రూపొందించుకున్నారు. అంతే కాని ఏ మహప్రాణాక్షరస్వరూపమూ కూడా ఎక్కడినుండీ తెచ్చుకున్నది కాదు. అందుచేత, బ అనేది ఎలాగు తెలుగులిపిలోని అక్షరమో అలాగే భ అనేది తెలుగులిపిలోని అక్షరమే కాని తదన్యం కాదు.

   కొండలరావుగారూ, మీకు లోగడనే మనవి చేసినట్లుగ ఇలాంటి రాగం-తానం-పల్లవి చర్చల్లో పాల్గొనేందుకు నాకు ఎంతప్రయత్నించినా ఆసక్తి కలగటంలేదు. రాజకీయాలకు సంబంధించిన చర్చకాన్నప్పుడు అభ్యంతరం లేదని అన్నమాట వాస్తవమే కాని, సాగతీతలవ్యవహారాన్ని మనం అన్ని రకాల చర్చల్లోనూ నడిపించగల పరిస్థితిలో నా వల్ల కాదు.

   Delete
  21. శ్యామలీయం గారు, చర్చ వల్ల ఉపయోగం తప్పక ఉంటుంది. మీతో చర్చించకపోతే నాకు తెలుగు భాషపై ఇంత సమాచారం తెలియదు కదా? చర్చలన్నాక అన్ని రకాల మనస్తత్వాల వాదనలూ ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసి వ్యక్తిగత నిందాలాపనలు లేవు.

   Delete
  22. ఒప్పుకుంటాను, కాని చర్చలో పాల్గొనే వారికి నిరంతరం సమాధానాలు చెప్పుకోవలసిన పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంది. నాకు నిజంగా అంత తీరిక లేనేలేదు. ఉ॥8నుండి రా॥8వరకు వృత్తిగతమైన పనుల్లో నాకు నిరంతరాయంగా వివరణలిచ్చుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ వాదించటం, అందులోనూ నా దృష్టిలో అవశ్యపరిహార్యమైన పాయింట్లమీద చర్చించటం అసాధ్యంగా ఉంది. జవాబులు పరంపరగా వ్రాస్తూ పోకపోతే అది నా మీద లేదా నా అభిప్రాయాలమీద దురదృష్టకరమైన ప్రభావం చూపుతుంది. అది సమ్మతించవలసిన విషయం కాదు కదా.

   Delete
  23. శ్యామలీయం గారు,

   >>> తెలుగులిపిలోనికి 19 అక్షరాలను దిగుమతి చేసుకున్నామా?

   మీ వ్యాఖ్యలోనే జవాబు వుంది.

   ఇక పోతే సాగదీస్తున్నది మీరు. మీరు వ్రాసిన మూడు వ్యాఖ్యలనూ నేను ఇప్పటివరకు పరిశిలించి విమర్శించే ప్రయత్నం చేయనే లేదు. అప్పుడే మీరు సమాధానలు చెప్పుకునే వరకూ వెళ్ళారు!

   Delete
  24. కొందరిని అన్నింటా కొన్నిసార్లు కొన్నింటిని ఇగ్నోర్ చేసుకుంటూ మనం చేయగలిగింది చెప్పగలిగిందీ చేసుకుంటూ వెళ్లడమనేది కామెంట్ కళలో ఓ భాగం. మీ పిలుపుమేరకు నేను వ్రాసిన ఆర్టికల్ లో మాటే మీకు చెప్తున్నాను సర్. మీరలా ఉంటూ అవసరమైన మేరకు మీ అనుభవాన్నీ, జ్ఞానాన్ని అవసరమైన వారికి, అందుకుందామనుకునేవారికీ అవసరం మేరకు అందించాలనేదే నా విన్నపం.

   Delete
  25. >>> వివరణలిచ్చుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ వాదించటం, అందులోనూ నా దృష్టిలో అవశ్యపరిహార్యమైన పాయింట్లమీద చర్చించటం అసాధ్యంగా ఉంది.

   ఒక సారి చర్చ మొత్తం గమనిస్తే ఎవరు పనిగట్టుకొని వచ్చి వేరే వారి వ్యాఖ్యలను కోట్ చేసి మరీ వ్యాఖ్యానిస్తున్నారో అర్థమవుతుంది. మీ వ్యాఖ్యల్లో నావి, జై వి వ్యాఖ్యలు ఎన్ని సార్లు కోట్ చేసి, అన్యాపదేశంగా ఖండించారో చూడండి. చర్చలో అదంతా భాగమే కనుక దానికి నా అభ్యంతరం లేదు. కాని మీరనేది మరోలా వుంది! ఇతరులు వచ్చి మిమ్మల్నేదో ప్రశ్నించినట్టూ, దానికి సమాధానాలు చెప్పుకోవడానికి సమయం లేనట్టూ రామాయణంలో పిడకలవేట మాదిరి ఉప చర్చ అవసరమా?

   ఈ విధంగా కావలసిన హడావుడి అంతా చేసేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా మాట్లాడడం, ఇతరులేదో సాగదీస్తున్నట్టు చిత్రించడం, గడుసరితనంగా లేదూ?

   Delete
  26. Q:..రామాయణంలో పిడకలవేట మాదిరి ఉప చర్చ అవసరమా??
   A: అవసరం లేదు. విరమించుకుంటున్నాను.

   Q:హడావుడి అంతా చేసేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా మాట్లాడడం, ఇతరులేదో సాగదీస్తున్నట్టు చిత్రించడం, గడుసరితనంగా లేదూ?

   A: మీ అభిప్రాయం మీది. కానివ్వండి. హడావుడి చేస్తున్నానంటున్నారు. అంత తీరిక లేదు. సెలవు.

   Delete
  27. శ్రీకాంత్ చారి గారు, ఇక్కడ విషయం కు పరిమితమై మాట్లాడగలిగే శక్తి మీకుందనే నా అభిప్రాయం. నేను మీకైనా శ్యామలీయంగారికైనా విజ్ఞప్తి చేసేది ఏదైనా శృతిమించిపోతుందనుకుంటే విషయానికి పరిమితమై వాదించి మిగతాది ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయగలరు. మిగతా చర్చంతా బాగుంది కొద్దిపాటి ఈ ఆవేశకావేశాలు తప్ప.

   Delete
  28. కొండలరావు గారు,

   నేను వారు వ్రాసిన మూడు వ్యాఖ్యల్లో కూడా నా వ్యాఖ్యల ప్రస్తావన వున్న, మిన్నకుండమే జరిగింది. కాని...

   >>> ఏమి వింతమాట! సంస్కృతపదాలను తెలుగువారం ఏ లిపిలో వ్రాస్తున్నామండీ? తెలుగులిపిలో కాదా?

   అంటూ సూటిగా అడుగుతున్నప్పుడు కూడా సమాధానం చెప్పకుండా వుంటే అది నా తప్పే అవుతుంది. గ్రహించ గలరు.

   Delete
  29. మళ్లీ వివరణలు వద్దు సర్. నేను మిమ్ములను తప్పు పడితేగదా వివరణ అవసరం. నేను మిమ్ములను గానీ శ్యామలీయంగారిని గానీ తప్పు పట్టడానికీ కామెంట్ చేయలేదని ముందు గమనించాలి. మీ ఇద్దరినుండి నేను నేర్చుకున్నాను గదా? అలాగే ఇంకా చాలామంది నేర్చుకునే అవకాశం ఉన్నది కదా? తెలుగు మీద మాష్టారికి కాస్త మమకారం ఎక్కువని మనకు తెలుసు కదా? ఆయనేమి దుందుడుకు స్వభావి కాడు గదా? అందుకే మీకు సలహా ఇచ్చాను తప్ప ఇక్కడెక్కడా మీ వాదన తప్పని నేనలేదు. తప్పైనప్పుడు తప్పని చెప్పగలను కూడా. కనుక విషయానికి పరిమితమై ఒకవేళ ఎవరైనా అన్నా మీరు ఇగ్నోర్ చేయండని చెప్పాను. మీకనే కాదు. ఇది నాకైనా శ్యామలీయం సర్ కైనా మార్గమే అని నేను భావిస్తున్నాను. మీరు మరోలా భావించవద్దని మనవి. మనమంతా కొన్ని సందర్భాలలో భావోద్వేగాలకు లోనవుతుంటాం. కావాలని రెచ్చగొట్టి వ్యక్తిగతంగా కోపంతో వ్యాఖ్యానిస్తేనో మరో విధంగా కించపరస్తేనో తప్పు తప్ప. భావోద్వేగాలలో జరిగేవి పట్టించుకోవద్దని మనవి. మనం మనుషులమే తప్ప మహాత్ములం కాదు. అన్నివేళలా అన్ని భావాలను బేలన్సుడుగా వ్యక్తపరచలేకపోవచ్చు ఎవరమైనా. ఒక్కో విషయాన్ని బట్టి అవతలి వ్యక్తులను అంచనా వేసి ఇగ్నోర్ చేసి అందులో అవసరమైన మేటర్ తీసుకుంటే చర్చ అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మనమలా చేయగలం, చేస్తున్నం కూడా. మరింత మెరుగు పరచుకుందామా కళని.

   Delete
  30. ఇంగ్లిష్‌లో "ట,డ,ణ"లు ఉండవు. ఇంగ్లిష్‌వాళ్ళు "t,d,n"లని పళ్ళ చిగుళ్ళు (alveolar ridge)తో పలుకుతారు. తెలుగు నుంచి "ట,డ,ణ"లని తొలిగిస్తే "గోల్కొండ" పేరుని తెలుగులో ఎలా వ్రాస్తాం?

   Delete
 4. @కొండలరావు:

  "రెంటి పనీ ప్రయోజనం ఒక్కటి కావు. ఎవరి మాతృభాషలో వారికి బాగా అర్ధమవుతుంది"

  ఇది వాస్తవం కాదు. ప్రతి కాన్సెప్టు ముందు ఏదో ఒక భాషలో వ్యక్తీకరించబడి ఉంటుంది. ఆ భాష (భావం యొక్క మాతృక)లో దాన్ని అర్ధం చేస్కోవడం అన్నిటి కంటే ఉత్తమం.

  అందరూ అన్ని భాషలు నేర్చుకోలేరు కాబట్టి తనకు వచ్చిన భాషలలో మాతృకకు అతి చేరువయిన (మినిమమ్ వరుస తర్జుమాలు ఉన్న) భాషలో చదివితే ఉత్తమం.

  "కానీ మాతృభాష మీద మమకారం తప్పక ఉంటుంది"

  ఉంటె ఉండొచ్చు కానీ అందరూ తమతమ భాషలను తల్లితో సమానంగా చూడాలని మంకు పట్టలేము. నాకు భాష ఒక టూల్ మాత్రమె.

  "చైనాలాంటి దేశాలలో అయితే ఒకటే భాష కనుక సమస్య లేదు"

  చైనాలో వందలాది భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హన్ దురభిమానులు మిగిలిన భాషలను నొక్కేసి తాము మాట్లాడే భాషను అందరిపై రుద్దారు. ఎన్నో దేశాలలో ఇదే పరిస్తితి.

  ReplyDelete
  Replies
  1. భాష ఓ టూలా? లేక తల్లిలా చూడాల్నా అనేది మరో చోట చర్చిద్దాము. చైనాలో ఇతర భాషలను అణగదొక్కడమనేది ఇప్పుడే తెలుసుకున్నాను.

   Delete
  2. ఇప్పుడు మనం చైనా వాళ్ళ్ళని ఇమిటేట్ చెయ్యాలా?

   భాష ధాతుజన్యం, అంటే క్రియ ముఖ్యం.ప్రతి భాషలోనూ నామవాచక పదాలు,క్రియా పదాలు,విశేషణ పదాలూ - ఇలా విభాగాలు వుంతాయి. కానీ తమాషా యేంటంటే మిగతా రకం పదాల్లో కూడా క్రియ గుప్తంగా వుంటుంది. వుదాహరణకి రాముదు అనేది మనిషి పేరు.కానీ దాని అర్ధం రమింపజేయువాడు అని. అంతే రమింప జెయ్యటం అనే క్రియ అందులో దాగి వుంది. కారా మాస్టారు తెలుగు వాక్యం అనే ఒక పుస్తకం రాసారని చదివాను.వాక్య నిర్మాణానికి సంబంధించిన సూత్రాలే భాషలకి ప్రత్యెకత నిస్తాయి.ఇంగ్లీషులో ఆబ్జెక్ట్ చివరికి చేరుతుంది.తెలుగులో కర్త,కర్మ ,క్రియ అన్నీ ఆ వరసలోనే వుంటాయి.


   పదాలు యెరువు తెచ్చుకోవడం తప్పు కాదు. పదుగు రాడుమాట పాడియై ధర జెల్లు నన్నట్లు మాట్లాడే వాడుక భాషే ముఖ్యం.భాషని పుట్టించే శక్తి కష్టజీవులకే వుంది! యెందుకంటే భాష పుట్టిందే పని కోసం కాబట్టి? ఒక పని చెయ్యాలంటే తను ఒక్కడే చెయ్యగలిగిన దయితే తనే వుపాయాలు ఆలోచించి చేసుకుంటాడు. కానీ ఇతర్ల సాయం అవసరం అయినప్పుడు తప్పనిసరిగా భాష కావాలి."నాకు నువ్వు ఈ సహాయం చెయ్యాలి" అని మరో మనిషిని అడగటానికే భాష పుట్టింది. పనిమంతులకి మాట్లాడటం ఒక అవసరం. ఆ అవసరం వున్నవాడు చిన్నయ సూరి కోసమూ చూడడు, రెన్ అంద్ మార్టిన్నూ వెదుక్కోడు.ఈ మధ్యనే ఫ్లై ఓవరుని ఒక పల్లెటూరి వాడు పైదారి అన్నాడని చదివాను.యేది బాగుంది?

   అలా వాక్యనిర్మానంలో తెలుగు యొక్క లక్షణాన్ని పాటిస్తున్నంతవరకూ యెన్ని రకాల పదాల్ని ఇముడ్చుకున్నా అది తెలుగే అవుతుంది.మాతృభాష అని యెందుకు అంటున్నాం అంటే మమకారం కోసం!పనిలో లీనమవ్వాలంటే పనిని ప్రేమించాలి.భాషని సరిగ్గా వాడుకోవాలంటే భాషని ప్రేమించాలి.ప్రతి భాషా మొదట అరుపులుగా కేకలుగా పుట్టిందే.ఆ అరుపుల్నీకేకల్నీ క్రమబధ్ధం చేస్తే అంటే వ్యాకరణాన్ని వుపయోగిస్తే భాష అయ్యింది.ఈ క్రమబధ్ధం చేసేవాళ్ళు యెక్కణ్ణించి వస్తారు?ఆ భాష మాట్లాదేవాళ్లలోంచే వస్తారు గదా!జై గారు పంచవేణీ సంగమం గురించి చెప్పుకుంటారు అన్ని రకాల పదాల్నీ కలుపుకోగలదని తెలంగాణాలో వినపదే తెలుగు గురించి.యేమండీ మీరొక్కరేనా కలుపుగోగలిగింది?కృష్నా జిల్లా మాందలికంలో అంతా తెలుగు పదాలేనా?వుర్దూ పదాలూ ఇంగ్లీషు పదాలూ లేవా?

   అసలు ఈ భిన్నత్వంలో యేకత్వం అనేది మన దేశానికే పరిమితమనీ ఇంకెక్కడా ఇలా లేదనీ కొందరెందుకో అదేపనిగా పొగుడుతారు?అమెరికాలో ఇప్పుడు అనేక జాతుల వాళ్ళు కలిస్ బ్రతకటం లేదా?రష్యా అంతా యేక మొత్తమయిన భూఖండమా?సెర్బియన్లు, బోత్స్నియన్లు లేరా?ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళిన మనిషి అక్కడ యెక్కువ కాలం వుండాలంటే చచ్చినట్టు అక్కడి భాషని నేర్చుకోవలసిందే గదా!ఆ మనిషి తిరిగి తన ప్రాంతాని వస్తే అక్కద నేర్చుకున్న మాటల్ని ఇక్కడా మాట్లాడితే ఇక్కడివాళ్ళకి నచ్చితే అందరూ అలవాటు చేసుకుంటే ఆ పదాలు ఈ భాషలోకి వొదిగి పోవడం లేదా?

   యేరుల జన్మం శూరుల జన్మం యేరికి తెలుసు?యే పదం యెప్పూదు పుట్టిందో యెప్పుడు చచ్చిందో యెప్పుడు మళ్ళె పుట్టిందో తెలుసుకోవాలంటే పదవ్యుత్పత్తి శాస్త్రం వుంది.భాష యెదగాలంటే వాడే వాళ్ళు కూర్చేవాళ్ళు ఇద్దరూ వుండాలి,వాళ్ళ మధ్య సయోధ్య వుండాలి!ఇవ్వాళ తెలుగు కున్న దుస్థితి కూర్చే వాళ్ళు లేకపోవటం మరీ గట్టిగా చెప్పాలంటే కూర్చుకోవటం మీద శ్రధ్ధ లేకపోవటం?!యెవడిష్ట మొచ్చినట్టు వాడు మాట్లాడుకోవాలనే దురద పరిమితి దాటింది.

   పనిమంతుడెవడూ ఇలా పిల్లితల గొరిగే చర్చలకి రాడు!వాడి కవసరమయిన భాషని వాడే సృష్తించుకోగలడు!పండితులు అతడు సృష్టించిన పదాల్ని వుపయోగించుకుని కావ్యాలు రచించి పేరు తెచ్చుకుంటారు?!

   కూర్చడం యెవరు చెయ్యాలి?అధికారం వున్నవాడు చెయ్యాలి!అధికారం యెలా వస్తుంది?పదే పదే వాడటం వల్ల పరిచయం పెరిగి జ్ఞానం విస్తారమయితే అధికారం వస్తుంది!అస్లు అన్ని అక్షరాలు యెందుకు,భాష తల్లి కాదు ఒక కట్టుగొయ్య మాత్రమే అనేవాళ్ళతో యేమి మాట్లాడగలం,అనవసరం!

   Delete
 5. పదవ్యుత్పత్తి శాస్త్రం=etymology(science of finding the history of words)

  ReplyDelete
 6. ఆసుపత్రి అనేది తెలుగు పదం కాదు. అది పోర్చుగీస్ నుంచో, ఇంకో యూరోపియన్ భాష నుంచో వచ్చింది. ఈ విషయం ఈనాడువాళ్ళకి తెలిస్తే వాళ్ళు దీని కోసం ఇంకో కర్ణ కఠోరమైన పదం కనిపెడతారు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top