దళిత, పేదల అభివృద్ధి పైనే ఆమె ధ్యాస... మహిళా అభ్యున్నతే ఆమె లక్ష్యం. నలుగురికి సేవ చేయడమే ఆమె బాధ్యత...జీవితాన్ని సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఆమే ఈశ్వరీబాయి. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆమె సేవలు మరువలేనివి. ఉద్యమ నాయకురాలిగా, రాజకీయ నేతగా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈశ్వరీ బాయి జయింతి నేడు. ఆమె జన్మించి నేటికి వంద సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆమె శతజయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ బడుగుల ఆశాజ్యోతి గురించి మానవి పాఠకుల కోసం...
పూర్వపు హైదరాబాద్‌ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి చేసిన వారిలో జెట్టి ఈశ్వరీబాయి ఒకరు. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు. హైదరాబాదు నగరంలో ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే ఆమె ధైర్యంగా పేదల కోసం పనిచేశారు.
బాల్యం, వివాహం...
ఈశ్వరీబాయి 1918, డిసెంబరు 1న సికింద్రాబాదు లోని చిలకలగూడలో సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. తండ్రి నిజాం స్టేట్‌ రైల్వేస్‌లో పనిచేశారు. బలరామస్వామికి నలుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. కుమారులు బాబురావు, పాండురంగం, కిషన్‌, రవీందర్‌. బిడ్డలు ఈశ్వరీబాయి, మాణికమ్మ. తనకు వచ్చే కొద్ది సంపాదనలోనే పిల్లలందరికీ చదువులు చెప్పించారు. ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య ఎస్‌.పి.జి. మిషన్‌ పాఠశాలలో సాగింది. ఆ తరువాత కీస్‌ హైస్కూలులో ఉన్నతవిద్య చదువుకున్నారు. 13 ఏండ్ల వయసులో పూణేలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జెట్టి లక్ష్మీనారాయణతో ఈశ్వరీబాయి వివాహం జరిగింది. ఆమెకు ఓ బిడ్డ(గీతారెడ్డి) పుట్టిన తర్యాత భర్త చనిపోయారు. దాంతో ఈశ్వరీబాయి కూతుర్ని తీసుకొని హైదరాబాదులోని పుట్టింటికి తిరిగి వచ్చారు. 
సమాజ సేవకురాలిగా
పుట్టింటికి చేరిన ఆమె తల్లిదండ్రులపై ఆధారపడలేదు. తన కాళ్ళపై తాను నిలబడి సాంఘిక అభ్యుదయానికి కృషి చేశారు. చిలకలగూడాలోని మురికివాడలకి వెళ్లి వయోజనులకు చదువు చెప్తానని అక్కడ ఓ బోర్డు పెట్టి, ఓ వరండాలో అందరినీ పోగేసి చదువు చెప్పేవారు.1951లో హైదరాబాదు-సికింద్రాబాదు నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య పద్ధతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆమెకు కాంగ్రెస్‌ అభ్యర్థి నుంచి బలమైన పొటీ ఎదురైంది. అలాంటి సమయంలోనే ఈశ్వరీ ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో విజయం సాధించారు. ఆమె విజయానికి సోదరుడు కిషన్‌ ఎంతగానో కృషిచేశాడు. ముఖ్యంగా పేదలు, దళితుల నుంచి ఆమెకు అధిక ఓట్లు లభించాయి. కౌన్సిలరుగా మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం ఇతర ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాక కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇప్పించారు. ఆమె అనేక కమిటీలలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు. అలా ఆమె పురపాలక సంఘ కౌన్సిలరుగా రెండు సార్లు పనిచేశారు.
ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా 
వెనుకటి హైదరాబాద్‌ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ప్రజల సంక్షేమానికి 1950లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ అనే కొత్త కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ఏపీ షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌గా అది రూపొందింది. దీనికి ఈశ్వరీ బాయి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
శాసనసభలో...
1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వరీబాయి నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ 1967లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి పోటీ చేసి దేవాదాయ శాఖమంత్రిగా పనిచేస్తున్న సదాలక్ష్మిపై విజయం సాధించారు. 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశలో ఆమె చేసిన కృషి ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సెపరేట్‌ తెలంగాణ పోరాట సమితి (ఎస్‌టిపిఎస్‌) అను పార్టీని స్థాపించారు. 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి సపరేట్‌ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా పోటీ చేసి, సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్యపై గెలిచి రెండవ పర్యాయం శాసనసభలో అడుగుపెట్టారు. ఆనాటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకులలో తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి. శివయ్య గార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. పది సంవత్సరాలపాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన పాత్ర వహించారు. 1978లో జుక్కల్‌ నియోజకవర్గం నుండి రిపబ్లికన్‌ పార్టీ (కాంబ్లే) అభ్యర్థిగా శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 
మహిళా సంక్షేమం కోసం...
ఈశ్వరీబాయి మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు. 1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకబడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి ఎంతగానో కృషి చేశారు. 
మరణం...
ఈశ్వరీబాయి ఏకైక పుత్రికే జె. గీతారెడ్డి. ఆమెను వైద్య విద్యలో పట్టభద్రురాలను చేసి, విదేశాల్లో ఉన్నత చదువులు చదివించి డాక్టర్ని చేశారు. తన వలెనే తన కూతురు కూడా సమాజసేవలో పాల్గొనాలని ఆమె కోరుకున్నారు. ప్రస్తుతం గీతారెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. పేదల కోసం ఎన్నో చేసిన ఈశ్వరీబాయి క్యాన్సర్‌ వ్యాధితో1991, ఫిబ్రవరి 24న హైదరాబాదులో మరణించారు. ప్రస్తుతం ఈశ్వరీబాయి జ్ఞాపకార్ధం ట్రస్టు, నర్సింగ్‌ కాలేజి నిర్వహిస్తున్నారు. పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారామె. దళితుల జీవితాల్లో మార్పుకోసం పోరాడి వారి ఆశాజ్యోతిగా పేరొందారు. తన జీవిత కాలమంతా ప్రజల సేవలో గడిపిన ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమవనున్నాయి. 


- మానవి డెస్క్‌ (నవతెలంగాణ నుండి సేకరణ )
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top