నాపై రామకృష్ణుల ప్రభావం విషయంలో గత టపాలో రాముడి గురించి చెప్పాను. ఈ టపాలో కృష్ణుడు గురించి చెప్తాను. ఆరవతరగతి చదువుతున్నపుడు మా క్లాసులో చదువు మినహాయిస్తే మిగతా వాటిలో ఆటలు, సినిమాలు, కథల పుస్తకాలు చదవడం, స్టాంపుల సేకరణ..... ఇలా రక రకాల extra circular activities లలో ఎవరికి నచ్చిన వారు ఆయా గ్రూపులుగా విడిపోయేవారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరేవి. నేను ఆటలకు బాగా దూరమనే చెప్పాలి. అందరికంటే చిన్నవాడిని కావడంతో ఏ ఆటలోనూ ఎవరూ కోరుకొనకపోవడం ఒక కారణం కాగా బడిలో ఆడే ఆటలపట్ల ఆసక్తి కూడా లేకపోవడం రెండవ కారణం. దీంతో నేను సినిమా బ్యాచ్ పట్ల, చందమామ,బాలమిత్ర లతో పాటు సినిమా వార్తలు చదవడం పట్ల, వివిధ రకాల కథలు చెప్పుకోవడం, ప్రకృతి-సమాజానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడం అనే అంశాల పట్ల ఆకర్షితుడనయినాను. వీటిలో సినిమాకు సంబంధించిన విషయాలలో కృష్ణ అభిమానిగా మారడానికి కారణాలు, దావివల్ల ఏమి జరిగిందనేది జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఈ టపా ఉపయోగపడుతుంది. ఇంటి వాతావరణం భక్తిని అలవాటు చేసి బుద్ధిమంతుడిగా ఉండాలని రోల్ మోడల్ గా రాముడిని క్రియేట్ చేయగా, స్కూల్ వాతావరణం చదువుతో పాటు సినిమాను అందులో హీరో కృష్ణను పరిచయం అయ్యేలా చేసింది.

సినిమా పాటల పుస్తకాలు, FOC బొమ్మలు (Freinds Offset Callandars), పత్రికలలో సినిమా కబుర్లు, రేడియోలో జనరంజని ప్రకటనలు-పాటలు, మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోనకల్ లోని లక్ష్మీ టూరింగ్ టాకీస్ లో సినిమాలు చూడడం, ఊళ్లలో 16mm ప్రొజెక్టర్ తో వేసే సినిమాలు చూడడం వంటివి మా సినిమా పిచ్చోళ్ల కాలక్షేపం కార్యక్రమాలు. ఎవడన్నా సినిమా చూసొస్తే దాని స్టోరీ పక్కోళ్లకి ఆసక్తికరంగా, హీరోల గొప్పతనం గురించి అతిశయోక్తి అలంకారం చేర్చి చెప్పడం, చూడనివాల్లు చెవులు రిక్కించి వాళ్ల రేంజ్ లో ఊహించుకుంటూ వినడం భలే తమాషాగా ఉండేది. ఈ సందర్భంలో హీరోల ప్రస్థావనలు రావడం ఎన్.టీ.ఆర్ గొప్పతనం గురించి ఎక్కువమంది బాగా పొగుడుతూ ఉండేవారు. అప్పటికి మాకు తెలిసిన హీరోలు ఎన్.టీ.ఆర్, కృష్ణ లు మాత్రమే. అపుడపుడు ANR, శోభన్ బాబు, కృష్ణంరాజుల పేర్లు వినబడుతూ ఉండేవి. అభిమానులు మాత్రం ఎన్.టీ.ఆర్, కృష్ణలకు మాత్రమే ఉండేవారు. బాబురావు అనే క్లాస్మేట్ ఎన్.టీ.ఆర్ గురించి అతిశయోక్తి అలంకారాలతో చెప్పడం, NTR సినిమాలలో ఫిల్మ్ ముక్కలను చుక్కాని పెట్టెలో చూపడం చేస్తుండేవాడు. ఎన్.టీ.ఆర్ ని పొగడడంతో పాటు అదే సందర్భంలో అవసరం లేకున్ననూ కృష్ణను హేళనగా తిట్టడం అనేది తప్పనిసరి వాక్యాలుగా ఉండేవి. అలా పదే పదే కృష్ణను  హేళన  చేయడం వల్ల ఎన్.టీ.ఆర్ కంటే కృష్ణను గురించి తెలుసుకోవాలనిపించేది. అతనే గాక చాలామంది కృష్ణను హేళన చేయడం, మిమిక్రీ అనుకరణలు వెకిలిగా చేయడం, పోష్టర్లపై పేడ కొట్టడం అనేవి కృష్ణను గురించి నన్ను ఆలోచింపజేశాయి.

స్కూలుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చేవి. పత్రికలలో వెనుక పేజీలలో సినిమా బొమ్మలు, కబుర్లు ఉండేవి. ఇక ఆంధ్రజ్యోతి (పాతది) అయితే సినిమాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా ఉండేవి కనుక మా అందరికీ అభిమాన పత్రిక అదే. అపుడపుడు సినిమా పిచ్చోళ్లు కొని తెచ్చే జ్యోతిచిత్ర, సితార  చదివే వాళ్లం. టీచర్లు కూడా భోజనం సమయంలో  అపుడపుడు సినిమాలపై చర్చలు పెట్టేవారు. పత్రికలలో వార్తలు, బొమ్మలు ఎక్కువగా కృష్ణవే ఉండేవి. ఒక్కరోజే కృష్ణవి రెండు సినిమాలు విడుదలయిన సందర్భాలుండేవి. ఎన్.టీ.ఆర్ కు అంత స్పీడు లేదు. సామాజికి సేవా కార్యక్రమాలు, తుఫాను బాధితులను ఆదుకోవడం వంటి పనులలో కృష్ణ పేరు బాగా వినబడేది. టీచర్లు కూడా కృష్ణను మంచిమనిషిగా చెప్పేవారు. బాబురావు అతిశయోక్తులు, కృష్ణను తిట్టేదానికి పత్రికలలో వార్తలు, టీచర్ల మాటలకు తేడా ఉండడంతో నేను కృష్ణ సినిమాలు చూడకుండానే కృష్ణ బ్యాచ్ వైపు మళ్ళాను. ఈ నేపథ్యంలో మా ఊరి పక్కనున్న చిరునోములలో హైస్కూల్ తరపున విద్యార్ధులకోసం అర్ధరూపాయి టికెట్ తో (ఇతరులకు రూపాయి) 'అల్లూరి సీతారామరాజు' సినిమా 16mm ప్రొజెక్టర్ తో వేశారు. దీనికి మా ఊరినుండి కూడా 6,7 తరగతులవారికి అర్ధరూపాయి టికెట్ కు అవకాశం ఇచ్చారు. టీచర్లతో సహా పిల్లలందరూ చిరునోముల వెళ్లి ఆ సినిమా చూశాము. ఇదే నేను చూసిన మొదటి కృష్ణ సినిమా. అందరికీ నచ్చింది. ఆ తరువాత బోనకల్ లక్ష్మీ టూరింగ్ టాకీస్ లో అసాధ్యుడు చూశాను. అది కూడా నచ్చింది. మా బాబురావు చెప్పినంత చండాలంగా, మిమిక్రీ కళాకారుల ప్రదర్శించినంత వెకిలిగా కృష్ణ లేడు. ఫైటింగులు బాగా చేస్తున్నాడు, మనిషి బాగానే ఉన్నాడనిపించింది. నటన గురించి దాని లోతుల గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం మాకేముందప్పట్లో.

మా ఊళ్ళో ఏడవతరగతి పూర్తయ్యక హైస్కూల్ కి చిరునోములలో జాయిన్ అయ్యాము. అక్కడ స్కూల్ లో కృష్ణ అభిమానులు ఎక్కువమంది ఉండడంతో నాకు ఉత్సాహం పెరిగింది. అప్పటిదాకా మా ఊరి బడిలో ఎన్.టీ.ఆర్ బ్యాచ్ కు వ్యతిరేకం నేనొక్కడినే. చిరునోముల వెళ్లాక కృష్ణ బ్యాచ్ ఎక్కువయ్యాక కృష్ణ సినిమాలు అన్నీ చూడడం అలవాటయింది. సినిమా పత్రికలు కొనడం, సినిమా వార్తలు చదవడం నిత్యకృత్యమయింది. సినిమాల సంఖ్యలోనూ, వార్తలలోనూ ఎక్కువ భాగం కృష్ణదే ఉండడం సంతోషంగా ఉండేది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగులన్నీ కృష్ణ బొమ్మలే సెలక్ట్ చేసి పంపేవాళ్లం. ఆకాశవాణి వివిధ భారతికి కృష్ణ బ్యాచ్ అంతా ఆయన సినిమాలలోని పాటలను కోరడం, అపుడపుడు టీచర్లు వాటిని విని సరదా వ్యాఖ్యానాలు చేయడం చేసేవారు. సినిమాలు బాగా చూడడంతో చదువుపై దాని ప్రభావం పడింది. చొప్పకట్లపాలెం వరకూ ఎపుడూ క్లాసులో నేనే ఫస్ట్. అయినా ఎందుకో ఈ ఫస్ట్ రావాలనే కోరిక కంటే సినిమా పిచ్చే ఎక్కువగా ఉండేది. ఇంటినిండా, మా రైస్ మిల్ నిండా కృష్ణ సినిమాల బొమ్మలు అతికించేవాడిని. మా మిల్లులో ఇప్పటికీ వాటిలో చాలవరకు అలాగే అతికినవి ఉన్నాయి. నాకు మా ఊళ్లో క్లాసులో ఎన్.టీ.ఆర్ బ్యాచ్ ఎక్కువయినా బయట పని చేసుకునేవాళ్లలో కృష్ణ బ్యాచ్ ఉండేది. అందులో మా మిల్లులో పనిచేసే వెంకటరత్నం కూడా ఒకడు. అతనూ నేను కలిసి మా రైస్ మిల్లులో ప్రతిచోట కృష్ణ బొమ్మలతో నింపేవాళ్లం. మా ఊరి చుట్టు పక్కల గ్రామాలలో ఎక్కడ కృష్ణ సినిమా ఉన్నా సైకిల్ పై లేదా నడచైనా వెళ్లేవాళ్లం. బొగ్గవరపు రత్నాకర్ రావు అని ఎన్.టీ.ఆర్ ఫ్యాన్ ఉండేవాడు. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్. కృష్ణ సినిమాలకు కూడా వాడు నాకోసం వచ్చేవాడు. ఒకసారి సైకిల్ పై 60 కి.మీ దూరం ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లాం. చెరికొద్దిసేపు తొక్కుకుంటూ వెళ్లేవాళ్లం. ఇది విని అందరూ వింతగా చెప్పుకున్న సంగతి ఇపుడు గుర్తొస్తే నవ్వు వస్తుంది. పదవతరగతిలో ఫైనల్ పరీక్షలు వ్రాస్తూ  (ఫైనల్ పరీక్షలు సిరిపురం అనే ఊరిలో జరిగేవి. అది మా ఊరుకు 20 km దూరం) లాస్ట్ పరీక్ష రోజు 'మాయదారి మల్లిగాడు' సినిమా మా ఊళ్లొ వేస్తున్నారని తెలిసి ఆ నైట్ ఇంటికెళ్లి సినిమా చూసి ఉదయాన్నే వెళ్లి పరీక్ష వ్రాశాను. ఏ పరీక్షలైనా సినిమాల తరవాతే అన్నట్లుండేడి. నేను చదువులో ముందుండేవాడిని. కానీ పరీక్షలకంటూ ప్రత్యేక ప్రిపరేషన్, ఫస్ట్ రావాలనే కోరిక ఉండేది కాదు. నేను పదవతరగతిలో క్లాస్ ఫస్ట్ వస్తానని నాపై నమ్మకం తో ఇద్దరు టీచర్లు ఇతర టీచర్లతో పందెం కాశారు. కానీ నేను సినిమా పిచ్చితో క్లాస్ థర్డ్ వచ్చాను. చాలా కాలం తరువాత మా టీచర్ మా పరువు తీశావంటూ నవ్వుతూ నాతో చెప్పారు. నాకు చాలా బాధేసింది. చదువు గురించి ఇలా చదవాలంటూ ఎవరూ గైడెన్స్ ఉండేది కాదు మాకు.


హైస్కూల్ తరువాత ఖమ్మం శారదా కళాశాలలో ఇంటర్ ఎం.పీ.సీ లో జాయిన్ అయ్యాను. అక్కడ అంతా కొత్త వాతావరణం. లెక్చరర్లు ఇంటి దగ్గర ట్యూషన్ లు గంటల చొప్పున చెప్పేవారు. అక్కడి వాతావరణం ఇబ్బందిగా ఉంది. నేను దాదాపు వాళ్లతో ఇమడలేక పోయాను. ఊరు, ఇల్లు విడిచి ఉండడం కొత్త. అక్కడ కూడా సినిమా పిచ్చోళ్లతోనే కలిశాను. ఖమ్మంలో కూడా కృష్ణ ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉండేది. అప్పటికి ఎన్.టీ.ఆర్ రాజకీయాలలోకి వచ్చారు. NTR తరువాత  జ్యోతిచిత్ర పోటీలో వరుసగా మూడు సార్లు కృష్ణ సూపర్ స్టార్ గా ఎన్నికయ్యాడు. మేము కూడా ఆ పోటీకి జ్యోతిచిత్ర కూపన్ కటింగులు పంపేవారం. అప్పట్లో కృష్ణ సినిమాలు బాగా హిట్స్ ఉండేవి. పాంప్లేట్లు పంచడం, బ్యానర్లు కట్టడం, సేవాకార్యక్రమాలు చేస్తుండేవారు. టికెట్ల కోసం క్యూలో నిలబడడం, పోలీసుల లాఠీచార్జీలు జరపడం వంటి సంఘటనలు ఇపుడు విచిత్రంగా అనిపిస్తాయి.

విప్లవ సినిమాలు, పల్లెటూరు, రైతు కథలు,  విలన్లపై అగ్రెసివ్  డైలాగ్ డెలివరీ వంటివి బాగుండేవి. నటన కంటే కృష్ణ మీద అభిమానానికి హీరోగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చేసిన సాహసాలు బాగా ఆకర్షించేవి. తెలుగు సినిమాలలో అన్నిరకాల కొత్త సాంకేతిక అప్డేట్స్ ని ఆయనే సాహసంతో ప్రారంభించడం అభిమానులకు గర్వంగా ఉండేది. మల్టీ స్టారర్ సినిమాలలో కృష్ణ ఒక్కడే అందరి హీరోలతో పోటీకి సై అనడం గొప్పగా చూసేవాళ్లం. తుఫాను బాధితులకు సహాయం చేయడంలో అందరి హీరోలకంటే ముందుండం, ఇతర సహాయకార్యక్రమాలలో కృష్ణకు మంచిగుణం ఉందన్న వార్తలు సంతోషాన్నిచ్చేవి. నటుడిగా కంటే ఓ విలక్షణ హీరోగా కృష్ణ అభిమానులకు ఆరాధ్యుడయ్యాడని చెప్పాలి. మిమిక్రి అనుకరణలలో అవహేళనలు ప్రదర్శించినా, పోష్టర్లపై పేడ కొట్టినా కృష్ణ అభిమానులు మాత్రం మరింత అభిమానం పెంచుకునేవారు. ఇతర హీరోలతో పోలిక లేని ఒక అంశం కృష్ణ కుటుంబాన్ని తమ కుటుంబంగానే భావించడం కృష్ణ అభిమానుల ప్రత్యేకత. 'వారసుడు' సినిమాలో పాత్ర తక్కువైందని గొడవ చేసి రీ షూట్ చేయించిందాకా గొడవ చేయడం, కూతురు మంజుల ని హీరోయిన్ గా ప్రకటించినపుడు మాన్పించినదాకా ఆందోళన చేయడం వంటివి ఆయన అభిమానులలోనే కనబడుతుంది. ఇవి కరెక్టా, కాదా అన్నది చెప్పడం కంటే అభిమానులు  నటనకు ఇచ్చే విలువ కంటే వ్యక్తిగా కృష్ణకు ఇచ్చే విలువగానే దీనిని చూడాలన్నది నా అభిప్రాయం.

కృష్ణ హీరోయిన్ లలో విజయనిర్మల, జయప్రద, శ్రీదేవిలపై చర్చ నడిచేది. కృష్ణ విజయాలలో ఆమె పాత్ర తెలిసుకునేదాకా విజయనిర్మల అంటే కోపం ఉండేది. రెండో పెళ్లి చేసుకుందని  కృష్ణ పక్కన ఆమె ఉండడం నచ్చేది కాదు.  ఎక్కువమందికి కృష్ణ - జయప్రద కాంబినేషన్ నచ్చేది. నాకు మాత్రం కృష్ణ - శ్రీదేవి కాంబినేషన్ నచ్చేది. తెలుగులో శ్రీదేవి ఎక్కువగా నటించింది కృష్ణ తోనే కావడం కూడా విశేషంగా చెప్పుకునేవాళ్లం. శ్రీదేవికి హీరోలతో పాటుగా మంచి పాపులారిటీ ఉండేది.ఎన్.టీ.ఆర్ కు సినిమా టైటిల్స్ లో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డా. ఎన్.టి.రామారావు అని వేసేవారు. మా హీరోకు తక్కువేంటని పాంప్లేట్లలో 'ప్రజా, విప్లవ, సాహస, సంచలన నటుడు , డేరింగ్ - డేషింగ్ - డైనమిక్, సూపర్ స్టార్, ఆంధ్రాజేమ్స్ బాండ్ , నటశేఖర, నటస్రష్ట హీరో కృష్ణ' అంటూ వివిధ సినిమాలలో కృష్ణకు వాడిన బిరుదులన్నీ కలిపి కొట్టించేవాళ్లం. కానీ సినిమాలలో మాత్రం ఒకటి, రెండు మాత్రమే వాడడం అసంతృప్తిగా ఉండేది. మరోవైపు కృష్ణ తన అభిమాన నటుడు రామారావు అని చెప్తుండేవారు. కృష్ణ హీరోగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో ఎన్.టీ.ఆర్ సినిమా బిట్లు ఉండేవి. అవి మాకు కోపం తెప్పించేవి. రాజకీయంగా, సినిమాల నిర్మాణంలో వీరిద్దరి మధ్య పోటీ వార్తలు ఆసక్తికరంగా ఉండేవి. ఎన్.టీ.ఆర్  కృష్ణ గొడవల విషయం లో కృష్ణ హుందాగానూ, ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందడం బాగా గుర్తు. ఎన్.టీ.ఆర్ నా అభిమాన నటుడు అంటూ ధైర్యంగా ప్రకటించే కృష్ణ ఆయనను ఎదిరించే విషయంలో, గౌరవించే విషయంలోనూ సాహసంగానే వ్యవహరించాడనే చెప్పాలి.

 

రాజకీయాలలో కృష్ణ కాంగ్రెస్ లో చేరిక నచ్చలేదు. ఆయన సినిమాలన్నీ విప్లవాత్మకంగా, రాజకీయాలలో అవినీతిని విమర్శించినట్లుండేవి. అప్పట్లో ఈనాడు పత్రికలో కాంగ్రెస్ అవినీతిపైనే ఎక్కువగా కథనాలు వచ్చేవి కావడంతో ఆ నిర్ణయం నచ్చలేదు. తరువాత నేను కమ్యూనిస్టు రాజకీయాలలో పనిచేయడం మొదలుపెట్టాక సినిమా పిచ్చి తగ్గింది. కృష్ణ అంటే అభిమానం ఉండేది. గతంలోలా పిచ్చి అభిమానం గా కాక మంచి మనిషిగా గౌరవం మిగిలింది. అయితే కృష్ణ కాంగ్రెస్ లో చేరాక ఖమ్మం లో విమల్ షోరూం ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంలో నేను చూడడానికి వెళ్లకపోవడం నాతో పాటు చాలామందికి ఆశ్చర్యకరమైన, గమనంలో ఉంచుకోవలసిన అంశం.  ఇప్పటికీ కృష్ణ అంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. పాత సినిమాలు, పాటలు కొన్ని డైలాగులు చూస్తుంటే అప్పటి మా వెర్రి అభిమానానికి ఇపుడు నవ్వు వస్తుంటుంది. బోర్ కొట్టినపుడు ఇప్పటికీ కృష్ణ పాటలు, సినిమాలు చూస్తుంటాను. కాకుంటే కృష్ణవి మాత్రమే గాక అందరి వాటితో పాటు కృష్ణవీ చూస్తుంటాను.
- Palla Kondala Rao,
27-07-2019

Post a Comment

  1. మీ రచనలో నిజాయితీ కనిపించింది. 70లలో కృష్ణ ఎన్ఠీఆర్ అభిమానుల మధ్య పోటీ నిండు నిజం . ఇప్పుడు వయసుతో పరిణితి చెందిన తరువాత అందరూ బాగా నటించేవారే ఎందుకలా వెర్రి అభిమానంతో ఊగిపోయేవాళ్ళం అనిపిస్తుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top