నాపై దాదాపుగా ఇంటర్ వరకూ ఎక్కువ ప్రభావం చూపింది రామకృష్ణులు. ఒకరు శ్రీరాముడు, మరొకరు హీరో కృష్ణ.  చిన్నపుడు నా వ్యక్తిత్వంపై వీరిద్దరి ప్రభావం ఎక్కువ. నేను జ్ఞాపకాలుగా చెప్పుకునే వాటిలో వీరిద్దరూ ముఖ్యులు.  ఈ టపాలో రాముడి గురించి నా జ్ఞాపకాలు, అభిప్రాయాలూ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరినీ బాధపెట్టడమో, సంతృప్తిపరచడమో, నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అనడమూ నా ఉద్దేశం కాదు. ఇందులో వ్రాసుకున్నవన్నీ కేవలం నా అభిప్రాయాలు, అనుభవాలు మాత్రమే.

అప్పట్లో ఊళ్ళోనూ, మా ఇంట్లోనూ అందరికీ భక్తి ఎక్కువ. ఇంట్లో దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా బాగా చేసేవారు. ఈ ప్రభావంతో నేను కూడా రోజూ పూజలు చేసేవాడిని. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదివేవాడిని. నేను ఆంజనేయస్వామి వరప్రసాదుడనని తల్లిదండ్రుల, బంధువుల నమ్మకం. ఈ విషయం మరో సందర్భంలో  చెప్తాను. ఆంజనేయుడి కథలు వినడం, ఆయన రామభక్తుడు కనుక అదే క్రమంలో రాముడిని గురించి తెలుసుకోవడం అనేది అలవాటుగా మారింది. గ్రామంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో శ్రద్ధగా పాల్గొనేవాడిని. ఇలా  శ్రీరాముడి ప్రభావం నాపై పడడానికి ఇది మొదటి మెట్టు.

పెద్దలు ఎవరు ఏదైనా వ్రాయడం మొదలు పెట్టేముందు 'శ్రీరామ' అని, 'శ్రీరామ నీవే కలవు' అని గానీ వ్రాసేవారు. ముసలివారు పడుకునేముందు రామయ్యతండ్రీ అనో, రామా అనో అంటూ నిద్రకు ఉపక్రమించేవారు. నిత్యం రామనామం జపిస్తే మంచిదని చెప్పేవారు. రామకోటి వ్రాసేవారిని చూసి నేనూ వ్రాద్దామని ప్రయత్నించాను. పూర్తి చేయలేదు. సినిమాలు, పాటలు, బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాటలు, నాటకాలు ..... ఇలా అన్నింటా రామమయంగా ప్రభావితమై పెరిగాను. స్కూలు పుస్తకాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషలలోనూ రామభక్తి పద్యాలు, కథలు (తెలుగుతో పాటు హిందీలో కబీర్దాస్,తులసీదాస్) ఉండేవి. ఏదైన కథలో నాయకుడి పేరు లేదా మంచి వ్యక్తుల పేర్లు రాముడు అనో... రామయ్య అనో ఉండేది. వ్యాకరణాలు ఇతర అనేక ఉదాహరణలలో 'రాముడు మంచి బాలుడు' అనే వాక్యాలు ఎక్కువగా కనబడుతుండేవి. వినబడుతుండేవి. రామరాజ్యం, తండ్రి మాట జవదాటకుండడం, అన్నదమ్ముల అనుబంధం, ఏకపత్నీవ్రతుడు, యాగ సంరక్షణ..... ఇలా చాలా ఘట్టాలు అమితంగా మన కేరక్టర్ నిర్మాణంపై ప్రభావితం చూపేవి.  ఇక సినిమాల సంగతి సరేసరి. 

ఇప్పటి మన శ్యామలీయం మాష్టారిలాగా రామభక్తులలో చాలామంది బుధ్దిమంతులుగా ఉండేవారప్పట్లో. అంటే వారెవరూ ఇంకొకరి గుడులు కూలుద్దామనో, రాముడిని రాజకీయాలలోకి లాగే ప్రయత్నమో చేసిన సందర్భాలు మచ్చుకైనా కనబడేవి కావు. పైగా గ్రామాలలో ముస్లింలు, హిందువులు ఐక్యంగా ఉండేవారు. అందరి పండగలూ అందరూ కలసి చేసుకునేవారు. రాముడిని అయితే అన్నిమతాల వారు మంచివాడికి సింబల్ గా ఒప్పుకునేవారు. చెప్పుకునేవారు. నేను శాస్త్రీయధృక్పథం అలవాటు చేసుకున్నాక భక్తిలో పూర్తి మార్పు వచ్చింది. మనిషి తన అవసరాల రీత్యా సృష్టించుకున్న దైవానికి అనేక రూపాలు, నిర్వచనాలూ, గాథలూ చెప్పుకున్నాడు. అప్పటి భక్తికీ ఇప్పటి భక్తికీ చాలా తేడాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇపుడది భక్తితో పాటుగా వ్యాపారం, రాజకీయాలకు పావులుగా ఉపయోగిస్తుండడం ప్రమాదకరమే. నిజమైన రామభక్తుడు ఎలా ఉంటాడో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇక రామాయణం జరిగిందా? లేదా? అన్నది చరిత్రకారులు తేల్చాల్సింది కాగా 'ఇతిహాసం'గా ప్రఖ్యాతి గాంచిన రామకథను అనేక మంది వివిధ రకాలుగా వ్రాశారు. ఆయా కాలమాన పరిస్తితుల ప్రకారం వ్రాయబడిన వాటిలో తీవ్ర విమర్శలకు లోనవుతున్నవి ఉన్నాయి. అయితే జనసామాన్యం ఎక్కువగా పుస్తకాలను లోతుగా అధ్యయనం చేసి భక్తులుగా మారరు. ఆయా గాధలలోని మంచిన స్వీకరిస్తూ..... చెడుని ధిక్కారం లేని వదిలింపుగా పాటిస్తూ ముందుకు వెళతారు. పండితులు, మేధావులు విమర్శలు చేయడం, పుస్తకాలు వ్రాయడం చేస్తుంటారు. 

రామభక్తులలో మంచివారిని నేను ఒకప్పటి రామభక్తునిగా అభిమానించగలను. నకిలీ భక్తులను, ఉన్మాదులను ఎదుర్కోగలను. నాస్తికులమని, హేతువాదులమని చెప్పుకుంటూనే భ్రమాత్మక ఆనందాన్నిచ్చే భక్తిపై శృతిమించిన అతి విమర్శలు, వాదనలకు దిగడం చేస్తున్నపుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. లేని దేవుడి గురించి అంతగా మంకుపట్టుతో వాదించాల్నా? విలువైన సమయాన్ని ప్రత్యామ్నయం చూపడానికి, మనిషిలో శాస్త్రీయతని పెంచేందుకు వినియోగిస్తే బాగుండుననిపిస్తోంది. భ్రమాత్మక ఆనందంపై బరితెగింపు వాదనలు చేయడం వల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువని అభిప్రాయపడతాను. అసలు విమర్శే చేయొద్దనడమో, దైవదత్త గ్రంధాలను ప్రశ్నించడమేమిటనే ఉన్మాదుల వైఖరిని అసలు సమర్ధించను. దేనినైనా విమర్శించే స్వేచ్చను ఎవడూ ఆటంకపరచకూడదు. అది ఉన్మాదంగా ఉంటే అసలు ఉపేక్షించకూడదు. ఇదే కోవలో ఉన్మాదం కాకుండా మూర్ఖంగా హేళన చేయడం, ఉన్మాదుల వాదనలకు మద్దతుగ ఈ సందర్భాలలో సన్నాయినొక్కులు నొక్కడమూ క్షమార్హం కాదు. తెలుగునాట రాముడైనా, కృష్ణుడైనా ఎన్.టీ.ఆర్ మాత్రమే. ఈ రెండు పాత్రలలో ఎన్నో సినిమాలలో జీవించిన ఆయన డ్రైవర్ రాముడు సినిమాలో "రాముడు కాదమ్మా ... నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా.... సవతులు ఉండరు " అంటూ పాడడం (నటించడం) మనకు తెలిసిందే. రామాయణం రంకు.... భారతం బొంకు.... అన్న విమర్శలూ విన్నవే. విమర్శలు, ప్రశంసలలో మనిషికి ప్రయోజనాన్నిచ్చేవి మాత్రమే కాలపరీక్షకు నిలిస్తాయన్నది నా అభిప్రాయం. ఏమయినా నేను మంచిని నేర్చుకోవడానికి రాముడు ఉపయోగపడ్డాడనడంలో సందేహం లేదు. నా వ్యక్తిత్వంపై ప్రభావితం చూపిన హీరో కృష్ణ గురించి మరో టపాలో చెప్తాను.

- Palla Kondala Rao,
21-07-2019.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top