• పల్లెల్లో అజ్ఞానం వల్ల అభివృద్ధి కుంటుపడడం, దోపిడీకి ఎక్కువ అవకాశం కలగడం జరుగుతుంటుంది.
 • అజ్ఞానం తాండవించే అంశాలలో నాకు బాగా చిరాకు అనిపించే ఓ అంశాన్ని మీ ముందు చర్చకు ఉంచుతున్నాను. ఊరిబయట రోడ్ల వెంట మల విసర్జన. ప్రతి పల్లెలోనూ నేటికీ ఈ సమస్య ఉందనే చెప్పాలి.
 • ముఖ్యంగా ఈ సమస్య పట్ల మహిళలు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బంది వర్ణనాతీతం . వర్ణించడం అనవసరం కూడా. ఎబ్బెట్టు కనుక.
 • ముక్కుపుటాలదిరే దుర్గంధం , ఆ పరిసరాలు అసహ్యకరంగా మారడం వర్షాకాలంలో అయితే ఇక నరకమే కనిపిస్తుంది. వ్రాయడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్యను గురించి.
 • గ్రహాంతర నివాసం, జీవనానికి ఏర్పాట్లపై పరిశోధనలు ఓ వైపు జరుగుతుండగా అనాదిగా, తరతరాల అజ్ఞానం నేటికీ మరోవైపు వర్ధిల్లుతూనే ఉందనడానికి ఇలాంటి అసహ్యకరమైన సమస్యలే ఉదాహరణలు.
 • ఇప్పటికీ ఈ సమస్య ఎందుకుంటోంది? ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? నాయకులు ఏమి చేస్తున్నారు? అసలు కారణమేమిటి? ఇంకా ఎన్నాళ్లీ సమస్య తాండవిస్తుంటుంది. అనే కోణం లో ఈ సమస్యను చర్చిస్తే నాకు తోచిన అంశాలు మీ ముందు ఉంచుతున్నాను.
 • అజ్ఞానం ఇందుకు ప్రధాన కారణం కాగా, పాలకుల కుళ్లు రాజకీయం - డబ్బు పై వ్యామోహం రెండో కారణం. అహంకారం కూడా కొంత కారణమనే చెప్పాలి. 
 • కొన్ని ప్రాంతాలలో ఇలా ఊరి బయట మల విసర్జన చేస్తే జరిమానాలు వేయాలని తీర్మానించిన సందర్భాలూ పత్రికలలో చూస్తున్నాము. ఫలితం ఎలా ఉందో తెలీదు.  ఈ లింక్ చూడండి.
 • అందరూ కలసి కట్టుగా అనుకుంటే ఇది పెద్ద సమస్య కానేకాదు.
 • తాగుడుకు ఇతర వ్యసనాలకు, పిచ్చి పనులకు, అనవసర ఆడంబరాలకు చాలా ఖర్చు చేస్తుంటారు. ఆరోగ్యానికి, పరిశుభ్రతకు కనీస నాగరికతకు ఆలవాలమైన, అత్యంత అవసరమైన ఈ పనిని చెయడానికి మాత్రం ఎందుకు ఆలోచించరో అర్ధం కాదు. 
 • ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ సమస్య పై ప్రయత్నాలు చేస్తున్నా శాచురైజేషన్ అనేది ఎప్పటికీ రాదా? అనే అసహనం కలుగుతుంది. ఎన్ని సార్లు ఎన్ని కోట్ల నిధులు ఖర్చు చేసినా ఎప్పటికప్పుడు మరుగుదొడ్లు లేని ఇళ్లు కనిపిస్తూనే ఉంటాయి పల్లెల్లో. మరి నిధుల ఖర్చు ఏమవుతుంది? అనే ప్రశ్న ఉదయించక మానదు.
 • ప్రభుత్వం ఏ పార్టీ చేతిలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన చిల్లర నాయకుల అల్లరే ఎక్కువ ఉంటుంది గ్రామాలలో. వాళ్లు చెప్పినోళ్లకే అధికారులనే బానిసలు (అందరూ కాదులేండి) సహాయ పనులు మంజూరు చేస్తుంటారు. ఇక్కడ ఎవడికి దక్కాల్సిన ఆమ్యామ్యా వాడికి దక్కడంతో అవసరమైన వాడికి, ఆమ్యామ్యా ఇవ్వలేనివాడికి, ఇవ్వాలని తెలవని వాడికి మరుగుదొడ్డి దక్కదన్నమాట. 
 • అంటే అసలు ఎవరికి అవసరమో వారికి ప్రభుత్వ పథకాలు దక్కవు. అట్టడుగు చిల్లర నాయకులతో ప్రారంభమయ్యే అవినీతి అధిష్టానం వరకూ బానిసలనే అధికారుల అండతో అందుతూ ఉంటుంది. అసలైన అర్హులు అలా దీనంగా, అమాయకంగా చూస్తూ ఉంటారు. ఇది పల్లెల్లో సర్వ సాధారణ విషయం. 
 • కాస్తో,కూస్తో చదువుకున్న మధ్యతరగతి మేధోజీవులు కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమాలో చెప్పినట్లు టీ.వీ చూస్తూ ఠీవీగా కామెంట్లు చేస్తూ అసంతృప్తిని, సంతృప్తిగా వెళ్లగక్కుతుంటారు.
 • నిజానికి ప్రజలు కూడా అడుగడుగునా అవినీతికి అలవాటు పడిపోతుంటారీ వ్యవస్థలో. తమకు అర్హతలేదని తెలిసినా అవసరాల కక్కుర్తిలో సాపేక్షం గా ఆలోచించే శక్తినీ, విచక్షణను కోల్పోయి అనివార్యంగా లబ్ధి పొందేందుకు చూస్తుంటారు. పోరాటాలు మరచిపోతారు. సరిగ్గా ఇదే అదనుకోసం చూసే చిల్లర అల్లరి నేతలకు పండగే పండగ. డబ్బుకు డబ్బు. కీర్తికి కీర్తి కొడుకులకి. 
 • ఎన్.టీ.ఆర్ అధికారంలోకి వచ్చాక పాలకులలో తెలుగు ప్రజలను, పల్లెల బాధలను పట్టించుకునే నేత వచ్చాడని చెప్పాలి. ఆయన గ్రామాలలో మహిళల ఇబ్బందులను గమనించి తెలుగు గ్రామీణ మహిళా బహిర్భూమి ప్రాంగణం (పేరు సరిగా గుర్తు లేదు) అని ఓ పథకం చేపట్టారు. ఇప్పటికీ ఆ సమస్య మాత్రం తీరలేదు.
 • సాధారణంగా ప్రభుత్వ పథకాలలో ప్రజల చేతికందేది 15% మాత్రమే అనేది ఓ సర్వే రిపోర్ట్. ఆ 15% లో కూడా అధికార పార్టీ తాబేదార్లకు (ఏ పార్టీ అధికారంలో ఉన్నా) అనర్హులకు మాత్రమే అందేది ఎక్కువ.
 • చంద్రబాబు ప్రజలవద్దకు పాలన - జన్మభూమి పథకం కొంత ప్రజలలో చైతన్యం తెచ్చినా ఆ తరువాత తెలుగు తమ్ముళ్లు ఊరూరా స్వంతంగా సమాంతర ప్రభుత్వాలతో పిచ్చి చేష్టలతో ఆ ఆశయానికి నీరు కార్చారు నిప్పు పెట్టారు. ఆ పథకాలు ఓ జోక్ గా మిగిలాయి. 
 • తరువాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన శాచురైజేషన్ కొంత మెరుగ్గానే ఉంది. చిల్లరదేవుళ్లకు మొక్కకుండా డైరెక్టుగా గ్రామాలలో అవసరమైన అందరికీ పథకాలను వర్తింపజేయడం కొంత మెరుగు. అది కూడా ఆ తరువాత కాంగ్రెస్ చిల్లర దేవుల్లు ముందుకు సాగనీయలేదు. గ్రామ రాజ కీయాలలో తమకు నచ్చని వారికి బిల్లులు రాకుండా అల్లరి పనులు చేయడమూ గమనించాలిసి ఉంది.
 • ఇలా ఎంతలేదన్నా కుళ్లు రాజకీయాలనేవి, అధికారుల అవినీతి,బానిసత్వం అనేవి కూడా ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడానికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి అంతకంతకూ పోటీ పడుతున్నాయి. గాంధి కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని గ్రామాలలోని చిల్లర నాయకుల స్వార్ధం, చేతకాని వీరత్వంలతో అడుగడుగునా అపహాస్యం చేస్తున్నారు.
 • అసలు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి, ప్రజల సొమ్ము ప్రజలకోసం ఖర్చు చేయడానికి ఈ చిల్లర నేతల జోక్యమెందుకు? పల్లెలు అభివృద్ధి కాకుండా ఉండడానికి ప్రధాన కారణం లలో ఇదొకటి.
 • ప్రజలే అవినీతి పరులుగా మారడం మరో ప్రధాన కారణం. వ్యక్తివాద సమాజం ప్రతి ఒక్కరు తమ స్వార్ధం కోసమే ఆలోచిస్తారు. పరిస్తితులు అనివార్యంగా మనుషులను అలా చేస్తున్నాయి. వ్యక్తిగతంగా అనేక వ్యసనాలకు డబ్బు తగలెట్టినా అవసరమైన వాటికి మాత్రం ఎవరిస్తారా? ఎవరూ సహాయం చేయరా? అని ఎదురుచూస్తుంటారు. సామాక బాధ్యత లోపిస్తుంది. ఊరంతా శుభ్రంగా ఉంటేనే మన ఇళ్ళూ బాగుంటుందనే వివేచన సాధారణంగా ఉండాల్సినది స్వార్ధం హరించివేస్తున్నది.ఎవడికివాడే యమునాతీరే అన్నట్లుగానే కాట్లకుక్క కొట్లాడుకోవుడమే జనం వైఖరిగా ఉంటుందీ వ్యవస్థలో.
 • సహజంగా పల్లెల్లో భూస్వామ్య అహంకారం-పురుషాధిక్యత కూడా ఎక్కువే. గతం కంటే మెరుగైనా ఇంకా ఈ వైఖరి ఉండడం కూడా మరుగుదొడ్ల సమస్య మిగిలి ఉండడానికి ఓ కారణం గా ఉంది.
 • సాధారణంగా ఎక్కువ ఈ సమస్యతో ఇబ్బందులు పడే మహిళలు కూడా ఈ సమస్యను అంత సీరియస్ గా పట్టించుకున్నట్లనిపించదు. అజ్ఞానం వారినీ కమ్మేస్తుంది. చీరల జాతరలకు - పోసుకోని కబుర్లకు, పక్కింటి పుల్లకూర్ల పోలికలకూ, టీ.వీ సీరియళ్లకూ, ఇతరులను ఆడిపోసుకోవడానికీ, మూఢనమ్మకాలకు ఇచ్హ్చిన ప్రాధాన్యత ఈ సమస్యకి ఇవ్వరు. డబ్బుంటే ఉప్పలమ్మకో, కట్టమైసమ్మలకో జాతరలు చేద్దామని భర్తలను వేధిస్తారు. మరుగుదొడ్డి కడదామంటే ఇపుడెందుకూ దండగా అంటారు. అందరూ అలా ఉంటారని కాదు. పరిస్తితిలో ఇపుడు కొంత మార్పు కూడా వచ్చింది. కానీ ఇంకా మారాల్సి ఉందీ అనేది ఈ సమస్య ఇంకా ఉండడాన్ని బట్టి చెప్పొచ్చు
 • అత్యంత ప్రాధాన్యతగా పట్టించుకోవలసిన ఈ పారిశుధ్య - కాలుష్య సమస్యని అనాదిగా వదిలేస్తూనే ఉన్నారు. కానీ భారత దేశం యొక్క ఆత్మ పల్లెల్లో ఉందనీ, గ్రామ స్వరాజ్యం వికసించినప్పుడే భారత స్వాతంత్ర్యానికి అర్ధముంటుందన్న గాంధీజి మాటల్ని లెక్క చేసేదెవరు? మూటలు లెక్కలేసుకునేవారే తప్ప.
 • ఓ సందర్భం లో ఎన్.టీ.ఆర్ అమెరికా వెళ్లి వచ్చి వాళ్ల మరుగుదొడ్లే మన రోడ్లకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే అంతా ఆవేశపడి ఆయనను ఖండించారు. కానీ భావావేశంలో తప్ప ఆచరణలో మన వాళ్లు ఏ పాటి ఘనాపాటీలో తెలియనిదా?
 • ఎందరో వీరుల త్యాగఫలమైన మన స్వాతంత్ర్యం, వీరూలంతా, వారి చరిత్ర, సంస్కృతి అంతా పల్లెలదే అయినా పల్లెల్లో నేటికీ అజ్ఞానం - అసహాయత - సమస్యలు తాండవిస్తుంటే మనమెక్కడి పోతున్నట్లు?

ఈ వాక్యాలు ఓ బ్లాగర్ తన బ్లాగులో వ్రాసుకున్నవి : 

  • ‘‘ ‘గరీబీ హఠావో’ అంటే- నేతల సంపన్నతకు అవరోధమయ్యే ‘గరీబీ’ని తొలగించమనే! ‘మురికివాడల అభివృద్ధి పథకం’అని వాడడం చూస్తూంటాం! అంటే- మురికివాడల నిర్మూలన కాదన్నమాట! వాటిని పెంచడం అన్నమాట! మురికివాడలు, పేదరికం వుంటేనే కదా- అవి పోగొట్టడానికి నేతలు శ్రమించడం అనేది! అంచేత- అవి పోకూడదు! వీళ్లు ఆ కబుర్లు చెబుతూ వుండాలే గానీ, అటుపోకూడదు. ప్రజలందరూ ‘బాగుపడిపోతే’ ఇంక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడుంటాయి? ఎందుకుంటాయి? అంచేత ‘ఎక్కడ వేసిన గొంగడి’- ప్రజలది, అక్కడే వుండాలి. పాలకులు మాత్రం ఆ ‘గొంగడి’ కప్పుకుని వెచ్చగా తమ రాజకీయ ‘అంగడి’వ్యాపారాలు పెంచుకుని, పైడితో, పాడితో సుఖించాలి! దటీజ్ భారత్.’’
  • ప్రజలకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. పౌరులకు హుందాగా జీవించే హక్కు ఉందని రాజ్యాంగం ఘోషిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరవై నాలుగేళ్లు. అందరికీ ఆరోగ్యం, ‘రోటీ, కప్‌డా ఔర్ మకాన్’ అందడం మాట అటుంచి రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి కూడా ఇంకా తొలగిపోలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నా, పార్టీలు మారుతున్నా ఈ పరిస్థితి మాత్రం మారకపోవడం సిగ్గుచేటుకాదా? వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఇప్పటికీ పల్లెలు, గ్రామాల్లోనేకాదు పట్టణాలు, నగరాల్లోనూ పేదలు రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకోక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిశువూభత లోపించిన ఫలితంగా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
  • కాలుష్యపరంగా ఆరోగ్యపరంగా తలెత్తుతున్న ఆందోళనకర పరిణామాల తీవ్రత తెలిసొచ్చాక ప్రభుత్వ పథకాలు రూపుదాల్చాయిగానీ ఆచరణ ఇంకా అంతంతమావూతమే. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ ‘తెలుగు మహిళ బహిర్భూమి పథకం’ అంటే పేరు చూసి నవ్వొచ్చిందేమోగానీ, నిజానికి ఆ సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలే నవ్వులపాలవుతున్నాయి. ఈనాటికీ మహిళలు తెల్లవారకముందే చీకట్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇందుకు సిగ్గుపడాల్సిందెవరు? ఆ వసతులు కల్పించని ప్రభుత్వాలే కదా? 
  ఈ పరిస్తితి మారాలి - మనమే మార్చాలి.
  • కొన్ని గ్రామాలు ఆదర్శంగా  ఈ సమస్యను అధిగమించినవీ ఉన్నాయి మన రాష్ట్రం లో . ఆయా గ్రామాల స్పూర్తితో ఇతర అన్ని గ్రామాలూ పని చేయాల్సి ఉంది. చిల్లర రాజకీయాలు మాని ఈ సమస్య వరకైనా అన్ని పార్టీలు కలసి పనిచేయాలి.
  కేంద్రం నిధులిస్తామన్నా రాష్ట్రం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి.

  ఇదిలా ఉండగా కేంద్రం నిధులిస్తామంటున్నా కుళ్లు రాజకీయాలతో కాలం వెళ్ళబుచ్చే మన నేతలకు ఈ సమస్యపై దృష్టి సారించని పరిస్థితీ ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం పై వచ్చిన ఓ వార్త చూడండి.

  పదమూడేళ్లుగా సాగుతున్న కేంద్ర పథకం భారీగా నిధులిస్తామంటున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే విస్మయం కలిగిస్తోంది. సొంతంగా రూ.50కోట్లు ఖర్చుపెట్టినట్లు చూపిస్తే చాలు.. అంతకు పదింతలు- రూ.500కోట్లు ఇస్తామని కేంద్రం అంటోంది. ఒక్కో జిల్లాలో కనీసం ఐదులక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరి ఇక్కడ సర్కారుకెందుకు నిర్లక్ష్యం? 1998 నుంచి రాష్ట్రం లో ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.20 కోట్లు కూడా వ్యయం కాలేదని సమాచారం. గ్రామీణ ప్రజల అవసరాల్లో 15 శాతం కూడా తీరలేదు. ఇదీ ప్రగతి! మరో మూడునెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఇదీ పథకం పరిస్థితి!!"
  మొత్తం మీద ఇంకా అనాగరికంగానే జీవిస్తున్నామూ అనడానికి ఉదాహరణ నేటికీ ఊరిబయట మల విసర్జన జరుగుతుండడమే. ఈ సమస్యను ఎంత త్వరగా సమూలంగా నాశనం చేస్తే అంత మంచిది. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్లు. జాతిపితకు నిజమైన నివాళులర్పించినట్లు.
  - పల్లా కొండలరావు,
  4-11-2012.
  --------------------
  *Republished
  ఈ విషయంలో మన ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు. ఎన్.టీ.ఆర్ తరువాత ఆ దిశగా సక్రమంగా ఆలోచించింది ఆయనే అని నేను అభిప్రాయపడుతున్నాను. 2012 లో నేను బ్లాగులోకి వచ్చిన మొదట్లో వ్రాసినది యథాతథంగా రీపబ్లిష్ చేస్తున్నాను. పరిస్థితిలో మెరుగదల ఉందన్నది గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి. 

  Post a Comment

  1. ఇది తీవ్రమైన సమస్య. తక్షణమే పరిష్కరించాల్సిన సమస్య కూడాను. మీ విశ్లేషణ బాగుంది. పారిశుధ్యం అవసరం, మార్చుకోవలసిన అలవాట్లు వంటి విషయాలలొ ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజా చైతన్యం వల్లనే ఇది సాధ్యం.

   ReplyDelete
   Replies
   1. అవును కిశోర్ గారు. ప్రభుత్వ నిధుల కేటాయింపుతో పాటు ముఖ్యంగా ప్రజా చైతన్యం అవసరమిటువంటి సమస్యలను సమూలంగా నాశనం చేయడానికి. స్పందనకు ధన్య్వాదములు.

    Delete
  2. ఉచితంగా Latrine tank నుంచీ అశుధ్ధం తొలగించే వరకు మారదు.

   ReplyDelete
  3. ఈ సమస్యని పరిష్కరించాలంటే లెట్రిన్స్ కట్టాలి. వాటికి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 24 గంటలూ నీటి సరఫరా ఉండేలా చేయాలి. డ్రెయినేజి వ్యవస్థ ఏర్పఱచాలి. గ్రామాల్లో గొట్టాల ద్వారా నీటిసరఫరా జఱగాలి. మోటార్లు పెట్టాలి. ఆ మోటార్లకి కరెంట్ ఇవ్వాలి. ఇన్ని సోపానాలున్నాయి. వీటిల్లో ఒక్కదాని గుఱించి కూడా ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదు.

   ReplyDelete
   Replies
   1. ప్రతి ప్రభుత్వానికీ అధికారం నిలుపుకోవడానికీ , ప్రతి ప్రతిపక్షానికి అధికారం లోకి రావడానికి కావలసిన ఆలోచనలు ఎత్తుగడలు తప్ప ప్రజావసరాలు పట్టడంలేదు. ప్రజలను ఓటర్లుగా కాక పౌరులుగా చూసే రోజులు రావాలి. అప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుంది.

    Delete
  4. మంచి సమస్య లేవనెత్తారు.
   ఎప్పుడాగుతుంది అంటే 1) తామేదో దేశాన్ని సారవంతం చేస్తున్నామన్న అపోహ జనాలకు తొలగించాలి 2) అలాంటి కార్యక్రమాలకు పాల్పడే వారికి తడవకు 500రూ జరిమానా విధించి గట్టిగా అమలు చేయాలి 3) టాయిలెట్ కట్టుకునేందుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా చూడాలి 4) పబ్లిక్ టాయిలెట్లు కట్టించడం సమసమాజం నిర్మించలేము, కట్టించడం కన్నా వాటిని నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న సమస్య అని, ప్రతిదీ ప్రభుత్వమే చేయాలా? అని మేధావులు గుర్తించి ప్రశ్నించుకోవాలి.

   ReplyDelete
   Replies
   1. SNKR గారూ! మీ సూచనలకు ధన్యవాదాలు.మరుగు దొడ్లు అనేవి సామాజికంగా నిర్మించడం సరయినది కాదనే నా అభిప్రాయం. అయితే గ్రామానికి కనీసం 5 ఉమ్మడి మరుగుదొడ్లు ఊరిబయట ఉండాలి. అత్యవసర అవసరాల కోసం. వీటి నిర్వహణ కూడా గ్రామ పంచాయితీలకుండాలి. ఉచితం అనుచితం అనేది అన్ని విషయాలలో కుదరదని నా అభిప్రాయమండి. ఉచితం పేరుతో నిధుల దుర్వినియోగం ను అరికట్టాలి. నిధుల దుర్వినియోగం అనేది ఉచితం లో మాత్రమే కాదు అన్నింటా ఉంది. అది వేరే సమస్య.

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

  అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
   
  Top