చేయెత్తి  జై కొట్టు తెలుగోడా?

'నా బ్లాగు అనుభవాలు' లో నేను కంప్యూటర్ ఎలా నేర్చుకున్నానో గత పోస్టులో తెలిపాను కదా! ఈ పోస్టులో తెలుగు టైపింగ్ గురించిన నా అనుభవాలు మీతో పంచుకుంటాను. నాకు మొదటినుండి తెలుగు అంటే ఇష్టం. మూడో తరగతి నుండే తెలుగుమీద మమకారం స్టార్ట్ అయింది. మా క్లాస్మేట్స్ ఎక్కువభాగం ఇంగ్లీషులో సంతకాలు చేస్తే నేను మాత్రం తెలుగులో సంతకం చేసేవాడిని. శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడనీ, ఇంగ్లీషు వాడైనా బ్రౌన్ లాంటి వారు తెలుగు భాషను వెలుగులోకి తేవడానికి కృషి చేశాడనీ చెప్పే పాఠాలు ప్రభావితం చేయడమే గాక, సహజంగా మాతృభాషపై ఉండే అభిమానమో, ఎందుకో చిన్నప్పటినుండి నాకు తెలుగు మీద కొంత ఎక్కువే మమకారం ఏర్పడింది. నేను హై స్కూల్ కెళ్లాక అక్కడ మా తెలుగు మాస్టారు వజ్రాల పరబ్రహ్మం గారు అని ఉండేవారు. ఆయనకూడా తెలుగు భాష పట్ల మంచి అభిమానం, భాషపై మంచి పట్టు కలిగి ఉండేవారు. తెలుగు గ్రామర్, సాహిత్యం ఇతర సంధులు-సమాసాలు ఇలా చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటు తెలుగుపై గతంలో ఉన్న అభిమానం మరింత పెరిగింది.

నానా తంటాలు పడి కంప్యూటర్ నేర్చుకున్నాక తెలుగు టైపింగ్ నేర్చుకోవడమూ ఓ ప్రహసనమే అయింది. ఎవ్వరినడిగినా అప్పట్లో తెలుగు టైపింగ్ కష్టమనేవారే. నా అనుభవంలో " కష్టం అనేది నిజం కాదు. వాళ్ళకి రాదు. పైగా ఇంగ్లీషు మీద తెలియని మోజుతో అలా చెప్పారు " అని తేల్చుకున్నాను. తెలుసుకున్నాను. కంప్యూటర్ అంటేనే అంతా ఇంగ్లీషుతో మాత్రమే ముడిపడి ఉంటుందన్న తప్పు సంకేతాలు ఇచ్చారు చాలామంది. తెలిసి కొంత తెలియక కొంత. మిడి మిడి జ్ఞానం(?) తో కొంత. కంప్యూటర్ నేర్చుకున్నాక తెలుగు టైపింగ్ కోసం దాదాపు 4 నెలలు ప్రయత్నించినా ఎవరూ సహకరించలేదు. చివరికి ఒక్కో 'కీ'  టైప్ చేసి ఏ అక్షరం టైప్ చేస్తే తెలుగులో ఏ అక్షరం వస్తుంది చూశాను కొన్నాళ్లు. కానీ మన భాషకి దీర్ఘాలు, వత్తులు ఉంటాయి కదా  అవి అర్ధం కాకపోయేవి.

తెలుగు కీబోర్డ్ ఉంటుందేమో అనుకునేవాడిని. కంప్యూటర్ పరిభాష వేరే ఉంటుందని ఇంగ్లీష్ కూడా కాదని ఒక్కో 'కీ' కి ఒక్కో అవుటు పుట్ వచ్చేలా ఏర్పాటు ఉంటుందని తెలుసుకున్నాను. అదంతా గుర్తు లేదు కానీ తెలుగు అక్షరాలను అంతర్జాలంలో అంతర్జాతీయంగా మంచిగానే తయారు చేయవచ్చని నమ్మకం కలిగింది. ఆ విధమైన ప్రయత్నాలను ఇపుడు మనం చూస్తున్నాం కదా? ఆ ప్రయత్నాలు చేస్తున్నవారందరికీ అభినందనలు. ప్రభుత్వపరంగా కూడా ఆ ప్రయత్నాలు పురోగమించాలని వీలయినంత త్వరగా పూర్తి కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


ముందుగా శ్రీలిపి వాడాను. తరువాత అనూ ఫాంట్స్ వాడాను. పేజిమేకర్ కోసం ట్రై చేశా. రాలేదు. వర్డ్ లోనే కంటిన్యూ అవుతున్నాను. నా అవసరాలమేరకు వర్డ్ సరిపోతున్నది. గతంలో విండోస్ 98 లో వర్డ్ లో జస్టిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు రావడం లేదు.  వర్డ్ లో జస్టిఫికేషన్ ఎలా వస్తుంది? ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

ప్లస్, బ్లాగులలో అయితే అనూఫాంట్స్ కుదరదు కనుక నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చూసి 'అక్షరమాల' వాడాను. కానీ అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు కొన్ని అక్షరాలు సరిగా రావడం లేదు. ఆ తరువాత లేఖిని ఎక్కువగా ఉపయోగించాను. ప్రస్తుతం శ్యామలీయం గారు సూచించిన ప్రముఖ్ టూల్ ని వాడుతున్నాను. కొన్ని పదాలు ఇబ్బందిగా ఉన్నా ఈజీగా ఉన్నది. ఇందులో ఇబ్బందిగా ఉన్నవి లేఖిని ద్వారా టైప్ చేస్తున్నాను. లేఖిని అయితే కాపీ చేసి తిరిగి పేష్టు చేసుకోవాలి. ప్రముఖ్ అయితే డైరెక్టుగా టైప్ చేసుకోవచ్చు. వీటి వాడకం వలన పాత ఫాంట్స్ టైపింగ్ మరచిపోతానేమోననిపిస్తోంది :))

మనం అనూఫాంట్స్ వాడినా అవి అన్ని చోట్లా రావు. నేను మా బిజినెస్ కోసం వెబ్సైట్ తయారు చేయించిన  సాఫ్ట్వేర్ వాళ్లదగ్గర తెలుగు కోసం గట్టిగానే యుద్ధం చేశాను. వాళ్ళకి తెలుగు రాదు. కనీసం యూనికోడ్ గురించి కూడా మనకు చెప్పరు. వాళ్ల గోల, బాధ వాళ్లదే తప్ప మన తాపత్రయం బాధ వాళ్లకి పట్టవు. చివరకు తెలుగు లో నేను టైప్ చేసింది ఇమేజ్ గా మార్చి పెట్టించే ఏర్పాటు చేశాను. హోం పేజిలో న్యూస్ అనేదానికి మాత్రం తెలుగు వచ్చేలా చేయించాను. అది చేయడానికి వాళ్లతో 2 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. నాకు తరువాత అర్ధమయిందేమిటంటే వాళ్ల నిర్లక్ష్యమే తప్ప అలా చేయడానికి ఒక్క గంట చాలు. ఏం చేస్తాం? మన తెలుగు పరిస్తితి అదీ. తెలుగోళ్లతోనే అలా ఉంది? 'ఈ పరిస్తితైతే మారాలి' అని చెప్పగలను. http://www.palleprapancham.in/

బ్లాగులలో తెలుగు కోసం కృషి చేస్తున్నవారు చాలామందే ఉన్నారని తరువాత అర్ధమయింది. తెలుగుకోసమే తాపత్రయపడేవాల్లను చూసి సంతోషమనిపించేది. తెలుగు కు కంప్యూటర్ పరంగా విలువ లేదని చెప్పిన వారి పట్ల కోపం వచ్చేది.  కానీ వాళ్ల అజ్ఞానమని సరిపెట్టుకోవడం తప్ప చేయగలిగేదేమీ లేదు. ఓ పల్లెటూల్లో ఉండి తెలుగు నేర్చుకోకపోతే ఇంగ్లీషు రాని నేను మీతో ఇన్ని విషయాలు పంచుకోగలిగేవాడిని కాదు. ఇన్ని విషయాలు నేర్చుకోగలిగే వాడినే కాదు. 

"తెలుగువర్ణమాలలోని 56 అక్షరాలివే ! " అనే పోస్టును వ్రాశాను.  చాలామందికి నేడు తెలుగు భాషలో అక్షరమాల తెలియకపోవడం, తెలుగును నిర్లక్ష్యం చేయడం బాధ కలిగించేదయితే, అంతర్జాలం లో తెలుగు కోసం మరోవైపు మంచి ప్రయత్నాలు జరుగుతుండడం చూస్తే నేను తెలుగు టైపింగ్ కోసం బాధపడ్డ విషయం మరచిపోవడం జరుగుతుంది. జనవిజయం బ్లాగులో తెలుగు భాష కోసం ఓ లేబుల్ వుంచి కొంత ప్రయత్నం చేశాను. కానీ నాకంటే మెరుగ్గ ప్రయత్నిస్తున్నవారున్నందున ఆ ప్రయత్నాలు మానేశాను. అయితే వాళ్లని అభినందించడానికి , నాకు నచ్చిన తెలుగు భాషకు సంబంధించి మంచి ఉపయోగకరమైన విషయాలను ఓ చోట ఉంచితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఈ బ్లాగులో 'తెలుగు-వెలుగు' అనే లేబుల్ ఉంచి ప్రయత్నిస్తాను నా వంతుగా. పల్లె ప్రపంచం ఫౌండేషన్ విజన్ లో తెలుగు భాషాభివృద్ది అనే అంశం కూడా చేర్చాను.

నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే. ఎవ్వరి ప్రయత్నాలనూ కించపరచడం, డిస్కరైజ్ చేయడం చేయొద్దు. మీకు తెలియకపోతే తెలీదు అని చెప్పండి. నాకైతే రాదు, మీరు ప్రయత్నించండి! అని ప్రోత్సహించండి. తెలుగును కించపరచకండి. తెలుగువారయి ఉండి తెలుగును అపహాస్యం చేయొద్దు. తెలుగును చులకన చేసి మీరు చులకన కాకండి! ఇంగ్లీషు పై మోజు వద్దు. ఇంగ్లీషు నేర్చుకోండి. తప్పు లేదు. తెలుగును కించపరచకండి. ఏ పదం ఎలా పలకాలో వ్రాతలో కూడా చూపగలిగే మన తీయనైన భాషను అంతర్జాలంలోనూ మరింతగా అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేయండి. ఆ విధంగా కృషి చేయాలనుకునే వారంతా ఓ వేదికగా తయారు కావాలి. 

నేను స్వంతంగా ప్రయత్నించి కేవలం 12 రోజులలో నేర్చుకున్నాను. అదే ప్రయోగం మా అబ్బాయి అరవింద్ మీద ప్రయోగిస్తే 3వ తరగతిలోనే కేవలం 3 రోజులలో నేర్చుకున్నాడు. కొన్ని అక్షరాలు అవసరాన్ని బట్టి ఆ తరువాత ప్రాక్టీస్ లో వస్తున్నాయి. ఆ ప్రాక్టీస్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే శ్రీలిపి నుండి అనూ ఫాంట్స్ కూ, అనూ నుండి లేఖిని వరకూ వచ్చినందున ఎప్పటికప్పుడు ప్రయోగాలు తప్పడం లేదు. యూనికోడ్ లో డైరెక్ట్ గా అన్ని అక్షరాలు సక్రమంగా వచ్చేలా డెవలప్ కావాల్సి ఉన్నందున ఈ ప్రాక్టీస్ నిరంతరమూ కొనసాగాల్సిందే అనుకుంటున్నాను.

నేనైతే ఎక్కువగా ప్రముఖ్, లేఖిని వాడుతున్నాను. అన్ని అక్షరాలు సరిగా వత్తులతో సహా సరిగా వచ్చేలా డైరెక్ట్ గా తెలుగు టైప్ చేసుకునే అవకాశం రావాలి. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుందని ఆశిస్తున్నాను. అన్ని అక్షరాలు సరిగా వచ్చేలా కూడా తెలుగు ఫాంట్స్ అభివృద్ధి కావాలని, అవుతాయని ఆశిస్తున్నాను. నన్ను ఎవరడిగినా తెలుగు టైపింగ్ చాలా తేలిక అని చెప్తూ ప్రోత్సహిస్తున్నాను. 

కొన్ని అక్షరాలు తెలుసుకోవలసి వచ్చినప్పుడు మామూలుగా అయితే విసుక్కుంటున్నారని ఆ మేటర్ వచ్చేలా చూసుకుని దగ్గరుండి తెలుగు టైప్ కొట్టించి మరీ తెలుసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం అది అంత తేలిక కాదు. అది అంత అవసరం లేనిది. పేజిమేకర్ రావాలి. టైపింగ్ నేర్చుకోవాలి.  చాలా కష్టం.  "ఈ డైలాగులలో ఏ ఒక్కటీ నిజం కాదు." వారికి చేతగాక చెప్పేవే. మిడిమిడి జ్ఞానం మాత్రమే.  కానీ అవసరం ఏమిటో మనకు తెలుసు. వాళ్లెలా చెప్పగలరు? ఇది తప్పు అని వేరే చెప్పాల్సిన పని లేదు. "కష్టం" "అది అయ్యేది కాదు" అనే జవాబులు నిర్లక్ష్యం మరియూ వాళ్లకు చేతకానిది ఇతరులకూ చేతకాదనే నెగిటివ్ ధోరణి. అసలు తెలుగు టైపింగ్ అనేది ఉందీ అంటే అది మనకు ఇష్టం అయినదై వుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేర్చుకోవడానికి కూడా నాకు తెలిసి ఇదీ మార్గం అని ఉండదనుకుంటాను. నేర్చుకున్నతరువాత అదీ ఓ మార్గం అవుతుందేమో. ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే అందరికీ ఇలాంటి వాళ్లే ఎదురు కాక పోవచ్చు.

- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

 1. నేను బర్హ వాడతా ఒక్కరోజులో నేర్చుకున్నా. ఇప్పటికీ అదే వాడుతున్నా.తెలుగులో టైపు చేయడం చాలా చాలా తేలిక. సంవత్సరంగా, నేనూ పల్లెటూరివాడినే చదువుకోలేదు కూడా..:)

  ReplyDelete
  Replies
  1. కష్టే ఫలే గారూ అభినందనలు. మీ పేరులోనే కష్టం - ఫలితం ఉన్నాయి. అభినందనలండీ. అయితే మన బేచ్ కూడా బాగానే ఉందన్న మాట :))

   ఇంగ్లీషు టు తెలుగు వేరు . తెలుగు ఫాంట్స్ వేరు కదండీ. అవి ఒక్క రోజులో అంటే కష్టమేమో. నాకైతే 12 రోజులు , మా అబ్బాయికి 3 రోజులు సమయం పట్టిందండీ.

   బరహా గురించి విన్నాను . కానీ చూడలేదండీ. యూ.ఆర్.ఎల్ చెప్తారా?

   Delete
 2. మీ మెయిల్ అడ్రస్ చెబితే లింక్ పంపుతా.

  ReplyDelete
 3. మైక్రోసాఫ్ట్ తెలుగు కూడా సులభమే అండి..వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి, సార్...

  ReplyDelete
  Replies
  1. మైక్రో సాఫ్ట్ తెలుగు అంటే నాకు తెలియదండీ. వివరించగలరా?

   Delete
  2. విండోస్ లో రీజనల్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ లో, తెలుగుని ఎంచుకోండి, ఒక్కసారి కీ బోర్డ్ పై అక్షరాలు గుర్తుంచుకుంటే చాలు, కొంచె ప్రాక్టీస్ తో తెలుగుని టైపు చేసేయచ్చు, నేను మొదటి నుంచి ఇదే వాడుతున్నాను కాబట్టి మిగిలిన వాటితో పోల్చలేను.

   Delete
 4. అమ్మ బాష కోసం మీరు పడుతున్న తాపత్రయం అభినందించతగ్గది. మీ కృషి తప్పక ఫలిస్తుంది. కృతజ్ఞతలు

  ReplyDelete
 5. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 24 గంటల్లో తెలుగు టైపింగ్ నేర్పుతుంది కదా! ఇంత కష్టపడాల్సిన అవసరమేముంది?

  ReplyDelete
  Replies
  1. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ అంటే?

   Delete
  2. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 2008 లో విడుదలైన తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. దీని గురించి వీవెన్ గారి రివ్యూ కింద చూడవచ్చు.
   http://veeven.wordpress.com/2008/04/27/intro-to-anupama-typing-tutor/
   అనుపమ వెబ్ సైటు కింద చూడవచ్చు.
   www.anupamatyping.com
   తెలుగు టైపింగ్ గురించి, తెలుగు ఫాంటుల గురించి కింది బ్లాగులో చూడవచ్చు.
   www.anupamatelugu.blogspot.com

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top