ఈ ఇమేజ్ గూగుల్ సెర్చ్ ద్వారా సేకరించాను

సముద్రానికీ ఒడ్డు ఉంటుంది కదా.....!?
బ్లాగు అనే పదమే సెప్టెంబర్ 2011 వరకూ నాకు పెద్దగా తెలీదు. అమితాబ్ ఏవో విషయాలు తన బ్లాగులో వ్రాశాడని , బీ.జే.పీ అగ్రనేత అద్వానీ లాంటి మరి కొందరు ప్రముఖులు తమ బ్లాగులలో ఏదో విషయం పై తమ అభిప్రాయాలు వ్రాసుకున్నారని చూచాయగా వినడమే తప్ప నాకు బ్లాగుల గురించి తెలీదు. బ్లాగులోకం లోకి వచ్చాక నా అనుభవాలు - పరిచయాలు - నచ్చిన బ్లాగులు , బ్లాగర్లు లాంటివి వ్రాసే ముందు నేను కంప్యూటర్ ఎలా ఎందుకు నేర్చుకున్నానో తెలియ జేయాలనుకుంటున్నాను. ఓపికగా  భరించాలి మీరు. ఎందుకంటే ఇది మీకోసం కాక కేవలం నాకోసం వ్రాసుకుంటున్నది కనుక.:))

అసలు నేను కంప్యూటర్ నేర్చుకోవడమే ప్రత్యేక పరిస్తితులలో నేర్చుకున్నాను. ఖమ్మంలో డా. వీ.నాగేష్ గారి 'హేపీ ప్రోగ్రాం' అనే కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నప్పుడు కొన్ని విషయాలతో ఒక గోల్ ఏర్పాటు చేసుకున్నాను. దానిలో భాగంగా ఇంటి దగ్గరే ఉండి కంప్యూటర్ నేర్చుకున్నాను. ఇంటి దగ్గరే అంటే మారుమూల పల్లెటూళ్లో (చొప్పకట్లపాలెం) ఉండి పట్టుదలతో నేర్చుకోవడం జరిగింది. షుమారు 9 సంవత్సరాల క్రితం నేను బోనకల్ ( మా మండల కేంద్రం మరియు ప్రస్తుతం నేను నివాసముంటున్న గ్రామం) పోలీస్ స్టేషన్లో పని వుండి వెళ్లాను. అక్కడ ఎస్.ఐ వెంకట్రావు గారు అని తను కంప్యూటర్ తెప్పించి నేర్చుకుంటున్నాడు. క్రైం రిపోర్ట్స్ ఎస్.పీ ఆఫీసుకి కంప్యూటర్ ద్వారా పంపుతున్నట్లు, ఇలా పంపగలిగే వారు (అప్పట్లో) చాలా తక్కువ మంది అని చెప్పారు. మాటల సందర్భం లో 'నేను నేర్చుకోవచ్చా?' అని అడిగాను. నెట్వర్క్ మార్కెటింగ్ మీద నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నందున స్వంతంగా కంపెనీ పెట్టి వ్యాపారం చేయాలనే తలంపుతో అలా అడిగాను. అందుకు ఎవరైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబు కూడా 40 ఏండ్ల వయసులో వాళ్లబ్బాయి దగ్గర కంప్యూటర్ నేర్చుకున్నాడని చెప్పారు.

పైగా ఎస్.ఐ గారికి కంప్యూటర్ నేర్పేది మా వూరు వాడే. మండెపుడి నరేష్ అని నాకు బంధువు కూడా అవుతాడు. నరేష్ ని అడిగితే ముందు మీకెందుకు అది చాలా కష్టం అన్నాడు. లేదు, 'నేర్చుకోవాలీ' అంటే, 'నీకు సాధ్యం కాదన్నాడు'. దానికి ఇంగ్లీషు వచ్చి ఉండాలన్నాడు. నాకేమో ఇంగ్లీషు  రాదు. నాకు తెలిసి నేను చెప్పిన ఎస్.ఐ గారికి కూడా పెద్దగా ఇంగ్లీషు రాదని నా అభిప్రాయం. కంప్యూటర్ కు ఇంగ్లీషుకు సంబంధమేమిటని మళ్లీ నరేష్ ని అడిగాను అతనేదో చెప్పాడు అవేవీ సహేతుకాలనిపించలేదు. 'ఎస్.ఐ గారికెలా నేర్పుతున్నావు?' అని నిలదీసినా సరిగా స్పందించలేదు. ఆ తరువాత ఒక్కడినైతే పని కాదని చిన్నపాటి సమావేశం పెట్టి ఓ 20 మందిని పోగేశా. అందరూ చాలా హుషారుగా మనకీ కంప్యూటర్ వచ్చేస్తుందోచ్ అన్నంతగా విజృంభించి నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఊళ్లో జనాలేమో నవ్వుకునేవారు.

సరే మనం చేసేదానిలో తప్పేముందని చూసుకుని మొండిగా ముందుకు పోయే అలావాటున్న నేను మా ఊళ్లోనే సాఫ్ట్వేర్ రంగం లో పని చేసేవాడు ఇంకొక వ్యక్తి ఉంటే  అతడ్ని పిలిచి అడిగాను. ఈ సారి నేను ఒక్కడిని కాకుండా ఇద్దరం (నేను,బోయనపల్లి అంజయ్య అని చొప్పకట్లపాలెం లో మా ఇంటిపక్క ఉండేవాడు) కలసి అడిగాము. అతనూ మీకెందుకు సార్ కంప్యూటర్? ఇప్పుడది అంత తేలికగా అయ్యేపనేనా? అన్నాడు. అసలు కంప్యూటర్ లో ఏమేమి ఉంటాయి? మనకు కొన్నైనా ఉపయోగపడతాయి కదా? ఆ వివరాలు చెప్పు. మనకొచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తే తప్పేంటి? అన్నాను. దానికి అతను సముద్రమంత ఉంటుంది. ఏమని చెప్పమంటారు? అన్నాడు నవ్వుకుంటూ అదో రకంగా మొహం పెట్టి. దానికి నా పక్కనున్నతను సముద్రానికి కూడా ఒడ్డు ఉంటుంది కదా? అక్కడనుండి మొదలెట్టొచ్చు కదా? అన్నాడు. ఆ మాటా కరక్టే కదా? అని నేను వాదించాను. అతను చివరికి తట్టుకోలేక ఓ కంప్యూటర్ కొనుక్కోండి. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. నేను సెలవులకు వచ్చినప్పుడల్లా కొంత చెప్తానన్నాడు. అయితే ఓ.కే అని సంతోషం వేసింది. మరి కంప్యూటర్ కొనాలంటే ఎలా?

ముక్కు కోసినా మొదటోడే నయమని మళ్లీ మొదట చెప్పిన నరేష్ దగ్గరకొచ్చి (ఇతడయితే ఎపుడూ ఊళ్ళోనే ఉంటాడు కనుక) కంప్యూటర్ కొనాలి? అన్నాను. అతనెలాగూ హార్డ్వేర్ వర్క్ చేసేవాడు కనుక సరే నన్నాడు. రేపు మాట్లాడదాములే అన్నాడు వాయిదా వేయడానికి . రేపు కూడా పట్టుబట్టి వెళ్ళాను. ఇక వదిలేట్లు లేడనుకుని, నేనెలాగూ మధ్యలో వదిలేసేదే అని ఫిక్ష్ అయ్యి, ఇదంతా కొనడాలు ఇవీ ఎందుకు గానీ ముందు రెంట్ కు తెద్దాము. మీరు కొనసాగిస్తే కొనుడు సంగతప్పుడాలోచిద్దామన్నాడు. మాంచి ఉత్సాహం తో ఉన్న మేము అందుకూ సరేనన్నాము.

మళ్లీ ఇంతకుముందు మీటింగేసుకున్న 20 మందిని పోగేస్తే తలా కొంత డబ్బులేసుకోవాలి అని ప్రతిపాదిస్తే కేవలం 9 మందే ఓ.కే అన్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ ఎస్.ఐ గారి వద్ద ఉన్న సిస్టం ని మేము తెచ్చుకున్నాము. ఆయన కొత్తది కొనుక్కున్నాడు. నెలకు 1200 రెంట్ అని చెప్పాడు. ఎర్త్ పెట్టాలి సపరేట్ గది ఉండాలి కొన్ని కండీషన్స్ చెప్పాడు నేర్పే నరేష్. సరేనని ఆ ఏర్పాట్లన్నీ చేశాము. 9 మందికి తలా 150 రూపాయలు పడుతుందని అది పెద్ద మేటర్ కాదని మొదలెట్టాము. కానీ అదే మేటర్ అయింది. డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి ఒక్కడే ఇచ్చాడు. మిగతా వాళ్లు ఓ వారం రోజులు వచ్చి మానేశారు. ఆ ఒక్కడు  15 రోజులకే మానేశాడు.

నేను ముందే చెప్పానా? ఇది కాదని అని నరేష్ సతాయింపులు - సన్నాయి రాగాలు మొదలెట్టాడు. ఇదంతా కాదు కంప్యూటర్ కొనాలంటే ఎంతవుద్ది చెప్పు అన్నాను. నువ్వే రా అని ఖమ్మం తీసుకెళ్లి కొన్ని పాత ఇన్స్టిట్యూట్లు తిప్పాడు. 12000 రూపాయలకు ఓ కంప్యూటర్ ని బేరమాడి తెచ్చాము. అంతకు ముందు సిస్టం కు కట్టాల్సిన నెల అద్దె నేనే కట్టి దానిని ఇచ్చేసి కొత్తగా ఓ పాత కంప్యూటర్ కొన్నాను. ప్రతి రోజు రాత్రి వేళల్లో కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి నరేష్ వచ్చేవాడు.  సిస్టం ఆన్ చేయడం - షట్ డవున్ చేయడం - పెయింట్ వరకూ నేర్పాడు. వర్డ్ లో ఏవేవో చెప్పేవాడు. అంతగా తలకెక్కక పోయేది. అడిగితే విసుక్కునేవాడు. లేదా మనమే విసిగించేవాళ్లం. ఇలా కుదరదని ఖమ్మం వెళ్ళి కంప్యూటర్ నేర్చుకునే బుక్ కొన్నాను. అదీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

ఇలా బుక్స్ కోసం వెతుకుతుంటే ఓ అద్భుతం జరిగిందని చెప్పొచ్చు. పిల్లను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికామన్న మాట. అప్పట్లో 8 వ తరగతి వారికి ఎన్.ఐ.ఐ.టీ వాళ్లు కంప్యూటర్ శిక్షణ కోసం ఓ బుక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠ శాల విధ్యార్ధుల కోసం. అందులో ఏ-టూ జెడ్ స్క్రీన్ షాట్ లతో వివరంగా ఉన్నాయి. చాలా రోజులు ఆ బుక్ భద్రంగా దాచాను.అప్పుడెవరో కొట్టేశారు. ఆ బుక్ చలవతో నేను కంప్యూటర్ నేర్చుకోగలిగాను. ఆ బుక్ తోడుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పగలను. అంత వివరంగా ఉందా పుస్తకం. ఎవరిదగ్గరైనా ఆ బుక్ , దాని తరువాత ఇంకో బుక్ వచ్చిందీ ఉంటే తెలుపగలరు. తెలుగులో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులకోసం వ్రాసిందా పుస్తకం.

అలా మొదలైన కంప్యూటర్ నేర్చుకునే కార్యక్రమం నేటికీ కొనసాగుతుంది. మీ అందరితో ఇలా పరిచయం కావడానికి, చాలామంది మేధావులుతో, మంచి అభిప్రాయాలున్న వ్యక్తులతో పరిచయానికి, చాలా విషయాలు రోజు రోజుకూ నేర్చుకోవడానికీ కారణమయింది. తెలుగు నేర్చుకోవడం - మా అబ్బాయి అరవింద్ కు నేను కంప్యూటర్ నేర్పడం - ఫాక్స్ ప్రొ అకౌంటింగ్ పేకేజ్ శిక్షణ వంటి అనుభవాలు తరువాత పోస్టులో వివరిస్తాను. ఒక్క విషయమేమిటంటే కంప్యూటర్ గురించి చాలామంది అతిశయోక్తిగా చెప్పేవేవీ నిజం కావనీ, కంప్యూటర్ నేర్చుకోవడానికి వయసుతో భాషతో అంతగా పట్టింపు లేదని చెప్పగలను. దానికి నేనే ఉదాహరణ.

- పల్లా కొండల రావు
నా బ్లాగు అనుభవాలు లో ఇంతక్రితం టపా కోసం ఇక్కడ నొక్కండి.
  Reactions:

  Post a Comment

  1. నేనుకూడా అంతే నండి స్వంతగా తిప్పలుపడ్దాను పడుతున్నాను

   ReplyDelete
   Replies
   1. ప్రాక్టీసు చేసుకుంటూ వెల్తే అదే వస్తుంది దుర్గేశ్వర్ గారూ!

    Delete
  2. చాలా బావుంది సార్. అభినందనలు మీ పట్టుదలకి

   ReplyDelete
  3. బావుంది మీ కృషి...స్వయంకృషి.

   ReplyDelete
   Replies
   1. మీ కామెంట్ కూడా బాగుందండీ :))

    ధన్యవాదాలు శరత్ గారు.

    Delete
  4. ఇన్స్పైరింగ్ గా ఉందండీ కొండల్రావు గారూ ;)
   ఆల్ ది బెస్ట్..

   ReplyDelete
   Replies
   1. ఇలాంటి మాటకారి తనంతో మొహమాట పెట్టి కామెంటర్లను కట్టేసుకుంటున్నారు.

    Delete
   2. Anonymous గారూ! మీరెవరో తెలీదు గానీ, మీరన్నదే నిజమైతే, దానిలో తప్పు లేదు. అలా ఉంటే నాకు సంతోషమే. అలా చేయగలిగితే తప్పు అని నేననుకోవడం లేదు.

    Delete
   3. ధన్యవాదాలు రాజ్ !

    Delete
  5. మీ అనుభవం చాలా స్పూర్తికరంగా ఉంది.సర్! అభినందనలు ,

   మీకు లాగానే నేను పట్టుదలతో.. నేర్చుకున్నాను. ఈ పోస్ట్ చదువుతుంటే నా కంప్యూటర్ అనుభవాలు వ్రాయాలి అనిపించింది.

   ReplyDelete
   Replies
   1. థేంక్యూ వనజ గారు.

    మీ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి మిమ్ములనోసారి అడుగుదామనుకున్నాండీ :))

    మీ కంప్యూటర్ అనుభవాలు తప్పక వ్రాయండి వనజ గారు. మీరైతే మంచిగా వ్రాస్తారు గనుక అందరికీ ఉపయోగపడుతుంది.

    కంప్యూటర్ అనేది అందరికీ అవసరమే. ఎవరైనా వయసు - భాషతో పనిలేదని చెప్పడానికే నేనిది వ్రాశాను. సోది అవుతుందేమోనని ముందు భయపడ్డాను. కానీ జరిగింది నా ఎక్ష్పీరియన్స్ కనుక ముఖ్యంగా కాస్త నాలెడ్జ్ తెలిస్తే జనాలెలా ఫోజు పెడతారు? ఎదుటివారిని ఎలా నిరుత్సాహపరుస్తారు? అనేదానిపై నాకు కసి ఉందండీ. మీరు మనుషుల స్వభావాన్ని అక్షరరూపం లో పెట్టడం గతం లో ఓ పోస్టులో అత్తా కోడళ్ల పాత్రల తీరు లోనూ మరికొన్ని సందర్భాలలోనూ చూశాను.

    మీ కంప్యూటర్ అనుభవాలు వ్రాయడానికి ఈ పోస్టు స్పూర్తి అయితే నేను వ్రాయడం మంచిదే అయిందని సంతోషిస్తానండీ.

    Delete
  6. I too learnt on my own. Of course working on computers in the Office from 1994 onwards helped me. There too nobody to teach but learning by blundering around. One funny incident in 1996. Just then everybody was talking about Y2K and so just to see what happens, I changed the date of the PC to 01 01 2000 and bingo it went to 2000 and everything was OK, as against all the apprehensions. But how to come back! Somehow struggling for about 2-3 hours with the back up floppies, restored the PC back to then then present date.

   By 1998 when our Office was selling old computers,I purchase one 486 computer and using it learnt Disk Operated System (DOS) thoroughly. Took it a challenge (when our Computer Engineers were clamoring that its not possible)loaded Windows 3.1 into 486 computer using the floppies. Of course it took very long time, but I succeeded and it worked fine.

   However, with my experimentation process ultimately the 486 computer purchased for just Rs. 500 had gone dead, but I learnt a lot, just like operation success but patient dead. Once a person knows all DOS commands, he can work in any platform and from then on everyday is a learning experience with coming onto internet in 2003 and started blogging in 2009. In brief, thats my computer learning.

   Kondal Rao garu good attempt. One suggestion, just increase the tempo of your narration.

   ReplyDelete
   Replies
   1. శివరామప్రసాద్ గారూ ! మీ అనుభవం తెలిపినందుకు ధన్యవాదములు. మీ సలహాకు కృతజ్ఞతలు. తప్పక ప్రయత్నిస్తానండీ.

    Delete
  7. సి-డాక్ కంప్యూటరు ప్రాధమిక శిక్షణ పాఠాలని తెలుగులో ఇక్కడ చూడవచ్చును
   http://elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html

   (ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో పై లంకెని చూడండి - ఇతర బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు)

   ReplyDelete
  8. ఒకానొకప్పుడు కంప్యూటర్ వచ్చినవాళ్లు చాలా పోజులు కొట్టేవారు. అసలు కంప్యూటర్ ఉన్న గదిలోనికి తొందరగా రానిచ్చేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.

   నేను చేసే పనికి కంప్యూటరు తప్పనిసరి - స్టెనోగ్రాఫరు కదా - నాటైపింగ్ స్పిడు చూసిన ఒకాయన తనపనికోసం నాకు కంప్యూటరు నేర్పేరు. ఆతరువాత అలా అలా బాగా అలవాటయిపోయింది.

   నేను ఒక్కడినే నేర్చుకుంటే లాభం ఏమిటి. అందుకని కంప్యూటరు గురించి అడిగినవారికి అడగనివారికి అందరికీ చెపుతోఉంటాని. అలా చాలామందికి నేర్పాను.

   కాని గ్రామంలో ఉండి మీరు నేర్చుకోవడం చాలా నచ్చింది.

   ReplyDelete
   Replies   1. "ఒకానొకప్పుడు కంప్యూటర్ వచ్చినవాళ్లు చాలా పోజులు కొట్టేవారు. అసలు కంప్యూటర్ ఉన్న గదిలోనికి తొందరగా రానిచ్చేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు." edi nijam

    Delete
   2. మీరు నేర్చుకోవడమే కాక పదిమందికి నేర్పడం అభినందనీయం వేణుగోపాల్ గారు.

    Delete
   3. ఒక్క కంప్యూటరే కాదు రాము గారు. చాలా విషయాలలో తెలిసినవారు తెలియనివారికి చెప్పడానికి ఫోజు పెట్టడం గమనిస్తుంటాం కదా? అలాంటివారిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు తెలిసి నేర్చుకోవడానికి , నేర్పడానికి వయసు-భాషతో నిమిత్తం లేదు. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశమే లేదు కదా? అలాంటప్పుడు తెలియనిది తెలుసుకునేవారికి తెలిసింది చెప్పేవారు గురువులే. అందుకే ఈ లోకంలో అందరూ గురు-శిష్యులే ఎప్పటికీ.

    Delete
  9. I have become a fan of sri Palla Kondala Raogaru after reading his computer learning process in a village.I am also learning on my own. Whomsoever I asked to teach me computer they posed that you cant learn it now,this is too late!I joined in some computer institute but they just routinely done their teaching in a one way traffic way!I could not learn anything there.In the begining I thought computer learning is above my comprehension.But Slowly and gradually I am learning myself!

   ReplyDelete
   Replies
   1. ధన్యవాదములు సూర్యప్రకాశ్ గారు. మీ అనుభవమూ, అభినందన మరింత ధైర్యాన్నిస్తోంది.

    Delete
  10. పటుటదలతో శరమించేవారిని అందరూ .ఎంత పోరతాసాహిసాతరో మీ టపాలో
   ని వాయఖయలు చూస్తే .తెలిసింది .నేను .కూడా .మీలాగానే పారరంభ సిథతి లో ఉన్నాను . మీ టపా .మాలాంటి వారందరికీ .మారగ దరశకం .

   ReplyDelete
   Replies
   1. ధన్యవాదములు నాగరాణి గారు. మీరు తెలుగులో టైప్ చేసేటప్పుడు వత్తులకు అక్షరాలను డబుల్ టైప్ చేస్తున్నారనుకుంటాను. ఉదాహరణకు పట్టుదల కు పటుటుదల అని వ్రాస్తున్నారు. పట్టుదల = paTTudala అని టైప్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయండి. లేఖినిలో పక్కనే హింట్ బాక్స్ ఉంటుంది.మీ వ్యాఖ్య మొత్తం ఇలా టైప్ చేస్తే సరిగా వస్తుంది.

    paTTudalatoa Sramincheavaarini andaroo enta proatsahistaaroa mee Tapaaloani vyaakhyalu choostea telisindi. neanu kooDaa meelaagaanea praarambhastitiloa unnaanu. mee Tapaa maa laanTi vaarandarikee maargadarSakam.

    Delete
  11. ముందుగా మీ పట్టుదలకి అభినందనలు . నేను కూడా కంప్యూటర్ సైన్స్ లో ఎన్నో విషయాలు స్వంతంగా నేర్చుకున్నాను . అందులో పిజి డిప్లమో చేసి , ఆ తరువాత ఎం.టెక్. (కంప్యూటర్ సైన్స్ ఆంధ్రా యూనివర్సిటీలో) చేసి పధ్నాలుగేళ్ళుగా పిజి , ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రొఫెసర్ స్థాయిలో కూడా పనిచేసాను . ప్రస్తుతం Ph.D.చేస్తున్నాను . ఇంట్లోనే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను . ఇది సరదాగా నావిశయాలు పంచుకోడానికే వ్రాస్తున్నాను .

   ReplyDelete
   Replies
   1. ధన్యవాదములు రాజా కిషోర్ గారు.

    మీ ఇనిస్టిట్యూట్ ద్వారా ఏ వయసువారికైనా తేలికగా కంప్యూటర్ నేర్పే పాఠాలుండాలని కోరుతున్నాను.

    మీకు వీలుంటే కంప్యూటర్ పాఠాలు బ్లాగుల ద్వారా వ్రాయగలరు. చాలామందికి అవి ఉపయోగపడతాయి.

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

   
  Top