ఆయన 52 ఏండ్ల కుర్రాడయితే 42 ఏండ్ల నేను బాలుడినే కదా?


నా బ్లాగు అనుభవాలలో భాగంగా నాకు నచ్చిన బ్లాగర్ల గురించి చెప్పాలంటే ముందుగా కప్పగంతు శివరామ ప్రసాద్ గారి గురించి చెప్పాలని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు ఓ బ్లాగర్ గా ఉండడానికి మొదటి స్పూర్తి ప్రసాద్ గారే.  ఆయనకు నేను ముందుగా ధన్యవాదములు చెప్పాలి.

ఎందుకు? కారణం మీకు తెలియాలి అంటే కొన్ని సంఘటనలు చెప్పాలి. నేను మొదట బ్లాగులలో ప్రజాశక్తి లోనూ , ఇతర బ్లాగులలోనూ మంచిగా ఉన్నవన్నీ కాపీ చేసి పేస్ట్ చేసేవాడిని. బ్లాగు వ్రాయాలి అనే అంత చైతన్యం అప్పటికి లేదు నాకు. అందరి బ్లాగులు రోజుకు కొన్ని పరిశీలించేవాడిని. బ్లాగులు ఈ వయసులో (నాకు 42 సం.) మనం బ్లాగులేమి వ్రాస్తాం అనుకునేవాడిని. బ్లాగులు - నెట్ అంటే కేవలం యూత్ వాడుకోవడానికి + ఏవో పనికి మాలిన వ్యక్తులు, కొద్దిమంది మాత్రమే మేధావులు అదీ ఇంగ్లీషులో వ్రాస్తారని భ్రమలో అపోహలో ఉండేవాడిని. ఇలాంటి అపోహలోను, ఈ వయసులో మనకు బ్లాగులెందుకని అంత ఆశక్తిగా లేని నాకు పెద్ద టానిక్ లా ఓ వాక్యం కనిపించింది. అదే...... ప్రసాద్ గారి బ్లాగులో ఆయన ఫోటో క్రింద   " నేను 52 సంవత్సరాల కుర్రాడిని " దానితో పాటు ఆయన చిన్నప్పటి ఫోటో కూడా ఉంటుంది. ఇప్పుడెందుకో గానీ ఆ వాక్యం ఆయన బ్లాగులో కనిపించుటలేదు.

అప్పటిదాకా అరవింద్ చెపితే నాటుకోలేదు గానీ ఈ వాక్యం చూశాక నేనాలోచించడం ప్రారంభించాను. నా కంటే 10 సం.పెద్ద వయసాయన వ్రాస్తుంటే మనమెందుకు వ్రాయకూడదనుకున్నాను. ధైర్యం చేయాలనుకున్నాను. ఆయన బ్లాగును ఇతర బ్లాగులకంటే ఎక్కువగా చూడడం ప్రారంభించాను. ఆయన 52 సం రాల కుర్రాడయితే మనం 42 సం రాల బాలుడినే కదా? అని పిల్లాడు పలకా బలపం పట్టినట్లు నేను కీబోర్డు సరిచేయడం ప్రారంభించాను. అవును బ్లాగులోకం లో నేను ఇప్పటికీ నేర్చుకుంటున్న బాలుడినే.

సరదా సరదాగా గరం గరం గా పోస్టులు!
ఆయన బ్లాగులో పోస్టులు హెడర్‌లో ఆయన పెట్టుకున్న కోట్ లానే సరదా సరదాగా గరం గరం గా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవి, కొన్ని ప్రయోగాలు, కొన్ని అనుభవాల సారంగా ప్రసాద్ గారి బ్లాగు పోస్టులు మనకి కనిపిస్తాయి. దాదాపుగా ఆయన బ్లాగు పోస్టులు మీ అందరికీ పరిచయమే కనుక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టులలో కూడా ఆయన ప్రయోగాలు బాగుంటాయి. వాయిస్ రికార్డింగ్ ... లాంటి అనేక విషయాలపై ఆయన బ్లాగులో పోస్టులు ఇతరులకు స్పూర్తిగా, ప్రయోగాలు చేద్దామనుకునేవారికి ధైర్యాన్నిచ్చేవిధంగా ఉంటాయనేది నా అభిప్రాయం. ప్రకటనల హోరును వ్యతిరేకిస్తూ పోస్టు వ్రాయగలరు. నచ్చని అంశాలకై తనవంతు ప్రయత్నంగా లేఖల ద్వారా పోరాటం చేయగలరు. పాడుతా తీయగా బృందానికైనా, గవర్నర్ కు వివిధ అంశాలపై ఆయన లేఖ వ్రాసినట్లు గుర్తు. 

సాహిత్యం లేబుల్ కథ !
నేను ప్రజాశక్తిలో ఓ ఆర్టికల్ ని కాపీ చేసి దానిని సాహిత్యం అనే లేబుల్ క్రింద పబ్లిష్ చేశాను. సాహిత్యం అనే లేబుల్ దానికెలా పెడతారని ఆయన నా పోస్టులో కామెంట్ ఉంచారు. ఇంత నిశితంగా గమనించి కామెంట్లు ఉంచేవారుంటారని అర్ధమయింది.

పేరు పంచాయితీ!
నేను శివరామప్రసాద్ కు బదులుగా ఏదో సందర్భంలో ఒకటికి రెండు సార్లు శివరామకృష్ణ గారు అంటూ సంభోదిస్తే ఆయన చూస్తూ ఊరుకోలేదు. అయ్యా నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరుంది అలానే పిలవండని సరిచేయించారు.

కృష్ణ జై ఆంధ్ర గోల !
తెలంగాణా ఉద్యమం వార్తలు చూస్తున్నప్పుడు జై ఆంధ్రా కృష్ణ పలుకవేమిరా అంటూ ఎవరో పోస్టు ఉంచితే నేను దానిని పోస్టుగా కాపీ చేసి నా బ్లాగులో ఉంచాను. హీరో కృష్ణ జై ఆంధ్రా ఉద్యమానికి మద్దతు తెలిపినట్లు నాకు తెలీదు. దానికి ఆయన బ్లాగులో జై ఆంధ్రా ఉద్యమానికి నాటి సినీ నటులెలా మద్దతిచ్చినదీ తెలుపుతూ ఆయన బ్లాగులో వ్రాసిన పోస్టు లింక్ ఇచ్చారు.వివరించారు. దానితో మరిన్ని వివరాలు  తెలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పటికీ ఆయన బ్లాగులో పాపులర్ పోస్టులలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యామం - అనికి సినీ నటుల మద్దతు అనే పోస్టు ఉంటుంది.

వివాహ ఆహ్వానం !
ఆయన తన పెద్ద కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను ఈ మెయిల్ చేశారు. బ్లాగు లోకం లో మితృత్వానికి విలువనిచ్చేవారుంటారనిపించింది. మాకు విజయవాడ దగ్గరే వెళదామనిపించింది. కానీ వెళ్లలేక పోయాను. నా బ్లాగు ద్వారా శుభాకాంక్షలు చెప్పాలని ఫోటోలు పంపించమన్నాను. అది పద్ధతి కాదేమో నాకు తెలీదు ఆయన పంపలేదు. ఆయన చిన్న కుమారుడి పెళ్లికీ మళ్లీ శుభలేఖ పంపారు. కానీ తిరుపతి కనుక వెళ్లలేక పోయాను. నేను ఈ స్పూర్తితో దేవభక్తుని రాజేష్ వివాహానికి వెళ్లాను విజయవాడలోనే జరిగిందది. ఇలా బ్లాగర్లను గుర్తుంచుకుని మన సాంప్రదాయం ప్రకారం తెలిసినవారిని ఆహ్వానించడం అనేది ఎందుకో మనసును ఆలోచింపజేసింది. వర్చ్యువల్ ప్రపంచం లో నిజంగా స్నేహం ఉంటుందా? అంటూ సందేహ పడుతూ వేరే మిత్రులు చర్చించుకున్న విషయం సరికాదని అనిపించింది.

ఘంటసాల పోస్టు !
ఎవరిదో గుర్తులేదు కానీ ఘంటసాల మాస్టారి ఏనిమేషన్ తో ఓ పాటను మిక్ష్ చేసి ఉంచిన పోస్టు ఆయన బ్లాగులో ఉంచారు. దానిని ఉపయోగించి ఘనా ఘన సుందరా! ఘంటసాల మాష్టారిలా! అంటూ ఓ పోష్టు వ్రాశాను. ఆ పద్ధతి బాగుందనిపించింది. ఇంటర్నెట్ ను టెక్నాలజీని మంచి విషయాలకు ఎలా ఉపయోగించవచ్చో ఆ పోస్టు స్పూర్తిగా అనిపించింది. ఇలాంటి మంచి విషయాలు - ప్రయోగాలు ఆయన పోస్టులలో మనం చూడవచ్చు.

నోస్టాలజియా కథ !
నాకు చిన్నప్పటినుండి రామాయణం - భరరతం లలోని ఘట్టాలు, కథలు బాగా ప్రభావితం చూపేవి. ఇలాంటిదే సీతారాముల కళ్యాణం చూతం రారండీ అనే పాట ఎన్ని సార్లు విన్నా బాగుంటుంది కదా? ఆ విషయాన్నే నేను పోస్టుగా ఉంచితే దానిని నోస్టాలజియా అంటారని చెప్పారు. ఇలా చాలా విషయాలు భేషజం లేకుండా కామెంట్ల ద్వారా ఎక్కడైనా, ఏ బ్లాగులో నైనా తెలిపే మంచి అలవాటున్న వ్యక్తి. ఈ లక్షణం చాలమందిలో కనపడదు.:( 

తెలుగు కామెంట్లు - తెలుగు భాష లోగోలు 
అన్ని విషయాలలాగే ఆయన కామెంట్ల విషయంలోనూ పాలసీని ఏర్పాటు చేసుకోవడం కూడా నాకు నచ్చింది. తెలుగులోనే కామెంట్లు వ్రాయాలని, లేదా ఇంగ్లీషులో వ్రాయాలని, టింగ్లీషులో మాత్రం వ్రాయవద్దనేవారు. బహుశా చాలామందికి తెలుగులో ఎలా వ్రాయాలో తెలియక టింగ్లీషులో వ్రాస్తుంటారనుకుంటాను. అజ్ఞాతలుగా వ్రాయడాన్ని ఆయన వ్యతిరేకిస్తారు. అలాగే తెలుగు భాషకు సంబంధించిన లోగోలు కూడా ఆయన బ్లాగు నుండి సేకరించాను. ఆయన మాత్రుభాషను గౌరవించే విధానం కూడా అభినందనీయమే. 


" ప్రోత్సహిస్తారు - సలహాలు చెపుతారు - వ్యక్తిగతంగా ఎక్కడా కించపరిచినట్లనిపించలేదు"
ఆయన కామెంట్లను పరిశీలిస్తే మంచిని ప్రోత్సహించేవిధంగా, సలాహలు చెప్పేవిధంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచినట్లుగా అనిపించదు. నచ్చని విషయాలపై సెటైర్లు గరంగానే ఉంటాయి. కొత్త బ్లాగర్లకు లేదా భావాలను పంచుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవారికి ఇలాంటి వారి ప్రోత్సాహం టానిక్ లా పనిచేస్తుంది. అది అవసరం కూడా! ఇతరులను కించపరచడం, వ్యంగ్యం అనుకుని భ్రమపడుతూ ఎద్దేవా చేస్తూ గాయపరచేవారు ప్రసాద్ గారి కామెంట్లను చూసి నేర్చుకోవాలి.

కామీలంటూ కన్నెర్ర !
కమ్యూనిస్టులపై మాత్రం ప్రసాద్ గారు కామీలంటూ విరుచుకుపడతారు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ కామెంట్లద్వారా తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తుంటారు. ఇక్కడ మాత్రం ఆయనతో నేను విభేదిస్తాను. సరయిన కారణాలతో కమ్యూనిస్టులను విభేదించినట్లుగా నాకనిపించలేదు. కొన్ని సందర్భాలలో ఇలాంటి అంశాలపై మా ఇద్దరికీ బాగానే వాదనలు జరిగాయి. నేనేమో కమ్యూనిస్టులను అభిమానిస్తాను. అన్నీ కాకపోయినా సమాజ పరిణామ క్రమాన్ని, సమాజంలో మార్పుకు మార్క్సిజంలో చెప్పిన శాస్త్రీయ అంశాలు నాకు నచ్చుతాయి. కమ్యూనిస్టుల కార్యాచరణలో లోపాలు, నియంతృత్వ పోకడలు బహుశా ప్రసాద్ గారిని అలా ఆలోచించేలా చేశాయేమో తెలీదు. ఆయన భావాలు ఆయనవి. నా భావాలు నావి. సమాజంలో చెడుపై కానీ, విలువలను కాపాడే దానిలో మాత్రం ఆయన పోస్టులలో భావజాల పోరాటం ఉంటుంది. దానికి నేను మద్ధతు తెలియ జేస్తాను.

ప్రసాద్ గారి గురించి నాకు గుర్తున్నంతవరకూ విషయాలు వ్రాశాను. బ్లాగింగ్ కు సంబంధించి చాలా సందర్భాలలో నాకు ఆయన స్పూర్తిగా ప్రేరణగా నిలిచారు. ముఖ పరిచయం గానీ, ఫోన్ పలకరింపులు కానీ లేవు. కేవలం బ్లాగుల ద్వారా, కామెంట్ల ద్వారా మాత్రమే నాకు ఆయన పరిచయం.

- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

 1. కొండల రావు గారు బాగా రాశారు . మంచి ప్రయత్నమ్. .. కప్పగంతు శివరామ ప్రసాద్ గారి బ్లాగ్ లో నేను దాదాపు అన్ని పోస్ట్ లు చదివాను . జై ఆంధ్ర ఉద్యమం పోస్ట్ పై మీ అభిప్రాయమే నా అభిప్రాయం అప్పటి వరకు నాకు కుడా ఆ విషయం తెలియదు .. ఆ పోస్ట్ నేను కాపి చెఇ ఉంచాను .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు మురళీ గారు. ఆ పోస్టులో మీ కామెంట్ చూశాను. అనుమతి లేకుండానే కృష్ణ ప్రకటనను మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే అది పతిర్కలో బహిరంగంగా చేసినది.

   Delete
 2. కొండలరావుగారూ. నా బ్లాగు గురించి, నా గురించి ఒక వ్యాసం వ్రాసినందుకు ధన్యవాదాలు. ఈ మధ్యనే నేను నా బ్లాగును గూగుల్+ కు అనుసంధించాను. అప్పటి నుండి 52 ఏళ్ళ కుర్రవాడు రిమార్క్ మాయమయ్యింది. అంతే కాని వేరే కారణం ఏమీ లేదు. ఈ విషయం మీరు వ్రాసిన తరువాతే గమనించాను.

  కామీల విషయం, నిజమే మన అభిప్రాయాలు కలవవు. కమ్యూనిజం నేను అనేక చోట్ల అనేకసార్లు చెప్పినట్టుగా, "ఇలా ఉంటే బాగుండును" అనుకోవటానికి బాగానే ఉంటుంది, కాని ఆచరణకు అసాధ్యమైన విషయం. మతాల్లో అక్కడెక్కడో, ఫలానా ఫలానా చేస్తే "స్వర్గం" లభిస్తుంది ఎంతవరకూ నిజమో, కమ్యూనిజం ఆచరణ సాధ్యం అనుకోవటం కూడా అంతే నిజం. ఇది తెలియకుండా ఒక అసాధ్య విషయం విపరీతంగా ఒంటబట్టించుకుని, తమ నమ్మకాన్ని ఇతరుల మీద బలవంతంగా నైనా సరే ఏదో ఒక రూపేణా అంటూ రుద్దే ప్రయత్నాలు నేను వ్యతిరేకిస్తాను, అలా వ్యతిరేకించే వాళ్ళను సమర్ధిస్తాను. అది నాకు మన రాజ్యాంగం ఇచ్చిన భావ స్వాతంత్రం. మీరు అన్నట్టుగా "ఆయన భావాలు ఆయనవి. నా భావాలు నావి".

  ReplyDelete
 3. ఎవరి భావాలు వాళ్ళవి ఎవరి బ్లాగులు వాళ్ళవి ఎవరి బ్లాగోగులు వాళ్ళవి!తలలు బోడులయినా తలపులు బోడులు కాకూడదు మనసును ఎప్పుడూ నవనవంగానే ఉత్తేజభరితంగానే మనం ఉంచుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అర్రులు సాచాలి ఎదలను ఎప్పుడూ తెరచి ఉంచుకోవాలి ప్రసాద్ గారు రావు గారూ ఇరువురూ మనకు ఆదర్శప్రాయులు

  ReplyDelete
  Replies
  1. తలలు బోడులైనా..... వేరే సందర్భంలో వాడతారనుకుంటానండీ.

   "మనసును ఎప్పుడూ నవనవంగానే ఉత్తేజభరితంగానే మనం ఉంచుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అర్రులు సాచాలి"

   100% మీతో ఏకీభవిస్తున్నాను సూర్యప్రకాష్ గారు.


   Delete
 4. నమస్కారములు
  గౌరవ నీయులైన శ్రీ శివరామ ప్రసాద్ గారు నాకు రేడియో అభిమాని గా పరిచితులే . మీ అందరి భావాలు నావంటి కొందరికి స్పూర్తి నిస్తాయి మీ అందరికీ ధన్య వాదములు

  ReplyDelete
  Replies
  1. నమస్తే రాజేశ్వరి గారు.

   కామెంట్ కు ధన్యవాదములు. రేడియో అభిమానిలో మీరు కూడా సహరచయితగా ఉండడం తెలుసుకున్నాను. ఇప్పటిదాకా ఆ బ్లాగు ప్రసాద్ గారిదే అనుకుంటున్నాను. రేడియోను కాపాడుకోవలసిన అవసరం ఉంది. అందుకు ప్రయత్నిస్తున్న మీ అందరికీ అభినందనలు.

   మీ మరో బ్లాగు సాహిత్య దీపికను కూడా చూశాను. బాగుంది.

   Delete
 5. అలా అనడంలో నా ఉద్దేశం ముదిమివయసులో కూడా కొత్తగా సాహసోపేతంగా సజీవంగా సరసహృదయంతో ఉండాలని మనసును ఉంచాలని.మీరన్నట్లు నేను సరిగా చెప్పలేకపోయినట్లు ఇప్పుడు అనిపిస్తున్నది ధన్యవాదాలు

  ReplyDelete
  Replies
  1. మీరన్న ఉద్దేశం సరయినదే ప్రకాష్ గారు. నిజానికి 30 సం. వయసు తరువాతే వ్యక్తిత్వం ఓ రూపుదాల్చుకోవడం ప్రారంభం అవుతుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top