----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------
ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. వార్త-వ్యాఖ్య అనే శీర్షిక క్రింద అదే అంశాన్ని ప్రశ్నగా ఉంచుతున్నాను. ఈ ప్రశ్న ఇక్కడ ఉంచిన ఉద్దేశం 1) హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను తెలంగాణా ప్రభుత్వం నిజంగా అడ్డుకుంటుందా? అది సాధ్యమా? 2) వార్తాపత్రికలలో వారి వ్యాఖ్యానాలలో వార్తకు మీ అభిప్రాయాలూ తోడైతే మరింత విస్తృతంగా ఈ అంశంపై చర్చ జరపడం అనే ఆలోచనతో ఈ ప్రశ్నను ఇక్కడ ఉంచుతున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయగలరని విజ్ఞప్తి.
---------------------------------------------------------------------------------------------------------------------------

నిధుల సమీకరణ కోసం సర్కారు కసరత్తు
క్రమబద్ధీకరణతో వెయ్యి కోట్ల రాబడి
కూల్చివేతల్లో అసలు మతలబు ఇదే
అయితే హైకోర్టు రూపంలో అడ్డంకి
బీపీఎస్‌కు అవకాశం ఇవ్వం
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించం
హైకోర్టుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హామీ
ఆక్రమణలపై కమిటీ!... టీ సర్కారు యోచన
కూల్చివేతలే పరిష్కారం కాదని భావన

(హైదరాబాద్‌ సిటీ - ఆంధ్రజ్యోతి) హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తారా!? ప్రజా వ్యతిరేకత, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిలిపి వేస్తారా!? లేక, ఎప్పట్లాగే, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌)కు శ్రీకారం చుడతారా!? తెలంగాణ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి!? ఈ ప్రశ్నలకు ‘క్రమబద్ధీకరణే ప్రభుత్వ లక్ష్యం’ అని అధికార వర్గాలు చెబుతున్నా.. అది సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని ప్రజలకు బలమైన సందేశాన్ని పంపించడం.. క్రమబద్ధీకరణ పేరిట భారీ ఎత్తున ఫీజులు వసూలు చేయడం ద్వారా నిధులు సమీకించుకోవడం కూల్చివేతల వెనకున్న వ్యూహమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అయితే, అందుకు పరిమితులు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం తెలంగాణ ప్రభుత్వానికి పులి స్వారీలా మారిందని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి! అక్రమ నిర్మాణాలు అనగానే పరిమిత సంఖ్యలోనే ఉంటాయని ఎవరైనా  భావిస్తారు. కానీ, అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించిన తర్వాత చేపట్టిన ప్రాథమిక సర్వేలోనే మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి.

అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతి లేని నిర్మాణాలు.. అనుమతి తీసుకున్నా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలు.. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో చేపట్టిన నిర్మాణాలు.. ఇలా నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తంమీద, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం కట్టిన నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో పది శాతానికి మించి లేవన్న నిర్థారణకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కూల్చివేతలను కొనసాగిస్తే నగరంలోని మెజారిటీ భవనాలను నేలమట్టం చేయక తప్పదన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే, గల్లీ గల్లీలో నెలకొన్న అనుమతులు లేని నిర్మాణాలను అక్రమ నిర్మాణాల పేరిట కూల్చి వేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని అధికార వర్గాలు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించాయి. స్థానికులు.. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కూల్చివేతలను నిలిపి వేయాలంటూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ కూడా తీర్మానించిందని వివరించాయి. ఈ నేపథ్యంలోనే, నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించడమా? లేక వాటిని క్రమబద్ధీకరించడమా అనే సందిగ్ధ స్థితిలో ప్రభుత్వం పడిందని ఆ వర్గాలు వివరించాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులూ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

దీనికితోడు, ఈ ఏడాది చివర్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూల్చివేతలను మరింత కాలం కొనసాగించలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని అధికార వర్గాలు వివరించాయి. అదే సమయంలో, మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం ఇద్దామని భావిస్తే అందుకు చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయని వివరించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడాని (బీపీఎస్‌)కి సంబంధించి 2008లో అప్పటి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని పౌర సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. దీంతో, ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో, అప్పటి ప్రభుత్వం హైకోర్టుకు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బీపీఎస్‌కు అవకాశం ఇవ్వడం ఇదే చివరి సారని, అక్రమ నిర్మాణాలను ఇకపై ప్రోత్సహించేది లేదని అందులో స్పష్టం చేసింది. దానికి సంతృప్తి చెందిన తర్వాతే కోర్టు బీపీఎస్‌ పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో, క్రమబద్ధీకరణకు అప్పట్లో 2,03,895 దరఖాస్తులు రాగా.. వాటిలో 1,45,895 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. దాని ద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.650 కోట్లు సమకూరాయి.   అప్పటి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బీపీఎస్‌ లేదా సంబంధిత ఉత్తర్వులను ఎలా జారీ చేయగలుగుతుందని అధికార వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

సాధ్యం కాకపోతే గందరగోళమే!
జీహెచ్‌ఎంసీ పరిధిలో గత బీపీఎస్‌లో మిగిలిన దరఖాస్తులు, కొత్తగా నిర్మించిన నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటే అక్రమ నిర్మాణాల సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. వీటిని  క్రమబద్ధీకరించడం ద్వారా ఎంత లేదన్నా రూ.1000 కోట్లు సమకూరతాయని భావిస్తున్నారు.   నిధుల సమీకరణకు వివిధ మార్గాలను అన్వేషించినప్పుడు అక్రమ నిర్మాణాల అంశం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టుతోపాటు పౌర సంఘాల నుంచి కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి, 2008లో వైఎస్‌ ప్రభుత్వం బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలను తీసుకుని వచ్చినప్పుడు పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీపీఎస్‌ వద్దని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ పథకాన్ని మళ్లీ తీసుకొస్తే పౌర సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. తాజా పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించలేకపోతే కూల్చివేతలను కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ విషయం రాద్ధాంతమై అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా కొందరు.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మరికొందరు న్యాయ వ్యవస్థను ఆశ్రయించారు.

గుర్తించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకుండా మిన్నకుంటే ప్రజలు ఇదే పంథాను మరింత ఎక్కువగా అనుసరించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘‘చర్యలు చేపట్టకుండా మిన్నకుండడం అంటే వీటిని ఓ విధంగా ప్రోత్సహించినట్లే లెక్క’’ అని సామాజిక శాస్త్రవేత్త సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, అక్రమ నిర్మాణాలు అన్నిటినీ నేలమట్టం చేయడానికి సర్కారు పూనుకుంటే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎలా చూసినా.. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం ద్వారా ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుందని, దీనిపై స్పష్టత వచ్చే వరకూ నగరంలో గందరగోళం నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు.

అధికారులపై చర్యలేవి..?
అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, అధికారులు ప్రోత్సహించారనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి.    అక్రమ నిర్మాణాలు వెలిసిన సమయాన్ని బట్టి ఆయా సర్కిళ్లలో అప్పట్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి.

కూలిస్తే ఊరుకోం: కార్పొరేటర్లు
అనుమతులు లేని నిర్మాణాలను అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ కూల్చివేయడాన్ని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పార్టీలకతీతంగా వ్యతిరేకిస్తున్నారు. కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని వీరు జీర్ణియించుకోలేకపోతున్నారు. అవసరమైతే అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సింగిరెడ్డి అభిప్రాయంతోనే కాంగ్రెస్‌, బీజేపీ, మజ్లిస్‌ కార్పొరేటర్లు ఉండటం గమనార్హం.

గురుకుల్‌ భూముల్లో కొత్త కోణం!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు, గురుకుల్‌ భూములకు మధ్య వ్యత్యాసం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ సొంత భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన వారు నగరవాసులైతే.. భూమిపై సాంకేతికంగా హక్కులు లేకుండా (కోర్టులో వివాదం పరిష్కారం కాకుండానే)నే గురుకుల్‌ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. అవన్నీ దేవాదాయ భూములు. గతంలో ఓసారి ఆ శాఖ హైకోర్టుకు ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. భూమికి తమకు విలువ కట్టి ఇస్తే కొనుగోలుదారులకు రిజిస్ర్టేషన్‌ చేయడానికి లేదా హక్కులు దఖలు చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అందులో పేర్కొంది. దీన్ని ఇప్పుడు ప్రముఖంగా గురుకుల్‌ బాధితులు తెరపైకి తెస్తున్నారు. దేవాదాయ శాఖతో వివాదం ఉందని, దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Reactions:

Post a Comment

 1. 1920లో హైదరాబాద్ జనాభా 4 లక్షలు, ఇప్పుడు అది 68 లక్షలు. కొత్తగా చేరిన 64 లక్షల మందిలో ఎంత మంది సక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్నారు? 1980కి ముందు ఇందియాలో కంప్యూతర్లు లేవు. అప్పట్లో ఆక్రమణకి గురైన భూముల రికార్దులు ఉండవు. మరి వాటి సంగతి ఏమిటి?

  ReplyDelete
 2. వీటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చాలి
  రహదారులు లేకుండా కట్టిన Flats
  చెరువులలో కట్టిన ఇళ్ళు
  అగ్నిమాపక వాహనం కోసం ఖాళీ వదలని flats
  నీరు ఇంకదానికి స్థలం వదలని ఇళ్ళు!
  మిగిలిన వాటిని క్రమబద్దికరిస్తే నాకు ఏ చింతా లేదు! ఇక ఈ అక్రమ నిర్మాణాలు కూల్చడం వలన చాలా ప్రకృతి వనరులుకు నష్టం జరుగుతుంది వాటిని తిరిగి ఉపయోగించే విధంగా మార్చాలి!

  ReplyDelete
  Replies
  1. >అగ్నిమాపక వాహనం కోసం ఖాళీ వదలని flats నీరు ఇంకదానికి స్థలం వదలని ఇళ్ళు!
   ఫణీంద్రగారూ. ఇలాంటి ఇళ్ళన్నీ కూల్చేస్తే ఇంక హైదరబాదులో ఆట్టే ఇళ్ళు మిగలవు!

   Delete
  2. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు: మీరు అతిముఖ్యమయిన ఆక్రమణ పద్దతి ఒకటి మర్చిపోయారు. ప్రజలకు ఉపయోగం (ఉ. స్టూడియో) అంటూ కారుచౌకగా కొట్టేసి ఇతర వ్యాపారాలకు (ఉ. మల్టీప్లెక్స్) వాడడం.

   @శ్యామలీయం: Sir, I think you are bring cynical. కాలనీ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వగైరాలకు ఇచ్చిన స్థలంలో కబ్జాలు నేనున్న ప్రాంతంలో అయితే లేవు.

   Delete
  3. నాకు తెలిసిన కొన్ని మోసాలు నేను వ్రాసాను అంతే Jai Gottimukkala గారు!
   శ్యామలీయం గారు నేను ఇప్పటికీ మరచిపోలేని సంఘటన Dommulur in Bangalore లో ఒక భవన సదుపాయం లో జరిగింది అక్కడ అగ్నిని ఆపడానికి సరైన సాధనం లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు! అందుకే అలాంటివి కూల్చాలి అన్నాను!

   Delete
  4. ముఖ్యంగా స్టుడియోల పేరుతో , పారిశ్రామిక డెవలప్‌మెంట్ పేరుతో గత ప్రభుత్వాల అక్రమ సహకారంతో కొట్టేసిన స్థాలాలను అర్జెంటుగా స్వాధీనపరచుకోవాలి.

   Delete
 3. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ సాధ్యమేనా!?

  ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాని ఎంతవరకు సబబు? చెరువుమీదా, నాళా మీదా, ప్రభుత్వ స్థలంలో... ఎక్కడ బడితే అక్కడ అనుమతుల్లేకుండా కట్టి, ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించమనడం ఎంతవరకు సబబు? అలా క్రమబద్ధీకరించుకుంటూ పోతే మిగిలి వున్న రోడ్లూ, చెరువులూ, నాళాలూ కూడా ఆక్రమించగలరు అక్రమార్కులు.

  ReplyDelete
  Replies
  1. exactly శ్రీకాంత్ చారి garu.

   Delete
 4. చెరువు భూముల్లోని అక్రమ నిర్మాణాలని క్రమబద్దీకరించడం సాధ్యం కాదు. అందుకే కదా తుమ్మిడికుంట చెరువులో నాగార్జున కట్టిన కట్టడాన్ని క్రమబద్దీకరించడానికి ఒప్పుకోలేదు.

  ReplyDelete
 5. యధావిధిగా ఆంధ్రజ్యోతి తన బుద్ధి బయట పెట్టుకుంది!

  ReplyDelete
  Replies
  1. ఈ వార్త వేమూరి వారి ఆలోచణా కోణంలోనే ప్రూఫ్ రీడింగ్ చేయబడినదని తెలుస్తోంది.

   Delete
 6. దురదృష్టవశాత్తు ఇంత పెద్ద వ్యాసాన్ని ఆవీసులొ కూర్చొని చదవటం అసాధ్యం. పనులున్నాయి. మనకు వ్యాసకర్తల ఆలోచనాధోరణీయో సంపాదకుల విధానాలో అన్నవి కాక ప్రశ్నకు సంబంధించిన విషయం (data) గురించే ఆలోచన ఇక్కడ. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింపదగున్ అన్న సుమతీశతకసూక్తి ఉండనే ఉందిగా మార్గదర్శిగా ఇక్కడ. వివరించటం (వివరం అంటే కన్నం అని అర్థం) అంటే రంధ్రాన్వేషణ అనగా తప్పొప్పులను విచారించటమే మనపని.

  ReplyDelete
  Replies
  1. అలాగే శ్యామలీయం గారూ! ఎవరేకోణంలో వ్రాసినా ( వారు వ్రాస్తూనే ఉంటారు ) ప్రజలకు మేలు జరిగేదానికి ఏ ప్రభుత్వం చేసినా మద్దతు తెలపుదాము. ప్రజా వ్యతిరేక చర్యల్ను ఎండగడదాము సర్. అయితే పత్రికల వక్రీకరణ ను మాత్రం ఓ కంట కనిపెట్టక తప్పదేమో! ఆంధ్రజ్యోతి అయితే ఖచ్చితంగా తెలంగాణాలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకమైనవి, ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచేవి తెలివిగా వ్రాయడానికి ప్రయత్నిస్తోంది. :)

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top