బ్లాగు ప్రపంచం! 


వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబంగానే వర్చువల్ ప్రపంచమూ ఉంది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో లేని అవకాశం బ్లాగు ప్రపంచంలో ఉంటుంది. మన భావాలు స్వేచ్చగా పంచుకునే మంచి వేదిక ఇది. మన అభిప్రాయాలు స్వేచ్చగా పంచుకునే అవకాశం ఉన్నట్లే మన లోపాలు సవరించుకోవడానికి సద్విమర్శకుల కామెంట్ల వల్ల అవకాశం ఉంటుంది.

తెలుగు బ్లాగులలో, బ్లాగర్ల వ్రాతలలో గతమంత క్వాలిటీ, వెలుగులు నేడు ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలామంది బ్లాగర్లు నిర్లిప్తతో ఫేస్‌బుక్ వైపు వెళుతున్నట్లుగా చెపుతున్నారు. కొందరి ఆకతాయి చేష్టలకు, వెకిలి కామెంట్లకు జడిసి బ్లాగులకు దూరమైనవారూ ఉన్నారు. ఇది మంచిది కాదు.

ఎవరి భావాలనైనా స్వేచ్చగా చెప్పనివ్వాలి. ఆ భావాలను తప్పు బట్టేవారు అంతే స్వేచ్చగా సద్విమర్శలు చేయాలి. తప్పుకు ఏది ప్రత్యామ్నయమో చెప్పి ఒప్పును ఒప్పించాలి. భిన్నాభిప్రాయాలుండడం తప్పు కాదు. అపుడే భిన్నవాదనల సారాంశంగా మేలైన, మెరుగైన భావన బయటకు వస్తుంది. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు అనవసరంగా, వ్యక్తిగతంగా దిగజారి విమర్శించుకోవడమే తప్పు.

తెలుగు బ్లాగులలో, బ్లాగర్లలో తిరిగి గత వైభవం రావాలని 'పల్లెప్రపంచం' కోరుకుంటున్నది. అందుకు తన వంతుగా సహాయపడాలని భావిస్తున్నది. దానిలో భాగంగా మీతో కలసి ఓ కార్యక్రమం చేయాలనుకుంటున్నది. తెలుగు బ్లాగర్లలో బాగా వ్రాయగలిగినవారి అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ముఖ్య బ్లాగర్లను ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించాము.

ఎవరు ముఖ్య బ్లాగర్లు? ఎవరు బాగా వ్రాయగలరు? అనే నిర్ధారణకు 'పల్లెప్రపంచం' రంధ్రాన్వేషణ  చేయదు. మన తెలుగు బ్లాగర్లందరికీ ఇందులో అవకాశం కల్పించడమే దానికి సమాధానమని భావిస్తున్నాము. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనేది మీలో ఎవరైనా సూచన చేసి, వారి వివరాలను, బ్లాగు వివరాలను మాకు మెయిల్ చేస్తే పంపితే వారి అనుమతి తీసుకుని 'పల్లెప్రపంచం' తరపున ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మేము కూడా అవకాశాన్ని, వీలుని బట్టి మాకు తెలిసిన, పరిచయం ఉన్నవారిలో ముఖ్య బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసి వారి భావాలను అందరితో పంచుకునేందుకు కృషి చేస్తాము. అందరం కలిస్తేనే తెలుగులో ఉన్న ముఖ్య బ్లాగర్లందరినీ ఇంటర్వ్యూ చేయగలం.

'పల్లెప్రపంచం'లో ఇంటర్వ్యూ చేసినవారే ముఖ్యులు, మిగతవారు కాదని కాదు. ఎవరికి ఉన్న పరిచయం, అవకాశం మేరకు అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేద్దామని మనవి. కనుక ఇది చదివిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి.

దీనివల్ల తెలుగు బ్లాగు ప్రపంచానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని నమ్ముతున్నాము. ఓ బ్లాగరు ని ఇంటర్వ్యూ చేయడం వల్ల వారిని ప్రోత్సహించడమే గాక సమాజానికి కొన్ని మంచి భావనలను అందించినట్లవుతుంది. మీకు నచ్చిన బ్లాగరుని ఇంటర్వ్యూ చేసి మాకు పంపితే పరిశీలించి పబ్లిష్ చేస్తాము.ఇంటర్వ్యూ చేయడానికి ఏ మాత్రం సంకోచం వద్దు. మీ ఇంటర్వ్యూలో మెరుగులు దిద్దడానికి మా వంతుగా కూడా సహకరిస్తాము.

ముందుగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్న వారిని అనుమతి కోరతాము. వారు అంగీకరిస్తే వారి బ్లాగును, వారి కామెంట్ల ద్వారా వారి అభిప్రాయాలపై ఉన్న అంచనాను బట్టి కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాము. ఆ తరువాత పాఠకుల నుండి కూడా వారిని ప్రశ్నించేందుకు ప్రశ్నలు ఆహ్వానిస్తాము. పాఠకులు ప్రశ్నలు మాకు పంపితే వాటిలో బాగాలేనివి ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్న బ్లాగరుకు ఆ ప్రశ్నలు పంపుతాము.

అజ్ఞాతలు, ముసుగు పేర్లతోనూ, కావాలని వ్యక్తిగతంగా కించపరచే లేదా టార్గెట్ చేసే ప్రశ్నలకు తావులేదు. ఒకవేళ మీరు పంపిన ఎటువంటి  ప్రశ్నకైనా ఇంటర్వ్యూ ఇస్తున్న బ్లాగరు సమాధానం చెప్పడానికి నిరాకరించినా పబ్లిష్ కాదని మనవి. ఆ ప్రశ్న కించపరచేది కాకున్నా తనకు తెలియక కావచ్చు. ఇష్టం లేక కావచ్చు. ఇగ్నోర్ చేయాలనిపించవచ్చు. కారణం ఏదైనా బ్లాగరుకు ఇష్టం లేనపుడు ఆ ప్రశ్నలకు సమాధానాలను నిరాకరించే అవకాశం ఉంటుందని పాఠకులు గమనంలో ఉంచుకుని ప్రశ్నలు పంపాల్సి ఉంటుంది.

బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసే ప్రశ్నలలో జనరల్ గా అందరినీ అడిగేవి , ఇంటర్వ్యూ చేసే బ్లాగరును ప్రత్యేకించి అడిగేవి , ఆ బ్లాగరుకు బ్లాగు ఉంటే వారి బ్లాగును పరిశీలించి అడిగేవి, పాఠకుల నుండి రాబట్టిన వాటిలో బ్లాగరుకు అభ్యంతరం లేనివి ...  బ్లాగరు చెప్పిన సమాధానాలను బట్టి కొత్తగా అడగాలనిపించే ప్రశ్నలు ఇలా ఐదు రకాలుగా ఉంటాయి. వీలైనంత ఎక్కువ మంది బ్లాగర్ల అంతరంగాలను మీతో కలిసి పంచుకునేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

అదేవిధంగా వివిధ పత్రికలలో, బుల్లితెరపైనా ప్రముఖుల ఇంటర్వ్యూలు అందరికీ ఆసక్తిగా ఉండేవి, స్పూర్తినిచ్చేవి ఉంటే వాటిని కూడా 'కత్తెరింపులు'గా 'పల్లెప్రపంచం'లో ఉంచడం జరుగుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూలను చూద్దాం! అందుకే ఈ టపాలో ఇంటర్వ్యూ చే(చూ)ద్దామా!? అనడం జరిగింది. ఇలా కత్తెరింపుల ఇంటర్వ్యూలలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తొలగిస్తామని మనవి. మీరు చూసిన ఇంటర్వ్యూలలో బాగున్నవాటి వివరాలు 'పల్లెప్రపంచం' కు పంపండి. మనం చేసేవైనా కత్తెరింపులలో చూసేవైనా ఏదో ఒక రంగంపైన లేదా అంశం పైనా ఆసక్తి కరమైనవి , ఉపయోగకరమైనవి, ఆలోచింపజేసేవి అయి ఉంటే తప్పక ఇంటర్వ్యులు సమాజానికి మేలు చేస్తాయనే 'పల్లెప్రపంచం' భావిస్తున్నది.

పల్లెప్రపంచం చేసిన, కత్తెరించిన ఇంటర్వ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. బ్లాగర్లను ఏ ప్రశ్నలు అడిగితే బాగుంటుంది? మీ అభిప్రాయాలు లేదా ప్రశ్నలను కామెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ కార్యక్రమం పై సూచనలను మెయిల్ చేయాలనుకుంటే  Contact Form ను ఉపయోగించండి.
- పల్లా కొండల రావు.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top