వినదగునెవ్వరు చెప్పిన .......
" చివరికంటా పోరాడి గమ్యాన్ని ముద్దాడుదామనుకునేవాడే నిజమైన సిపాయి " - కే.సీ.ఆర్

అనుకున్నామని జరుగవు అన్నీ .... అనుకోలేదనీ ఆగవు కొన్నీ.... ఈ పాట మీ అందరికీ తెలిసిందే. నాకే ఆశ్చర్యం కలిగించేలా జరిగిన ఓ సంఘటన ఇది. నేను కే.సీ.ఆర్ స్పూర్తితో ఓ అంశాన్ని పోస్టుగా వ్రాస్తానని .... అదీ నాకు సంబంధించిన ఓ విషయంలో నిర్ణయం తీసుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు కూడా ! 

నేను కాస్త డోలాయమానంగా ఉన్నప్పుడు ప్రజ బ్లాగులో జై గారిలా సూచించారు:- కె.సి.ఆర్ అంటే " మీకు ఇష్టం కాదు కానీ ఆయన అన్న "గమ్యం ముద్దాడిన వాడే సిపాహీ" వాక్యం మీకు నచ్చవచ్చు. 

నచ్చడం కాదు. నిజానికి ఆ కామెంట్ లేకుంటే నా నిర్ణయమిలా ఉండేది కాదు. ఇలా అంటే నేననుకున్న పనులలో కొన్నింటిని లేదా అసలు బ్లాగులోకం నుండే నేను రద్దు కావడం జరిగేది. అందుకే ఓ మంచి మాట సరైన సమయంలో సరిగా అందితే మంచి నిర్ణయాలు జరుగుతాయంటారు.

నేనిలా కే.సీ.ఆర్ వాడే కొటేషన్ తో బ్లాగు ప్రపంచంలో ఓ కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తాననుకోలేదెప్పుడూ :)) నాకు కే.సీ.ఆర్ అంటే నచ్చదనేది కొందరు తెలంగాణా మిత్రుల అభిప్రాయం. నాకు కే.సీ.ఆర్ చాలా విషయాలలో నచ్చుతాడు. ఆంధ్రా వ్యతిరేకతను రెచ్చగొట్టడం లోనూ, నోటిదూలలోనూ మాత్రమే నచ్చడు. నాకు కే.సీ.ఆర్ తో ఉన్న పరిచయం గురించి, (నేను కే.సీ.ఆర్ కు గుర్తుండే అవకాశమైతే లేదు) కే.సీ.ఆర్ పట్ల నా వైఖరి గురించి వీలున్నప్పుడు వివరిస్తాను. ప్రస్తుతానికి ఆ విషయాలు పక్కన పెడదాము. 

సాధారణంగా చాలా సందర్భాలలో ఓ చిన్నమాట కూడా పెద్ద సమస్యకు పరిష్కారం చూపుతుంది. నేను బ్లాగుల గురించి కొంత గందరగోళంగానూ, ఒక దశలో బ్లాగు ప్రపంచం నుండి దూరమవుదామని భావిస్తున్న సమయంలో నాకు వచ్చిన ఓ మెయిల్ మరియూ జై గొట్టిముక్కల గారి కామెంటూ కొంత ఆలోచనను ధైర్యాన్ని కలిగించి ఓ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి.  ప్రజలో మిగతా మిత్రులు శ్రీకాంత్ చారి గారి లాంటి వారు  కూడా మంచి సూచనలిచ్చారు. ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు. ఒడ్డునుండి రాళ్లు రువ్వే వారికంటే మనం సమస్యల్లో ఉన్నప్పుడు మంచి సలహాలు ఇచ్చేవారు నిజంగా గొప్పవారు. అలాంటి మిత్రులు నాకు బయట ప్రపంచంలో ఉన్నట్లే బ్లాగు ప్రపంచంలో ఉన్నందుకు సంతొషంగా ఉన్నది. 

'ప్రజ' లో కామెంట్ల విధానం గురించిన చర్చలు అనంతరం బ్లాగులోకంలో నేనుండాల్సిన విధానంపై పునరాలోచనకు దారితీసింది. నేనుండేది పల్లెటూరిలో కావడం నెట్ స్లోగా ఉండడం వల్ల కామెంట్స్ మోడరేషన్ చేయడం వంటివాటిపై సరిగా నియంత్రణ చేయలేక 'ప్రజ' ను క్లోసే చేస్తున్నాను.  ప్రజ ద్వారా నేను నిర్వహిద్దామనుకున్న చర్చావేదికను అదే లేబుల్ తో 'పల్లె ప్రపంచం' వెబ్‌ పోర్టల్‌ లో నిర్వహిస్తాను. ప్రజలో ఉన్న పోస్టులలో ముఖ్యమైనవన్నీ పల్లెప్రపంచం లోకి బదిలీ చేస్తాను. ఎప్పటిలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ సందర్భంగా నాకు మంచి సలహాలు ఇచ్చిన మిత్రులకు ముఖ్యంగా జై.గొట్టిముక్కల గారికి ధన్యవాదములు. 'కే.సీ.ఆర్ చెప్పిన గమ్యాన్ని ముద్దాడేవరకూ చివరికంటా పోరాడదామనుకునేవాడే నిజమైన సిపాయి' అన్న వాక్యం బాగా స్పూర్తినిచ్చింది. ఈ వాక్యం కే.సీ.ఆర్ వాడతారనేది నాకు కూడా తెలిసినా నేను కొంచెం గందరగోళంలో ఉన్న సమయంలో సరైన విధంగా సలహా ఇచ్చిన 'జై' గారికి కృతజ్ఞతలు.

నేను నడుపుతున్న బ్లాగులన్నింటినీ క్లోజ్ చేసుకుంటున్నాను. నిజానికి బ్లాగు ప్రపంచానికి గుడ్ బై చెపుదామనుకున్నాను. కానీ పైన చెప్పిన విధంగా నా గోల్ పూర్తి కాకుండా ఎందుకు తప్పుకోవాలి? అని అనుకుని ఒకే ఒక బ్లాగుని నడపాలని అందులోనే నేను ఏవైతే నిర్వహిద్దామనుకున్నానో అన్నీ చేయాలని మొండిగా నిర్ణయించుకున్నాను. ఇది 'బ్లాగు ప్రపంచం'లో నా చివరి ప్రయత్నం. నాకు సంబంధించి ఇకపై ఈ ఒక్క బ్లాగు మాత్రమే ఉంటుంది. 

ప్రజ (తెలుగువారి చర్చావేదిక): 

ప్రజ బ్లాగు ద్వారా వివిధ అంశాలపై నేను చాలా నేర్చుకున్నాను. చర్చలలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరునా మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనివార్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కోరుతున్నాను. ఈ బ్లాగులో కామెంట్ మోడరేషన్ తో 'ప్రజ' ఓ శీర్షికగా నిర్వహించడం జరుగుతుంది. 

ఎప్పటిలాగే మీరూ ప్రశ్నలు పంపవచ్చు. అయితే గతంలోలా ఏ ప్రశ్నయినా పబ్లిష్ చేయడం జరుగదని మనవి. చర్చకు ఓ స్థాయిలో ఉన్నది అనిపిస్తేనే అనుమతిస్తాను. ఈ విషయంలో ఇకపై నాదే తుది నిర్ణయం. ప్రశ్నలలోనూ, కామెంట్లలోనూ నియంత్రణ ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఏ ఒక్కరి గొంతును నొక్కే ప్రయత్నం ఎప్పటిలాగే ఉండదని హామీ ఇస్తున్నాను. మీరు ఇతరులను టార్గెట్ చేసినట్లుగా లేదా కించపరిచినట్లుగా లేదా చర్చనీయాంశానికి సంబంధం లేని విధంగా కామెంట్లు చేస్తే అవి పబ్లిష్ కావు. ఏవైనా వివరణలు కావాలంటే నాకు మెయిల్ చేయండి. mail id : kondalarao.palla@gmail.com

ప్రజలో ఉంచిన ప్రతీ ప్రశ్నకు మోడరేషన్ ఉండడమే గాక చర్చ పూర్తయిందనుకున్నాక అవసరమైన పోస్టులకు ఆ అంశాన్ని సమీక్షిస్తూ నేనే ఓ సమప్ ఆర్టికల్ వ్రాస్తాను. ప్రశ్న పంపినవారు కూడా వారు పంపిన ప్రశ్న మరియూ కామెంట్లు సమీక్షిస్తూ సమప్ ఆర్టికల్ వ్రాసి పంపవచ్చు. ఇలా చేయడం వల్ల చర్చలకు ఓ ప్రయోజనం ఉంటుంది.కొన్ని కరెంట్ ఎఫైర్స్ లేదా రాజకీయాలకు సంబంధించిన వాటికి సమప్ ఆర్టికల్స్ అవసరం ఉండకపోవచ్చు. 

'జనవిజయం' పోస్టులూ పల్లెప్రపంచం లోనే....

జనవిజయం బ్లాగులోనూ, ఆన్లైన్ పక్ష పత్రికలోనూ ఇంతకుముందున్న పోస్టులలో ముఖ్యమైనవి, ఇతరులు వ్రాసిన ఆర్టికల్స్ కూడా ఇదే బ్లాగులోకి షిఫ్ట్ చేస్తున్నాను. జనవిజయం పేరుతొ వారపత్రిక, డిజిటల్ ఎడిషన్ నడపాలనుకుంటున్నాను. 

పల్లెప్రపంచం విభజన...

పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యక్రమాలను, మార్కెటింగ్ కార్యక్రమాలను విడదీయాలని నిర్ణయించుకున్నాను. మార్కెటింగ్ అనేది స్వంతంగా ఫర్మ్ ప్రారంభించి బిజినెస్ చేస్తాను. ఫౌండేషన్ విజన్ యథాతధంగా సొసైటీ ద్వారా నడుపుతాను. ఈ రెండింటి విజన్ లో తేడాలుంటాయి. ఈ రెండింటికి సంబంధించిన వివరాలు కూడా ఈ బ్లాగులో పల్లెప్రపంచం, మార్కెటింగ్, కార్యక్రమాలు లేబుల్స్ పేరుతో టపాలు ఉంటాయి. 

ప్రయాణం వ్యక్తిగతం గా కొనసాగింపు....

వ్యక్తిగతంగా ఓ బ్లాగు వ్రాసుకుందామనుకుని 'ప్రయాణం' పేరుతో ప్రారంభించిన బ్లాగుని కంటిన్యూ చేయలేకపోయాను. వ్యక్తిగత పని ఒత్తిడి ప్రధాన కారణం. నేను నడిపిన ఇతర బ్లాగులన్నింటినీ కలిపి 'పల్లెప్రపంచం' బ్లాగులోకి బదిలీ చేస్తున్న సందర్భంగా ప్రయాణం బ్లాగు ప్రారంభించిన రోజు టపా, దానికి వచ్చిన కామెంట్లు ఈ బ్లాగులోకి బదిలీ చేశాను. నా వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు 'వ్యక్తిగతం' లేబుల్ పేరుతో కొనసాగిస్తాను. ప్రయాణం లో వ్రాయాలనుకున్న విషయాలు వ్యక్తిగతం లేబుల్ క్రింద పల్లెప్రపంచం బ్లాగులో కొనసాగిస్తాను. అందుకే  ప్రయాణం .... ప్రారంభం! అని నాటి టపాకు పెట్టుకున్న శీర్షికకు.... కొనసాగిస్తున్నాను.... అనే పదాన్ని జత చేసి కొత్త శీర్షిక పెట్టాను. 

ఇలా అన్నింటినీ ఒకే బ్లాగులో నడపాలనే పట్టుదలకు రావడానికి స్పూర్తినిచ్చిన జై గారికి, పరోక్షంగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు ధన్యవాదములు. ప్రతి రోజు ఇక బ్లాగు ప్రపంచంలో ఒక్కచోట మాత్రమే మిమ్ములందరినీ కలుసుకుంటాను. నేను చేద్దామనుకున్నవన్నీ సాధించేందుకు చివరికంటా పోరాడే సిపాయిగా ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నాలన్నింటినీ మీతో పంచుకునే వేదికే ఈ 'పల్లె ప్రపంచం'. 

ఎప్పటిలాగే మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ ................ 

- పల్లా కొండల రావు.
Reactions:

Post a Comment

 1. ప్రజను మూసేయడం, మిగతా బ్లాగులను క్లోజ్ చేయడం ఎందుకో బాధగా అనిపిస్తోంది.

  ReplyDelete
  Replies
  1. ప్రజ ని మూసేయలేదు K.S.Chowdary గారు. ప్రజ బ్లాగు మూతపడుతుందంతే. ప్రజ ఓ శీర్షికగా పల్లెప్రపంచం లో కొనసాగి తీరుతుంది ఈ పోస్టులో చెప్పినట్లు.

   ప్రజ బ్లాగు స్థానాన్ని మన రచ్చబండ పూరిస్తుందని ఆశిస్తున్నాను.

   ప్రజ ని నేను నడపడం లేదు కానీ ఎవరైనా నడిపితే ఇద్దామనుకుంటున్నాను. నాకెవరూ ఆసక్తి చూపుతూ మెయిల్ చేయలేదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఎవరూ నడిపేందుకు ముందుకు రాకపోతే దానిని ప్రజావేదిక ఫోరం గా మారుస్తాను. కేవలం పోస్టులే ప్రజ లో - అగ్రెగేటర్లలో కనిపిస్తాయి మిగతా చర్చంతా ఫోరం లో వస్తుంది. ఫోరం నడిపే తీరిక కూడా నాకు లేదు కానీ శ్యామలీయం సర్ , సాయి కుమార్ గారు అలా సూచిస్తున్నారు. గతంలో ఫోరం ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. చూద్దాం ఇప్పుడు మరికొందరు తోడయితే తెలుగులో ఓ ఫోరం నడపవచ్చేమో.

   మిగతా బ్లాగులను క్లోజ్ చేస్తున్నాని మొదట్లో నాకు బాధ అనిపించినా అన్నీ ఒకేచోట చేసి చూపిస్తాననే నమ్మకం కలిగాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. బ్లాగులోకంలో ఇది నా చివరి ప్రయత్నం ఇక్కడా ఫెయిల్ అయితే నేను ఎవరినీ విసిగించకుండా ఆఫ్‌లైన్లో మాత్రమే నా కార్యక్రమాలు కొనసాగిస్తాను.

   నా సెకెండ్ ఇన్నింగ్స్ కు మొదటిగా కామెంట్ ఉంచిన మీకు ధన్యవాదములు :))

   Delete

  2. శుభం!
   ఆల్ ది బెష్ట్!!

   చీర్స్
   జిలేబి

   Delete
  3. ధన్యవాదములు జిలేబి గారు.

   Delete
 2. అన్ని బ్లాగులు క్లోజ్ చేసి వెల్లిపోవాలి అనుకోవడం .. తరువాత బ్లాగులోకి మనం రావడానికి కారణమైన దాన్ని సాధించకుండా క్లోజ్ చేయడం ఎందుకు అని ఆగిపోవడం .. నాకూ ఈ స్థితి వచ్చిందండీ. కనీసం మీ కోరికైనా తీరాలని ఆశిస్తూ..

  All The Best.

  ReplyDelete
  Replies
  1. Thank you శుక్రా చార్య గారు

   Delete
 3. మీకు నేను (లేదా నా వ్యాఖ్య) కొద్దో గొప్పో ఉడతా భక్తి సాయపడగలిగానని మీరు అనుకోవడం నా అదృష్టం. ఒక మంచి పని కోసం మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో మేము పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది.

  నిజానికి ప్రస్తుతం ఫిర్యాదు చేసిన వారిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండే. ఇంకొక్క క్లిక్ చేస్తే పోయేదానికి మంది మీద పడడం, దానికి సున్నిత మనస్సు వల్ల మీరు రంది చేయడం దురదృష్టం.

  మోడరేషన్ పెడితే దాంతో బాటు మరో మార్పూ తప్పదు. టపా ఒకటి రెండు వ్యాఖ్యల ప్రశ్నగా కాక కొంత విశ్లేషణ & రచయితా సొంత అభిప్రాయం ఉండాలి. తత్తిమ్మా వ్యాఖ్యలు తన చుట్టూ తిప్పుకొనే స్థాయి కల టపాలు మాత్రమె ఈ ఫార్మాట్ సరిపోతుంది.

  Anyway all the best!

  ReplyDelete
  Replies
  1. సున్నితమనస్సుతో రంది చేసుకున్నా కఠిన నిర్ణయమే చేయించారు మీరు :)) మీ వ్యాఖ్య నాకు బాగా ఉపయోగపడింది జై గారు.

   వారెవరో అన్నది కొంత - శ్యామలీయం గారి నిర్ణయం కొంత - అనవసర కామెంట్లుతో నేను విసిగినది కొంత - నెట్ స్లో సమస్య కొంత కలిపి నేను విసిగి పోయిన సందర్భంలో మీ వ్యాఖ్య స్పూర్తితో నేను ఒక రోజల్లా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.

   మోసం చేయడం కన్నా విఫలం కావడం మేలన్న అబ్రహం లింకన్ మాటల ప్రభావం నాపై ఎక్కువగా పడింది. ఫెయిల్ అయినందుకు , ప్రయోగాలకు నేనెప్పుడు ఫీల్ కాను కానీ నాలో ఉన్న లోపం సున్నితంగా ఉండడం. ఇది తగ్గించుకుంటాను.

   ప్రశ్నలలో విశ్లేషణ ఇతర కొన్ని మార్పులపట్ల మీ సూచనలను గమనంలోకి తీసుకుంటాను. ఎప్పటిలాగే మీ సహకారం అన్నింటా ఉంటుందని ఆశిస్తూ మరోసారి మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

   Delete
 4. మీరు సమస్యపై అతిగా స్పందించినట్టు అనిపించింది.

  అసలు వారు చెప్పిన సమస్య ఏమిటి? అధికంగా ప్రజలో కామెంట్లు రావడం వల్ల మాలిక లో అవే నిండిపోతున్నాయని. అది మీ సమస్య కాదు, మాలిక వారి సమస్య.

  రేపు మీకు భావావేశం ఎక్కువై మీరు నడీపిన ఒక్క బ్లాగులోనే రోజుకు పదో పదిహేనో పోస్టులు వేశారనుకోంది. అప్పుడు కూడా మాలికలో మీ పోస్టులే ఎక్కువ కనపడుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే రాయడం మానుకుంటారా?

  ఒక వేళ ప్రజ వల్ల ఇబ్బంది వుందని మాలిక వారు అనుకుంటే వారే దాన్ని లిస్టునుండి తొలగించడమో, లేక రేషనింగ్ చేయడమో చేస్తారు. అందుకోసం మీరు మార్పు చేర్పులు చేసుకోనక్కరలేదని ఇప్పటికీ నా భావన.

  ఇక శ్యామలీయం గారి నిర్ణయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం కూదా సరికాదని నా భావన. అది వారి వ్యక్తిగత నిర్ణయం.

  ఇక పోతే మితిమీరి కామెంట్లు రావడం అన్నది ఒక సమస్యే. అది అంత సులభంగా పరిష్కారమయ్యే సమస్య కాదు. మీరే కాదు, మరెవరికైనా కూడా నయా పైస ఆదాయంలేకుండా పూర్తికాలం కంప్యూటర్ ముందు కూర్చుని మోడరేషన్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి బాధ్యత తీసుకోలేక పోయినందుకు మీరు బాధ పడవలసిన పనీ లేదు. మోడరేషన్ తీసేసి, రోజుకు రెండు సార్లు సమీక్షించి మితి మీరిన కామెంట్లను తొలగించడం సరైన పద్ధతి అనుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ చారి గారు, మీ కామెంటుతో నేను చాలా వరకూ ఏకీభవిస్తున్నాను. శ్యామలీయం గారి నిర్ణయం వల్ల కొంత బాధపడిన మాట వాస్తవమే. అయితే కేవలం ఎవరో ఏదో అన్నారనో, శ్యామలీయం గారి నిర్ణయమో మాత్రమే గాక నాకు కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. అవి చర్విత చరణంగా చెప్పడం ఇక అనవసరం. ఏదైనా నా నిర్ణయం నేను తీసుకున్నాను. దానిలో పునరాలోచన చేయాలనుకోవడం లేదు.

   ప్రజ ఉద్దేశాన్ని మాత్రం నేను తప్పనిసరిగా కంటిన్యూ చేయగలననే నమ్మకం ఉన్నది. మీలాంటివారి సహకారమూ ఉంటుందనే అనుకుంటున్నాను. ఇప్పుడూ కామెంట్లు ఎక్కువైతే నేను చేయగలిగేదేమీ లేదు. ప్రజ నిర్వహణలో నా లోపమేమీ లేదనే నేనూ ప్రకటించి ఉన్నాను కూడా. కానీ అనవసర కామెంట్లు కూడా ఉంటున్న విషయం మీకూ తెలుసనే అనుకుంటున్నాను.

   దానికి పరిష్కారంగా నేను అనుకునేది ఓ పోస్టుకు 2 లేక 3 రోజులు కామెంట్లకు ఓపెన్ గా అవకాశం ఇచ్చి తరువాత మోడరేషన్ ఉంచడం. ఈ 3 రోజులలో అయితే పోస్టుల వారీగా మనం చూసి అనవసరమైనవి డిలీట్ చేయవచ్చు. కామెంటే వారికీ ఇబ్బంది ఉండదు. రోజూ కొంత సమయం కేటాయించి మోడరేట్ చేయడం నా వల్ల కాదనే నిర్ణయానికి వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్ని పోస్టులకూ అన్నివేళలా మోడరేషన్ లేకుండా ఉంచడమూ ఇక నాకు సాధ్యం కాదు.

   ప్రజ అనుభవంతో గత ఫెయిల్యూర్స్ అనుభవంతో ఇకముందు జాగ్రత్తగా ఉండగలనని ఓ నమ్మకమైతే ఏర్పడింది. మీ స్పందనకు, అభిప్రాయానికీ ధన్యవాదములు.

   Delete
 5. కొండల రావు గారూ, శ్రీకాంతాచారి గారు చెప్పినట్లు మీ "ప్రజ" బ్లాగు మీద వచ్చిన విమర్శలకి మీరు అతిగానే స్పందించినట్లున్నారు. సరే మీ బ్లాగు(లు) మీ ఇష్టం అనుకోండి. కాని మొత్తం మీద గత కొద్ది రోజులుగా జరిగిన ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుఫానులాగా అనిపిస్తోంది.

  నా పరిశీలన ప్రకారం నాకు అనిపించిన కారణం “మాలిక” అగ్రెగేటర్లో వ్యాఖ్యలకి కేటాయించినది ఒక్క పేజ్, ఆ ఒక్క పేజ్లో కూడా ఎడమ పక్కన "ప్రజ" బ్లాగులో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వ్యాఖ్యలు / వాటికి జవాబులు / వాటికి మళ్ళా స్పందనలు, కుడి పక్క భువనవిజయం రీతిలో సాగుతున్న పూరణలు సవరణలూ (ఈ బ్లాగులు పోప్యులర్ అయ్యుండటవల్లనే కావచ్చు). రెండు బ్లాగులూ మంచి కార్యక్రమాల్నే నిర్వహిస్తున్నాయి అని చెప్పటంలో సంకోచమేమీ లేదు. అయితే వాటికి వస్తున్న వ్యాఖ్యలు “మాలిక” వ్యాఖ్యల పేజీని అధికభాగం కమ్మేస్తున్నాయి. దానివల్ల వేరే బ్లాగుల్లో వచ్చే కామెంట్లకి “మాలిక” లో చోటు దక్కట్లేదనిపిస్తోంది. ఉదాహరణకి జిలేబీ గారి బ్లాగులో వ్యాఖ్యలు (ఆవిడంటే ఆ సమస్య మీద తన బ్లాగులో తనదైన శైలిలో టకటకా ఓ టపా వ్రాసేసారు. ఆ టపాకి ఏమన్నా కామెంట్లు వచ్చాయా అని తెలుసుకోవడానికి కూడా “మాలిక” ద్వారా వీలవదు, ఆవిడ బ్లాగు చూస్తేనే తెలుస్తుంది). తమ బ్లాగుల్లో వచ్చే వ్యాఖ్యలు “మాలిక” లో ఎందుకు కనబడటం లేదని బిక్కమొహం వేసుకుని చూస్తున్న బ్లాగులు ఇంకెన్నున్నాయో? తతిమ్మా బ్లాగుల్లో అసలు ఏమయినా వ్యాఖ్యలు ఉన్నాయా, తాము వ్రాసిన వ్యాఖ్యలకి జవాబులేమన్నా వచ్చాయా తెలుసుకోవాలనే ఇంటరెస్ట్ ఉన్నవారు “మాలిక” లో చూస్తే కనపడక ప్రతిసారీ ఆయా బ్లాగుల్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్ధితి (ఆమధ్యెప్పుడో ఏదో బ్లాగులో చెప్పినట్లు "కాలు గాలిన పిల్లిలా" ఆ బ్లాగుల చుట్టూ తిరుగుతుండాలి అన్నమాట). “మాలిక” వ్యాఖ్యల పేజ్ చూడగానే ఈ రకంగా దర్శనమిస్తుండేసరికి పాఠకులకి విసుగనిపించడం సహజం, దానిమీద విమర్శలు రావడమూ సహజం. ఈ మధ్య వచ్చిన విమర్శలకి ప్రధానకారణం పేరుకుపోతూ వస్తున్న ఈ చికాకే అని నా అభిప్రాయం.

  దీనికి పరిష్కారం “మాలిక” వారి చేతిలోనే ఉందని నా అభిప్రాయం కూడా. “మాలిక” వారు అమలు చేయదలిస్తే నా దృష్టికి రెండు మార్గాలు కనిపిస్తున్నాయి (మీకు, ఇతరులకి, “మాలిక” వారికి ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉండేవుంటుందిలెండి).

  (1). “జల్లెడ” అగ్రెగేటర్లో ఉన్నట్లు “మాలిక” వారు కూడా వ్యాఖ్యల విభాగాన్ని ప్రస్తుతమున్న సింగిల్ పేజీనుంచి కనీసం రెండు మూడు పేజీలకి (వీలయితే ఇంకా ఎక్కువకి) పెంచటం.

  (2). బ్లాగుల వ్యాఖ్యల్ని “మాలిక” అగ్రెగేటర్లో పూర్తి నిడివి చూపించే బదులు వ్యాఖ్యలోని మొదటి రెండు మూడు లైన్లు మాత్రం చూపించటం. వ్యాఖ్య యొక్క మిగిలిన భాగాన్ని చూడాలనుకునేవారు సంబంధిత బ్లాగులోకి వెళ్ళి ఆ వ్యాఖ్యని పూర్తిగా చదువుకోవచ్చు. “జల్లెడ” లోను, “కూడలి” లోనూ ఇదే పద్ధతి కదా. "మాలిక" అగ్రెగేటర్లో కూడా అలాగే ఉంటే ఉపయోగంగా ఉంటుంది కదా.

  ప్రస్తుతం “మాలిక” వారు అనుసరిస్తున్న పద్ధతి ప్రకారం వ్యాఖ్య ఎంత సుదీర్ఘంగా ఉన్నప్పటికీ కూడా “మాలిక” లో వ్యాఖ్యలకి కేటాయించిన ఆ ఒకేఒక్క పేజీలో పైనుంచి కిందదాకా వ్యాఖ్య నిడివి మొత్తం ప్రచురిస్తున్నారు (నేను ఇప్పుడు వ్రాస్తున్న ఈ వ్యాఖ్య కూడా - ప్రచురితమైతే - "మాలిక" లో బహుశా పూర్తిగానే కనిపించే అవకాశాలే ఉన్నాయి :)). నిజానికి అలా చెయాల్సిన అవసరం లేదే. ఇదిగో ఇక్కడో వ్యాఖ్య వచ్చింది కావలసినవారు చూసుకోండి అన్నట్లుగా సూచనప్రాయంగా ఆ వ్యాఖ్యలోని మొదటి రెండు మూడు లైన్లు మాత్రం చూపిస్తే చాలు గదా. బోలెడంత చోటు ఆదా అవుతుంది, తతిమ్మా బ్లాగుల కామెంట్లకి కూడా స్ధానం దక్కుతుంది.

  అందువల్ల, నా అవగాహన మేరకు అదీ సమస్య సారాంశం. సమస్య ప్రధానంగా అగ్రెగేటర్లో స్పేస్ మానేజ్మెంట్ కి సంబంధించినది. ఆ కారణంగానే దీని పరిష్కారం బ్లాగర్ల చేతుల్లో లేదు కాబట్టి మీరు ఇంకా ఇతర ప్రముఖ సీనియర్ బ్లాగర్లందరూ కలిసికట్టుగా “మాలిక” యాజమాన్యంతో టేకప్ చేస్తే ఫలితం కనిపించవచ్చు, అలా జరిగితే అందరికీ ప్రయోజనకారిగా ఉంటుంది.

  ఇక పోతే, వ్యాఖ్యల్లోని నాణ్యత / ఔచిత్యం బేరీజు వెయ్యటం, మోడరేషన్, రేషనింగ్, డిలీషన్, ఒకే విషయం / ప్రశ్న మీద ఎడతెరిపి లేకుండా జరిగే చర్చని ఎంతకాలం అనుమతించడం (కామెంట్లు అధికంగా వస్తున్నాయా, ఎలా అడ్డుకట్ట వెయ్యాలి లాంటి డైలమా), ముగింపు పలకాలా వగైరా అంశాల గురించి నేనేమీ చెప్పబోవటంలేదు. వాట్ల గురించి మీకే బాగా తెలుసు. ఆ విషయాలన్నీ బ్లాగుఓనర్ గారి పరిధిలోనివి అని, చూసుకోవలసిన బాధ్యత అగ్రెగేటరుది కాదు బ్లాగుఓనర్ గారిదే అనీ మీకందరికీ తెలుసు కూడా.

  ReplyDelete
  Replies
  1. విన్నకోట నరసిమ్హా రావు గారికి, మీ వివరణకు ధన్యవాదములు. నిజానికి నేను ఓ అగ్రిగేటర్ నడపాలనుకున్నా సాఫ్ట్‌వేర్ టెక్నిక్స్ తెలియక తెలిసినవారు సహకరించక , ఎవరు అలాంటి సాఫ్ట్ వేర్ చేస్తారో కూడా తెలీక ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

   నిజానికి మాలికలో వ్యాఖ్యల విభాగం లో ప్రజ నిండిపోతున్నదని ఓ అజ్ఞాత విమర్శ చేసినప్పుడే చూశాను. ప్రజ ఓ వైపు , శంకరాభరణం ఓ వైపు ఈ మధ్య భారత మాత సేవలో ... ఇలా కొన్ని బ్లాగులకు ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. ఇది బ్లాగర్ల లేదా కామెంటర్ల తప్పు కాదు. అగ్రిగేటర్లు కూడా పరిష్కారం సమస్యను బట్టి క్రమంగా ఆలోచిస్తూ డెవలప్ అవుతాయి అనేది నా అంచనా.

   ఇక నేను స్పందించిన తీరు నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఎవరి బలాలు బలహీనతలు వారికి ఉంటాయి. లోపలో రకంగా బయటో రకంగా ఉండడం కనీసం అవసరమైనమేరకుండడం కూడా నాకు రాదనేది సన్నిహితులు చేసే విమర్శ. క్రమంగా దానిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. అది నా సమస్య కాబట్టి ఇతరులకు పెద్దగా నష్టం లేదు కాబట్టి వదిలేయండి.

   జై గారి కామెంటుతో నాకో పరిష్కారం దొరికిందంటే కామెంట్ల పవర్ అర్ధమవుతూనే ఉంది కదా? నేను కొందరికీ విజ్ఞప్తి చేసేది ఎవరి భావప్రకటననూ పిచ్చిగా అడ్డుకోవాలని చూడొద్దని. ఇప్పుడు మీ కామెంట్ ద్వారా కూడా అగ్రిగేటర్లవారు ఆలోచిస్తారేమో. మీరన్నవాటిలో ఆలోచించేవి ఉన్నాయి. అదే విధంగా ఏ బ్లాగుకు వచ్చిన కామెంట్లు ఆ బ్లాగుకు విడిగా ఒకే చోట చూసుకునేలా కూడా అగ్రిగేటర్లు చేయాలని కోరుకుంటున్నాను.

   అగ్రిగేటర్ కోడింగ్ వ్రాసేవారి వివరాలు తెలిస్తే మీ అందరి సలహాలతో + నాకున్న అభిప్రాయాలతో కలిపి మంచి అగ్రిగేటర్ ని రూపొందించాలని ఉంది. దానర్ధం ఇప్పుడున్న అగ్రిగేటర్లు బాగాలేదని కాదు. ఎవరి వంతుగా వారు హెల్ప్ చేస్తున్నారు. బ్లాగిల్లు శ్రీనివాస్ గారయితే విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. చూద్దాం మీరన్న పద్ధతిలో అగ్రిగేటర్లలో ఎప్పటికప్పుడు బ్లాగర్లకు సౌకర్యాలు మెరుగవుతాయని ఆశిద్దాం.

   బ్లాగరుగా నేను నిర్ణయించుకున్నది ప్రతి పోస్టుకు ఓపెన్ గా మొదటి 3 రోజులు కామెంట్లు చేయొచ్చు. ఆ తరువాత మోడరేషన్ ఉంటుంది. ఈ మూడు రోజులలో అనవసరమైన కామెంట్లను నేనే చూసి డిలీట్ చేస్తాను. కొందరికి ముందు అవసరమైన సలహాలిచ్చి చూస్తాను. పాటించకపోతే డిలీట్ చేస్తాను. నా అనుభవం మేరకు తీసుకున్న నిర్ణయమిది. శ్రీకాంత్ చారి గారు చెప్పినట్లు ఒకవేళ ఇప్పుడూ మాలికలో పల్లెప్రపంచమే కనిపిస్తే అది మాలిక వారు పరిష్కరించాల్సిన సమస్య అనేదే నా అభిప్రాయం కూడా.

   మరో విషయం నేను 3 రోజులుగా గమనించినదేమంటే ఉచిత సలహాలు ఇచ్చినవారిలో బాధ్యతగా ఉన్నవారు చాలా తక్కువ. ఎప్పుడూ మంచిగా ఉన్నవారు చాలా బాధ్యతగా ఒకింత ఆత్మీయంగా స్పందించడం సంతృప్తినీ, ధైర్యాన్నీ ఇచ్చాయండీ. బయటి ప్రపంచంలో ఉన్నట్లే బ్లాగుప్రపంచంలోనూ ఎవరి బుద్ధిని వారు ప్రదర్శిస్తుంటారు.

   స్పందనలో అతో - మితో నా నిర్ణయం నేను తీసుకున్నాను. ఇది మాత్రం నా చివరి ప్రయత్నం. చూద్దాం ఏమి జరుగుతుందో.

   Delete
  2. కొన్ని బ్లాగులకి ఎక్కువ కామెంట్లు రావటం బ్లాగర్ నేరమూ కాదు కామెంటేటర్ల నేరమూ కాదు అనే నా అభిప్రాయం కూడా. కాకపోతే వాటిని అగ్రెగేటర్లో ఎలా సర్దుబాటు చెయ్యాలి, తతిమ్మా బ్లాగుల కామెంట్లకి కూడా ఎలా న్యాయం చెయ్యాలి - ఈ అంశాలు అగ్రెగేటర్ గారి పరిధిలోనివే అనటంలో ఏమీ సందేహం లేదు.

   " ........ ఒకవేళ ఇప్పుడూ మాలికలో పల్లెప్రపంచమే కనిపిస్తే అది మాలిక వారు పరిష్కరించాల్సిన సమస్య అనేదే నా అభిప్రాయం కూడా." అని అంటున్నారు మీరు. పరిష్కరించగలిగినది "మాలిక" వారే సందేహం లేదు. ఇప్పటి వరకూ వచ్చిన అనుభవంతో వారంతట వారే పరిష్కరిస్తే సంతోషమే. కాని దానికోసం వెయిట్ చెయ్యకుండా ముందు జాగ్రత్తగా సీనియర్ బ్లాగర్లందరూ కలిసి "మాలిక" వారితో చర్చిస్తే బాగుంటుందనేది ఇప్పటికీ నా నిశ్చితాభిప్రాయం.

   " ......... మంచి అగ్రిగేటర్ ని రూపొందించాలని ఉంది." అనే మీ లక్ష్యం తప్పక సిద్ధిస్తుందని ఆశిస్తాను. గుడ్ లక్.

   Delete
  3. సీనియర్ బ్లాగర్లు అంటే ఎవరెవరు వస్తారు? వారంతా ఏమి చేయాలి?

   నేనైతే మాలిక భరద్వాజ్ గారికి లెటర్ వ్రాస్తాను.

   హారం లో కామెంట్ల సెక్షన్ బాగుండేదట నేనంతగా అబ్జర్వ్ చేయలేదు.

   నాకు అగ్రిగేటర్ కోడింగ్ వ్రాసేవారి వివరాలు తెలిస్తే మాత్రం తప్పక కోడింగ్ వ్రాయిస్తాను. తెలిసినవారు చెప్పగలరు. లేదా మెయిల్ చేయగలరు.

   ధన్యవాదములు నరసింహ రావు గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top