----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
సకలజన సన్నాసులారా, ఏకం కండి

తెలంగాణలో సన్నాసులకు, పిచ్చివాళ్లకు కొదవలేదు. ఉద్యమం సృష్టించిన ఐక్యత, సంఘశక్తి, ఆలోచనలు అన్నీ వృధా అవుతుంటే నిస్సహాయంగా మిగిలిపోయిన గొంతులన్నీ నెమ్మదిగా విచ్చుకుంటాయి. ఉద్యమాన్ని తుడిచిపెట్టి, కేవలం అధికార రాజకీయాన్ని మాత్రం మిగులుస్తున్న పరిణామాన్ని సమాజం సహించదు. పొరుగురాష్ట్రంతో పొరపొచ్చాలను ఉద్వేగపూరిత సమర్థనగా మలచుకోవాలనుకునే వ్యూహానికి చెలామణి తగ్గిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను ప్రజాదృష్టితో చూసి సాధించుకునే తెలివిడి పెరిగిపోతుంది. ఇది పాలనను, పాలకులను కూడా ప్రజాస్వామ్యీకరించుకునే ప్రక్రియ. 

కత్తి గొప్పదా కలం గొప్పదా అని స్కూళ్లలో ఉపన్యాసం పోటీలు పెట్టినప్పుడు, కలం గొప్పదనం గురించి ఆవేశంతో మాట్లాడి ఉంటాం కానీ, జీవితంలోకి దిగుతున్న కొద్దీ ఒకచేత విత్తం మరోచేత బెత్తం పట్టుకున్న పెత్తనం ముందు బారెడు కలాలూ కుప్పబోసిన అక్షరాలూ బండ్ల కెత్తిన జ్ఞానాలూ అన్నీ తీసికట్టేనని తెలిసివస్తుంది. నాలెజ్‌ ఈజ్‌ పవర్‌ అన్న సూక్తి గోడలకు అలంకరించుకోవడానికేనని, అసలు వాస్తవం పవర్‌ ఈజ్‌ నాలెజ్‌ అని తరచు బోధపడుతుంటుంది. పసిడి కలుగువాడి బానిసకొడుకులు అని మాత్రమే అన్నాడు కానీ వేమన, పవరు కలుగువాడి గురించి అనలేకపోయాడు. ఆ కాలానికి అదే గొప్ప. నిజానికి ఏ కాలంలో అయినా వ్యవస్థ తర్కం తెలియనివాళ్లూ, తెలుసుకోదలచుకోనివాళ్లూ, మొండివాళ్లూ మాత్రం అనుభవసత్యాలను అబద్ధం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. వీపుభద్రం కాదని తెలిసినా, పెదవికి చేటు అని తెలిసినా నోరు జారుతూనే ఉంటారు, అనువుగాని కోపాలను ప్రకటిస్తూనే ఉంటారు.

ఎవరి బలం ఎంత అన్న లెక్క రాచరికాల కాలంలో సరిపోయింది కానీ, కాలం మారి వ్యవహారం కాసింత నాజూకుగా మారిన తరువాత బడితె ఉన్నవాడిదే పైచేయి అన్నది అన్ని చోట్లా చెల్లకపోవచ్చు. కొన్ని చోట్ల అంతో ఇంతో జ్ఞానానికి కూడా చెల్లుబాటు ఉండవచ్చును. అప్పుడు కూడా వాదబలం కంటె వాదిబలమే విర్రవీగుతుంటుంది. నక్కీరుడు భక్తుడే. కానీ శివుడి పద్యంలో తప్పుపట్టాడు. తప్పు గురించి చర్చించవలసింది పోయి, ‘దేవుణ్ణి, నా పద్యంలో తప్పుందంటావా’ అని భక్తుడి మీద భగ్గుమన్నాడు శివుడు. దేవుడు దేవుడే తప్పు తప్పే అని నక్కీరుడు నిలబడ్డాడనుకోండి. అందుకే కదా అతని పేరు ఇప్పటికీ తలచుకుంటున్నాము. పణికర మల్లయ్య పేరు కూడా అందుకే నిలిచిపోయింది. మస్కు మహిపాల్‌రెడ్డి పేరూ నైనాల గోవర్ధన్‌ పేరూ కూడా అందుకే నిలిచిపోతాయి. నీకు తెలుసా నాకు తెలుసా అని రాజంతటివాడు గద్దిస్తుంటే, నాక్కూడా తెలుసును, నేను చెప్పింది నువ్వూ వినాలి- అనగలగడమే ప్రజాస్వామ్యం.

తెలంగాణలో అధికారం చేపట్టగలగడం కేసీఆర్‌కూ ఆయన పార్టీకి ఒక అదృష్టమూ అవకాశమూ అయి ఉండవచ్చును కానీ, అది తెలంగాణ కావడం ఒక సమస్య కూడా. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి కేసీఆర్‌ సంకేతాత్మకమైన నాయకత్వం ఇచ్చినంతగా భౌతికమయిన సారథ్యం ఇవ్వలేదు. తెలంగాణ భావనకు రాజకీయ క్షేత్రంలో ప్రధాన ఆలంబనగా ఆయన పార్టీ పనిచేసింది. వాళ్లిద్దరితో పాటు, వాళ్లిద్దరికంటే ఎక్కువగా తెలంగాణలోని వివిధ రాజకీయ, రాజకీయేతర సంస్థలు, సమూహాలు, వేదికలు పనిచేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమస్య ఆ ప్రాంత అభివృద్ధి అంశాలతో ముడిపడి ఉన్నందున, స్వయంపాలన ద్వారా తమదైన పురోగమనాన్ని రచించుకోవాలని తెలంగాణ సమాజం భావించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎవరో బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తారని, ఎవరో మహానుభావుడు బంగారు తెలంగాణను తీర్చిదిద్దుతారని తెలంగాణవాదులు భావించలేదు. తాము కూడా ఆ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాలని భావించి ఉద్యమించారు. తెలంగాణ సమస్యలను అధిగమించడానికి అనుసరించవలసిన అభివృద్ధి వ్యూహాలను వివిధ రంగాల నిపుణులు, ఆలోచనాపరులు రూపొందించుకున్నారు. స్వయంపాలనలో పురోగమనానికి కావలసిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, కవులు, కళాకారులు, ప్రవాస తెలంగాణీయులు, సమస్త వృత్తివర్గాల వారు.. ఒకరనేమిటి, అందరూ చేతులు కలిపితేనే ఆ కల సిద్ధించింది. వీరిలో ప్రతి ఒక్కరికీ తెలంగాణను ముందుకు తీసుకువెళ్లడానికి తనదైన ఆలోచనలున్నాయి. అవకాశం లభిస్తే ఆచరణలోకి తేవాలన్న ఆకాంక్ష ఉన్నది. ఏ స్వార్థమూ లేకుండా చేసే ఆ ఆలోచనలకు, రకరకాల అంశాలకు లోబడి పాలకులు చేసే ఆలోచనలకు తేడా తప్పకుండా ఉంటుంది. దారి తప్పినప్పుడు దారిచూపడమూ, దారి తప్పించినప్పుడు నిలదీయడమూ జనం చేస్తారు. ప్రాణహిత-చేవెళ్ల వివాదంలో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చి తీరాలి. అర్జెంటుగా కొత్త సెక్రటేరియట్‌ ఎందుకు కట్టాలో, రైతు ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడరో సంజాయిషీ ఇవ్వాలి. ఎందుకంటే, అడుగుతున్నది నీ సహచరులు కనుక.

కాబట్టి, తెలంగాణ ఉద్యమకారులు, సమాజం ప్రేక్షకపాత్రతో సంతృప్తిపడరు. ఉద్యమంలో రూపొందిన ఆకాంక్షలను, ప్రతిపాదనలను ఆచరణలోకి తేవాలని కోరుకుంటారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, తమ వద్ద ఉన్న ఆలోచనలను పోల్చిచూస్తారు. తేడా ఉంటే నిలదీస్తారు. ప్రశ్నిస్తున్న వ్యక్తులు ఏ హోమ్‌వర్క్‌ చేయకుండా, నోటికి వచ్చిన అభ్యంతరాలను చెప్పేవారు కాదు. తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకంటె ముందూ కూడా ఆయా సమస్యల మీద క్షేత్రస్థాయిలో పనిచేసి జ్ఞానాన్ని, అనుభవాన్ని సమకూర్చుకున్నవారు. అయినంత మాత్రాన వారి ఆలోచనలను యథాతథంగా అమలుచేయాలని కాదు. వాటిని కనీసం చర్చకు పెట్టాలి. ప్రాథమిక స్థాయి నుంచి కూడా ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఎందుకంటే, వాళ్లు కోరుకున్న రాష్ట్రం ఇది. వారి ఆకాంక్షలకు పాలకులు కేవలం ధర్మకర్తలు మాత్రమే. 

అక్కడొకడు, ఇక్కడొకడు అడగడానికి తయారవుతున్నారని కేసీఆర్‌ చిరాకు పడుతున్నారు కానీ, ఎక్కడ పడితే అక్కడ అడగడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తెలంగాణ ఉద్యమమే ఇచ్చింది. రెండు ప్రశ్నలు, నాలుగు నినాదాలు ఎదురయ్యే సరికి సహనం కోల్పోయేవారు మున్ముందు ఎట్లా ప్రతిస్పందిస్తారు? ఆశ్చర్యం ఏమిటంటే, మొన్నటి దాకా, రాజకీయంగా ప్రత్యర్థులను మాత్రమే సన్నాసులు అని విమర్శించే కేసీఆర్‌, ఇటీవలి రెండు సంఘటనల్లో తెలంగాణవాదులనే సన్నాసులు అని దుర్భాషలాడారు. తెలంగాణ తొలి ప్రభుత్వం విఫలం కావాలని కోరుకుంటున్న వారినో, రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను ఇబ్బందిపెడుతున్నవారినో తీవ్రంగా విమర్శించారంటే (విమర్శను మాత్రమే, భాషను కాదు) అర్థం చేసుకోవచ్చు. కానీ, మొన్నటిదాకా తెలంగాణ సాధనలో తనతో కలసి నడిచినవారినే తిట్టడం నూతన రాష్ట్ర ప్రస్థానంలో, ప్రభుత్వ గమనంలో ఒక కీలకమయిన మలుపుగానే గుర్తించాలి. సబ్బండవర్ణాల సకలజన తెలంగాణలో తన-పర తేడా చూడడం మొదలయిందంటే, సరికొత్త విభజనకు అది నాంది. ఇప్పుడప్పుడే కాకపోవచ్చు, బీజం మాత్రం పడుతున్నది. తెలంగాణవాద పార్టీ నుంచే దాని ప్రత్యర్థి కూడా ఆవిర్భవించడం సహజన్యాయం. తమిళనాడులో అదే జరిగింది. ప్రతిపక్షమనేదే మిగలకుండా కిక్కిరిసిపోతున్న అధికారపార్టీని బయటి శక్తులేవీ భగ్నం చేయలేకపోవచ్చు. స్వీయభారంతో అదే విచ్ఛిన్నం కావచ్చు. జాతీయ ప్రతిపక్షాన్ని నామమాత్రం చేసి మోయలేని మెజారిటీని పొందిన 1985 నాటి కాంగ్రెస్‌, ప్రత్యర్థికి తన కడుపులో నుంచే జన్మనిచ్చింది.

తెలంగాణలో సన్నాసులకు, పిచ్చివాళ్లకు కొదవలేదు. ఉద్యమం సృష్టించిన ఐక్యత, సంఘశక్తి, ఆలోచనలు అన్నీ వృధా అవుతుంటే నిస్సహాయంగా మిగిలిపోయిన గొంతులన్నీ నెమ్మదిగా విచ్చుకుంటాయి. ఉద్యమాన్ని తుడిచిపెట్టి, కేవలం అధికార రాజకీయాన్ని మాత్రం మిగులుస్తున్న పరిణామాన్ని సమాజం సహించదు. పొరుగురాష్ట్రంతో పొరపొచ్చాలను ఉద్వేగపూరిత సమర్థనగా మలచుకోవాలనుకునే వ్యూహానికి చెలామణి తగ్గిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను ప్రజాదృష్టితో చూసి సాధించుకునే తెలివిడి పెరిగిపోతుంది. ఇది పాలనను, పాలకులను కూడా ప్రజాస్వామ్యీకరించుకునే ప్రక్రియ.

బౌద్ధసన్యాసుల మీద అక్కసుతోనో, లేదా సాధుసంతుల యాచక-దిమ్మరిజీవనం మీద ఆధునిక కాలంలో ఏర్పడిన చిన్నచూపు కారణంగానో ‘సన్నాసి’ ఒక తిట్టుగా మారింది. అంతే తప్ప సన్యాసులు అన్న సమూహమే ఏకంగా నిందార్హులు కారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో సన్యాసుల తిరుగుబాటు ఒక ఘట్టం. అనేక నియంతృత్వ దేశాల్లో బౌద్ధ సన్యాసులు పోరాటకారులుగా ఉన్నారు. వియత్నాం యుద్ధం సమయంలో ఒక బౌద్ధభిక్షువు ఆత్మాహుతికి పాల్పడి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాడు. అసమర్థులు, పనికిరానివారు అన్న అర్థంలో కేసీఆర్‌ ప్రత్యర్థులను సన్నాసులని దూషిస్తున్నారు. తాను తప్ప మరొకరు జ్ఞాని కాదని, తాను తప్ప మరొకరు ఆలోచించలేరని, తనకు తప్ప మరొకరికి జ్ఞానం లేదని నమ్ముతూ- మరెవరికీ పాలనలో ప్రగతిరచనలో భాగస్వామ్యాన్ని లేకుండా చేస్తున్న నేతకు ఎవరినైనా సన్నాసి అనే హక్కు ఉన్నదా?

చినజీయర్‌ స్వామి అంటే కేసీఆర్‌కు చాలా భక్తి. విశిష్టాద్వైత మత ప్రచారం కోసం చిన్నవయసులోనే సన్యాసాశ్రమం తీసుకుని, నమ్మిన మార్గంలో నడుస్తున్న వారు చినజీయర్‌. తన శిష్య సమానుడైన కేసీఆర్‌ సన్యాసులనే మాటను అంత హీనార్థంలో వాడుతుంటే జీయర్‌స్వామి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉన్నది.
--------------------------------

వార్త -  ఈ ఆర్టికల్ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో సందర్భం శీర్షిక లో పబ్లిష్ అయినది. కె.సి.ఆర్ తెలంగాణా వాదులని సైతం సన్యాసి అని తిట్టడంపై వ్రాసిన ఆర్టికల్ ఇది.

వ్యాఖ్య - సన్నాసి అనే పదాన్ని తిట్టుగా ఎందుకు వాడుతున్నట్లు? కేవలం కె.సి.ఆర్ మాత్రమే కాదు ఈ పద ప్రయోగం చాలామంది చాలా తేలికగా వాడేస్తుంటారు. రాజకీయాలలో తిట్లు లేదా అన్ పార్లమెంటరీ వర్ఢ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? తెలంగాణాలో మాత్రమే సన్నాసులు లేరు. ఏకం కావాలంటే చినజీయర్ స్వామితో సహా తిట్టే వారందరిపై దేశవ్యాపితంగా 'సన్యాసి ఉద్యమం' చేయాలేమో!? రాజకీయాలలో నేతల బూతుల కూతలు తగ్గడానికి మార్గం ఏమిటి?

Reactions:

Post a Comment


 1. "తిక్క సన్నాసి" అని ఉండాలేమో నండీ !

  ReplyDelete
 2. >>సన్నాసి అనే పదాన్ని తిట్టుగా ఎందుకు వాడుతున్నట్లు?

  సన్నాసి అనే పదాన్ని తిట్టుగా వాడుతున్నారు సరె. ఆ తిట్టుకు అర్థం చెప్పగలరా? తెలుగులో దీనికి సమానమైన ఇంకో తిట్టు పదం?

  ReplyDelete
  Replies
  1. గ్రీన్‍స్టార్ గారు బాగున్నారా? చాలా రోజుల తరువాత మీ కామెంట్ చూస్తున్నాను.

   'సన్యాసి' అంటే అన్నింటిని వదిలేసినవాడు. 'సన్నాసి' అంటే అందరూ వాడిని వదిలేసినవాడు అని ఓ జోక్ ఉన్నది. సన్యాసి అంటే వ్యక్తిగత లాభం లేదా జీవనం కోసం ఏ పనీ చేయకుండా, ఆ ఆశ వదులుకు బ్రతకడం కోసం భిక్షాటనతో సంఘ హితం కోసం ధర్మ బోధన అనే వృత్తితో బ్రతికేవారు. వీరికి మన హిందూ సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానం ఉన్నది. సాధారణంగా జీవనంలో ఏ పనీ చేయకుండా తప్పించుకునో, బాధ్యతలనుండి తప్పించుకునో తిరిగేవారిని సన్నాసులనో , సన్యాసి వెధవా అనో వ్యంగ్యంగా తిడతారు. నాకు తెలిసి సన్యాసులను కించపరచే తీవ్రమైన ఉద్దేశం దాని వెనుక లేదు. కావాలని ఆపాదించి తిడతారని అనుకోను. అలవాటుగా జరిగే పొరపాటు అది. అయితే సన్యాసుల పని ధర్మబోధన. వారు పని లేనివారు కారు. ధర్మం వర్ధిల్లడం కోసం సమాజానికి బోధన ఎపుడూ అవసరమే. ఇక్కడ మన సమాజంలో సన్నాసి పేరుతొ తిట్లు తినేవారు ధర్మబోధన చేయకపోగా అధర్మాన్ని వృద్ధి చేయడానికి కృషి చేస్తుంటారు తెలిసి కొంత - తెలియక కొంత.

   అయితే ధర్మబోధన అనే వృత్తి సన్యాసులుగానే ఉండాలా? ఏది ధర్మం? మతం లేకుంటే దర్మం లేదా? ఎలా అప్డేట్ కావాలి? అనేది నాకు వేరే అవగాహన ఉన్నది. దానిపై స్పష్టత మాత్రం లేదు.

   భౌద్ధ సన్యాసులు, క్రిస్టియన్ సన్యాసినులు గురించి కూడా విన్నాను. కేవలం ఇపుడు నేను చెప్పింది నాకున్న పరిమితమైన నాలెజ్ మేరకు మాత్రమే.

   < తెలుగులో ఆ తిట్టుకు సమానమైన ఇంకో తిట్టు పదం ఉన్నదా? > లేదు. దానికి సమానంగా కాదు గానీ , సన్యాసులను కించపరచకుండా పనికిమాలినవాడా? 'పనికిమాలిన వారు' అని తిట్టవచ్చనుకుంటా? మన నేతలు దాదాపు అన్ని పార్టీలవారు ఈ సమాజంలోనుండి వచ్చినవారే కనుక నాలుకను అదుపులో పెట్టుకునే పని ప్రయత్నం ద్వారా పోగొట్టుకోవలసిందే.

   ఇక నా ఉద్దేశం కేవలం ఆ తిట్టుకోసం కొట్టుకోకుండా ఆ తిట్టును కలుపుకుని చేసిన విమర్శలో ఏ అంశంలో ఎవరు పనికిమాలినవారిగా వ్యవహరిస్తున్నారో చూడడం ఉత్తమం. సన్యాసులను రెచ్చగొట్టాలనుకోవడం అనవసరం. సమస్యను పక్కదోవ పట్టించడం అవుతుంది. అయినా రెచ్చిపోయేవారు సన్యాసులు కారు. సన్యాసులు తమ పని తాము చేస్తుంటారు. ఈ పనికిమాలిన వారి తిట్లను పట్టించుకోకుండా వీరిని దీవిస్తూనే ఉంటారు.

   Delete
  2. >>సన్యాసి వెధవా అనో వ్యంగ్యంగా
   'సన్నాసి' అని ఎవరినైనా తిడితే నిజం 'సన్యాసులు' బాధపడుతారని నేను అనుకోను. ఎందుకంటే సమాజంలో ఎవరైనా 'సన్యాసి' కనబడితే వారిని 'సన్యాసి' అని అంటారు కాని 'సన్నాసి' అని పిలవరు, అలాంటి వారు ఎదురు పడితే కెసిఆర్ కూడా 'సన్యాసి' అనే వారిని సంభోదిస్తారు కాని 'సన్నాసి' అని సంభోదించరు. నాకు అర్థం అయినంత వరకు 'సన్నాసి' అనే పదాన్ని 'వెధవ' అనే అర్థంలో వాడతారు.
   'బుద్ది లేదు', 'వెధవలు', 'శుంటలు'అనే మాటలు అనేక మంది నాయకులు అనేక సందర్బాలాలో వాడారు. ఉదాహరణలు అవసరం లేదు, బాగా చదువుకుని అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన అనుభవం కలిగిన, రాజకీయాలను సమూలంగా మార్చాలని కంఖనమ్ కట్టుకొని వచ్చిన జయప్రకాశ్ లోక్ సత్తా గారు కూడా ఈ మాటలను ఎన్నో సారూ బహిరంగ సభల్లో వాడారు. అలా జేపి లాంటి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు లేని సమస్య కెసిఆర్ సన్నాసి అని అనగానే ఈ "మేధావులకు" లేదా ఈ "మీడియాకు" ఎందుకు నొప్పి కలుగుతుందో మనం అర్థం చేసుకోలేని విషయం కాదు. 'వెధవా' అని అంటే పర్లేదు కాని 'సన్నాసి' అని మాత్రం అనొద్దు అన్నట్లుంది ఈ మేధావుల మేధావి తనం.
   పోనీ, ఇప్పుడు ఈ పత్రికలో ఈ వ్యాసం రావడానికి కారణం ఒక సామాన్య జనుడు ప్రశ్నిస్తే ఒక ముఖ్యమంత్రి కోపగించుకోవటం(తిట్టటం అని వారు రాసారు కాని తిట్లు ఏమున్నాయో నాకు తెలియటం లేదు, నేను విడియో చూసాను). ఇంకో రాష్ట్రంలో రుణ మాఫీ గురించి అడిగితె లక్షకు మించి ఋణం ఉన్న "రైతులందరూ దొంగలే" అని అంటారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బయట ఎవరైనా జనం నిలదీస్తే వాళ్ళను "వైఅర్ఎస్ పార్టి కార్యకర్తవా, తమాషాగా ఉందా" అని కళ్ళు ఉరిమి కోపగించుకుంటారు ఆ ముఖ్యమంత్రి. ఒకటి రెండు సార్లు కాదు, ఇలా చాలా సార్లు ఇతర ముఖ్యమంత్రుల విషయంలో ఇంత జరిగినా కూడా ఈ మేధావులకు ఇలాంటి వ్యాసం రాయలనిపించదు. కెసిఆర్ విషయంలో మాత్రం బూస్ట్ తాగిన ఉత్సాహం వచ్చేస్తుంది. కెసిఆర్ విషయంలోనే పద్దతి, సంస్కారం, వంకాయ, వగరాలు గుర్తుకు వస్తాయి.

   ఇలాంటి బయాసేడ్ మీడియా/మేధావులు ఇలాంటి (పక్షపాత)ఆలోచనాత్మక వ్యాసాలు రాస్తే ఎవ్వరు పట్టించుకోరు సరి కదా, ఖచ్చితంగా వికటిస్తుంది కూడా.

   >> గ్రీన్‍స్టార్ గారు బాగున్నారా? చాలా రోజుల తరువాత మీ కామెంట్ చూస్తున్నాను.

   నమస్కారం కొండల రావు గారు. నేను బాగున్నాను. మీరు కుషలమనే తలుస్తాను. వ్యక్తిగత పనుల్లో ఉక్కిరి బిక్కిరి అవ్వటం మూలానా కొన్నాళ్ళు బ్లాగుల్లో కామెంట్లు రాయలేక పోయాను. కాని తరచుగా బ్లాగులు చదువుతూనే ఉన్నాను.

   Delete
 3. అల్లూరి గురించిన పోష్టులో నేను ఒక కామెంటు వేశాను.అందులో గాంధీ తన ఆదర్శాన్ని గౌరవించి ఉద్యమం చెయ్యడం వల్లనే జైలుకెళ్ళిన మోతీలాల్ నెహ్రూ,లాలా లజపతిరాయ్ లాంటి వాళ్లని కూడా "జైలులో ఉన్నవాళ్ళు మృతుల కిందే లెఖ్ఖ" అని సాటి స్వాతంత్రవీరుల్ని చచ్చినోళ్ళ కింద తీసెపారేస్తే ఒక్కరూ కిక్కురు మనలేదు,కేసీఆర్ వాడుతున్న సన్నాసి అంతకన్నా తీసిపోయిందా?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top