డియర్ కామ్రేడ్ సినిమా చూశాను. ఒక మంచి కాన్సెప్ట్ ని నిజాయితీగా ప్రజంట్ చేయడానికి ఈ సినిమా టీం ప్రయత్నించిందనిపించింది. నేటి సమాజం లో సగటు మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? రావలసిన మార్పు ఏమిటి? అన్నది ఆలోచింపజేసేందుకు దర్శకుడు భరత్ కమ్మ చేసిన ప్రయత్నానికి విజయ్ దేవరకొండ ఇమేజ్ ఉపయోగపడింది. క్రికెట్ లక్ష్యంగా పెట్టుకున్నఓ యువతికి ఎదురయిన ఆటంకం వలన ఆమె కెరీర్ కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నది, సగటు ఆడపిల్లలా ఎలా సర్దుకు పోవాలనుకున్నది, పరువు పేరుతో నేటి కుటుంబాలు ఏమి చేస్తున్నది, అందుకు మనమేమి చేయాలన్నది ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు గట్టి ప్రయత్నం చేశాడు. వాయిస్ ఓవర్ బాగలేదు. కథనం సాగదీత ఇబ్బందిగా ఉంటుంది.
కామ్రేడ్ అంటే నాకు తెలిసి ఒకే ఆశయం కోసం పోరాడే సహచరుడు అని అర్ధం. కలిసి ఉండేవాడు, కలుపుకుపోయేవా డు కామ్రేడ్. ఒక్క మాటలో చెప్పాలంటే 'కామ్రేడ్ అంటే సహజమైన మనీషి' అనొచ్చు. ఏ సమస్య వచ్చినా చివరికంటా ఉమ్మడి తత్త్వ౦తో పోరాడేవాడే కామ్రేడ్. నేడు మనుషులలో ఆ తత్త్వం కొరవడుతుండడమే అనేక సమస్యలకు, దుర్మార్గాలకు కారణం. సమస్యలపై నికరంగా పోరాడడాన్ని దుడుకుస్వభావం గానూ, ప్రమాదకర ధోరణి గానూ చూస్తూ అదే సమయంలో సమస్యలకు గల కారణాలతో రాజీ పడడం, పరోక్షమ్గా దానికి సహకరిస్తూ అదే పరువుగా బ్రతకడం అనే దౌర్భాగ్యపు ఆలోచనాధోరణిని తగ్గించడానికి ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి. సినిమా మాధ్యమం కూడా మనిషి ఆలోచనలపై గట్టి ప్రభావం చూపుతుందని నమ్మేవాళ్లలో నేనూ ఒకడిని.
తాత కామ్రేడ్ సూర్యం ఆదర్శాల ప్రభావితంతో అన్యాయాలపై తిరగబడే ఆవేశపూరిత యువకుడిగా ఉన్న బాబీ (విజయ్) హీరోయిన్ పరిచయంతో ప్రేమలో పడడం, అందరితో గొడవపడే బాబీ మనస్తత్వంతో విభేదించిన ఆమె దూరం కావడంతో అందరి యువకుల మాదిరిగానే పిచ్చివాడిగా మారతాడు. ఈ సమయం లో తాత చెప్పిన సూచనలతో మనకు ఇష్టమైనది డిస్టర్బ్ అయితే మనం డిస్టర్భ్ కావడం పరిష్కారం కాదని, దానికి కారణాలపై పోరాడడమే పరిష్కారం అని, అదే మార్గం కావాలని తెలుసుకుని తనలో మార్పు తెచ్చుకుంటాడు. ఇందుకు మూడేండ్లు జర్నీ చేసిన హీరో సమస్యలపై పరిష్కారం కోసం పోరాడాలనే కామ్రేడ్ తత్వాన్ని అలవరచుకుంటాడు. ఇదే మనిషి తత్త్వమని తాత నుండి స్పూర్తి పొందుతాడు. ఈ సినిమా టైటిల్ సబబుగా ఉన్నదనే చెప్పాలి.
మూడేండ్ల తరువాత మానసికంగా కృంగిపోయి ఆసుపత్రిలో ఉన్న హీరోయన్ ని కలసిన హీరో ఆమెను ఆ స్తితినుండి బయటకు తెస్తాడు. తిరిగి ఆమె మామూలు స్తితికి చేరుకుని హీరోలో మార్పును గమనించి ఆశ్చర్యపోతుంది. ఆనందపడుతుంది. పెళ్లి చేసుకుందామని హీరోను అడుగుతుంది. మరి క్రికెట్ సంగతేందని అడిగితే వదిలేశానని చెపుతుంది. అది సరికాదని హీరో చెపుతాడు. మరోసారి హీరో, హీరోయిన్ల మధ్య అభిప్రాయబేధాలు మొదలవుతాయి. అయితే హీరోయిన్ తను జీవిత లక్ష్య౦గా పెట్టుకున్న క్రికెట్ ను వదులుకోవడానికి కారణం లైంగిక వేధింపులని తెలుసుకుని తాను వంటబట్టిన్చుకున్న కామ్రేడ్ తత్వ౦తో ఆ సమస్యపై పోరాడమని, అందుకు అండగా నమ్మకమైన కామ్రేడ్ గా తాను ఉంటానని హీరోయిన్ కు చెపుతాడు. దీనికి ఆమె ఇష్టపడదు. పైగా నువ్వేమీ మారలేదంటుంది. కానీ నేను మారాను. అప్పుడున్న కోపం, ఆవేశం వ్యక్తిగతమైతే ఇప్పుడున్నవి వ్యవస్తీకృతమైనవనీ చెప్తాడు. దీనిని హీరోయిన్ అర్ధం చేసుకోలేదు. హీరో తాలూకు పాత లక్షణాలుగానే చూస్తుంది.
ఈ సందర్భంగా హీరోయిన్, ఆమె కుటుంబం వైఖరికీ, హీరో వైఖరికీ తేడా నేటి సామాజిక చైతన్యాన్ని గుర్తుకు తెస్తుంది. లైంగిక వేధింపులకు పాల్పడేవాడిపై పోరాడకుండా తనను తప్పు బట్టడాన్ని గురించి హీరో హీరోయిన్ తండ్రిని ప్రశ్నించడం ఆలోచింపజేస్తుంది. చివరకు హీరోయిన్ తనలోని బానిసత్వ, మధ్య తరగతి భావాలను తెంచేసుకుని తిరగబడి విలన్ కు శిక్ష పడేలా చేయడ౦, ఆ సందర్భంగా రష్మిక ప్రదర్శించిన హావభావాలు సుపర్బ్. సినిమాను సాగదీసినా క్లైమాక్స్ లో కామ్రేడ్ తత్వం వల్ల ఉపయోగం ఏమిటి? అన్నది తెలిపిన విధానం, ప్రతి మహిళకు అండగా ఓ కామ్రేడ్ నిలబడాలని, సమస్యలపై పోరాడి బానిస భావాలకు దూరం కాగలిగితే లైంగిక వేధింపుల వంటి అనేక సామాజిక సమస్యలు దూరమవుతాయన్న సందేశం ఆహ్వానించదగ్గ, అభినందించదగిన విషయం. ఓపికగా చూడాల్సిన ఓ మంచి సినిమా డియర్ కామ్రేడ్.
Post a Comment